తరం మారింది

తరం మారింది

రచన: శ్రీదేవి అన్నదాసు

హలో ఏమండీ మిమ్మల్నే అనే పిలుపు విని తననే నేమోనని వెనుకకు తిరిగింది శిరీష. కొంచెం దూరంగా ఉన్న ఒకతను చేయి ఊపుతూ కనిపించాడు. ఎవరబ్బా నన్ను పిలుస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నచోటే ఆగి నిలబడి ఉంది. ఆ పిలిచిన అతను రెండు నిమిషాలలో దగ్గరికి వచ్చి హాయ్ స్వాతి అన్నాడు .ఆమాటకి శిరీష మీరు ఎవరో అనుకుని నన్ను పలకరిస్తున్నారు. నేను మీరనుకున్న స్వాతిని కాను అసలు నా పేరు స్వాతి కూడా కాదు అని చెప్పి ముందుకు నడుస్తున్న శిరీషను వెంబడిస్తూ అతను ఏయ్ స్వాతి జోకులెయ్యడం ఇంక ఆపుతావా రాను రాను నీకు అల్లరి బాగా ఎక్కువైపోతుంది అన్నాడు . ఆ మాటలకు ఒళ్ళుమండిపోయిన శిరీష ఏయ్ మిస్టర్ కళ్ళు సరిగా కనిపించట్లేదా ఏంటి నీకు లేకపోతే కావాలనే నాటకాలాడుతున్నావా అంది దానికి అతను నిజంగానే నువ్వు సారీ మీరు స్వాతి కారా అన్నాడు అతను.ఒక్కసారి చెబితే అర్ధం కాదా నీకు ఎన్ని సార్లు చెప్పాలి అంది శిరీష చాలా చిరాగ్గా. మేడమ్ సారీ నిజంగా మీరు అచ్చంగా నా ఫ్రెండ్ స్వాతి లానే ఉన్నారు. అందుకే అంత చనువుగా మాట్లాడాను ఏమీ అనుకోకండి. మీరు ఇంత చెప్ఫినా మీరు స్వాతి కాదంటే అస్సలు నమ్మలేకపోతున్నానండీ అన్నాడు అతను దానికి ఏమీ మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతున్న శిరీషను మేడమ్ నా పేరు వత్సల్ ఇంతకీ మీ పేరు చెప్పారు కాదూ అన్నాడు అతను. ఆ మాటకి అపరిచితులకు పేర్లు, అడ్రస్ లు చెప్పేటంతా తింగరిదానిని కాదు నేను అంటూ విసావిసా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శిరీష

శిరీషది ఆర్ధికపరంగా నర్వాలేదు అనిపించే కుటుంబం. ఇంట్లో శిరీష, శిరీష అమ్మ. నాన్న, చెల్లి ఉంటారు.
శిరీష అందములో ఎంత చక్కగా ఉంటుందో, గుణములో కూడా చాలా ఒద్దికగా ఉంటుంది చాలా చలాకీ గలది అంతకు మించి చాలా చాలా తెలివైనది కూడా. ప్రస్తుతం ప్రేమ పేరు తో జరుగుతున్న మోసాలు,సైబర్ క్రైమ్ ల గురించి అమ్మాయిల పై జరిగే అత్యాచారాల గురించి తన చెల్లికి జాగ్రత్తలు చెబుతూ తల్లి,దండ్రులతో కూడా ఆ విషయమై ఎప్పుడూ చర్చిస్తూ ఉంటుంది శిరీష. దాంతో తన తల్లిదండ్రులు శిరీష విషయంలో చాలా ధైర్యంగానూ, నమ్మకంగానూ ఉంటారు.శిరీష బి.కామ్ ఫైనలియర్ చదువుతుంది.

