సుసుంకు

(అంశం:హాస్యకథలు)

సుసుంకు

రచన:- కొల్లూరు వెంకటరమణమూర్తి

        సుబ్బారావుకి పెళ్లి సంబంధం కుదిరింది. తనకంటే రెండేళ్ళే పెద్ద అయిన అన్నయ్యకు నాలుగేళ్ల క్రితమే పెళ్ళై, ఇప్పుడు రెండేళ్ళ పాప కూడా ఉంది. అందగాడు అయినప్పటికీ, మంచి జీతభత్యాలు, సకలవసతులూగల ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి అయినప్పటికీ, ఎంత తీవ్రంగా ప్రయత్నించినా కళ్యాణ యోగం వరించలేదు. మగాడై పుట్టినందుకు ప్రస్తుత కాలంలో అయితే ఇలాంటి ఇబ్బంది ఆశ్చర్యమేమీ కాదు, కానీ ఇది ముప్పై యేళ్ళ క్రితం కథ.
లేక లేక సంబంధం కుదిరిందన్న సంబరంతోపాటు, వచ్చే ఆమె(సుందరి)కు ఏ లోటూ లేకుండా అన్నీ బాగా అమర్చేయాలన్న ఆరాటం ఎక్కవైపోయింది. దానిలో భాగంగానే తను పుట్టిపెరిగిన పల్లెటూరిలోని తన ఇంట్లో అధునాతన మరుగుదొడ్డి లేకపోవడం ఒక పెద్ద లోటుగా తోచింది అతగాడికి.
శుభస్త్య శీఘ్రం అన్నట్లుగా వెంటనే యుద్ధప్రాతిపదికన మొదలుపెట్టారు తమ పెరట్లో దానికోసం ఓ పెద్ద గొయ్యి తవ్వకం. వాళ్ళ నాన్నగారి పర్యవేక్షణలో చాదస్తంగా చక్కగా శాశ్వత నిర్మాణంలా కొనసాగుతోంది.
ఒక రోజు ఉదయం దాని నుండి మూలుగులు, అరుపులు వినిపించేయి. చూడగా ఇంకేముంది  వీధి కుక్కపిల్ల ఎప్పుడు పడిందో మరి. ఇక దాన్ని బయటకు తీయడానికి తలో పథకాలు చెప్పడం మొదలుపెట్టారు.

“తాడు రింగులాగ చేసి వదిల్తే, అది దానిలో దూరితే వెంటనే బిగించి లాగేయ్యొచ్చు”
“అందులోకి దూరాలని దానికెలా తెలుస్తాది?”
“అయినా ఒకవేళ తాడు మెడకి బిగుసుకుంటే చచ్చిపోతాది”
“ఎవరినైనా దింపితే, వాళ్ళను కరిచేస్తాది”
“నిచ్చెనకు తాడుకట్టి వదిలితే, నిచ్చెన ఎక్కదేమో?”
ఒక పెద్ద బకెట్టుకి తాడు కట్టి వదిల్తే, దానిలోకి వచ్చి కూర్చోదేమో?”
“దాని తల్లిగాని వచ్చిందంటే మన పనిపట్టేస్తాది”
“అదెప్పుడో వదిలేసింది దీన్ని! ఇది మరీ చిన్న పిల్లేంకాదులే!”
“జంతు సంరక్షణోళ్ళకి తెలిస్తే కేసు పెట్టేస్తారు”
“ఈ పల్లెటూరికెవరొస్తారులే? అదంతా పట్నాల్లోనే!”
“అయ్యో! నిన్నటి నుంచి ఆకలిదప్పులతో ఉండిపోయింది, పాపం!” అని జాలి ప్రాణంగల పెళ్లికొడుకు అన్నగారు ఒక చిన్న బకెట్టుతో నీళ్ళు దింపి, బిస్కట్లు, రస్కులు, పూరీలు, వగైరాలు ఆ గోతిలో వేశాడు.

మళ్ళీ మాములే!

