రీఛార్జ్(కవితా సమీక్ష)

రీఛార్జ్(కవితా సమీక్ష)

రచన: చంద్రకళ. దీకొండ

ఆధునిక పదాలతో కూర్చిన ఈ నవీన కవిత చదవండి. కవి పేరు తెలియదు. ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది.

మనసెందుకోఒక్కోసారి స్విచ్ ఆఫ్ అవుతుంది
ఎడదలో సంతోషానికి సడెన్ గా లాక్ పడుతుంది
అంటూ కుతూహలాన్ని కలిగించే ఎత్తుగడతో మొదలెట్టారు కవి కవితను.

మెదడులో ఎందుకో మెర్క్యూరీ మెరుపు బ్లాక్ అవుతుంది
మనిషికెందుకో ఓసారోసారి ఉషారుతనం ఎస్.ఎమ్.ఎస్ అందదు
దయాగుణం ఓటిపి రానేరాదు

మెర్క్యూరీ మెరుపు బ్లాక్ అవడం,ఉషారుతనం ఎస్.ఎం.ఎస్.,దయాగుణం ఓటిపి… ఈ ఉపమలను గమనించండి.
మమతల అలకబూనినందుకా
కోరుకున్నది నెరవేరనందుకా
చెలిమియో చెలియో చేరువకానందుకా
ఆశించినది అందనందుకా
ఎందుకో ఏమో తెలియదు మనిషికి
ఎదురుగా కుదురుగా మూడుబార్ల సిగ్నలున్నా
ఎదుటి మనిషితో మాట్లాడ మూడు ఉండడెందుకో
మనిషి ఓన్లీ ఇన్ కమింగ్ సిమ్ గా బహశా అయ్యాడా
డబుల్ సిమ్మ్లున్నా కొమ్మమీది ఒంటరి గుబుల్ పిట్ట అయ్యాడా

ఏవేవో కారణాలతో వ్యాకులపడుతున్న మనిషి…ఎదురుగా కుదురుగా అంటూ ప్రాసను మేళవించి మూడు బార్ల సిగ్నలున్నా మాట్లాడే మూడ్ ఉండడంలేదని…ఓన్లీ ఇన్కమింగ్ సిమ్ గా మారాడంటూ…డబుల్ సిమ్ములున్నా కొమ్మ మీది గుబుల్ పిట్ట అయ్యాడంటూ
ఆంగ్ల, ఆంధ్ర పదాల మేళవింపుతో, ఆధునిక సమాజంలో మానవుని స్థితిని చక్కగా వివరించారు.ఇంకా ఇలా కొనసాగుతుంది.

అరవైనాలుగు కళల బ్యాటరీ రీచార్జ్ అలాగే వున్నా
దేవులపల్లి భావకవితలా 4Gసెల్ దేహమై వున్నా
ఆలోచనల ఆప్షన్ లు ఎరకవున్నా
అరిషడ్వర్గాల ఐకాన్ లు ఎదుటనున్నా
గూగుల్ లాంటి గురువు 24×7గంటలు వెంటవున్నా
మెలోడి కోకిలా ఫేవరేట్ సాంగ్ వినిపించవున్నా
ఇష్టమైనపాట రింగ్ టోన్ గా మోగనున్నా
అనంతమైన ధీర్ఘదృష్టిలాంటి కాంటాక్టులిస్ట్ సేవ్డై వున్నా
ఒక్కోసారి మనిషి కాల్ రాంగ్ నంబరవుతుంది…

తన ఎదుట ఎన్ని సౌకర్యాలున్నా…”ఒక్కోసారి మనిషి కాల్ రాంగ్ నంబరవుతుంది”…అంటూ అన్నీ ఉన్నా ఏమీ లేని మనిషి ఒంటరితనాన్ని,మన అవసరానికి ఎవరూ తోడురారనే సత్యాన్ని ఎంతో చక్కగా తన కవితలో పొదిగారు.ఇంకా ఇలా కొనసాగిస్తూ…

టచ్ స్క్రీన్ కీ ప్యాడ్ పాడై డల్ మబ్బులుకమ్మిన అంబరమవుతున్నాడు
జీవితంలో ఆనందక్షణాల్ని సైతం మిస్ అవుతున్నాడు
నెట్వర్క్ వున్నా నేనై నెర్వెసై మిస్ కాల్ అవుతున్నాడు
ఇన్ కమింగ్ అవుట్ గోయింగ్ లు వున్నా మహా ఇదైపోతున్నాడు ఎందుకో మనిషి

“టచ్ స్క్రీన్ కి ప్యాడ్ పాడై, డల్ మబ్బులు కమ్మిన అంబరమంటు”న్న పదచిత్రాన్ని దర్శించండి.

అయినవాళ్ల అనురాగానికి లిఫ్ట్ అవటంలేదు మనుజుడు
బంధాలను ఇన్ టైంలో రీఛార్జ్ చేయడంలేదు
ప్రేమల ప్లాన్ గడువు గుర్తుండటంలేదు
ఎందుకో ఏమో
మనిషి అదో మాదరైపోతున్నాడు
కలికికష్టాలు కన్ఫాం ఐ వున్నాడు
ఈ లోకంలో

అయినవాళ్ళ అనురాగాన్ని అందుకునే సమయం లేక.. అవసరమైన సమయంలో చేయూతనందించక.. మిథ్యా ప్రపంచంలో జీవిస్తున్న వైనాన్ని రీఛార్జి అనే పదంతో మన మనసులను కూడా తట్టి మమతలను,మమకారాలను రీఛార్జ్ చేస్తారు తన కవితతో.

అయితేనేం
నిలబడ్డ నగం
ఎగసిపడే తరంగం
ఎగిరిపోయే విహంగం
ఉదయించే సూర్యబింబం
తెరిచిన బతుకు పుస్తకం
అనుభావాల మస్తకం
కనిపించి కదలిస్తుంది
అలసిన మనిషిలో
ఆగిన మమతను
మట్టి తత్వాన్ని
మానవవత్వ చేతనత్వాన్ని
మరలా ప్రవహింపజేస్తుంది.

నల్లగొండ
8309452179

అయినా బతుకు పుస్తకం అనుభవాల మస్తకాన్ని కదిలించి తీరుతుందని,
ప్రకృతి సౌందర్యం మట్టితత్వాన్ని తట్టిలేపి,కృత్రిమత్వాన్ని బాపి మానవత్వ చేతనత్వాన్ని తప్పక కలిగిస్తుందని…మనిషి తన మూలాలకు మరలి వెళ్లక తప్పదని గొప్ప నిత్య సత్యంతో, ఆశావహ దృక్పథంతో ముగించారు కవితను.
ఎత్తుగడ నుంచి ముగింపు దాకా చదువుతున్న వారు తమను తాము తడుముకునేలా…మనసును కదిలించి చదివింపజేసే శైలితో…ఆకర్షించే ఆధునిక
పదాలను కూర్చి అందరికీ అర్థమయ్యేలా చక్కని కవితా శిల్పాన్ని మలచి…బండబారిన గుండెలపై మానవత్వపు జల్లు కురిస్తే తప్పక ఆగిన మమత చిగురించి మనసు రీఛార్జి అవుతుందని ఆలోచనాత్మక, భావాత్మక,సందేశాత్మక కవితను అందించిన కవికి
అభినందనలతో….

చంద్రకళ. దీకొండ

You May Also Like

2 thoughts on “రీఛార్జ్(కవితా సమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!