నల్లనివి నీళ్ళు, తెల్లనివి పాలు కావు

నల్లనివి నీళ్ళు, తెల్లనివి పాలు కావు

రచన :: కమల ముక్కు (కమల’శ్రీ’)

పని ముగించుకుని వెళుతున్న లక్ష్మి ని తీక్షణంగా చూస్తోంది హాలులో కూర్చుని తన చీరకి తనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్న భారతి.

“ఏంటీ! అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడుస్తోంది?.” అనుకుంటూ ఉండగా,

“భారతీ భారతీ…” అంటూ బెడ్ రూమ్ లోంచి కేకేసాడు భర్త కిరణ్.

“హా! వస్తున్నా” అంటూ “ఏమైందండీ?. ఎందుకా గావు కేకలు?!.” అంది చిరాగ్గా బెడ్రూం లోకి వెళ్లి.

“హా గావుకేకలా నీకలానే ఉంటుంది. నేనెంత టెన్షన్ తో పిలిచానో తెలుసా?!.”

“చెప్తేగా తెలిసేది?!.”

“రాగానే టాపిక్ డైవర్ట్ చేశావుగా. ఇంకెలా చెప్తాను.”

“అయ్యా! మహానుభావా తప్పైంది. చెప్పండి ఎందుకు పిలిచారో?!.”

“ఎందుకా! నా జోబీ లో వెయ్యి రుపాయలు పెట్టాను కనపడటం లేదు. నువ్వేమైనా తీసావా?!.”

“నేను తీయలేదండీ.సరిగ్గా చూడండీ.”

“ఇప్పటికి పదిసార్లు చూశానే. ఉంటే గా కనపడటానికి.”

“ఏమై ఉంటుందంటారు?!. ఎవరు తీసారు. మీరూ కాక నేనూ కాక ఇంకెవరు తీసుంటారు?!.”

“ఏమోనే అదే అర్థం కావడం లేదు.”

“నాకెందుకో మన పనిమనిషి లక్ష్మీ తీసుంటుంది అనిపిస్తోందండీ.”

“లక్ష్మీ నా. ఛా తను అలాంటి మనిషి కాదు భారతీ. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతుంది. ఎన్ని పనులు చెప్పినా నోరెత్తకుండా చేస్తుంది. తను చేసే పనికి నువ్విచ్చే జీతం తక్కువే. అయినా కూడా అడిగిందా. లేదే. అలాంటి మనిషి దొంగతనం చేస్తుందా. తనని కానీ అడేగేసేవు. బాధపడుతుంది పాపం. సర్లే అయ్యింది విషయం ఇక్కడితో వదిలెయ్యి.” అంటూ రెఢీ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్ కి వెళ్లిపోయాడు కిరణ్.

‘తక్కువ జీతం ఇస్తున్నాననే అక్కసుతో డబ్బులు దొంగతనం చేసుంటుంది. ఎవరికి తెలుసు ఎవరి బుద్ధి ఎలాంటిదో?!. సాయంత్రం వస్తుంది గా అప్పుడు చెప్తాను దాని సంగతి.’ అనుకుంటూ తన పనిలో పడింది భారతి.

సాయంత్రం ఎప్పటిలాగే ఐదు గంటలకు వచ్చిన లక్ష్మి తన పనులు తాను చేసుకుంటుంది. అంతవరకూ టీవీ చూస్తున్న భారతి లేచి లక్ష్మీ దగ్గరికి వెళ్లి, “ఏంటి లక్ష్మీ కొత్త చీర లాగుందే?.” అంది లక్ష్మీ కొత్త చీర కట్టుకు రావడం తో.

“అవునమ్మగోరూ. మా మావ కొని తెచ్చిండు ఇయ్యాల మా పెళ్లిదినమని.” అంది అంట్లు తోముతూ.

“అవునా ఎంత ఉంటుందేమిటి ఈ చీర?.” మాటల్లో వ్యంగ్యం కొట్టొచ్చినట్టు కనపడింది.

“ఏమోనమ్మా! ఇట్టాంటి సీర ఎవులో కట్టుకుంటే నేను అట్టాగే సుత్తా ఉన్నానని సానా రోజుల నుంచి డబ్బులు దాచి ఈ సీర మా పెళ్లి దినానికి కొని పెట్టాడమ్మా నా పెనివిటి.” అంది లక్ష్మి సీర వంకే మురిపెం గా సూత్తూ.

“ఏంటీ వేయి రూపాయలు ఖరీదు చేసే చీర మీ ఆయన కొన్నాడా. అదీ దాచిపెట్టుకున్న సొమ్ముతోనా. ఎవరికి చెప్తావు అబద్దాలు?. పొద్దున్న వెళ్లేటప్పుడు మా ఆయన జోబీ లోంచి డబ్బులు దొంగతనం చేసి , ఆ డబ్బుతో చీర కొనుక్కుని, తీరా నేను అడిగేసరికి ఏదేదో చెప్తున్నావు.” అంది కోపం గా భారతి.

