తెగిన పతంగం

తెగిన పతంగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

మౌనమే నీ భాష ఓ మూగ మనసా… ఎఫ్ మ్ రేడియో లో మంగళంపల్లి వారు ఆలపించిన ముత్యాల వంటి పదాల తో జీవిత సత్యాన్ని వినిపించిన మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి పాట వింటోంది తులసి. అవును తలపులు ఎన్నెన్నో కలలుగా కంది ఇప్పుడు కల్లలు అయ్యాయని కన్నీరు కారుస్తోంది తన మనసు. పదిహేను సంవత్సరాల క్రితం తను చేసిన పొరబాటు కనుల ముందు కదిలింది. అమ్మా! నేను గుడికి వెళ్ళొస్తా నువ్వు, నాన్న ఆఫీస్ కి వెళ్ళాకా అంది తులసి. గత కొన్ని నెలలుగా ఇళ్లు కదలని కూతురు అలా అనేసరికి హమ్మయ్య అనుకున్నారు భవాని భర్త మధు. అవును పాపం అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, ప్రాణాలన్ని తన మీదే పెట్టుకుని పెంచుకుంటున్నారు ఒక్కగా నొక్క కూతురు తులసిని. మరో బిడ్డ కూడా ఒద్దనుకుని, రెక్కల కష్టం తో  ఎం టెక్ చేయించారు. ఇప్పుడే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఆప్యాయత అనురాగాలు కొదవలేని కుటుంబమే వారిది. అయితే ఇరుగు పొరుగు వారు, బంధువుల తో మరీ ఎక్కువ బంధాలు ఏర్పరచుకోలేదు వారు. ఏదో వారు వారి జీవితాలు అలా గడిచిపోతున్నాయి. ఇంతలో తెలుసున్న దూరం బంధువుల అబ్బాయి రాజేష్ తో పెళ్లి సంబంధం కుదిర్చారు అమ్మా నాన్న. తాంబూలాలు కూడా మార్చుకున్నారు ఒక నెల క్రితం. ముహూర్తాలు పెట్టుకున్నాక మరో నెలలో పెళ్లి అనగా తెలిసింది ఒక నమ్మబుద్ధి కాని నిజం. రాజేష్ కి ఉద్యోగం లేదనీ, చదివింది బి టెక్ అని చెప్పాడు కానీ అదీ తప్పని. చదువు తన కన్నా తక్కువే అయినా తెలిసిన వాళ్ళు చెప్పారు అమ్మ నాన్న మెచ్చారు అని పెళ్లికి ఒప్పుకుంది తను. ఇలా నిజం తెలియడం తో ఇప్పుడు ఆ పెళ్లి వద్దనుకున్నారు ఇద్దరు పెద్దలూ. ఈ పరిణామం తో ముగ్గురూ కృంగి పోయారు. అప్పటి నుంచీ లేచిన నాడు లేచారు, లేని నాడు లేదు. తిన్నారో లేదో ఎంతగా కృంగి పోయారు అంటే భవాని కి అంతకు ముందే ఉన్న చెక్కర వ్యాధి పెరిగిపోయింది. మందుల మీద శ్రద్ద తగ్గిపోయింది. మధు కి కూడా కొత్తగా చెక్కర వ్యాధి, రక్తపోటు వచ్చి చేరాయి. అలా నెల గడిచాక ఇప్పుడిప్పుడే మామూలు జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు కూతురు కూడా కొంచెం బయటకు వెళ్తోంది అనేసరికి హమ్మయ్య అనుకున్నారు. యధావిధిగా సాయంత్రం ఇద్దరూ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటికి తాళం అలాగే ఉంది. కూతురు