నమ్మక ద్రోహం

(అంశం:”అపశకునం”)

నమ్మక ద్రోహం

రచన::ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

‘ఏమండీ మరిచి పోయారా? భుజంగరావు గారి యింటికి వెళ్ళి, మన అమ్మాయిని చూడటానికి మంచిరోజు చూసి రమ్మని చెప్పాలి, అనుకున్నాం కదా వాళ్ళని కలుపుకుంటే బాగుంటుందని. ఈ రోజు వెళ్ళి చెప్పి రండి. మంచి రోజు చూసుకుని వస్తారు. ఒకరికొకరం తెలిసిన వాళ్ళం. నవంబర్, డిసెంబర్ నెలల్లో ముహూర్తాలు వున్నాయి. తొందరగా చేసేద్దామండి. వాళ్ళ ఆలోచన ఎలా వుందో? కృష్ణారావు బావగారిని తోడు తీసుకుని వెళ్ళండి. దగ్గరగా వున్నా కరోనా కారణంగా కలుసుకుని చాలా రోజులయ్యింది. ఈరోజు మంచిదే చల్లబడ్డాక యిద్దరూ వెళ్ళి రాకూడదు’ అని వూపిరి పీల్చుకుంది జానకి.

‘అలాగేలేవే. రేపు కూడా మంచిదే కదా! రేపు వెళ్తాం. ఈ లోపు నువ్వు కృష్ణుడు భార్యకు ఫోన్ చేసి రేపు ఉదయం వస్తున్నానని చెప్పు. వాడికి యేమి పనులు వున్నాయో, యోమో?
……

కృష్ణారావు ఆఫీస్ కొలీగ్. అతని భార్య సుగుణ, జానకీ రోజూ ఫోనులో మాట్లాడుకుంటూనే వుంటారు. ఎందుకో రామారావుకు మాత్రం కృష్ణారావు వ్యక్తిగతంగా నచ్చడు. ఒక వూరి వాళ్ళు, ఒకే ఆఫీసు కాబట్టి స్నేహంగా వుంటున్నాడు.
……

ఉదయమే రామారావు భార్యతో చెప్పి కృష్ణారావు యింటికి బయలుదేరుతుండగా, యెదురింటి పెంపుడు పిల్లి యెదురు వచ్చి, దాని మానాన అది వెళ్ళిపోయింది.

‘అబ్బ అపశకునం, పిల్లి యెదురు అనుకుంటూ వెనక్కి వచ్చి, కాసేపు కూర్చొని, భార్య యిచ్చిన మంచి నీళ్ళు తాగి, బయలుదేరే సమయానికి యిద్దరు సద్బ్రాహ్మణులు యెదురు రాగా, నా పంట పండింది అనుకున్నాడు.
……

తలుపు కొట్టగానే సుగుణ తలుపు తీసి, ‘ఓ అన్నయ్యగారా అంటూ చాలా కాలమయ్యింది వచ్చి, రండి లోపలికి అని కూర్చీ చూపించి, ఆయన స్నానానికి వెళ్ళారు అంటూండగానే, కృష్ణారావు వచ్చాడు. ఈ లోపున సుగుణ తెచ్చిన కాఫీ తాగి, బయలుదేరుతుంటే, వితంతువు యెదురు. ‘ ఆగరా కృష్ణా, అపశకునం’ – రామారావు. ‘ఒరేయ్ ఏమిటి ఈ కాలంలో కూడా యిటువంటి మూఢనమ్మకాలు. అయినా ఇక్కడకు వచ్చేటప్పుడు చూసే బయలుదేరి వుంటావు. ఆగిన ప్రతీసారీ చూడనవసరం లేదు’ – కృష్ణారావు. అలాగా అంటూ నడక సాగించారు. భుజంగరావు గారి యిల్లు అక్కడకు దగ్గరే.
……

అపశకునాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. మన మానసిక బలహీనత మాత్రమే. భయంతో పనిచేస్తే ఓటమి, ధైర్యంగా ముందడుగు వేస్తే, వేయి యేనుగుల బలం. నీ ఆత్మ విశ్వాసమే నీ గెలుపుకు నాంది.
……
భుజంగరావు గారి యింటి గేటు తెరవగానే ఆయన వారిని కిటికీలోంచి చూసి, ‘వెల్కమ్, వెల్కమ్, ఏమిటి విశేషం, రామకృష్ణులు యిరువురు మా యింటిని పావనం చేసారు’ అంటూ నవ్వుతూ, కూర్చోండి అని సోఫాలు చూపగానే ఆశీనులయ్యారు.

