పందెం

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

పందెం

రచయిత :: నామని సుజనాదేవి

‘ఏంటి? నిన్న ఎక్కడికి వెళ్ళావ్? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవదు’
‘అబ్బో! నిన్న పెద్ద అడ్వెంచర్ అనుకోవాలి. మా తాతయ్య ఊరు, మా అమ్మతో కలిసి వెళ్ళాను. అక్కడ నాకు తోచడం లేదు, అని అమ్మ చెబుతున్నా వినిపించుకోకుండా అమ్మ ను అక్కడే ఉంచి తిరుగు ప్రయాణం అయ్యాను. నన్ను బస్సు ఎక్కించారు . అయితే దారిలో బస్సు టైర్ పంచర్ అయింది. దానితో దాదాపు మూడు, నాలుగు గంటల వరకు వేరే బస్సు రాక నేను వెళ్ళలేకపోయాను . చివరికి ఆర్టీసీ డ్రైవర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడి మరో బస్ అరేంజ్ చేయించితే, వేరే బస్సు తీసుకొచ్చి అందులో ఎక్కించి నన్ను హైదరాబాద్ నుండి కరీంనగర్ లో దించేసరికి అర్ద రాత్రి పన్నెండు అయ్యింది. ఇక అక్కడి నుండి మళ్ళీ మన ఊరికి రావాలి. ఆ రాత్రి అక్కడ ఉండలేను. ఆ రాత్రి మన వూరి బసేస్ లేవు. అయితే నాలా మన ఊరివైపు వెళ్ళేవాళ్ళు, దాటి ఇంకా దూరం వెళ్ళేవాళ్ళు అంతా ఒక ప్రైవేట్ జీపు లో వెళుతుంటే , ఇక తప్పదనుకుని వారంతా ఉన్నారు కదా అని అది ఎక్కి మన ఊరి దగ్గర దిగాను. ఇక్కడికి ఆ రాత్రి ఆటోలు ఉండవు కదా! లోపలికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు , అమ్మో ఇక నా దడ చూసుకోవాలి. అబ్బో ! మామూలు వారు అయితే హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చేవారే!’

‘ఓసోస్! ఆమాత్రం చీకటికి భయపడతారా? పేద్ద … కాలేజీలో ఝాన్సీ లక్ష్మి ని అంటూ తిరుగుతావు. అయినా చేతిలో అంత పెద్ద ఆయుధం సెల్ ఫోన్ ఉంది కదా ’
‘ అవునులే చెప్పడం చాలా తేలిక . అనుభవించిన వారికే తెలుస్తుందిలే ఆ బాధ !చార్జింగ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ ! పవర్ బాంక్ తీసుకు పోలేదు. నీకేం తెలుసు? అటు అమ్మ వాళ్ళు కంగారు, ఇటు నాకు భయం’
‘పుట్టి పెరిగిన మన ఊరికి చీకట్లో రావడానికి భయపడతావు గాని, మాటలకు మాత్రం , ‘నేను ఝాన్సీ లక్ష్మీబాయి , రాణి రుద్రమ’ అని మాట్లాడతావు . నీ సంగతి నాకు తెలియదా’
‘ మాటలు జాగ్రత్తగా రానీవె! భయపడేది నీకేం తెలుసు? అర్ద రాత్రి నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న మందుల కోసం ఒక్క దాన్ని రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి తెచ్చి ఇచ్చా అని తెలుసా! అప్పుడు నా వయసు ఎంతో తెలుసా? నాలుగేళ్ళు’
‘ మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుంది నీ కథ! అప్పుడెప్పుడో నువ్వు ఏం చేస్తే ఏం లాభం ? ఇప్పుడు అందరూ చూస్తుండగా చెయ్యాలి గాని! ‘
‘ సరే ఏం చేయమంటావు? చెప్పు’
‘నీ మొహం కోతలరాయుడు లాగా కోతలు కోయకు. పేరు ఝాన్సీ అని పెట్టుకోగానే సరిపోయిందా?’’
‘ఏంటి అంతా వెటకారం, నన్ను చూస్తే! మీకు అలా జోకర్ లాగా కనపడుతున్నానా?’
‘లేదు ఝాన్సీ లక్ష్మీబాయి, కనకదుర్గ తల్లి, రుద్రమదేవి కలగలిసిన రూపంలా కనపడుతున్నావు సరేనా! వదిలేయండి తల్లి’
‘ లేదు మీరు ఇంత అవమానించిన తర్వాత ఇక నేను ఊరుకోను. చెప్పు ఏం చెయ్యమంటావో చెప్పు! ఆకాశాన్ని కిందకు దించ మంటావా? పాతాళాన్ని పైకి తెమ్మంటావా? ఏం చేయాలో చెప్పు! ఒంటరిగా అర్ధరాత్రి చిమ్మని చీకటి 200 మైళ్ళు ప్రయాణించి తిరిగి రమ్మంటావా చెప్పు’
‘ఓయబ్బో నీ దగ్గర అంత ధైర్యం ఉందా?’
‘ ఉంది. చెప్పు .ఏం చేయమంటే అది చేస్తాను.బెట్’
‘ ఓకే అయితే నువ్వు రేపు అమావాస్య రాత్రి పన్నెండు గంటలకి , ఏమాత్రం ఎవరికీ తెలియకుండా ఒక్క దానివి మన ఊరి అవతల ఉన్న ఊడల మర్రి ది ఒక ఊడ తీసుకుని రా ! చాలు’
గుండె గుభేల్లు మంది ఝాన్సీ కి. అక్కడికి ఇప్పటి వరకు రాత్రి వెళ్ళిన వారు ఎవరూ తిరిగిరాలేదు. ఎందఱో వెళ్లి అక్కడే చచ్చి పడి పోయారు. ఆ పక్కనే పాత పాడుబడిన బంగాళా కూడా ఉంది. ఎవరూ పగలే అటు వెళ్ళే సాహసం చేయరు. కాని ఇప్పుడు కమిట్ అయ్యింది కాబట్టి దారి లేదు. చేతికి ఉన్న అమ్మ కట్టిన ఆంజనేయ స్వామీ బిళ్ళ ఉన్న దారం ఉంది. ఏదయినా ఆ స్వామీ చూసుకుంటాడు అనుకుంది.
‘ఒకే బెట్’ అంది

