అమ్మ కొట్టింది

అమ్మ కొట్టింది

రచన:: చంద్రమౌళి భవానీ శంకర్ శర్మ
( కలం పేరు : శంకర్ )

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం కోసం మెయిన్ రోడ్ మీద అందర్నీ ఆపి టెస్ట్ చేస్తున్న పోలీసులను చూడగానే బైక్ ని పక్కన సందులోకి తిప్పేశాడు వంశీ.

హమ్మయ్య తప్పించుకున్నాను. లేదంటే ఇప్పుడు మళ్ళీ ఫైన్ కట్టాలి వచ్చేది లేదా పెద్ద క్లాసు వినాల్సి వచ్చేది. అనుకుంటూ బండి వేగం పెంచాడు.

ఇక ఇంటికి చేరుకుంటున్నాను అనుకుంటూ ఉండగా గొంతులో పడిన మందు నిషా పూర్తిగా తలకు ఎక్కడం మొదలు పెట్టింది.

నెమ్మదిగా మత్తులో జారుకుంటూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని బండితో గుద్దేసి తను కూడా పడిపోయాడు వంశీ.

తగిలిన దెబ్బలు నెప్పి తెలుస్తున్నా తల మొత్తం దిమ్ముగా ఉండి కళ్ళు మూసుకుపోతూండడం తో అలాగే పడిన చోటే ఉండిపోయాడు.

మరుసటి రోజు మెలకువ వచ్చిన వంశీ చుట్టూ చూసుకొని ఆశ్చర్య పోయాడు.

ముందు రోజు జరిగినది ఏదీ గుర్తు లేకపోవడం తో ఏమ్ జరిగింది. నేనెందుకు హాస్పిటల్ లో ఉన్నాను. అనుకుంటూ పైకి లేవబోతూ తన కుడి చేతికి సిమెంట్ కట్టు ఉండటం గమనించాడు.

ఆలోచిస్తే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ముందు రోజు పీకల దాకా తాగి ఇంటికి వస్తూ దారిలో ఎవరినో బండి తో గుద్ది ఏక్సిడెంట్ చెయ్యడం.

అయ్యో, చూసుకోకుండా ఎవరికో ఏక్సిడెంట్ చేశాను. వాళ్ళు ఎలా ఉన్నారో. అనుకుంటూ రూం బయటకు వచ్చి అక్కడ ఉన్న నర్స్ ను అడిగాడు.

అదిగో అక్కడ ఐసీయూ లో ఉన్నారు ఆమె. నువ్వు తాగి చేసిన ఏక్సిడెంట్ వల్ల ఆవిడకి చాలా గట్టి దెబ్బలు తగిలాయి. అప్పుడే వాళ్ళ అన్నయ్య వచ్చి మీ ఇద్దరినీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
ఆవిడకి పాపం చాలా రక్తం పోయింది. ఇంకా ఎక్కడా రక్తం దొరకలేదు.  అయినా అంత స్పృహ లేకుండా తాగి తమ వాళ్ళకి ఏక్సిడెంట్ చేసిన నిన్ను అలా వదిలేయకుండా ఆమె తో పాటు నిన్ను కూడా హాస్పిటల్ కి తీసుకు వచ్చారు వాళ్ళు.
ఇప్పుడు వాళ్ళకి కష్టం వస్తే సహాయానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంటూ వెళ్ళిపోయింది ఆ నర్స్.

అయ్యో, పాపం. నా వల్లనే ఆమెకి ఈ పరిస్తితి వచ్చింది. నా రక్తం తనకు పనికి వస్తుందేమో చూస్తాను. అనుకుంటూ నర్స్ చూపిన వైపుగా అడుగులు వేశాడు వంశీ.

ఐసీయూ దగ్గరకు వెళ్తున్న వంశీ అక్కడ ఐసీయూ డోర్ ఎదురుగా నిలబడి డాక్టర్ తో మాట్లాడుతున్న వ్యక్తి ని చూసి అక్కడే ఆగిపోయాడు.

వీడా, నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసింది. అసలు వీడు, ఇంకా ఇతడి చెల్లి వల్లనే కదా నేను ఈ రోజు ఇలా ఉండాల్సి వచ్చింది. మంచిదే అయ్యింది. లేదంటే నేనే ఏదో ఒక రోజు వీళ్ళ మీద పగ తీర్చుకునే వాడిని. అనుకుంటూ కొన్ని రోజుల ముందు జరిగిన విషయాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం…

తల్లి ని గుడి దగ్గర దిగబెట్టి కాలేజ్ కి బయలుదేరాడు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వంశీ.

ఆ రోజే న్యూ అడ్మిషన్స్ ప్రారంభం అవడం తో ఫ్రెషర్స్ ని రాగింగ్ చేస్తున్నారు సీనియర్స్.

వంశీ కూడా తన బ్యాచ్ తో చేరి జూనియర్స్ ని ఏడిపిస్తున్నాడు.

