రైతు బిడ్డను (కూతురిని కాదు కొడుకుని)

రైతు బిడ్డను (కూతురిని కాదు కొడుకుని)

రచన: స్వాతి సూర్యదేవర

        నేను ఒక మధ్యతరగతి అడపిల్లని…. నా పేరు ధాత్రి! నేను ఆడుతూ,పాడుతూ అల్లరి చేస్తూ అమ్మ,నాన్నల చాటున వుండే రోజులవి. ఆనందం తప్ప ఇంకేమి పట్టని రోజులు కూడా. అమ్మ,నాన్న, నేను ఇదే మా చిన్న కుటుంబం. ఇంతకీ మా నాన్న ఎం చేస్తాడో చెప్పలేదు కదా…, మా నాన్న హీరో…అంటే సినిమాలలో కాదు రియల్ హీరో…అవును మా నాన్న ఒక రైతు.అది నేను గర్వంగా చెప్పుకుంటాను.ఎందుకంటే ప్రపంచంలో కొంతమంది తినడానికి అయిన తనవంతు సాయంగా వ్యవసాయం చేస్తాడు కదా!అందుకు.

అలా  ఆనందంగా సాగిపోతున్న రోజులలో ఒక్క రాత్రి నా జీవితాన్నే మార్చేసింది..

            అప్పటి వరకు మాకున్న కొంత భూమి సాగు చేసే నాన్న ,పిల్ల చేతికి వస్తుంది అనో,ఆర్ధిక వృద్ధి పెంచుకోవాలి అనో, మరొకటో కానీ ఆ సంవత్సరం భారీగా కౌలు భూమి తీసుకొని వ్యవసాయం చెయ్యాలి అనుకోని ఆరు ఎకరాలు  మెట్ట కౌలు కి తీసుకొని మిర్చి పంట వేసాడు. అమ్మ ,నాన్న ఇద్దరు పొద్దున్నే ఏడూ గంటలకు నన్ను స్కూల్ బస్ ఎక్కించడం ,పొలం వెళ్లిపోవడం మళ్ళీ సాయంత్రం ఆరు దాటాక ఇంటికి రావడం.తిండి,నిద్ర మర్చిపోయి ఇద్దరు అప్పు తెచ్చి మరి పెట్టుబడి పెట్టి, చాలా కష్టపడి పంట సాగు చేశారు. అంత కష్టం వృధా పోనివ్వకూడదు అని అనుకున్నాడేమో ఆ దేవుడు కూడా ఊర్లో ఎవరికి రానంత పంట దిగుబడి ఇచ్చాడు.

        పంట కోతలకు వచ్చే సమయంలోనే నేను చేతికి వచ్చాను.ఇప్పటికే పంట పెట్టుబడికి చాలా అయ్యాయి ఇపుడు వేడుకలు అంటే చాలా అవుతుంది అని అమ్మ ఆలోచిస్తే ,కాసిన పంట ఉంది అన్న ధైర్యంతో ఒక్కతే పిల్ల అన్ని ముచ్చట్లు జరగాలి అని అప్పు అయినా తగ్గకుండా చాలా ఆర్భాటంగా వేడుక జరిపించాడు నాన్న. కొన్నాళ్ళకి పంట కోసే సమయం వచ్చింది.కూలీలని రమ్మని చెప్పారు నాన్న. అన్ని సిద్ధం చేసాడు పంట కోయించడానికి.

