నాన్నే నా ప్రపంచం.

 నాన్నే నా ప్రపంచం.

రచయిత:అనురాధ కోవెల

 

ఈ  రోజెందుకో మనసంతా దిగులుగా ఉంది. మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిన నాన్న  పదే పదే గుర్తొచ్చి మనసు బరువెక్కుతోంది. నాన్నతో ఒక్కసారి మాట్లాడాలనిపిస్తోంది. కళ్ళు మూసుకున్నా…….

“ ఏంటి నాన్నా!  ఇవ్వాళ అందరూ ఫాదర్స్ డే   అని ఎవరి తండ్రి గురించి వారు గొప్పగా రాసుకున్నారు..

నేనేంటి ఏమి రాయలేదు.నాకు నీ మీద ప్రేమ లేదా?? ఎందుకు నాన్నా కలం కదలడం లేదు.”

“చిన్నప్పటినుండి మిగతా ముగ్గుర్ని మందలించినంతగా నన్ను మందలించలేదేమో కదా నాన్నా!. అందుకే వాళ్ళకెప్పుడూ అదే చాడీ ‘నాన్నకు అదంటేనే  ఎక్కువ ఇష్టం’ అని. “

“చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకొని నువ్వు పడ్డ బాధలు కథలుగా మాకు మేమెంత అదృష్టవంతులమో అమ్మ నాన్నలతో ఉండడడం అనిపించేలా చెప్పేవాడివి కదా నాన్నా! “

“అందరికి మంచి సంబంధాలు చూసి మంచి మనుషుల చేతిలో పెట్టావు కదా నాన్నా.  నీకెలా తెలుసు నాన్నా నా బిడ్డలకు వీరే తగిన వాళ్ళు వీరితో నా బిడ్డ జీవితం బాగుంటుంది అని?. ఇప్పుడు మేము అనుభవిస్తున్న ఈ జీవితం నువ్వు తీర్చి దిద్దిందే కదా నాన్నా!”

“అందరూ అనేది నిజం నాన్నా అమ్మ వర్తమానం చూస్తుంది నాన్న భవిష్యత్తు చూస్తాడు అని. నీతో సన్నిహితంగా మెదిలిన నాకు తెలుసు నాన్న ఈ విషయం. ప్రతి విషయాన్ని చాలా అడ్వాన్స్ గా ఆలోచించే నీ ధోరణి నాకు అప్పుడు విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే అది అర్థం చేసుకునే పరిణితి నాకు అప్పుడు లేకపోవడం. నీకు సాధ్యమైనంతలో మమ్మల్ని చాలా సౌకర్యవంతంగా పెంచావు నాన్నా. “

“అదేమిటో నాన్నా నన్ను పెంచావు కాబట్టి నేను నీలా ఉంటా. సరే నా కొడుకు పై కూడా నీ ముద్ర ఎలా వేశావు నాన్నా? నెలల పిల్లవాణ్ణి పాల సీసా తో నీ చేతిలో పెడితే బస్సులో అంత దూరం నుండి వాణ్ణి తీసుకొచ్చావే నీతో. ఎప్పుడూ గుర్తు చేసేవాడివి ఈ విషయం. వాడు ఎంత అదృష్టవంతుడు నాన్న. సెలవు వస్తే వాడికి నీ మీద ధ్యాసే. నీతో కలిసి వాకింగ్ చేసాడు నీతో కలిసి ఆడాడు పాడాడు .నిన్ను నా కన్నా ఎక్కువగా విసిగించాడు. వేసవి నీటి ఎద్దడిలో నీళ్లతో ఆటల ఆడి నీతో తిట్లు తిన్నాడు. నీతో అమ్మతో కలిసి ఒకసారి  భద్రాచలం వెళ్లిన విశేషాలు వాడు ఇప్పటికి చెప్తూనే ఉంటాడు. నువ్వు నాకు నాన్నవు కాబట్టి నాకు గొప్ప. మరి వాడికెందుకు నాన్నా నీ మీద అంత ఇష్టం. నిన్ను నా తర్వాత నాకన్నా దగ్గరగా చూసాడు కాబట్టి కావచ్చు కదా నాన్నా!. “

“వాడికి మేమిద్దరం కలసి కార్ కొని ఇచ్చినప్పుడు వాడు ఒక మాట అన్నాడు ఏంటో తెలుసా నాన్నా………..

‘నాకు  తాతయ్యను పక్క సీట్ లో కూర్చోబెట్టుకొని లాంగ్ డ్రైవ్ వెళ్లాలని ఉండేది కానీ అది తీరలేదు ‘ అని కంట నీరు పెట్టుకున్నాడు. నువ్వు నాకు హీరోవే కావచ్చు నాన్నా!  మరి వాడెందుకు నిన్ను అంతగా మిస్ అయ్యాడు ?” 