       పల్లెటూరు కదా! ఊరంతా తరలి వచ్చేశారు ఒకొక్కరిగా. ఎవరికితోచిన సలహా వారిచ్చేసేవారు.

“దాన్ని చూడ్డానికి పిల్లల్ని ఆ గొయ్యి దగ్గరకు వెళ్ళనీయకండి”
“గొయ్యి తవ్వించేటప్పుడు చుట్టూ కంచె వేయించాల్సింది”
“దాన్ని అలా వదిలేస్తే చచ్చిపోయాక దిగి, తీసి పడేయవచ్చు గాని పాపం కదా!”
“ఆ గోతిలో ఒక పక్కన కొంచెం కొంచెం మట్టి వేస్తే, అది ఎక్కి వచ్చేస్తాది”
“అమ్మో! ఒడ్డులు పడిపోతున్నాయి, దాని మాటకేమిగాని, మనం ,పడిపోతాం బాబోయ్”
“అసలే వాన కురుస్తుంది, తడిమట్టిలో కూరుకుపోతాది ఊబిలోలాగ ”
“కాలభైరవుడికి మొక్కుకోండి, పరిష్కారం లభిస్తాది”
“ఈ తవ్వకం మొదలెట్టినపుడు పూజ చెయ్యలేదేమో?”

ఇంకా చాలామంది చాలా సలహాలు చెప్పేరు.

        ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లికి తరలి వెళ్ళాలి. తిరిగి రావడానికి ఇంకో రెండుమూడు రోజులు పడతాది. అప్పటివరకూ దీని సంగతి ఎలా అని ఆలోచించారు సుబ్బారావు ఇంట్లోవాళ్ళందరూ. తాము తిరిగి వచ్చేటప్పటికి ఇది చచ్చిపోతే పాపమనీ, ఆ కీడు తమకు తగుల్తాదనీ భయపడ్డారు.

        మరో రోజు గడిచింది. చిన్నగా వాన కురుస్తూనే ఉంది. ఆ గోతిలో అది తడుస్తూనే ఉంది.

        చాలా రకాల తినుబండారాలు దానిచుట్టూ సమకూడేయి. అది ఏదీ తినక నీరసించి పోయింది. మూలగడం కూడా మానేసి, కూలబడిపోయింది. మరోరోజు గడిచేక ఒక సాహసవంతుణ్ణి దింపి, ఒక పెద్ద బకెట్టులోకి దాన్ని తరలించి, బయటకులాగి, దూరంగా ఒకచోట దానికి కావలసినవన్నీ పెట్టేసి, అటుగా ఎవ్వరూ వెళ్ళకుండా ఉండిపోయారు. ఓ పూట తర్వాత చూస్తే, అది అక్కడ లేదు, పెట్టిన తిండి పదార్థాలన్నీ అలాగే ఉన్నాయి. వీధిలో చక్కగా తోటి కుక్కపిల్లల్తో పరుగులెడుతూ కనిపించింది. మమ్మల్ని చూడగానే తోక ఊపుకుంటూ దగ్గరకు వచ్చింది.

ఇదండీ ఆ కుక్కపిల్ల గారి ప్రహసనం!

        ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆ సుబ్బారావు గారి పెళ్ళి అయిపోయింది గాని ఆ మరుగుదొడ్డి పూర్తికాలేదు. ఈ కథంతా విన్న సుందరరి “ఎందుకండీ ఈ హైరానా అంతా! నేనేమీ అడగేలేదుకదా! పెళ్లి పేరుతో రెండు మూడు రోజులే కదా నేను ఈ ఊర్లో ఉండేదీ! తర్వాత ఎలాగూ పట్నం వెళిపోతాం కదా!” అన్నాది. ఖంగుతిన్నట్లైంది సుబ్బారావుకి.
ఇప్పుడు మీకు ఆర్థమయ్యే ఉంటుంది ‘సుసుంకు’ అంటే ‘సుబ్బారావు సుందరి కుక్కపిల్ల’ అని.

(జరిగిన సంఘటనకు పాత్రలపేర్లు వగైరా చిన్న చిన్న మార్పులు చేసి వ్రాయడమైనది)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!