రహస్యాలు

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

రహస్యాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎస్.ఎల్. రాజేష్

భారతదేశం ఒక మహిమాన్విత పుణ్య భూమి. ఈ గడ్డ పై ఎన్నో అంతు చిక్కని, శాస్త్రవేత్తల ఊహకి అందని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా అద్భుతమైన దేవాలయాలు దర్శనమిస్తూ వుంటాయి. వీటిలో కొన్ని వీడని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. వాటిలో కొన్ని రహస్య ప్రదేశాలు చూసొద్దాం రండి.
అక్కడ ఇళ్లకే కాదు బ్యాంకులకూ తాళాలు వేయరు!
మహారాష్ట్రలో శనిశింగనాపూర్ గ్రామంలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయినా ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. అంతా శనిదేవుడి మహిమ అంటారు భక్తులు. షిరిడీకి వెళ్ళే భక్తులు అక్కడ నుండి 75 కిలో మీటర్ల దూరంలోఉన్న శని శింగణాపూర్ వెళ్లి రావడం ఆనవాయిగా మారింది.
లేపాక్షి స్థంభాల మర్మం!
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో లేపాక్షి ఆలయం లో వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలి పోయాయి. 16 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని స్థంభం క్రింద కాగితం గానీ, చేతి రుమాలు కానీ సులువుగా ఆ చివరి నుండి ఈ చివరి వరకు తీయవచ్చు. అంటే స్థంభానికి కింద ఖాళీగా ఉంటుందన్నమాట. ఆ స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంత వరకు ఎవ్వరూ చెప్పలేక పోయారు. దీని రహస్యం కనిపెట్టాలి అని విదేశీయులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఏనుగులతో స్తంభాన్ని నెట్టించే సమయంలో మిగిలిన స్తంభాలు కదలిపోయాయి. దీంతో భయ భ్రాంతులకు గురైన పాశ్చాత్యులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.
మిస్టరీగా తంజావూరు..
తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది.అలాగే ఆ ఆలయానికుపయోగించిన రాళ్ళను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు.ఇలా మన భరతభూమిలో ఎన్నో రకాల అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి.చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో అత్యత్బుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతటి మహోన్నతమైన కర్మ భూమిలో జన్మించడం మన పూర్వ జన్మ సుకృతం.

You May Also Like

2 thoughts on “రహస్యాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!