“ఎందుకో హఠాత్తుగా  మారిపోయావ్ . ఏమీ పట్టించుకోడం మానేశావ్. అన్నీ అమ్మే చేసేలా చేస్తున్నావ్. ఇంటి పని బయట పని. ఎందుకిలా చేస్తున్నావు అనేది అర్ధం కాకపోయేది. 

ఒక్కోసారి కోపం కూడా వచ్చేది. కానీ దానికి జవాబు మాకు కొన్ని రోజుల్లోనే దొరికింది. వైద్యం లేని ఒక భయంకరమైన చికిత్స లేని వ్యాది డిమెన్షియా, ఆల్జీమర్స్ రూపంలో నిన్ను మా నుండి వేరు చేయడానికి సిద్ధంగా  ఉంది అని. అమ్మతో అన్ని పనులు చేయిస్తుంటే ఎందుకో అనుకున్నాం రేపటి కాలంలో నువ్వు లేకున్నా అమ్మ దేనికి ఎవరి దగ్గరా తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేసావు నువ్వు లేకుండా  ఈ లోకంలో బతక గలిగే ధైర్యం ఇచ్చావు.”

“జ్ఞాపకశక్తి కోల్పోతున్న స్థితి లో నీ కోసం రోజూ నా ఆఫీస్ డ్యూటీ అయిపోగానే వచ్చేదాన్ని. అలసిన నా మొఖం నీకు నచ్చేది కాదు. జుట్టు లేచిందేమిటే అని నేను ఫ్రెష్ గా అయ్యేదాక చిన్నపిల్లోడిలా మారం చేసేవాడివి. నా వేలు పట్టి నడక నేర్పిన నువ్వు  నా చేయి పట్టుకొని ఆడుకుంటూ అల్లరి చేశావ్. కోల్పోతే ఈ ఆనందాన్ని  మళ్ళీ పొందలేనని నేనూ నీతో ఎక్కువ సేపు ఉండేదాన్ని నాన్న. ఎన్ని కోట్లిచ్చినా నాకు మళ్ళీ దొరకదు అలాంటి అవకాశం.”

 “ఉద్యోగ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న వివిధ మనస్తత్వాల గురించి చెప్తూ ప్రపంచాన్ని నీదైన శైలిలో పరిచయం చేసావు కదా నాన్నా.”

“నిజం చెప్పనా నాన్నా! నేను ఇప్పుడు ఎదుర్కొనే ప్రతి కష్టంలో, ప్రతి పరిస్థితి లో నువ్వు గుర్తొస్తున్నావు. అంటే నీ వయసుకి నేను వస్తేనే గాని నాకు అర్థం కాలేదు కదా నాన్న అప్పుడు నువ్వు చెప్పిన విషయాలు. నీ ఆలోచన ధోరణి నాకు అబ్బడం వల్లనో ఏమో ఏ సమస్య వచ్చినా నీ లాగే స్పందిస్తున్నాను. “

“ఇవన్నీ నీ నుంచి పొందిన నేను నీ గురించి రాయలనుకుంటే రాయలేకపోవడమేంటి నాన్నా!”

“ఇప్పుడు ఇదంతా గుర్తొస్తుంటే నా కళ్ళ వెంట నీరు కారిపోతుందేంటి ?”

“అందరు నీ ఫోటో  పెద్దదిగా చేసి గోడ మీద పెట్టుకొని వారి ప్రేమను చాటారు. నేనెందుకు నాన్నా పెట్టుకోలేదు ? ఎందుకో చెప్పనా నాన్నా!.. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్వుతూ వుండే నువ్వు గోడ మీద ఫోటో లో కనిపిస్తే.. నువ్వు లేవని ఇక రావని గుర్తొస్తూ ఉంటుంది .అది నేను తట్టుకోలేను నాన్నా. అందుకే నిన్ను నా గుండెలోనే పెట్టుకున్నాను”

“నాన్నా!  నేను రాయలేకపోవడానికి కారణం నీ మీద ప్రేమ లేకపోవడం కాదు నాన్నా అసలు నా ప్రపంచమే నువ్వు కదా !”

“కన్నీటితో మసక బారుతుంది నాన్నా మనసు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే  నీకు తల్లినై  పుట్టి నీ ఋణం తీర్చుకుంటాను నాన్నా…!”

 

You May Also Like

4 thoughts on “నాన్నే నా ప్రపంచం.

  1. నిజమే ప్రతి కూతురికి నాన్నే ప్రపంచంలో అందరికన్నా గొప్పవాడు…ప్రతి కూతురు నాన్నకు మరో అమ్మ కావాలి అనే కోరుకుంటుంది..బాగుంది మేడమ్ మీ నాన్న గురించి చెప్పిన విధానం👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!