రెండు రోజుల తరువాత శిరీష కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే మొన్న కనిపించినతను అదేనండీ వత్సల్ మరలా కనిపించాడు. హాయ్ అంటూ పలకరించాడు.శిరీష ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది.ఇలా ప్రతీరోజూ శిరీష మాట్లాడకపోయినా అలా పలకరిస్తూనే ఉండేవాడు ఇంక ఒక రోజు తెగేసి చెప్పేసాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒప్పుకుంటే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను అన్నాడు వత్సల్. ఆ మాటకి శిరీష నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు నన్నింక విసిగిస్తే బాగోదు అంటూ అరుస్తూ అక్కడినుండి వెళ్ళిపోయింది అంతే అప్పటినుండి అతను కనిపించడం మానేసాడు.

ఇలా ఒక నెల గడిచింది.ఒకరోజు శిరీషకి ఏదో ఆన్ నోన్ నంబర్ నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి హలో శిరీషా నేను వత్సల్ ని దయచేసి ఫోన్ మాత్రం కట్ చెయ్యొద్దు ప్లీజ్ నువ్వంటే నాకు పిచ్చి గనుకనే నువ్వు చెప్పకపోయినా నీ,పేరు,ఫోన్ నంబర్ ఇంటి అడ్రస్ తో సహా తెలుసుకోగలిగాను ప్లీజ్ నన్ను అర్ధం చేసుకో అన్నాడు వత్సల్. రిజక్ట్ చేయడానికి కారణమేమి కనబడక అతని ప్రేమని అంగీకరించింది శిరీష

అలా రోజులు, వారాలు నెలలు గడుస్తున్నాయి. ప్రతీ రోజు ఫోన్ ద్వారానూ, అప్పుడప్పుడూ కాలేజ్ దగ్గరా మాట్లాడుకోవడం ఇలా వారి ప్రేమాయణం కొనసాగుతుంది.

ఈలోగా శిలీషకి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయి పోయాయి. ఒకరోజు వత్సల్ శిరీషకి ఫోన్ చేసి నీ చదువు ఎలాగూ కంప్లీట్ అయిపోయింది కదా మనమిద్దరమూ ఇంక పెళ్ళి చేసేసుకుందాం అన్నాడు. ఆ మాటకి శిరీష నువ్వు మీ పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి మా డాడీతో మాట్లాడు అంది దానికి వత్సల్ పిచ్చిదానా ముందే చెబితే ఒప్పుకోవడం అటుంచీ మన పెళ్ళి జరగకుండా అడ్డుకుంటారు. అదే మనం పెళ్ళి చేసేసుకుని వచ్చామంటే చేసేదేమీ లేక ఆశీర్వదించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు అన్నాడు ఆ మాటకి సరే ఐతే అలాగే చేద్దాం అంది శిరీష .ఐతే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు ఈరోజు రాత్రి 8 గంటలకి మీ ఇంటి పక్కనే ఉన్న స్కూల్ దగ్గరకు వచ్చి ఉండు నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అన్నాడు వత్సల్ సరేనంటూ ఫోన్ కట్ చేసింది శిరీష

రాత్రి 8 గంటలకు శిరీష ఇంటి నుండి బయటకు వచ్చేసింది కొంతసేపటికి అమ్మా ఇల్లు మొత్తం వెతికాను అక్క ఎక్కడా కనిపించలేదు. కానీ అక్క గదిలో ఈ కాగితం దొరికిందంటూ తన తల్లికిచ్చిందిశిరీష చెల్లి అనూష. ఏముందో అందులో నంటూ కంగారు కంగారుగా చదివేసరికి అందులో అమ్మా నాకోసం కంగారు పడకండీ నేనూ,వత్సల్ పెళ్ళి చేసుకుని ఉదయానికల్లా మరలా ఇంటికి వచ్చేస్తాము అని రాసి ఉంది అయ్యో దేవుడా ఎంతో తెలివైనదనుకున్న పిల్ల ఇలా చేసినదేమిటి దేవుడా, మరలా నిన్ను చూడగలమా నా తల్లీ సమయానికి ఈయన కూడా ఇంట్లో లేరే అంటూ ఏడుస్తూ కూలబడిపోయింది శిరీష తల్లి సావిత్రమ్మ.

