తెగింపు

(అంశం:: “నా ప్రేమ కథ”)

తెగింపు 

రచన: మంగు కృష్ణకుమారి

“అమ్మా! నువ్వు తీసుకున్న జాగ్రత్తలు, చేసిన బోధలు ఏవీ ఊరికే పోలేదు. ఎందరో పిచ్చి పిచ్చి లవ్ లెటర్స్ రాసినా నేను చింపి పడేస్తున్నాను. ఎవరికీ చెప్పను కూడా చెప్పను” కూతురు రవళి తల్లి వేదప్రియతొ అంది. అది ఇంజనీరింగ్ చేస్తోంది.

కొడుకు వైనతేయ నవ్వుతూ “ఆడపిల్లలు తక్కువ అనే అనుకుంటున్నావా? అమ్మా! నువ్వు నమ్మలేవు, అంత తెగించి మగపిల్లలని రేగింగ్ చేసే లెవెల్లో ఉన్నారు. మనింటి వాతావరణం, నువ్వు, నాన్న మమ్మల్ని పెంచిన విధానం వల్ల చెత్తకారీ ఫ్రండ్స్ నాకు లేరు” మెడిసన్ ఫైనల్ లో ఉన్నాడు.

వేదప్రియ ప్రేమగా పిల్లలని చూసి “మీ గురించి నాకు తెలీదా? ఏమిటర్రా” అంటూ వంటింట్లోకి నడిచింది. కొడుకు మాటలు చెవిలో రింగుమంటున్నాయి.
“ఆడపిల్లలు తక్కువ అనే అనుకుంటున్నావా” ఎలా అనుకుంటుంది? అందులో ఆమె.

భర్తకి అనుకూలవతీ, పిల్లలని అత్యంత ప్రేమగానే కాక చక్కటి చదువు, సంస్కారం అబ్బేట్టు పెంచిన గొప్పతల్లీ, కోలనీలో అందరితోనీ కలుపుగోలుగా ఉంటూ, ఆదర్శ మహిళ అనిపించుకొనే వేదప్రియ తన యవ్వనంలో లేత వయసులో ఉన్నప్పుడు ఇంకోలా ఉండేది.

ఆడపిల్లకి పెద్దచదువులు అక్కరలేదు, మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తే చాలు అన్న భావాలు ఉన్న తల్లితండ్రులు. అప్పటికే పెళ్ళయిన అక్క. ఓతమ్ముడు, ఓచెల్లి. ముగ్గురు మేనమావలు, ఇద్దరు పిన్నులు ఆ ఊళ్ళోనే ఉండేవారు. తండ్రి స్టేట్ గవర్నమెంట్ లో ఆఫీసర్. పెద్ద బావమరిది అంటే అతనికి చాలా ఇష్టం.‌‌ తన ఇంట్లో ముఖ్యమైన విషయాలకి బావమరిది సలహా లేనిదే ఏదీ చేసేవాడు కాదు.

ఇంటర్ అయిన తరవాత వేద టైప్, షార్ట్ హేండ్ నేర్చుకుంటానంటే తండ్రి “దేనికి? పెళ్ళికావలసిన పిల్లవి, ఉద్యోగాలు చేయాలా?” ఒద్దనేసాడు.
పెద్దమావే తీసుకెళ్ళి జాయిన్ చేసేడు. “పెళ్ళి కుదిరిందాకా వెళ్ళనీ బావా!” అని వేద తండ్రికి నచ్చచెప్పేడు. అక్కడ పరిచయం అయేడు సూర్యచంద్రారెడ్డి.

మడత నలగని బట్టలతో చక్కటి క్రాఫుతో, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. స్కూటర్ మీద తిరుగుతూ జోక్స్ వేస్తూ మాటాడే అతన్ని అందరూ అభిమానించే వారు.

పెద్దజడా, సోగకళ్ళతో ఉన్న వేదప్రియ, అతని ఆకర్షణలో తనకి తెలీకుండానే పడ్డాది. అతని జోక్స్ వింటూ కిలకిల నవ్వుతూ ప్రపంచం మరిచిపోయేది. స్కూటర్ మీద ఆమెని ఆమె ఇంటి సందు కొసదాకా దింపేవాడు. ఇద్దరూ అప్పుడప్పుడు కాఫీ తాగిందికి హొటల్ కి వెళ్ళేవారు. ఫేమిలీ రూమ్ లో కూచున్నపుడు అతని చూపులూ పరవశం వచ్చేలా ఉండేవి.