అప్పుడే రెండు పుస్తకాలు చేత్తో పట్టుకుని భయం భయం గా నడిచి వస్తున్న ఒక అమ్మాయి వంశీ బ్యాచ్ కంట పడింది.

ఓయ్, అమ్మాయ్. ఇలా రా. అంటూ పిలిచాడు వంశీ.

బిక్కు బిక్కుమంటూ వచ్చి వాళ్ళ ముందు నిల్చున్న ఆ అమ్మాయిని సరదాగా ఏడిపించడం మొదలు పెట్టారు వంశీ అండ్ కో.

అసలే బెదురుతూ ఉన్న ఆ అమ్మాయి ఈ హడావిడి చూసి భయపడి ఏడ్చేసింది.

అయినా పట్టనట్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలతో ఆమెను ఇంకా ఏడిపిస్తూ నవ్వుతున్న వంశీ దవడ ఎముకలు కదిలేలా చాచి కొట్టారు ఎవరో.

ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మే సరికి తల విదుల్చుకొని చూసిన వంశీకి ఎదురుగా తను మర్చిపోయిన భోజనం క్యారేజ్ తీసుకుని వచ్చిన తల్లి నీరజ కనిపించింది.

అమ్మా అని ఏదో చెప్పబోతుంటే మళ్ళీ రెండో చెంప మీద కూడా కొట్టి భోజనం బాక్స్ ను వంశీ ముఖాన కొట్టి వెళ్ళిపోయింది నీరజ.

ఆ రోజే రాగింగ్ చెయ్యబడిన అమ్మాయి అన్న వచ్చి వంశీ కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు.

సాయంత్రం ఇంటికి వెళ్ళిన కొడుకు తో నీరజ మాట్లాడటం మానేసింది.

ఆ రోజే కాదు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మాట్లాడ లేదు.

జరిగిన దానిలో తన తప్పు ఏమాత్రం లేదన్నట్లు కేవలం చిన్న విషయానికి అందరిలో కొట్టి తల్లి తన పరువు తీసింది అని రోజూ తాగడం కూడా మొదలు పెట్టాడు.

దీనంతటికీ కారణం అయిన ఆ అమ్మాయి ని , వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ అన్ననీ వదలకూడదు అని ఫిక్స్ అయ్యాడు వంశీ.

ప్రస్తుతం…

అన్నయ్యా, అంటూ ఐసీయూ దగ్గర ఉన్న వ్యక్తి వద్దకు పరుగు పెడుతూ వస్తున్న అమ్మాయి ని చూసి విస్తు పోయాడు వంశీ.

ఈమె ఇక్కడ ఉంటే ఐసీయూ లో ఉన్నది ఎవరు. అని  వంశీ ఆలోచన లో వుండగానే
ఐసీయూ దగ్గర ఉన్న ఆమె అన్న సాగర్ ” రా వైశాలి, అత్తకి ఏక్సిడెంట్ అయ్యింది. నాన్న అడ్మిట్ చేశారు. అత్తకి బ్లడ్ అవసరం. నీ గ్రూప్ మాత్రమే మ్యాచ్ అవుతుంది. తొందరగా వెళ్ళి బ్లడ్ ఇవ్వు.” అంటూ పంపించాడు.

మాట్లాడకుండా వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చింది వైశాలి.

జరిగేది అంతా చూస్తున్నాడు వంశీ.

అప్పుడే అతని భుజం మీద చెయ్యి పడింది.

వెనక్కి చూస్తే ఒక పెద్దాయన ఉన్నాడు.

కుక్కకు ఒక పూట అన్నం పెడితే జీవితాంతం విశ్వాసంగా ఉంటుంది. నీ లాంటి విశ్వాస ఘాతకులు మాత్రం అన్నం పెట్టిన వాళ్ళ ప్రాణాలే తీసేస్తారు అని ఆవేశపడ్డాడు ఆయన.

వీళ్ళు నాకు ఏమ్ ఉపకారం చేశారా అని “ఏమ్ మాట్లాడుతున్నారు.” అని అయోమయం గా అడిగాడు వంశీ.

స్నేహితురాలు ఆమె భర్త కళ్ళ ఎదురుగా ఏక్సిడెంట్ లో చనిపోతే, వాళ్ళ బిడ్డ అనాధ కాకూడదు అని, తెచ్చి పెంచుకోబోయింది నా చెల్లెలు.
పెళ్లి కాకుండా ఇలా పిల్లల్ని పెంచుతుంటే పెళ్లి జరగదేమో అని భయపడి తనకి పెళ్లి చేయబోతే ,
పెళ్లి చేసుకునే వ్యక్తి ఆ బిడ్డ ను ఒప్పుకోకుంటే వాడు అనాధ అయిపోతాడు అని,
ఆ బిడ్డను తీసుకుని ఇంటినుంచి వెళ్ళిపోయింది.
అని ఆగాడు ఆ పెద్దాయన.