అర్దరాత్రి . ఝాన్సీ తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని బయలు దేరింది. అల్లంత దూరంలో ఉన్న ఊడల మర్రి అర్దరాత్రి అమావాస్య చీకటిలో జడలు విరబోసుకున్న జడల దయ్యంలా ఉంది. నక్కల ఊళలు భయంకరంగా వినబడుతున్నాయి. అల్లంత దూరంలో గాలిలో ఎర్రగా నిప్పులు గాలిలో ఎగురుతున్నాయి. ఎక్కడి నుండో స్మశానం చితి నుండి వచ్చిన పొగలా ఆ కారు చీకటి లో ఊపిరి సలపకుండా చేస్తూ పొగ వస్తోంది. ఎవరో అనుసరిస్తున్నట్లు , దయ్యాలు వెంబడిస్తున్నట్లు అనిపించి భయంగా నెమ్మదిగా ఆగి వెనకకు తిరిగింది. ఎవరూ లేరు. ప్రాణాలు ఉగ్గబట్టు కుంది. మరో రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు నెమ్మదిగా ఒక ఊడ తెంపుకుని రావచ్చు. ‘శ్రీ ఆంజనేయం అంటూ చదువుతూనే ఉంది. అంతే వెనక ఆమె షర్ట్ పట్టుకుని ఎవరో లాగుతున్నారు.
గుండె జల్లుమంది. తన అనుమానం అనుకుని కొంచెం గట్టిగా ముందుకు సాగ బోయింది. ఊహు ఇంకా గట్టిగా లాగుతున్నారు. అంతే గుండె రాజధాని ఎక్స్ ప్రెస్ లా కొట్టుకుంది. అంతే పై ప్రాణాలు పైనే పోయాయి.
దేవుణ్ణి స్మరిస్తూ వెనకకు తిరిగింది. ఎవరూ లేరు. షర్ట్ ఒక ముళ్ళ కంపకు కుచ్చుకుని ఉంది. ఆమె శ్వాస ఆమెకే భయంకరంగా వినబడుతుంది. ఎదురుగా నిప్పులు లేవు. కాని దట్టంగా పొగ మాత్రం వస్తూనే ఉంది. నెమ్మదిగా ఒక ఊడ దగ్గరకు వెళ్ళి, చిన్న ముక్క తెంప బోయింది. పెద్ద శబ్దం. ఆపై పెద్ద పెద్దగా మాటలు. బిత్తర పోయింది. అది వచ్చిన వైపు నెమ్మదిగా దారి తీసింది. ఆ పాడు పడిన బంగాళా నుండి వస్తుంది. నెమ్మదిగా అక్కడి గోడ కున్న చిన్న రంద్రం గుండా లోనకు చూసింది. అంతే ఆమె కళ్ళు బెర్లు కమ్మాయి. అంతే ! ఆమె పడిపోతుంటే ఒక చేయి ఆమెను పడకుండా ఒడిసి పట్టుకుంది.

***

తెల్లవారి,’ ధైర్యంగా డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేసిన యువత’ అంటూ పెద్ద శీర్షిక లో ఝాన్సీ పేరుతొ పాటు ఆమె ఫ్రెండ్స్ అందరి పేర్లు పడ్డాయి.
అసలేం జరిగింది అంటే, నిజానికి ఆ పాడుపడిన బంగాళా లో డ్రగ్స్ మాఫియా జరుగుతుంది,ఎవరూ అటు రాకుండా ఉండడానికి , వచ్చిన వారిని వచ్చినట్లు చంపడం, రాత్రి చిత్ర విచిత్ర శబ్దాలు చేయడం లాంటివి చేసేవారు. ఆరోజు అమావాస్య అటువైపు ఎవరూ రారు అనుకుని కొంచెం అజాగ్రత్త గా ఉన్నారు. అయితే ఝాన్సీ ని అలా పందెం పేరుతొ పంపినా వెనకనే , పందెం కట్టిన రాధ కూడా తన అన్నయ్య కు విషయం చెప్పి ఫాలో అ వుతూ వచ్చింది. ఆమెతో పాటు అన్ని చూసి ఆమె పడిపోతుంటే పట్టుకుని ఈ విషయం పోలీసులకు ఫ్జోన్ చేసి బయటకు వచ్చేలా చేసారు. అదీ సంగతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!