రాఖీ చెల్లెలు

రాఖీ చెల్లెలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

అనురాగ మెలా ఉంటుందని ఎవరైనా అడిగితే, పాట, రింగ్ టోన్ గా వినబడుతోంది, తన సెల్ ఫోన్ లో. ఒక్కసారి బండి నడుపుతున్న సంతోష్ ఆగి చూసాడు. అవును తన రాఖీ చెల్లెలే, ఎప్పుడూ తరచూ వినిపించే ఆ పాట, చాలా నెలల తర్వాత వినిపించింది తన ఫోను. మదిలో ఒక్కసారి ఆప్యాయత పొంగింది. సంతోష్ తన కుటుంబ సభ్యులకు, భార్య పిల్లలకి అలా తలో రింగ్ టోన్ పెట్టుకున్నాడు మంచి పాటలతో. ఇప్పుడు ఆ పాట వినడంతో ఉత్సాహంగా బండి పక్కకి ఆపి హలో అన్నాడు. హలో అన్నయ్యా నేను అంది. చెప్పు చెల్లెమ్మా, ఒక పది నిమిషాల్లో చెయ్యనా బండి మీద ఉన్నా అన్నాడు. మామూలుగా అయితే ఆపి మాట్లాడే వాడే, అది తనను అన్నా అని పిలిచే శారద కాల్. సరే అని కాల్ కట్ చేసింది సదరు చెల్లెమ్మ. ఇప్పుడు మళ్లీ చేస్తా అనడానికి కారణం తెలియా లంటే గతం లోకి వెళ్ళాలి. వెళ్దామా ఓ సారి, పది నిమిషాలు సమయం ఉంది కదా.
అది సుమారు పది సంవత్సరాల క్రితం. సంతోష్, శారద ఓ సంస్థ లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాల్లో పరస్పర సహకరంతో ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉండే వారు. అనుకోకుండా ఓ రోజు మా ఇంటికి భోజనానికి రండి అని ఆహ్వానించాడు సంతోష్. దానితో శారద కుటుంబం తో సహా వారింటికి రావడం, ఆ రెండు కుటుంబాలు బాగా దగ్గరయ్యాయి. అలా రెండు కుటుంబాలు రాక పోకలు, ఆప్యాయతతో సాగేవి. అంతకు ముందు వీరు కలిసిన ఓ ఏడాదికి కుటుంబాల గురించి ఒకరినొకరు తెలుసుకున్నారు. ఓ రోజు
సంతోష్: అవునూ ఎన్ని రోజులైనా ఈ “అండి” సంబోధన ఏమిటీ, బాగో లేదు అన్నాడు.
శారద: మరి ఏమనాలో తమర్ని అంది.
ఏదో ఒక బంధంతో పిలుచుకుంటే బాగుంటుంది కదా అన్నాడు. సరే మరి ఏమనాలి అంది.
ఏదో ఒకటి చెప్పు, ఎలా అయినా పర్వాలేదు అన్నాడు. ఇప్పుడిప్పుడే ఇంకా అండి ఓ సారి, ఏకవచనం ఓ సారి అలవాటు అవుతోంది, నాకు సోదరులు లేరు, అన్నయ్య అననా అంది.
అబ్బో ఏమి భాగ్యమ, తప్పకుండా అన్నాడు.
అదిగో ఆ రోజు నుంచి వారు సహోదరులను మించి న స్నేహితులు, స్నేహితులను మించిన అన్నా చెల్లెలు అయ్యారు. కుటుంబాలు కూడా అలాగే కలిసి పోయాయి. పండుగలు, ఇతర కార్యక్రమాలు అన్నిటికీ కలుస్తూ చక్కగా సాగుతున్నారు.
ఇలా ఉండగా ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలే కదా. సంతోష్ కి అదే ఊరులో వేరే ఉద్యోగం మారడం జరిగింది. తరువాత ఎప్పుడో విడి పోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించని వీరు తను ఉద్యోగం మారేటప్పుడు ఎంతో బాధ పడ్డారు.
శారద: అన్నయ్య ఇప్పుడు ఇక రోజూ కనిపించవా, ఎంతో దిగులు గా ఉంది అంది.
సంతోష్: తప్పదు కదరా, ఉద్యోగం. రోజూ కనిపించక పోయినా వినిపిస్తాను అన్నాడు.
వినిపించక పోతే వచ్చి మరీ కొరుకుతా అంది శారద.
నీకు ఆ అవకాశం ఇవ్వను లే అన్నాడు సంతోష్.
నువ్వు మంచి కోసం వెళ్తున్నావని ఆనందంగా ఉన్నా, తలచుకుంటే మాత్రం కన్నీళ్లు ఆగడం లేదని ఏడిచేసింది. నాకు ఏ సమస్య వచ్చినా నీకే చెప్పుకునే దానిని. ఇప్పుడు ఒక్కసారి ఏదో వెలితిగా ఉంది అని మరీ మరీ వెక్కి వెక్కి ఏడిచింది.