ఎటైనా వెళ్ళింది అనుకున్నారు. చూస్తే వంటింట్లో గిన్నెలు ఖాళీ కాకుండా తన కోసం వండిన వంట అలాగే ఉంది. ఎందుకో ఇద్దరికీ కీడు శంకించింది. ఫోన్ చేస్తే స్విచెడ్ ఆఫ్ అని వస్తోంది. పై ఫ్లాట్ లో ఉండే మధు అన్నయ్య వాళ్ళని, తెలిసిన కొంత మంది స్నేహితులను అడిగినా వాళ్ళు అసలు ఈ రోజు తులసిని చూడలేదు అన్నారు. దానితో కంగారు ఇంకొంచెం పెరిగిపోయింది. ఏమిటా భగవంతుడా అనుకుంటూ రాత్రంతా తిండికి, నిద్రకి దూరమై బ్రతికారు. ఏం చెయ్యాలి, ఎలాగా ఏమీ తోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఉదయం తొమ్మిది అయింది.  ఏదో తెలియని నంబర్ నుంచి మధు కి ఫోన్ రావడం తో భయ పడుతూ ఎత్తాడు. అవతలి నుంచి పోలీస్ ఆఫీసర్ అని వినే సరికి పై ప్రాణాలు పైకే పోయాయి ఇద్దరికీ. తమాయించుకుని స్పీకర్ ఆన్ చేసాడు ఆయన చెప్తున్నాడు. చూడండి మీ అమ్మాయి తులసి టా, రాజేష్ అనే అబ్బాయిని తీసుకుని నిన్న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని, రిజిస్టర్ కూడా చేసుకుని నా దగ్గరకు వచ్చారు, రక్షణ కావాలని. వీళ్ళు మేజర్లు కావడం తో చట్ట ప్రకారం వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది. మీరు వాళ్ళ జీవితాల్లో కలుగచేసు కుంటే మర్యాదగా ఉండదు. అర్థం అయింది అనుకుంటా అని పెట్టేశాడు. వీరిద్దరికీ ఏమీ అర్ధం కాలేదు. వాడినే చేసుకుంటా అంటే మనమే చేసే వాళ్ళం కదా, ఇదేమిటి అసలు ఏమైంది దీనికి ఇలా పరువు తీసింది. మనకి కూడా అది ఒక్కత్తే కదా అని మరింత తల్లడిల్లి పోయారు. ముందు జీవితం అంతా శూన్యం అయిపోయినట్టు ఉంది. అంతగా నా అని చెప్పుకునే వారు లేని వాళ్ళు ఇక కోలుకోలేదు. ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, తింటున్నారు అంతే. కూతురు నుంచి ఆనాటి నుంచీ ఓ కబురు కానీ, ఫోన్ కానీ ఏమీ లేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి భవాని కాలం చేసిందని, అదే బాధలో తన తండ్రి ఫ్లాట్ అవీ అమ్మేసి ఏదో ఆశ్రమాన్ని ఆశ్రయించారు అని ఈ మధ్యనే తెలిసింది తులసికి. అదే దిగులు పడుతోంది తులసి ఇప్పుడు. ఎందుకు తను రాజేష్ మాయ లో పడిపోయానని బాధ పడని క్షణం లేదు. అమ్మానాన్న మంచివాడు కాదని కదా ఈ సంబంధం వద్దన్నారు అని ఆలోచించ లేక పోయింది. స్థిరమైన ఉద్యోగం లేదు, చదువా తెలీదు. ఏదో పెళ్ళైన కొత్తలో ఓ నెల రెండు నెలలేమో తనని కనీసం ఓ మనిషి గా చూసాడు రాజేష్. తనకి వాళ్ళ అమ్మ తోడు ఉండనే ఉంది. అమ్మానాన్నలకు తను ఒక్కదాన్నే అయినా రాజేష్ మోజులో పడి వాళ్ళని అనాథలను చేసినందుకు తనకి తగిన శాస్తి జరిగింది అనుకోవడమే తప్ప ఏమీ మిగల్లేదు జీవితంలో. ఇద్దరు పిల్లలు పుట్టినా మారని తన పరిస్తితి కి జాలి పడే వారు కూడా లేరు. ఇల్లు గడవక తనుకూడ ఓ ఉద్యోగం చెయ్యక తప్పడంలేదు. ఇన్ని సమస్యలతో కెరీర్ లో కూడా ఎదిగింది లేదు. ఏదో పూట గడిచే జీతం అంతే.