         తెల్లారితే పంట కొస్తారు ఒక వారం ఆగితే ఇప్పటి దాకా పడ్డ కష్టమే కాదు ,పెట్టుబడికి రెండింతలు మిగులుతాయి అనే ఆనందం, చాలా సంతోషంగా ఉన్నారు.నన్ను హోమ్ వర్క్ కూడా చేసుకొనివ్వకుండా తెల్లవారుజామున నే పొలం వెళ్ళాలి అని ఏడూ గంటలకే పడుకోమని నిద్రపుచ్చేసింది అమ్మ.వాళ్ళ సంతోషం చూసి నాక్కూడా చాలా ముచ్చటేసింది. ఆదివారం రోజుకి నేను కూడా పొలం వస్తా అని చాలా సేపు గొడవ చేసి అమ్మ ని ఒప్పించి ,ఆ ఆనందంతోనే రెండు రోజుల తర్వాత వచ్చే ఆదివారం కోసం కలలు కంటూ.. అమ్మని గట్టిగా హత్తుకొని నిద్రపోయాను.పొలం వస్తా అని గోడవచేయడం ఏంటి అనుకుంటున్నారా..హ.హ…నేను రైతు బిడ్డనే అయినా..మా నాన్న కి యువరాణిని కదా.. అందుకే మట్టిలోకి కాలు పెట్టనిచ్చేవాడు కాదు.గారాల బిడ్డని కదా మరి!!

              ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడం ఆ దేవుడికి చాలా ఇష్టం కదా.అలానే రైతుకి అన్ని వనరులు సమకూర్చి,ఆరుగాలం కష్టం చేసిన రైతుకి ముత్యంలాంటి పంటని చూపించి, చేసిన కష్టం మర్చిపొమ్మని చెపుతూనే.., తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షం రూపంలో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేయ్యడం ఆయనకి బాగా అలవాటు. ఆరోజు కూడా అలానే అర్ధరాత్రి సమయానికి పెద్దపెట్టున వాన,ఎంతలా అంటే తెల్లవారేపాటికి మా ఊరు పెద్ద చెరువు కూడా నిండేంత అదీ ఫిబ్రవరి నెలాఖరులో… మంచి నిద్రలో ఉన్న నాకు ఉరుములు శబ్దం కన్నా పెద్దగా ఒక ఏడుపు వినిపించింది.మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన నాకు చుట్టూ చీకటే కనిపించింది.అప్పుడు తెలియలేదు నాకు, ఆ చీకటి నా జీవితంలో పెను మార్పులని తీసుకువస్తుంది అని. మెల్లిగా లేచి “అమ్మా,అమ్మా” అని అంటే అమ్మ ఏడుస్తూనే పలికింది. “ఏమైంది అమ్మ ఎవరు ఏడుస్తున్నారు…నాకు భయం వేస్తోంది” అని తడుముతూ అడుగుతున్నా  నాకు, బయట హోరున వర్షం పడుతున్నా ,ఆ శబ్దం చెవులకి చేరుతున్నా… దాని గురించి పట్టించుకొనే పరిస్థితి లో నేను లేను.ఎంతకూ అమ్మని ఏమైంది అని అడుగుతుంటే అమ్మ లేచి కిరోసిన్ దీపం వెలిగించింది.

       ఆ వెలుగులో నాకు కనిపించిన నాన్న కన్నీళ్లు చూసి చాలా ఏడుపు వచ్చింది.ఎప్పుడూ సీరియస్ గా వుండే నాన్న కళ్ళలో నీళ్ళు ..చాలా భయం వేసింది.అమ్మని ఏడుస్తూ “అమ్మా” అని పిలిస్తే అమ్మ వచ్చి నా పక్కన మంచం పై కూర్చొని గట్టిగా మళ్ళీ ఏడుస్తుంది.”ఎందుకు ఏడుస్తున్నారు అమ్మా…నాన్న కూడా ఏడుస్తున్నాడు ఎందుకు” అని అమాయకంగా అడిగాను.

దానికి అమ్మ “ఎడవకుండా ఎం చెయ్యలే, ఇప్పటిదాకా చేసిన కష్టం అంతా బూడిదలో పోసినట్టు అయింది..తెల్లారితే పొలం కోసి ,వారం లో అమ్మితే మనకి ఉన్న అప్పులే కాదు ఇంకా మిగులు కూడా ఉంటుంది అని ఆశపడితే ఆ దేవుడికి కూడా మా ఆశని చూసి కన్ను కుట్టిందేమో ఇలా ఈ మాయదారి వానని కురిపించి మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు…” అని బోరున ఏడ్చింది..అమ్మతో పాటు,నాన్న కూడా వులుకు పలుకు లేకుండా కంటి నిండా నీళ్ళతో మౌనంగా అలానే ఉండిపోయాడు.