భుజంగరావు గారు బాగా ధనవంతుడు. కృష్ణారావు ఆ భవంతిని కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఈలోపు వారి అబ్బాయి వచ్చి, యిద్దరికీ నమస్కారం చేసి, నాన్నగారూ నేను ఆఫీసుకు వెళుతున్నాను, అమ్మను మరిచిపోకుండా డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళండి, అందుకే నేను కారును తీసుకుని వెళ్ళడం లేదు అనేసి వెళ్ళి పోయాడు.

ఏమైందండి మేడమ్ కు – కృష్ణారావు

‘ఏదో వయసులో వచ్చే కాళ్ళ నెప్పులేనండి. అంతకు మించి ఏ సమస్యలు లేవు – భుజంగరావు

ఈలోపు భుజంగరావు గారి సతీమణి అందరికీ కూల్ డ్రింక్స్ యిచ్చారు. కొంచెం సేపు నిదానపడి రామారావు విషయంలోకి దిగాడు.

ముఖ్యంగా మేము వచ్చిన విషయం ఏమిటంటే, మాకు వున్న ఒక్క అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాము. పాప బీటెక్ చదివి, టెక్ మహీంద్రా లో పనిచేస్తోంది. మనం ఒకరికొకరు తెలుసు. అందుకని, మీతో వియ్యమొందాలని మా అభిలాష. మంచి రోజు చూసుకుని మీ అబ్బాయి, మీరిద్దరూ తప్పకుండా మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసి, మీ అభిప్రాయం చెప్పండి – రామారావు.

అలాగేనండి, అబ్బాయి రాగానే అడిగి, ఏ విషయమూ చెపుతాను – భుజంగరావు.

ఆ విషయంలో కృష్ణారావు మోనంగా వున్నాడు.

తరువాత ముగ్గురు కాసేపు పిచ్చాపాటి కబుర్లలో గడిపి, ఎవరి యిళ్ళకు వారు బయలుదేరారు.
……

ఇంటికి వస్తూ, ఎదురు ఇంటాయన దిగాలుగా కూర్చోవడం చూసి, ఏమైంది అని రామారావు అడిగాడు.

మా పిల్లికి ఉదయమే బయటకు వచ్చేసరికి ఎవరు ఎదురు వచ్చారో ఏమిటో అంటూ కారు కింద పడి చనిపోయిన పిల్లిని చూపాడు. రామారావు భుజాలు తడుముకున్నాడు.
……
వారం రోజులు అయ్యింది. భుజంగరావు గారి నుండి సమాధానం లేదు, అయినా ఫోన్ చేసాడు. వారి నుంచి వచ్చిన సమాధానం ‘సారీ’, అబ్బాయికి వేరే సంబంధం కుదిరింది’. శుభవార్త కాదు కదా అని కృష్ణారావుకు చెప్పలేదు.
……
ఆరు నెలలు గడిచాయి. కృష్ణారావు రామారావు ఇంటికి వచ్చి శుభలేఖ యిస్తూ, ‘ఒరేయ్ మా అమ్మాయి పెళ్ళిరా, నువ్వు తప్పకుండా రావాలి’ అంటూంటే అప్పుడే వచ్చిన జానకితో అమ్మా నువ్వు కూడా ముందుగా వచ్చి, సుగుణకు తోడుగా వుండాలమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు.

తను వెళ్ళగానే ఒక్కసారిగా హతాశుడయ్యాడు ఆ శుభలేఖలో వున్న భుజంగరావు గారి అబ్బాయి పేరు చూసి.

ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. తను పెళ్లి చూపులు పిలుపుకు బయలుదేరుతుండగా ఎదురైన జంట బ్రహ్మణుల ఎదురు అపశకునమా, లేక కృష్ణారావు ఇంటినుంచి బయలుదేరిన సందర్భంగా ఎదురైనా వితంతువు కృష్ణారావుకు మంచి శకునమా అర్థం కాలేదు. కానీ తనకు నమ్మక ద్రోహం చేసిన కృష్ణారావును తీసుకుని వెళ్ళడం మాత్రం తనకు అపశకునమే.
……

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!