ఎంత చనువుగా మాటాడినా ఆమె తన చితికిన వేలుకూడా
అతన్ని ముట్టుకోనిచ్చేది కాదు. నిజానికి వేదప్రియకి ఈ స్నేహం, పరిచయం ‘ముందు ముందు’ ఏమవుతుందో అనే ఆలోచన ఉన్నంత మెట్యూరిటీ లేదు.

ఆ టైమ్‌లో వేదప్రియకి పెళ్ళిచూపులు జరగడం ఆ సంబంధం కుదిరిపోడం కూడా జరిగిపోయింది.

అబ్బాయి నార్త్ లో ఉద్యోగం చేసేవాడు. తల్లీ తండ్రీ ఆంధ్రాలో. కట్నకానుకలూ మాటలు అయిపోయేయి. వేద సూర్యకి జరిగినదంతా మోసింది. కళ్ళనీళ్ళతో “సూర్యా! నాకీ పెళ్ళి ఇష్టం లేదు. మాఇంట్లో వినరు. ఏం చేద్దాం?” అంది. సూర్య ఆలోచించి, “అబ్బాయి వాళ్ళ నాన్న ఎడ్రస్ ఇవ్వగలవా?” అన్నాడు.

మర్నాడే వేద తండ్రి బీరువాలో దాచిన ఎడ్రస్ కాగితం చూసి, వేరే కాగితం మీద రాసుకొని సూర్యకి ఇచ్చింది. సూర్య ఒక ఉత్తరం తయారు చేసి వేదకి చూపించేడు. అందులో “మీ అబ్బాయికి కుదుర్చుకున్న అమ్మాయికి ఈపెళ్ళి ఇష్టంలేదు. వాళ్ళ పెద్దలకి తెలిసే చేస్తున్నారు. ఈ పెళ్ళి చేస్తే మర్నాడే అమ్మాయి బావిలో
దూకుతుందో, ఇల్లువిడిచి పారిపోతుందో, లేదా మీ ఫేమిలీ అందరిమీదా గృహహింస కేస్ పెడుతుందో తెలీదు గానీ ఏదొ ఒకటి తప్పకుండా జరుగుతుంది.” అని ఇంకా ఇలా జడిపించే భాషతో ఉంది. వేద పోస్ట్ చేసీమంది.

ఆమెకళ్ళ ముందు ఈ ఉత్తరం చదివి తన పెళ్ళి రద్దవుతున్నట్టూ, వెంటనే సూర్య ముందుకు ఉరికి అందరినీ ఒప్పించీ తనచేయి పట్టుకొని పెళ్ళిపీటల మీదకి తీసుకెళుతున్నట్టు
కలలు కనిపించేయి.

ఆ తరవాత చాలా ఘోరమయిన పరిస్థితి ఎదురయింది. ఉత్తరం అందుకున్న అబ్బాయి తండ్రి వేద తండ్రిని పిలిపించి ఉత్తరం ఇచ్చి ఛడాఫడా తిట్టేడు.

అతను ఇంటికి వచ్చి కోపంగా కూతురిని నిలదీసేడు. ఫేమిలీ మీటింగ్ జరిగింది. వేద తల్లి ఏడుపుతో కూలబడింది. వేదకి తెగింపు వచ్చింది. తనే సూర్యకి చెప్పి రాయించిసినట్టు ఒప్పుకుంది.

తండ్రి వేదని చితకబాదుతూ ఉంటే, బావమరిది చెయ్యి పట్టుకొని ఆపి,
“బావా! జరగాల్సింది చూడు. పద ఆరెడ్ల ఇంటికి వెళ్దాం” అన్నాడు. “రామం, ఆఖరికి కులాంతరం మన చేతులమీద చెయ్యాలా?” అని ఏడుస్తూ కూచున్నాడు.