     అమ్మ ఏడుపు చూసి నాకు ఏడుపు ఆగక ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చామ్ చాలా సేపు.కాసేపటికి వాన తగ్గింది,బయట కీచురాళ్ల గోల తప్ప ఏమీ వినిపించట్లేదు.కానీ నాకు ఎవరిదో ఏడుపు వినిపిస్తుంది.ఎవరో అర్ధం కాలేదు.అమ్మ ని అడిగితే చెప్పింది మా ఎదురింట్లో వుండే పూర్ణ అత్త ది అని.తను కూడా వాళ్ళ కష్టం ఇలా వరదపాలు అయింది అని ఏడుస్తుంది అని.అలా ఏడుపులతో ఆ రాత్రి గడిచింది.

       తెల్లారి చీకటితోనే నాన్న పొలం వెళ్ళాడు ఎంతవరకు నష్టం అయిందో చూడడానికి.కానీ అక్కడ నష్టం చూసిన ఎవరికి కన్నీరు ఆగలేదు అంట. కాయలన్ని రాలిపోయి,మొత్తం కింద పడిపోయాయి అంట. అది ఏరించిన మొత్తం తాలు కాయ అయి కూలి కూడా నష్టమే అని,చాలా భాధ పడుతూ మెల్లిగా ఉన్న పంట ని కోయించారు.రాలిన పంట లో కొంచెం మంచి కాయ ఏరించారు.మిగతా కాయ అంతా ఎత్తించి చెరువులో పారబోశారు.మా నాన్నే కాదు మిగతా వారిది కూడా అదే పరిస్థితి.వారి కష్టం అలా చెరువులో మట్టి పాలు అవుతుంటే వారి భాధ వర్ణనాతీతం.కంటికి,మంటికీ అన్నట్టు కారిపోతున్న రైతు కన్నీరు ఆ మట్టిలోనే ఇంకిపోయింది ఎవరికి కనిపించకుండా.

       అంతా అమ్మకానికి పెడితే , వర్షం కురవక ముందు వరకు అరువేలు ఉన్న క్వింటా మిరప ,వర్షం పడ్డాక మూడువేలు అయితే,తాలు కాయ కేవలం పద్నాలుగు వందలు మాత్రమే ఉంది అని,చేసేది ఏమి లేదు కొంటాను అన్నవాణ్ణి దేవుడిగా భావించి వచ్చిన కాస్త పంట ని అమ్మితే పెట్టుబడి కూడా రాలేదు. అలా అప్పులు అయిన నాన్న వరుసగా ఇంకో సంవత్సరం కూడా ఇలానే ఎదురు దెబ్బ తినడంతో ఇంకా అప్పులు ఉబిలోకి వెళ్లిపోయారు ఎంతలా అంటే ఇక నాకు పెళ్లి చేసి పంపిస్తే,  తర్వాత వాళ్ళు తిన్న, తినకపోయిన భాధ లేదు అనుకునేంత.అలానే అందరూ ఆ సలహానే ఇవ్వడంతో తప్పక,మనసు ఒప్పుకోకపోయినా నేను పదవతరగతి పూర్తి చేయగానే  మళ్ళీ అప్పు చేసి మరీ నా పెళ్లి చేసేసారు.కానీ రైతు కష్టం,నష్టం తెలిసిన వాడు కదా..అందుకే రైతుకి ఇవ్వడానికి మనసొప్పక ఉద్యోగస్తునితోటే నా పెళ్లి చేశారు.