“అమ్మగోరూ.ఏమంటున్నారు.నేను దొంగతనం చేయడం ఏమిటి?. ఇది నిజం గా నా పెనివిటి కొన్న సీర.నేనేమీ దొంగతనం సేయలేదు. అట్టాంటివి మా ఇంటా వంటా లేవు.” భాదగా అంది లక్ష్మి ఉబికి వచ్చే కన్నీరు ఆపుకుంటూ.

“మరి ఏమీ చెయ్యకపోతే పొద్దున్న వెళ్లేటప్పుడు ఎందుకే దొంగ సూపులు చూస్తూ వెళ్లావు?.”

“అదీ నేను కసవ తుడిసి సెత్తబుట్టలో ఎత్తి పారబోసేటప్పుడు నా పెనివిటి ఈది లోనే ఉన్నాడు నాకోసం ఎదురుసూత్తా ఉంటే గబుక్కున లోపలికి వొచ్చి సీపురు లోపలెట్టి ఎల్లిపోయినా. మీరేమైనా నా పెనివిటిని సూసినారేమో అని సిగ్గుపడతా అట్టా సూసుకుంటా పోయినా. గంతే కానీ నేనేమీ దొంగ సూపులు సూడలేదు. కూటికి లేనోలము కానీ దొంగతనం సేసేటోల్లమ్ కాదు. మీరిట్టా లేనిపోని అబాండాలు ఏయకండి.” ఖచ్చితత్వం ధ్వనించింది లక్ష్మి గొంతులో.

“ఏంటే నేను అబాండాలు వేశానా. దొంగతనం చేసింది చాలక కబుర్లు ఆడుతుంది కబుర్లు. మీలాంటి వాళ్లు ఇళ్లల్లో పనులకు కుదరడం, ఆ మాటా ఈ మాటా కలిపి మంచి వాళ్లలా నటించి ఇళ్ళల్లోని సోమ్మూ, నగానట్రా, సామాన్లు ఎత్తుకు పోవడం. మాకు తెలీదా ఏంటీ మీ లేకి బుద్దులు. నీలాంటి దాన్ని పనిలో పెట్టుకున్నాను చూడూ నన్ను అనాలి. నెల నెలా జీతం తో పాటూ మా ఇంట్లో సోమ్ము కాజేసి నంగనాచి తుంగబుర్ర కబుర్లు ఆడుతుంది. అమ్మా, మహా తల్లీ ఇక తమరు మా ఇంటికి పనికి రావాల్సిన అవసరం లేదు. వెళ్లిపో ఇక్కడి నుంచి.” అంది కోపం గా.

“ఇట్టాంటి నిందలు ఏసే ఇళ్లల్లో పని సేసే కర్మ నాకూ పట్టలేదు. మనిసన్నాక ఎదుటి వాళ్ళని నమ్మాలి. ఇన్నేళ్లుగా మీ ఇంట్లో పని సేసినా. అయినా మీరు నమ్మలేదు నన్ను. అట్టాంటి మీ కాడ నేనూ పనిసేయలేను.” అంటూ తోముతున్న గిన్నెలు అక్కడే పడేసి చేయి కడుక్కుని వెళ్లిపోయింది లక్ష్మి.

“వెళ్ళు, నువ్వెళ్లిపోతే మాకు పనిమనిషి దొరకదా ఏంటీ?. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎన్ని మాటలు ఆడుతుంది.” అంటూ లక్ష్మి వదిలేసిన అంట్లు తోమడానికి సిద్దం అయ్యింది భారతి.

ఏమాటికామాటే చెప్పాలి గిన్నెలు తోమి, ఇంట్లోని పనులన్నీ చేసేసరికి ఒళ్ళు హూనం అయ్యింది భారతికి. భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించింది కిరణ్ కంటే ముందే.

మధ్యరాత్రిలో ఏదో అలికిడి అనిపించి కళ్లు తెరిచిన కిరణ్ కళ్లు ఒక్కసారిగా పెద్దవి అయ్యాయి. తమ ఒక్కగానొక్క కొడుకు వినయ్, తన జోబీ లోకి చేయి పెట్టి డబ్బులు తీస్తూ కనపడ్డాడు.

“రేయ్! ఈ టైమ్ లో ఇక్కడ ఏం చేస్తున్నావు రా.” అంటూ కోపం గా పడుకున్న వాడు లేచాడు.

“అదీ.. నాన్నా.” అంటూ ఏదో చెప్పబోయాడు వినయ్.

ఆ అరుపులకు లేచింది భారతి.”ఏంటండీ ఏమయ్యింది ఎందుకు అరుస్తున్నారు?” అంటూ ఎదురుగా ఉన్న కొడుకుని చూసి, “నువ్విక్కడ ఏం చేస్తున్నావురా?.” అంది ఆశ్చర్యంగా.

