పండు – హాస్యం

అంశం: హాస్య భరిత కథ

పండు – హాస్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

అనగనగా తారకాపురం అనే ఒక ఊరు. ఆ ఊరు వసుంధర అనే రాజ్యం లోకి వస్తుంది. ఆ రాజ్యానికి రాజు సుమంతుడు. ఈ ఊరిలో పండు అనే పిల్లవాడు ఉండేవాడు. ఈ పండు చిన్నప్పటి నుంచి చిలిపి పనులు చేస్తూ, హాస్యం పండిస్తూ అందరినీ నవ్వించే వాడు. పండు ఎదిగి పెద్దవాడు అయ్యే కొద్దీ ఊర్లో అందరితో మంచి వాడుగా ఉంటూ వినోదాన్ని పంచే వాడు. చదువులో ముందు ఉంటూ రకరకాల కుస్తీ విద్యలూ అవీ కూడా నేర్చుకున్నాడు. పండు ఎలాంటి వారినైనా ఎలాంటి పరిస్థితి లోనైనా నవ్వించ గలడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా రాజు గారికి చేరింది. ఆ రాజు గారికి ఒక కూతురు ఉంది, ఆమె పేరు లతాంగి. పేరు మృదువుగా ఉన్నా మనిషి చాలా కటువు. అసలు ఆమెను నవ్వడం చూడలేదు ఎవ్వరూ. రాజు గారికి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఇతను తన అమ్మాయిని నవ్విస్తే వారికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. విషయం మంత్రికి చెప్పి నలుగురు గూడచారులని నియమించి ఆ పండు గుణగణాలని పరిశీలించాలని ఆజ్ఞాపిస్తాడు. వారు తారకాపురం చేరి పండుని రహస్యంగా గమనిస్తూ ఉంటారు.
ఒకరోజు పండు ఒక కోతిని ఆడిస్తూ ఒక ఇంటికి వెళ్లి తను కూడా కోతిలా ఆడుతూ వీధి అరుగు మీద గంతులు వేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉండే అవ్వ, అయ్య ఎంత ఆట పట్టించినా విచారంగా ఉంటారు.
దానితో ..పండు : బుజ్జి కోతీ అరటి పండు ఇస్తా తల్లో పేలు చూడు అంటే ఆ కోతి చక్కగ పేలు చూస్తుంది. మళ్లీ అమ్మ గారికి అయ్యగారికి దన్నం పెట్టు అంటే పెడుతుంది. చూడు వీళ్ళు ఎంత చేసినా నీకు అరటి పండు ఇవ్వడం లేదు ఇంటి పైకి ఎక్కి రెండు పెంకులు తీసెయ్ అంటే అది ఎక్కడానికి తయారవు తుంది. ఇంతలో ఆరి! బడవా.. ఆగు ఆగు! అంటూ కోతికి అరటి పండు, పండుకి తినడానికి పల్లీలు తెస్తూ నవ్వుతారు అవ్వ, అయ్య.
హమ్మయ్య నవ్వారు అని పండు, చుట్టూ ఉన్నవాళ్లు సంతోషిస్తారు. కోతి చప్పట్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే పాపం వీళ్ళు ఒక్కళ్లూ ఉంటారు, నా అనే వారు లేక, అప్పుడప్పుడు దిగాలు పడిపోతూ. అలా రెండు రోజుల నుంచీ ఏమీ తినకుండా ఉంటే, పక్క వాళ్ళు వెళ్లి పండుని తీసుకు వస్తారు అన్నమాట. ఆ ముసలి వారికి ఎప్పుడూ దిగులు పడకండి, తినడం మానేస్తా ఎలా అని హితవు చెప్తే, సరే అని మాట ఇస్తారు వాళ్ళు.
ఇంతలో గూడచారులుగా వచ్చిన రాజభటులు పండుని రాజు గారు తీసుకురమ్మన్నారని తీసుకు వెళ్తారు. మంత్రి గారికి పండు గుణగణాలు చెప్పాకా రాజు గారి దగ్గరకు తీసుకువెళతారు.
రాజు గారు: నువ్వు ఇక్కడే కొన్ని రోజులు ఉండి మా అమ్మాయి ని నవ్వించాలి లేదంటే నీకు రాజ్య భహిష్కరణ శిక్ష పడుతుంది అంటారు.
పండు: హమ్మా! నాకేం పని అవిడ నవ్వితే నాకేం నవ్వక పోతే నాకేం నే పోతా!
రాజుగారు: ఏయ్ రాజు అజ్ఞనే ధిక్కరిస్తావా, చెరసాల లో బంధిస్తా జాగ్రత్త.
