అంతుచిక్కని వ్యాధి

(అంశం:”అపశకునం”)

అంతుచిక్కని వ్యాధి 

రచన::వడలి లక్ష్మినాథ్

.”తొందరగా బయలుదేరు, డాక్టర్ అపాయింట్ కి టైమ్ అవుతోంది” కంగారు పెట్టాడు కామేశ్వరరావు.

“ఆ… వచ్చే.. వచ్చే… పది నిముషాలు” అంది విశాలాక్షి.

“ఎన్ని పది నిముషాలు…..మధ్యలో పెట్రోలు కూడా పోయించుకోవాలి. టైమ్ కి డాక్టర్ పిలిచినప్పుడు వెళ్లకపోతే, అందర్నీ చూసిన దాకా ఉండిపోవలసి వస్తుంది” అన్నాడు కామేశ్వరరావు.

“నాకు పెట్రోలు బంక్ అంటేనే మహా చికాకని తెలిసి, నేనున్నప్పుడే పెట్రోలు పోయిస్తారు మీరు. ముందే వెళ్ళి ఆ పని కానివ్వచ్చుగా” విసుక్కొంది విశాలాక్షి.

“అయితే నేను పెట్రోలు పోయించుకొని వస్తాను. నేను వచ్చేసరికి నువ్వు వచ్చి కారు ఎక్కాల్సిందే, లేకపోతే మరోరోజు వెళదాము” హెచ్చరించి బయలుదేరాడు.

కామేశ్వరరావు కారు ఎక్కుతుండగానే విశాలాక్షికి తుమ్ము వచ్చింది “ఏవండీ! ఆగండి తుమ్మినప్పుడు ఎక్కడికీ వెళ్ళకూడదు” అంటూనే ఉంది, ఈ లోపల కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కామేశ్వరరావు.

విశాలాక్షికి నీరసము వచ్చింది. దేవుడికి దండం పెట్టుకుంటూ “దేవుడా! ఆయనకేమీ అవకుండా చూడు. వద్దన్నా బయలుదేరి వెళ్ళిపోయారు. ఎప్పుడూ ఇంతే, ఏ నమ్మకాలు లేవు. ఈ మనిషితో నేను ఎలా బతుకుతున్నాను” అనుకుంటూ తయారవ్వటం మొదలు పెట్టింది.

తయారయ్యి, చెప్పులేసుకుని తాళం పట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడే ఒక సాధువు గుమ్మంలోకి వచ్చి, “నువ్వు తలుపు తాళం వెయ్యకు.
ఈ రోజు నీ ఆతిథ్యం పొందాలని నా గురువుగారైన బాబా చెప్పారు” అన్నాడు.

“గురూజీ! మా వారికి ఈ బాబాలు, దేవుళ్ళ మీద నమ్మకం లేదు. ఆయన వచ్చారంటే కేకలు వేస్తారు. నాకు డాక్టర్ అప్పాయింట్మెంట్ ఉంది. మీరు మరొక రోజు రండి. ఇప్పుడు నేను వంట చేసిపెట్టే పరిస్థితిలో లేను” అంది విశాలాక్షి.

“బాబా మాటనే కాదంటావా నువ్వు! బాబా నన్ను ఇక్కడికి వెళ్లి భోజనం చేయమని చెప్పాడు. బాబా మాటను నువ్వు ధిక్కరిస్తున్నావు. నీకు ఉందిలే పెద్ద గండం ఈరోజు. నీ చావు నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు” అన్నాడు.

” అయ్యో స్వామి! మీరు అంత మాట అనకండి. అసలే ఆయన కోపిష్టి. ఆయన మాట కాదంటే, మళ్ళీ నా మాట వినరు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను” అంది ఈ లోపల వెనకనుంచి కారు శబ్దం వినిపించడంతో, గబగబా పరుగెత్తుకు వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది విశాలాక్షి.

ఇవేమీ గమనించని కామేశ్వరరావు విశాలాక్షి ఎక్కడం తోనే కారు డ్రైవ్ చేయడం మొదలెట్టాడు. విశాలాక్షికి గుండెల్లో అంతా దడగా ఉంది. చాలా టెన్షన్ గా అనిపించింది. విశాలాక్షి “ఎందుకు అంత స్పీడు, మనం వెళ్తున్నాం కదా! మనకి ఏదైనా అవుతుందని, నాకు భయంగా ఉంది” అంది.