మర్నాడు సూర్య ఇంటికి వెళ్ళిన తండ్రికీ, మేనమావకీ అవమానమే జరిగింది. “మీరెవరో మాకు తెలీదు. మా అబ్బాయికి మా పల్లెటూర్లో మేనరికం ఉంది. మావాళ్ళు. ‌మాసాటి వాళ్ళు” అంటూ అతని తండ్రి వీళ్ళని తీసిపారేసారు.

అంతా విని కోపంతో వేద సూర్యని ఇంటికి పిలిపించి అడిగింది. సూర్య నిర్భయంగా, “నేనేం నిన్ను పెళ్ళి చేసుకుంటానని మాట ఇవ్వలేదే? ఇష్టం లేని పెళ్ళి తప్పించిందికి నువ్వు సాయపడమంటే సాయం చేసేను”‌ అన్నాడు. వేద తెలివి తప్పి పడిపోయింది. తెలివి వచ్చేసరికి ఆమె పక్క చూస్తూ రాజారావు.

“మంచి నీళ్ళు తాగండి” అని నీళ్ళ గ్లాసు వేదకి అందించేడు. అతను పెళ్ళిచూపుల్లో వేదని చూసి ఎంతో ఇష్టపడి, తన తల్లితండ్రులతో వేదనే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన అబ్బాయి.

వేద వెర్రిదానిలా చూస్తూ ఉంటే, తల్లి లోపలకి పిలిచింది. తండ్రి కూడా వచ్చేడు. రాజారావు వెళిపోయేడట. తల్లి ఏడుస్తూ “వేదా! అబ్బాయి బంగారం. ఇంత జరిగినా ఇంకా
ఈ పెళ్ళి ఆగదని, నిన్నే చేసుకుంటానని పట్టు పడుతున్నాడు. ఇంత మంచివాడు ఎవరికీ దొరకడు. నీ చేతుల్లో ఉంది, అంతా” అంది.

మళ్ళా ఫేమిలీ మీటింగ్ అయింది. అందరూ రాజాని పొగుడుతూ, వేదని నానా తిట్లు తిట్టేరు. తండ్రి “అమ్మాయ్!‌ఇది వదులుకుంటే, ఇహనీ పెళ్ళి నేను చేయలేను” అన్నాడు.

పిన్ని కోపంగా “ఇలాగే నాకొడుక్కి జరిగిఉంటే ఆ అమ్మాయిని ‌నా కోడలిగా నేను చచ్చినా చేసుకోను. ఏవనుకుంటున్నారో? అంతెందుకు? బావా! నువ్వయితే నీ కొడుక్కి
చేసుకుంటావా?” అంది.

అందరూ మౌనం. వేదని దేవుడు రక్షించినట్టు రాజారావే వేదతో మాటాడతానని కబురు పెట్టేడు.

అతనితో మాటాడిన గంటలో వేద మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలయిపోయేయి.
సంస్కారం అంటే ఏమిటో బోధపడింది. హృదయపూర్వకంగా అతనికి వందనం చేసేసింది.

అన్నదానికన్నా రెట్టింపు లాంఛనాలతో పెళ్ళి చేసేడు వేద తండ్రి. రాజారావు తల్లితండ్రులు మొహాలు మాడ్చుకొనే ఉన్నారు. అతని వదిన తృణీకారంగా వేదని చూసింది. అయినా రాజారావు స్వచ్ఛమయిన మనసు‌ ముందు ఏవీ వేదకి కనపడలేదు.

తరవాత సంసారంలో పడి వేద తన పాత ప్రేమ కథంతా మరచిపోయింది. పిల్లలని చాలా జాగ్రత్తగా పెంచింది. విచిత్రంగా ఆమె అత్తమామలు కూడా పెద్దకోడలితో పడక, వేదదగ్గరే సెటిల్ అయ్యేరు. వేద తన తల్లితండ్రుల్లాగే చూసింది. తోటికోడలు కూడా వేద మంచితనం గ్రహించుకొని తన పిల్లలకి అవసరమయిన సలహాలు వేదనే చెప్పమనేది.

వేద పాత తలపుల్లోంచి బయటికి వచ్చింది. “ఆడా మగా ఎవరయినా వయసు ఉద్రేకంలో చిన్న తప్పుచేస్తే, క్షమించి ఆదుకొనే అండ ఉండాలి. అప్పుడే జీవితం వారికి నందనవనం” అనుకుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!