పెసర (నోము)బూరెలు

పెసర (నోము)బూరెలు

రచన:సావిత్రి తోట జాహ్నవి(జానకి)

 

 

 

 

మేము కార్తీకపౌర్ణమి కేధారేశ్వరస్వామి నోము కి పెసర్లతో బూరెలు చేస్తాం.

అవి ఎలా చేయాలో ఈ రోజు మీ కోసం చెప్తాను.మీరు కూడా ప్రయత్నించి, మీ ఇంట్లో వారిని, పక్కింట్లో వారిని బుట్టలో పడేసుకోండి
మరీష(పెసర బూరెలు) ఎలా చేయాలో చెప్పుకుందామా…!

ముందుగా కావాల్సిన పదార్ధాలు:

మినపప్పు    ::      200 గ్రా. లు

బియ్యం       ::       300గ్రా.లు

పెసలు         ::       250గ్రా.లు

బెల్లం           ::       400 నుండి 500గ్రా.లు (తీపిని బట్టి వేసుకోవచ్చు)

(పొరపాటున కూడా అనకాపల్లి ఇసుక బెల్లం వేయకండి. జిగురు బెల్లం వేస్తే చాలా బాగుంటుంది ఏ వంటకమైనా)

ఉప్పు           ::     1 టీ స్పూన్

ఆయిల్         ::     1 లీటర్ (అంతకన్నా కొంచెం ఎక్కువ అయితే మంచిది. బూరెలు బాణలిలో అంటుకోకుండా వేయగానే చక్కగా తేలిపోతాయి)

తయారు చేసే విధానం:

బూరెలు చేయడానికి 6గం.లు ముందుగా మినపప్పు, బియ్యం కలిపి శుభ్రంగా ఎక్కువ నీళ్లతో 4,5 సార్లు నీళ్లు తెల్లగా వచ్చేలా కడిగి, నానబెట్టాలి.

పెసలు రాళ్లు లేకుండా శుభ్రంగా ఏరుకుని, స్టవ్ మీద బాణలి పెట్టి, అన్ని సమానంగా వేగేలా వేయించాలి. పావు గంట అలా వేయించిన తర్వాత, వేగినట్లు మంచి వాసన వస్తుంది. రెండు గింజలు తీసి, చితక్కోడితే లోపల బంగారు రంగుతో కనబడితే సరిగ్గా వేగినట్లు.

అలా పెసలు వేగాయి అని నమ్మకం కుదిరిన తర్వాత తగినన్ని నీళ్లు ఎసరుబెట్టి, పెసలు అందులో వేసి, ఉడికించుకోవాలి. పెసలు బాగా ఉడికిన తర్వాత, తీసి గంజి వార్చేయాలి. లేదా కుక్కర్ లో 1కి 2 వంతులు నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవచ్చు. ఆ తర్వాత నీళ్లు లేకుండా పూర్తిగా వంచేసి, ఒక వెడల్పాటి బెసిన్లో వేసి చల్లారబెట్టాలి.

బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా  మిక్సీలో వేస్తే అంతా సమానంగా,పొడి పొడిగా అవుతుంది.

మినప్పప్పు నానబెట్టి 4,5 గంటలు అయిన తర్వాత  అందులో నీళ్లు వంపేసి, మనకు ఆవకాశం బట్టి, మిక్సీ కాని, గ్రెండర్లో కాని వేసి గారెల ముద్దలా గట్టిగా, మెత్తగా రుబ్బుకుని, పక్కన పెట్టాలి. (గ్రెండర్ ఉంటే అదే బెటర్) .

ఇప్పుడు మరల స్టవ్ వెలిగించి, ఒక వెడల్పాటి గిన్నెలో బెల్లం వేసి, 200గ్రా.ల నీళ్లు పోసి, బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగి, బెల్లం బాగా కలిసింది అనుకున్న తర్వాత, స్టవ్ కట్టేసి స్టిల్ స్టెయినర్ తో వడకట్టి, మరల స్టవ్ మీద పెట్టాలి. బెల్లం పాకం దగ్గరకు రాగానే, ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో ఒక చుక్క పాకం వేయగానే  గట్టిగా ముద్దలా అయిందాంటే  సరిపడినంత పాకం వచ్చినట్లు లెక్క. వెంటనే స్టవ్ కట్టేసి, పాకం పక్కన పెట్టాలి.

ఇప్పుడు  మినప రుబ్బులో కొంచెం బెల్లం పాకం (ఒక గరిటెడు) ,ఉప్పు వేసి బాగా బుడగలు లేకుండా కలుపుకోవాలి.

అలాగే పెసర పొడిలో కొంచెం,కొంచెం బెల్లం పాకం వేసి, కలుపుతూ ఉండలు చుట్టడానికి సరిపోయేంత కలిపి,చక్కగా నిమ్మకాయ సైజ్ లో ఉండలు చుట్టి పక్కన పెట్టాలి.

తర్వాత  స్టవ్ వెలిగించి, దాని మీద బాణలి పెట్టి, నీళ్లు లేకుండా వంచేసి, వేడెక్కాక నూనె వెయ్యాలి. నూనె బాగా వెడెక్కే వరకు ఆగి, పెసర ఉండలను ఒక్కొక్కటి గా మినప రుబ్బు లో ముంచి, నూనెలో వేయాలి. మెుదటగా బాణలిలో సులువుగా కదిలేటట్టు అయిదు, ఆరు కన్న ఎక్కువ వేయకపోతే మంచిది. ఆ తర్వాత వీలును బట్టి వేసుకోవచ్చు. ఇలా గ్రెండర్ లో వేసిన రుబ్బులో ముంచి బూరెలు చేస్తే, అరచేయి పట్టనంత పెద్దవి వస్తాయి.

ఈ విధంగా చేస్తే, రెండు, మూడు రోజులు నిలవ ఉంటాయి కూడా.
ఇంకేమిటి చూస్తున్నారు. అయిపోయింది బూరెలు చేయడం. చక్కగా అందరూ కూర్చుని ఆరగించండి మరి.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!