కామేశ్వరరావు బయల్దేరేముందు తుమ్మడం, స్వామీజీ వచ్చి …..నీ చావు నువ్వు కోరి తెచ్చుకుంటావు ……అన్న మాటలు బుర్రలో గిర్రున తిరగడం మొదలు పెట్టాయి. కారెక్కింది మొదలు ఒళ్ళంతా చెమటలతో తడిసి పోయింది.

“ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. డాక్టర్  మనకు ఇచ్చిన అపాయింట్మెంట్ టైంకి వెళ్ళాలి” అంటూ హాస్పటలుకి తీసుకెళ్లాడు కామేశ్వరరావు.

“హాస్పిటల్ వచ్చింది” అని కామేశ్వరరావు అనగానే తలుపు తీసిన విశాలాక్షి ఒక్కసారి కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న వీల్చైర్ వాళ్ళని పిలిచి లోపలికి పంపించి, కారు పార్క్ చేసి వచ్చాడు కామేశ్వరరావు.

కామేశ్వరరావును చూసిన డాక్టరు, విశాలాక్షి వైపు చూపిస్తూ, “ఆవిడకు ఏమైంది?” అని అడిగారు.

“మోకాలి నొప్పి ఉందని, చెకప్ కోసం తీసుకొని వచ్చాను. ఆమెకి ఇతర ఏ సమస్య లేదు. కానీ, కారు దిగంగానే కుప్పకూలి పోయింది” అన్నాడు కామేశ్వరరావు.

డాక్టర్లు టెస్ట్ చేసే “బిపి చాలా ఎక్కువగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా బీపీ ఉందా?” అడిగారు కామేశ్వరరావును.

“అబ్బే అలాంటిదేమీ లేదు” చెప్పాడు కామేశ్వరరావు.

ముందు జనరల్ ఫిజీషియన్ వచ్చి మొత్తం పరీక్ష చేసి “బి పి ఎక్కువగా ఉంది కాబట్టి , ఈ టెస్టులతో పాటు, అత్యవసరంగా ఈసీజి, టూ డి ఈకో కూడా చేయించండి” అని చెప్పారు.

ఇంతలో విశాలాక్షి స్పృహలోకి వచ్చింది.” బాగా గుండె దడగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కళ్ళు కూడా ఏమీ కనిపించడం లేదు” అంది వెంటనే డాక్టర్ “ఐ స్పెషలిస్ట్ కూడా ఒకసారి చూపిద్దాము. మీరు వెళ్ళి వీటన్నిటికీ కౌంటర్ లో డబ్బులు కట్టి రండి. అని కామేశ్వరరావును పురమాయించాడు.

కామేశ్వరరావు కి జరుగుతున్నది ఏంటో అర్థం కావట్లేదు, అసలు ఆవిడకు ఏమి అయింది అని డాక్టర్లను అడిగాడు.

“ఆవిడ కండిషన్ బాగా లేదు. రిపోర్ట్ లు చూస్తే గాని చెప్పలేము” అని చెప్పాడు.

చూస్తుండగానే టెస్టులు అన్నీ ఒకదాని మీద ఒకటి జరిగి పోతున్నాయి. దాంతో డాక్టర్ కామేశ్వరరావు తో “ఇప్పటి వరకు జరిగిన పరీక్షలలో ఆవిడ సమస్యకు కారణం అయితే ఏమి తెలియడం లేదు. అలాగని ఆవిడని ఈ పరిస్తితిలో వదిలెయ్యడం కరెక్ట్ కాదు. బిపి ఎక్కువగా ఉందికదా! తల కూడా తిరుగుతోంది కదా! స్పాండిలైటీస్ ఏమైనా ఉండి ఉండొచ్చు. ఒకసారి ఆర్థోపెడిక్ కు చూపిద్దాము” అన్నాడు.
క్షణాల్లో ఆర్థోపెడిక్ వచ్చి ” అమ్మా! మీకు ఎప్పుడైనా నడుము నొప్పి, కానీ మెడ నొప్పి కానీ ఉంటుందా” అని అడిగాడు.

“పని ఎక్కువగా ఉన్నప్పుడు నడుము నొప్పి వస్తుంటుంది” చెప్పింది విశాలాక్షి.

అంతే డాక్టరు “ఎందుకైనా మంచిది ఒకసారి ఎమ్ ఆర్ ఐ చేయిద్దాము” అంటూ డబ్బులు కట్టి రమ్మని కామేశ్వరరావు కి చెప్పాడు ఆర్థోపెడిక్.