“హా ఏం చేస్తున్నాడా దొంగతనం చేస్తున్నాడు. నా జోబీ లోని డబ్బులు తీస్తున్నాడు నీ కొడుకు. నా కొడుకు బంగారం, నా కొడుకు బంగారం అంటావే. వాడేం చేస్తున్నాడో చూడు.” అంటూ లేచి “ఏరా! మేము నీ మీద పెట్టుకున్న నమ్మకానికి గొప్ప బహుమతి ఇచ్చావురా. నువ్వు దొంగతనం చేస్తే, అది పనిమనిషి లక్ష్మి చేసింది అని తనని నానా మాటలు ఆడి అవమానించింది మీ అమ్మ. కానీ అసలు దొంగ నువ్వని తెలిసింది కదా ఇప్పుడేం చేస్తుందో మరి. అయినా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు కదా. ఎన్నాళ్ల నుంచీ ఈ దొంగతనాలు చేస్తున్నావు. అసలు నీకు ఈ అవసరం దేనికి వచ్చింది రా.” అంటూ కోపం తో చేయి ఎత్తాడు కిరణ్.

“ఏంటండీ చేయెత్తుతున్నారు. దించండి చేతిని. ఏదో చిన్నపిల్లాడు అవసరం వచ్చి తీసుకుంటున్నాడు. దానికే వాడిపై చేయెత్తాలా?. వినయ్ వెళ్లి పడుకో.” అంటూ కొడుకుని బయటకు పంపింది భారతి.

“అసలు వాడిలా దొంగలా అవ్వడానికి నీ అతి గారాబమే కారణం. ఇప్పుడు కూడా వాడిని ఏమీ అననివ్వడం లేదు. ఇలాగైతే వాదింకా చెడిపోతాడు.” అన్నాడు కిరణ్ కోపంగా.

“ఇప్పుడు వాడిని ఏమీ అనకండి. నేను వాడితో తీరిగ్గా మాట్లాడుతాను పొద్దున్న.” అని ముఖం అదోలా పెట్టింది భారతి.

“ముఖమెందుకు అలా పెట్టావు నీ కొడుకు దొంగతనం చేసినందుకా?.” అన్నాడు కిరణ్.

లేదండీ. తప్పు చేసింది వీడు అయితే నేను అనవసరంగా లక్ష్మి ని అనుమానించి, అవమానించాను. పాపం ఈ రోజు పెళ్లి రోజట తనది, వాళ్ళాయన ఎంతో ప్రేమగా కొన్న చీరని మనింట్లో దొంగతనం చేసిన డబ్బులతో కొందని నానా మాటలు అన్నాను. ఇన్నేళ్లుగా పని చేస్తుంది అని కూడా చూడకుండా మాట్లాడి పని మానెయ్యమని అన్నాను. పాపం ఏమనుకుందో ఏమో.” అంది భాదగా.

“అందుకే ఒక మనిషి ని ఒక మాట అనే ముందు చాలా ఆలోచించి మాట్లాడాలి అంటారు. ముందు ఏవేవో అనేసి తర్వాత భాదపడతారు మీ ఆడవాళ్లు.” అన్నాడు కిరణ్ పడుకో బోతూ.

“లేదండీ.. ఓసారి లక్ష్మి ని కలిసి తనకి క్షమాపణ చెప్తే కానీ నా మనసు మనసులో ఉండదండీ.”

“హుమ్ నువ్వెల్లి క్షమాపణ చెప్తే మన్నిస్తుందని అనుకుంటున్నావా. నువ్వు అవి ఒట్టి మాటలే అనుకుంటున్నావు. కానీ ఆ మాటలు తన ఆత్మాభిమానం మీద కొట్టి ఉంటాయి. కొన్ని తప్పులెప్పుడూ ఒప్పులు కావు భారతీ. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు కూడా ఒప్పుకాదు. ఎక్కువ ఆలోచించకుండా పడుకో.” అంటూ నిద్రకుపక్రమించాడు కిరణ్.

“నిజమే తను చేసింది క్షమించరాని నేరమే. మంచి మనసుని ముక్కలు చేశాను. ముక్కలైన మనసెప్పుడూ అతకదని అంటారు. నా మాటల వల్ల దెబ్బతిన్న లక్ష్మీ మనసు కూడా మారదు. నన్ను మన్నించు లక్ష్మీ తెల్లని వన్నీ పాలు కావనీ, నల్లని వన్నీ నీళ్లు కావనీ తెలుసుకోలేకపోయాను.” అనుకుంటూ భాదగా పడుకోవడానికి ప్రయత్నించింది కానీ జరిగిన సంఘటనలే కళ్ళముందు మెదిలి ఆ రాత్రి కాల రాత్రే అయ్యింది భారతికి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!