శిరీషని కారులో ఎక్కించుకుని చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత అప్పుడు వత్సల్ నిజ స్వరూపం ఒక్కొక్కటిగా కక్కడం మొదలు పెట్టాడు. మీ ఆడవాళ్ళు మాత్రం ఇంక మారరు ప్రేమ పేరుతో రోజుకో మోసం జరుగుతున్నా చూసి కూడా కళ్ళుతెరచుకోరేం .మగవాళ్ళు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి ప్రేమిస్తున్నాను వచ్చెయ్ మంటే గుడ్డిగా నమ్మేసి వచ్చేస్తారు. ఆ తరువాత ఎవరికో అమ్మబడిపోతారు . ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. ఆల్రెడీ బేరం జరిగిపోయింది. ఇంకొంతషేపట్లో వారొచ్చి నాకు డబ్బిచ్చి నిన్ను తీసుకువెళతారు .అంటూ ఒకచోట కారు ఆపాడు

నలుగురు మగవాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. వత్సల్ కారు దిగి వారితో మాట్లాడుతున్నాడు. ఈలోగా ఎక్కడ నుండి వచ్చిందో పెద్ద పోలీస్ బలగం చుట్టూ చేరి వారిని చుట్టి ముట్టేసారు ఆ హఠాత్పరిణామానికి విస్తుపోయి అలాగే నిశ్చేస్టులై నిలబడి పోయారు వత్సల్ తో సహా ఆ నలుగురు. అప్పుడు ఆ మనషుల ఎదుటకు SI దిలీప్ కుమార్ ,శిరీష తండ్రి శ్రీధర్ వచ్చి నిలబడ్డారు. కారు దిగిన శిరీష మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు ప్రేమించానని చెప్పినప్పుడే కాదని గట్టిగా చెప్పొచ్చు కానీ నీ నుండి అసిడ్ దాడులు,లేదా నీ విషయానికై ఇంట్లో రాద్దాంతాలు ఫలితంగా నా చదువు ఆగిపోవడాలూ ఎందుకని ప్రేమించినట్టు నటించి నిన్ను మ్మించాను
నిజంగా ప్రేమించినవాడివైతే పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించేవాడివి. కానీ నన్ను పెళ్ళి పేరుతో బయటకు రమ్మన్నప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది అందుకే విషయమంతా డాడీకి చెప్పి జాగ్రత్తలు తీసుకున్నాం లొకేషన్ డాడీకి షేర్ చేసి నీకు అనుమానం రాకుండా కూర్చున్నాను.
ఏంటి అన్నావు ఎన్నిసార్లు మోసం చేసినా మోసపోతూనే ఉంటారు అమాయకపు ఆడవాళ్ళు ఆనే కదా అది ఇదివరకటి సంగతి కానీ ఇప్పుడు కాలం మారింది మీ పప్పులు ఇంక ఉడకవు నీకు గుణపాఠం చెప్పి నీ వెనుక ఉన్న వీళ్ళను కూడా పట్టించడం కోసమే నేను నీతోపాటూ వచ్చాను అన్నది శిరీష.
దాంతో SI దిలీప్ కుమార్ అక్కడున్న ఐదుగురిని అరెస్టు చేసి తీసుకెళ్ళిపోయారు.
శ్రీధర్ గారు ఇంటికి ఫోన్ చేసి జరిగినది మొత్తం వివరంగా చెప్పి కంగారు పడకండి మేము వచ్చేస్తున్నాం అని ఫోన్ కట్ చేసారు. అమ్మాయి గురించి అన్నీ తెలిసి కూడా అపార్ధం చేసుకున్నాభంటూ బాధపడ్డారు సావిత్రమ్మ,అనూషలు.

***

You May Also Like

One thought on “తరం మారింది

  1. Chala బాగుంది అండి. ఇప్పటి situation ki తగినట్లుగా రాశారు.. నైస్. 👏👏👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!