“ఎమ్ ఆర్ ఐ రిపోర్ట్ లో కూడా ఏమీ లేదు. ఆడవాళ్లు అన్నీ చెప్పుకోలేరు. ఎందుకైనా మంచిది ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపిద్దాము” అంటూ గైనకాలజిస్ట్ కి రెఫర్ చేసాడు.

గైనకాలజిస్ట్ వచ్చి టెస్టు చేసి “ఒకసారి స్కాన్ చేసి కానీ ఏమీ చెప్పలేను” అంది. .

అప్పుడే బాబా శిష్యుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని విశాలాక్షి “కాళ్ళు చేతులు ఆడటం లేదు. నా పని అయిపోయింది. పిల్లవాడిని అర్జెంటు గా రమ్మని కబురు చెయ్యండి” అంటూ మళ్ళీ స్పృహ కోల్పోయింది.

విశాలాక్షికి మళ్ళీ మెలుకువ వచ్చాకా స్కాన్ చేసి రిపోర్ట్ చూసిన గైనకాలజిస్ట్,
“ఇందులో అయితే ఈవిడకు యేసమస్య లేదు” అంది.

అప్పటికి సాయంత్రం అయ్యింది, లక్షన్నర ఖర్చయింది. కామేశ్వరరావు అకౌంట్లో డబ్బులు అన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ, విశాలాక్షి అనారోగ్యం ఎవరికీ అంతు పట్టలేదు.

అప్పుడు అక్కడ డాక్టరు ” ఇక్కడ అన్ని రకాల టెస్టులు చేయడం జరిగింది. ఆవిడ పరిస్థితి అయితే బాగా లేదు. నాకు తెలిసిన డాక్టర్ గిరిధర్, కార్పొరేట్ హాస్పటల్లో పనిచేస్తారు. అక్కడ జాయిన్ చేయండి” చెప్పాడు.

కామేశ్వరరావు ఆ విషయమే కొడుకు ఫోన్ చేసి చెప్తే , బెంగళూరులో ఉన్న కొడుకు “నాన్న నేను బయలుదేరి వస్తున్నాను. అమ్మను ఇంటికి తీసుకొని వెళ్ళండి. రేపొద్దున నేను వచ్చాక అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాము” అని చెప్పాడు.

విశాలాక్షికి సాధువు చెప్పిన మాట కాదన్నందుకు తనకు ఈ రోజు ఇలా జరిగింది. ఆ సాధువు వివరాలు అడిగి ఇంటికి పిలిపించి ఆతిథ్యం ఇవ్వాలని నిశ్చయించుకొంది.

ఇల్లు చేరుతుండగానే వీధి చివర చాలా గొడవగా ఉంది. అందరూ గుంపులుగా వున్నారు. కారు ముందుకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించలేదు. కారు పక్కగా ఆపుకుని కామేశ్వరరావు దిగి వెళ్లి అడిగాడు “ఏం జరుగుతుంది ఇక్కడ?” అని అప్పుడు ఆ పెద్దమనిషి చెప్పాడు
“ఎవరో స్వామీజీ వచ్చి ఆతిథ్యం అంటూ ఇంట్లోకి చొరబడి , ఇంటి యజమానురాలి పైన మత్తు మందు ప్రయోగించి అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నీ కలిపి ముప్పై లక్షల వరకు పట్టుకొని పోయాడు” చెప్పాడు.

విషయం విన్న విశాలాక్షి ” ఓరి నీ వాడి మాటలు నమ్ముకునే కదా! నేను ఈ రోజు అంత బెంబేలు పడింది. హాస్పిటల్ లో అన్ని రకాల పరీక్షలు చేయించుకొని అనవసరంగా మీ డబ్బులు అన్నీ ఖర్చు చేయించాను. అసలు సమస్య మోకాలి నొప్పి గురించి చూపించుకోలేదు” అంటూ కళ్ల నీళ్ళు పెట్టుకుంది.

“నువ్వేమీ డబ్బుల గురించి బెంగ పెట్టుకోకు. ఎందులోనూ ఏమీ లేదని తెలిసిందిగా. మన శరీరానికే కదా పెట్టుకొంది. ఎవరో దొంగలకు అప్పచెప్పలేదుగా. అందుకే నేను చెప్పేది కాషాయం కట్టిన వాడల్లా స్వామీజీ కాదు. అలాంటి వారి మాటలు పట్టుకొని నిజమనుకొని లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవడమే. నయం పెద్ద గండం నుండి బయట పడ్డాము” అంటూ ఓదార్చాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!