విఫలమైన ప్రేమ

(అంశం:: “నా ప్రేమ కథ”)

విఫలమైన ప్రేమ 

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

కొత్తకలెక్టర్ శ్రీమతి లతారావు జిల్లాలో బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు దానికి ప్రతి బ్యాంకు ప్రతినిధులు హజరు కావల్సిందని సమాచారం. కృష్ణప్రసాదు స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజరుగా బదలిపై వచ్చాడు. ఆ సమావేశానికి వెళ్ళాడు. అక్కడ కొత్తకలెక్టర్ లతారావును చూసి
షాక్ తిన్నాడు. ఆమె అతని ప్రధమ ప్రేమికురాలు లతానే. కాలేజీ చదువుతున్న రోజులలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడు. అది ఒక పక్క ప్రేమే. ఆమె ఇతనని అసలు ప్రేమించలేదని అలాంటి
ఉద్దేశమే లేదని స్పష్టంగా చెప్పేసింది. అయినా రక రకాలుగా ఆమె వెంట పడుతూనే వుండేవాడు.
ఆ రోజు కాలేజిలో చివరి పరీక్ష జరిగిన రోజు.
పరీక్షరాసేసి ముందుగా వచ్చేసి హాలు బయట లత కోసం ఎదురు చూడసాగేడు. ఎలాగైనా తన చివరి ప్రయత్నంగా ఒప్పించాలని చూశాడు. లత కూడా
ఖచ్చితంగా చెప్పేసింది. అయినా వదలటం లేదు ఆమెను. ఇక లతకు ఒపిక నశించి వాళ్ళ అన్నయ్యకు ఫోను చేసింది. వాళ్ళ అన్నయ్య గట్టిగా బెదిరించడంతో
కృష్ణప్రసాదు ఏమి చేయలేక నిరాశతో వెళ్ళిపోయాడు.
ఆ తరవాత ఆమెను చూడడం ఈ కలెక్టర్ హోదాలోనే.
సమావేశానంతరం కృష్ణప్రసాదుకు ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ గారు రమ్మంటున్నారని పిలుచుకొని వెళ్ళాడు.
ఆమె చాంబరులోకి వెళ్ళాక “హలో !కృష్ణ ప్రసాద్ ఎలా వున్నారు. మీ భార్య శ్రీలక్ష్మీ మీ అబ్బాయి శ్రీకాంత్, అమ్మాయి శశిరేఖ ఎలా వున్నారు?” అంటూ కుశల ప్రశ్నలు వేయడంతో కృష్ణప్రసాదు మరోసారి షాకయ్యాడు.
“ఏంటి నీ వివరాలు నాకెలా తెలిశాయని షాకయ్యావా. అసలు నీ భార్య ఎవరనుకుంటున్నావు? మా అన్నయ్య స్నేహితుడి కూతరయ్యా. ప్రేమంటూ నా వెంట పడ్డావు. నీ ప్రేమలో పస ఇంతేనన్నమాట.
సరేలే నిన్ను దెప్పిపొడవడం నా ఉద్దేశం కాదు. నీ జీవితం ఒక గాడిలో పడినందుకు చాలా సంతోషంగా వుంది. నీ భార్యా పిల్లలను అడిగానని చెప్పు. వీలు చూసుకొని ఒక రోజు మీ ఇంటికి వచ్చి మీ అందరిని కలుస్తాను” చెప్పి పంపేసింది కృష్ణప్రసాదుని. కృష్ణప్రసాదు ఇంకా అయోమయ అవస్థలోనే ఇంటికి చేరుకున్నాడు.
**
కాలేజీ జీవితం తరువాత కృష్ణప్రసాదు చాలా కాలం నిరుద్యోగజీవితం గడిపాడు. కొన్నాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేడు. అలా ఒక స్వచ్ఛంద సంస్థలో
కొన్నాళ్ళు పనిచేశాడు. అక్కడ అకౌంటెంటుని ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకుంటానని వెంటపడ్డాడు.
ఆమె కూడ వాళ్ళ అన్నదమ్ములతో తన్నించింది. ఆ సంస్థవాళ్ళు అతడిని తీసేశారు.
మరికోన్నాళ్ళు ఒక ప్రైవేటు కళాశాలలో ట్యూటర్ పని చేసేవాడు. అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించానంటూ
పెళ్ళి చేసుకుంటానని వేదించాడు. వాళ్ళు ఉద్వాసన చెప్పేశారు. ఇలా చిరుద్యోగపర్వంలో తిన్న దెబ్బలకు బుద్ది వచ్చి ప్రేమా గిమా ఏమి లేదంటు ఉద్యోగ ప్రయత్నాలలో పడ్డాడు. అతని పట్టుదల వల్ల ఎట్టకేలకు స్టేట్ బ్యాంకులో అధికారిగా ఉద్యోగం సంపాదించాడు.
అక్కడే పరిచయం అయింది శ్రీలక్ష్మీ సహ అధికారిగా.
అది అలా పెళ్ళికి దారితీసింది. అలా అయ్యేలా చేసింది లతే. శ్రీలక్ష్మీద్వారా కృష్ణప్రసాదు గురించి తెలుసుకొన్న
లత వాళ్ళిద్దరిని ఒకటి చేసింది. ఇక కృష్ణప్రసాదు సంసారజీవితంలోపడి ఉద్యోగంలో పదోన్నతులు పొంది చీఫ్ మేనేజర్ కాగలిగాడు.

—-////—-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!