ప్రతీ రెండు మూడు రోజులకు వస్తూ ఉంటాగా అని సెలవు తీసుకున్నాడు సంతోష్. అలా ఇచ్చిన మాట ప్రకారం రోజూ ఫోన్ చెయ్యడం, వీలు చూసుకుని మరీ అస్తమానూ వెళ్తూ ఉండడం చేసే వాడు సంతోష్. అయితె రాను రాను శారద కొంచెం మాట్లాడడం తగ్గించడం, వెళ్ళినా ఏదో ముభావంగా మాట్లాడడం, అప్పుడప్పుడు ఫోన్ ఎత్తక పోవడం చేస్తోంది. ఏమిటా అనుకుంటూ శారద భర్తనీ, కొడుకునీ అడిగితే ఏమో మాతో కూడా అలాగే ఉంటోంది. నువ్వు వచ్చి ఓ సారి అడుగు అనే సరికి మనవాడు వెళ్లి ఏమిటని చాలా ప్రయత్నం చేసాకా, ఈ మధ్య ఏమో అలాగే ఉంటోంది, మాట్లాడం లేదు, అసలు ఎవరికి కనిపించాలని లేదు అంటూ ఏవో చెప్పు కొచ్చింది. కొంత మానసిక అందోళన లో ఉందని అర్థం చేసుకుని. తన భర్త కి చెప్పాడు ఒకసారి వైద్య సలహా తీసుకుంటే మంచిదని. దానితో వైద్యున్ని సంప్రదించడం, షుగర్ వ్యాధి బాగా ఎక్కువ ఉంది, చాలా రోజుల నుంచి అని తెలుసుకున్నారు. దానికి సరిపడే మందులు అవీ వాడడం తో వ్యాధి తీవ్రత తగ్గి మామూలు స్థాయి లోకి రావడం జరిగింది. ఇలా ఎప్పుడూ వాళ్ళకి చేదోడు, వాదోడు గా ఉండేవాడు సంతోష్.
అయితే శారద మాత్రం మాములు మనిషి అయినా మాటలు తగ్గించి ఫోన్లు అవీ తగ్గి పోయాయి. దానితో సంతోష్ కూడా తన పనులు, తన కుటుంబం తో అంతగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం మానేశాడు. అంతా చాలా యాంత్రికంగా అయిపోయింది. అయితే గుర్తు వచ్చినప్పుడు మాత్రం ఏదో బాధగా ఉండేది సంతోష్ కి.
అదండీ ఏమీ లేకపోయినా కాల గమనంలో విడి పోయిన వారి అపూర్వ సోదర బంధం. ఇంటికి చేరుకుని శారద కి ఫోన్ చేశాడు. హలో అన్నయ్యా ఎలా ఉన్నారు, శారద. బాగున్నాంరా, మీరెలా ఉన్నారు అన్నాడు. చాలా కాలం అయిపోయింది చూడాలని ఉంది వస్తావా ఓ సారి అంది. తప్పకుండా అన్నాడు. రేపు భగినీ హస్త భోజనం కదా భోజనానికి వచ్చేయ్, సెలవు పెట్టాను కొంచెం ఎక్కువ సేపు ఉండేలా రా అనే సరికి సరే అని చెప్పి ఎగురుకుంటూ ఇంట్లోకి వెళ్ళే సరికి, సంతోష్ భార్య ఏమిటి మీ రాఖీ చెల్లెలు ఫోన్ చేసిందా మంచి హుషారుగా ఉంది బండి అంది. అవునోయి, నీకెలా తెలుసు అన్నాడు. ఇంతకు ముందే నాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడింది. ఇన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఏమిటో అలా అయిపోయాను, ముందు ఫోన్ అన్నయ్యకే చేశాను, బండి మీద ఉన్నాడుటా, తరువాత నీకు వదినా అంది.
హమ్మయ్య మంచి పని చేసావు శారద. నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా తెగ బాధ పడుతున్నారు మీ అన్నయ్య. అవును వదిన జరిగిందేదో జరిగింది, ఇప్పుడు ఇంకా మళ్లీ అలా ఉండను, అన్నయ్య ని రేపు భోజనానికి పంపు, వీలైతే మీరు కూడా రండి అంది. మాకు కుదరదు లే మరోసారి వస్తాం అని చెప్పా. అదండీ మన రాఖీ చెల్లెలు కథ. నిష్కారణంగా ఎవరినీ ఒదులుకో కూడదు. బంధాలు బల మైనవి, కానీ సున్నిత మైనవి కూడా. వాటిని జాగ్రత్త గా కాపాడు కోవాలి.
ఇక ఈ బంధం మళ్లీ చిగురించి వికసిస్తుందని ఆశిద్దాం.

You May Also Like

13 thoughts on “రాఖీ చెల్లెలు

  1. బంధాల గురించి బాగా చెప్పావు.
    పడిన దైనా , కలుపుకున్న దైన
    నిలబెట్టుకునే మనసుంటే నీ కథ లో వాళ్ల లాగే అందరూ ఉండచ్చు🙂

  2. సోదర బంధం కాపాడు కోవాలి అని చెప్పిన కథ. బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!