పండు: ఓసోసి, మీరు మంచోరు అంటారు అందరూ, ఇదేనా మీ మంచి తనం, నే పక్క రాజ్యానికి పోతా వదిలెయ్యండి అంటాడు.
రాజు గారు: అబ్బా, వీడు గడుగ్గాయిలా ఉన్నాడే అనుకుని, అది కాదు బాబు, సరే శిక్ష ఏం కాదు కానీ మా అమ్మాయిని నవ్విస్తే నీకు మంచి బహుమానం ఇస్తా.
పండు: సరే అలా చెప్పండి, మరి మహుమతి నేనడిగింగింది ఇవ్వాలి.
దానితో రాజు గారు లోలోపల వీడే మా అమ్మాయికి సరైనోడు అనుకుని సరే అంటాడు.
ఇదంతా సభ పై అంతస్తు నుంచి చూస్తున్న లతాంగి, లోలోపల ఇతనెవరో నాలాగే భలే గట్టోడే అనుకుని రాబోతున్న నవ్వుని ఆపుకుంటుంది.
రాజు గారు అతఃపురం లోనే పండుకి బస ఏర్పాటు చేశారు. వీళ్ళని గమనిస్తూ ఉండి అమ్మాయి నవ్వగానే తనకి చెప్పమని రాణీ కి పురమాయిస్తారు. మరునాడు పండు ఒక జోకర్ వేషం వేసుకుని, లతాంగి విహరిస్తున్న ఉద్యాన వనానికి చేరుకుని చెట్లు పుట్టలు ఎక్కుతూ ఉంటాడు. రక రకాల వింత చేష్టలు చేస్తూ, యువరాణి లతాంగి దగ్గరకి వెళ్తాడు.
పండు: యువరాణి వారూ, మీకు నవ్వడం రాదటకదా, నేర్పమంటారా.
లతాంగి: ఎవరు చెప్పారు, నేను చక్కగా నవ్వగలను.
పండు: లేదు అబద్దం మీకు నవ్వడం రాదు
లతాంగి: ఏయ్, ఏమనుకున్నావు నన్ను. నిన్ను చూస్తేనే నవ్వు వస్తోంది. నేనే నువ్వు బాధ పడతావు అని నవ్వడం లేదు
పండు: అంతా ఉత్తిదే అని కొన్ని విదూషకుడు చేసే చిన్న చిన్న క్రీడలు చేస్తూ, పక్కనే ఉన్న జామ పండు టోపీ లో వేసి, పేక ముక్కలు గా మార్చడం, ఒక చిన్న గుడ్డ ముక్కని తీసుకుని రామచిలుక లా మార్చడం చేస్తాడు. దానితో యువరాణి పకా పకా నవ్వుతుంది. అది పక్కనే ఉన్న రాజు గారితో పాటు రాణీ గారు కూడా చూసి ఎంతో ఆనందిస్తారు.
రాజు గారు, పండు ని ఏదైనా కోరుకోమంటారు. దానితో పండు నాకేమ వద్దు గానీ, మీరు రాజ్యపాలన చక్కగా చేస్తున్నారు. రోజూ సాయంత్రం పూట ప్రతి గ్రామంలో ఒక గంటసేపు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే, ప్రజలంతా మరింత ఆరోగ్యంగా ఉంటారు. అలా చేయించమని కోరతాడు. దానికి రాజు గారు మరింత సంతోషిస్తారు. రాజు తోనే ధైర్యంగా మాట్లాడడం, సమయ స్ఫూర్తి, నిస్వార్థం గా ఉండడం ఇవన్నీ బాగా నచ్చి, ఇంత వరకూ తన కూతురు అసలు నవ్వ లేదనీ, తనని పిలిపించిన కారణం కూడా చెప్పి తన కూతురిని పెళ్లి చేసుకో మంటారు.
దానికి పండు అది ఉచితం కాదనీ తాను కేవలం పది మంది హాయిగా ఉండాలనే తప్ప, తనకి దురాశ లేదని చెప్తాడు. దానితో రాజు గారికి పండు మీద అభిమానం, గౌరవం రెట్టింపు అవుతాయి. రాజు, రాణి, లతాంగి కలిసి అతనిని ఒప్పించి, పండు అమ్మా నాన్న నీ కూడా పిలిపించి తగు రీతిలో సత్కరించి వాళ్ళ అంగీకారం తో వైభవంగా పండు- లతాంగిల పెళ్లి జరిపిస్తారు. అదీ మన పండు కథ పది మంది మేలు కోరేవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటారు, ఉన్నతంగా ఎదుగుతారు అన్నది కథ లో నీతి.
కథ కంచికి మనం ఇంటికి.

***

You May Also Like

8 thoughts on “పండు – హాస్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!