       ఆ తర్వాత కూడా ఐదు సంవత్సరాలు పాటు ఇలా ఏదో ఒక దెబ్బ తింటూనే వున్నారు.ఇంతలోనే నా పురుళ్ళు,పుణ్యాలు,సారెలు పై ఖర్చు ఎలానో ఉంది కదా.వాళ్ళకి లేకపోయినా బిడ్డని ఎక్కడ మాట అంటారో అని తపించే తండ్రులు ఎక్కువ మనకి.అలానే నాకు ప్రతి సంబరం బాగానే జరిపారు .మా అత్తవారింటి నుండి నాకు మాట రాకుండా.దాంతో ఇంకా భారం పెరిగింది.అది ఎలా దించుకోవాలి తెలియని పరిస్థితి తీసుకువచ్చింది చివరికి.

        నాకు, వాళ్ళకి ఎం సహాయం చేయలేనందుకు నా మీద నాకే కోపం వచ్చేది.ఆడపిల్ల ఐనందుకేనా మా నాన్నా ఈ పరిస్థితి లో ఉంటే కనీసం సాయం చెయ్యలేకపోతున్నా అని.ఇక చూసి చూసి విసుగు వచ్చేసింది నాకు.ఇక లాభం లేదు అని మా వారికి గట్టిగా చెప్పి,మా అత్తగారుని ఎదిరించి నాకు కట్నం గా ఇచ్చిన పొలం అమ్మి వాళ్ళ అప్పులు తీర్చి ,మిగిలినవి మా వారికి తెచ్చి ఇచ్చేసాను.నా దగ్గర నాకంటూ ఉన్నది ఆ పొలమే మరి ఎం చెయ్యను.ఆ తర్వాత చిన్నగా కోలుకుని ఇప్పుడు మళ్లీ స్థిరంగా నాకు అన్ని సమకుర్చేలా ఆర్ధిక వృద్ధిలోకి వచ్చారు.

       మీరు అనుకోవొచ్చు అలా కూతురు సొమ్ముతో ఎలా అని.అది నాది కాదు, మా నాన్న కష్టార్జితం.అందుకే ఇచ్చేసాను.ఎం కొడుకైతే తీసుకోరా…,కొడుకు ఉంటే వారి మీద ఎంత బాధ్యత ఉండేదో..,మరి కూతురిగా నాకు అంతే బాధ్యత ఉంటుంది కదా.అందుకే అడుగు ముందుకేసాను.అడ్డొచ్చిన  వారికి సమాధానం చెప్పి నోరు మూయించి మరి.

             కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ రోజు వర్షం పడకుండా ఉంటే,ఆ పంట తో నా భవిష్యత్తు ఇంకొలా ఉండేది కాదా.. అని, ఆ వర్షం వల్ల నాకు ఎంతో ఇష్టమైన నా చదువు ,డిస్టింక్షన్ లో పాసైనా చదివించే స్థోమత లేక పెళ్లి జరిగేలా చేసింది,నాకు పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమి ని పోగొట్టుకొనెల చేసింది, అన్నింటికంటే ఎక్కువగా నాన్న ని చాలా అవమానాల పాలు చేసింది.

      ఆ వర్షం మా సంతోషాలు తీసుకుపోయినా, నేను మాత్రం మా నాన్న ని ఓడిపోనివ్వలేదు.సమయం కోసం వేచి , నా బాధ్యత నేను నెరవేర్చి, ఒక కూతురుగా మాత్రం గెలిచాను.ఎప్పటికి మా నాన్నని గెలిపిస్తాను.ఎందుకంటే డబ్బు,కష్టం విలువ తెలిసిన రైతు బిడ్డని కనుక.

      కొడుకు చూడట్లేదు అనకండి.కూతురుగా మీ బాధ్యత ఎంతుందో..,మీరు ఎం చేయగలరో ఆలోచించండి.ఎందుకంటే కూతురు పరాయి ఇంట్లో భాదపడకూడదు అని ఉన్నదంతా ఊడ్చి కూతురికి పెట్టి,కొడుకును కష్టం చేసుకొని బ్రతకమనే మధ్యతరగతి తండ్రులే ఎక్కువ.
ఆస్తి కూతురికి,బాధ్యత మాత్రం కొడుకికి అంటే ఎలా?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!