నిజం 

 నిజం 

రచయిత:ఇంద్రపాల శ్రీనివాస్

మీరు ఇంకా 

చెట్లు, చేమలు 

పువ్వులు, పుట్టలు 

ఆకులు, అలములు అంటూ రాస్తూనే పోండి. 

నేను చరిత్ర బట్టలు ఊడదీసి 

అక్షరాన్ని నగ్నంగా నడి బజారులో పడుకో బెడతా.

 

అమ్మ రొమ్ము అందక రోదించే వాడి 

అనాథ గుండెల్లోంచి బయలుదేరుతా 

బతుకు, మెతుకు కానరాక 

శిథిలం అయిన అభాగ్యుల అరిగోసల అనామక పర్వం లో నుండి 

మొదలు పెడతా 

 

కళ్ళు ఉంటే 

కళ్ళు మూసుకోండి 

నోళ్ళుంటే 

నోళ్లు వెళ్ళబెట్టుకోండి 

 

ఆరు బయట వెన్నెల్లోనే 

అరుగుల మీదే చావండి 

తులసి చెట్టు చుట్టే తిరగండి 

నేను అర్ధరాత్రి శ్మశాన చితి మంటల్లోంచి 

చావక ముందే చచ్చిన ఆశల్లోంచి తలెత్తుకుంటా 

గుండెలు  పగిలిన వాడే 

నా అక్షరాన్ని గుండెలకు హత్తుకుంటాడు 

సమస్తం అగమ్య గోచరం అయినవాడే 

నా ఆవేదన ను 

కనుగొంటాడు 

ఇప్పుడు మానవత్వమే 

మందు పాతర 

మాటలకు రంగులు, సోకులు, సొబగులు పులిమి మత్తులోకి దించి మభ్య పెట్టేది  

నిన్ను నన్ను నిలువునా పేల్చి  కూల్చి వేయడానికే  

కవిత్వం ఇప్పుడు 

కళ్ళు లేని కబోది

కాళ్ళు లేని దివ్యాoగురాలు 

చెదలు పడుతున్న వార్ధక్యపు వాక్యాన్ని 

నా భుజస్కంధాల మీద మోస్తూ 

గొంతు ఎండుకు పోతూ ప్రాణాపాయ స్థితిలో 

కొట్టు మిట్టాడుతున్న పదాలను  

నా రక్త మాంసాలతో తడుపుతూ 

ఏ విశాఖ కార్మికుల, పంజాబ్ రైతుల , 

పసుపు బోర్డు పేరుతో బలి పశువులైన నిజామాబాద్ రైతన్నల, మల మూత్రాలతోనో 

అత్యాచారాల సంస్కృతి తో శోభిల్లు తున్న 

అబలల కన్నీళ్ల తోనో  మళ్ళీ పునర్జీవింపజేస్తా 

నిర్జీవ నియంతృత్వానికి 

సజీవంగానే పిండం పెడతా 

అక్షరానికి నా కలల  కాగడాల వెలుతురు సెగలతో 

పురుడు పోస్తా 

నీతులు, నియమాల పట్ల 

నాకు నమ్మకం లేదు 

వేదికలంత అందం గా వ్యవస్థ లేదు 

అతిధుల ముసలి కన్నీళ్ల మధ్య 

సమాజం అసలు స్వరూపం ప్రతి ధ్వనించడం లేదు 

ఏ కంటి కన్నీటి ని మీ కవిత 

హృదయం తో తుడిచినదో 

చెప్పండి 

ఏ విరిగిన వెన్ను ను మీ ఆక్రోశం 

నిజాయితీ గా నిమిరిందో 

సెలవివ్వండి

చరిత్ర చీకటి గుహల్లాంటి 

గ్రంధాలయాలలో 

గాయపడ్డ కావ్యాల అరణ్య రోదన వినే నాధుడెవ్వడు? 

ఫుట్ పాత్ ల మీద 

పుట్టెడు దుఃఖం తో 

నలిగిపోతున్న అక్షరాల ఆత్మ క్షోభ ను 

పసి గట్టే ప్రాణం ఉన్న కవులెవరు??

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!