” ఇదంతా నాకెందుకు చెబుతున్నారు. ” ఒకింత విసుగ్గా అడిగాడు వంశీ.

ఎందుకంటే అప్పుడు కనిపించకుండా పోయినా నా చెల్లెలు నిన్న నీ వల్ల రక్తపు మడుగులో కనిపించింది రా దుర్మార్గుడా. అని ఆవేశ పడ్డాడు ఆ పెద్దాయన.

అది వినగానే కొంచెం బాధగా అనిపించినా, ఆ బాధ ను తలపొగరు కమ్మెయ్యడం తో విసురుగా ఆ పెద్దాయన వైపు తిరిగి ” అయితే ఇప్పుడు ఏమ్ చెయ్యమంటారు. పొరపాటున అలా జరిగింది. నేనేమైనా కావాలని చేశానా. ” అంటూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు వంశీ.

అది అంత బాధలో కూడా నా బిడ్డని కాపాడండి అని స్పృహ తప్పింది రా నా చెల్లెలు నీరజ. నీకు ఇన్నేళ్ళు పెంచిన తల్లి అనే మమకారం కూడా లేదు. చీ… అంటూ ఐసీయూ వైపు అడుగులు వేశాడు ఆ పెద్దాయన.

ఆ మాటలు విన్న వంశీ అడుగులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఒక్క నిమిషం తల గిర్రున తిరిగింది.

ఆ పెద్దాయన చెప్పిన బిడ్డ తనే అని అర్థం అయ్యేసరికి గుండెల్లో బాధ కళ్ళనుండి వెల్లువలా మారింది.

తప్పతాగి తనే తన తల్లి కి ఏక్సిడెంట్ చేశాడు అని అర్థం అయ్యేసరికి భరించలేని బాధతో తల గిర్రున తిరిగింది.

అప్పటిదాకా అమ్మ కొట్టింది అనే ఆలోచించిన వంశీ ,
తన కోసం అన్నింటినీ త్యాగం చేసిన తల్లి , తన ఎదుగుదల కోసం ఎన్నో కష్టాలను దాటించి ఈ స్థాయికి చేర్చిన తల్లి, తనను ఎందుకు కొట్టింది అనే ఆలోచన రాగానే వంశీ మనసు తన తప్పు ను అంగీకరించడం మొదలైంది.

బాధతో అడుగు ముందుకు పడటానికి చాలా కష్టం గా  ఉన్నా ఐసీయూ ముందుకు వెళ్ళి అమ్మను చూడాలి అనుకున్నాడు.

అప్పుడే అడ్డు వచ్చిన పెద్దాయన కాళ్ళ మీద పడి క్షమించమని అడిగాడు.

ఐసీయూ డోర్ తెరుచుకొని బయటకి వచ్చారు డాక్టర్.
నథింగ్ టు వర్రీ. కొంత సేపటి లో స్పృహ వస్తుంది. ఒక్కొక్కరూ వెళ్ళి చూడొచ్చు. అని చెప్పి వెళ్ళిపోయాడు.

నీరజకి స్పృహ రాగానే లోపలికి వెళ్ళాడు వంశీ. చేతికి కట్టు తో ఉన్న వంశీని చూసి దగ్గరకు రమ్మంది నీరజ.
వెళ్ళి పక్కన కూర్చున్న వంశీ చెంప మీద బలం కొద్దీ ఒక్కటి వేసింది.

ఆశ్చర్యం గా చూసారు అంతా.

తాగి డ్రైవింగ్ చెయ్యకూడదని తెలీదా. నీకేదైనా అయితే… అని కోప్పడింది నీరజ.
ఈ సారి వంశీ బాధ పడలేదు.
ఎప్పుడూ తాగనని మాట ఇచ్చాడు.

వెనుకే ఉన్న తన అన్న ను చూసి కన్నీళ్లు పెట్టుకుంది నీరజ.

అత్తా, నీకోసం బోలెడంత రక్తం ఇచ్చాను. నువ్వు తొందరగా కోలుకొని నాకు గులాబ్ జామ్, పూరి చేసి పెట్టాలి. అంది వైశాలి.
అందరూ నవ్వుకున్నారు.

వైశాలి ని ఏడిపించినందుకు తను తప్పు తెలుసుకున్నాను అంటూ మనస్ఫూర్తిగా క్షమార్పణ చెప్పాడు వంశీ.

అందరూ ఆనందంగా ఇంటికి చేరారు.

ఆపై కూడా వంశీని అమ్మ కొడుతూనే ఉంది.  అది కోపం తోనో, బాధ తోనో కాదు. సాగర్, వైశాలి ఇద్దరితో కలిసి ఇంటిని కిష్కింధ చేస్తూ వంశీ చేసే అల్లరి కి నవ్వుతూ మాత్రమే.

సమాప్తం.

You May Also Like

One thought on “అమ్మ కొట్టింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!