అమ్మా! చూడరా తల్లీ మాకు నువ్వు ఒక్కత్తివే కదా! మంచి అబ్బాయితో పెళ్లి చేసుకుని, హాయిగా ఉంటూ మమ్మల్ని రోజూ ఒకసారి పలుకరిస్తూ ఉంటే అదే చాలు మాకు, మా తరువాత ఈ ఫ్లాట్, కష్టపడి పోగేసుకున్న బంగారం, మిగిలే కాస్త డబ్బు తో జాగ్రత్త గా ఉండు అని చెప్పే అమ్మ మాటలు ఇప్పుడు రోజూ తలచుకున్నా ఉపయోగం ఏముంది.  కూతురికి అప్పుడే పన్నెండు సంవత్సరాలు. ఇకపై జీవితం ఏమిటో అనుకుంటూ ఉండగా… అమ్మా ఎక్కడికి పోయావు అంటూ కూతురు అరవడం తో ఈ లోకం లోకి వచ్చింది.
ప్రేమా ఆప్యాయత తెలియని అత్త, మగడు వారసత్వం పిల్లలకి వచ్చింది ఎప్పుడూ వాళ్ళు కూడా తనని మనిషిగా చూడడం లేదు. ఎంత చెప్పినా వినడం లేదు. అదీ తన జీవితం. చేజేతులా తానే నిర్మించుకుని ఇప్పుడు ఏడిస్తే ఏమి ఉంది.  పెళ్లి కుదిరింది కదా అని అతి చనువుతో షాపింగ్ లకు, సినిమాలకి తిప్పి, ఏవో మూడు మాయమాటలు, ఆరు రకాల ఫాస్ట్ ఫుడ్లు తినిపించిన తన రాజేష్ గురించి ఎవరో కిట్టని వాళ్ళు తప్పుగా ప్రచారం చేస్తే అమ్మా నాన్న నమ్మారు గానీ ఇతను మంచి వాడే అనిపించిన ఒకే ఒక్క కారణానికి తన జీవితం ఇలా అయిపోయింది. చెప్పుకుని ఒక్కసారి ఒడిలో ఏడుద్దాం అన్నా అమ్మ కూడా లేదు. ఇలా తనకు తప్పుడు సలహా ఇచ్చి, అమ్మానాన్న కొన్నాళ్ళు ఏడిచినా తర్వాత వాళ్లే కలుస్తారని చెప్పిన పిన్ని, ఏమైనా అవసరం అయితే మేము ఉన్నాం అన్న బాబయ్య కూడా ఎప్పుడో మొహం చాటే సారు కదా అనుకుని కూతురుకి భోజనం వడ్డించడానికి లేచింది. తనని తిన్నావా అని ఎవరైనా అడిగి పదిహేను సంవత్సరాలు అయింది కదా! అని నిట్టూర్చింది. అంతే కదా మరి , లేనిది కోరేవు వున్నది వదిలేవు, ఒక పొరబాటు కు యుగములు వగచేవు* .. తీరని వ్యధ మిగిల్చిన చిన్న తప్పు చేసిన జీవితం తనది. ఎప్పటికైనా ఏ దేవుడో కరుణించి కాస్త మనిషిగా గుర్తింపు పొందాలని ఆశ తప్ప ఏమీ లేదు ఇప్పుడు ఈ తెగిన పతంగానికి. చూసారా ఆలోచించ కుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఏమౌతుంది అన్నది ఈ కథ చెబుతోంది.

You May Also Like

21 thoughts on “తెగిన పతంగం

  1. పద్మనాభం గారు మీరు ఒక కథ గా వ్రాసారు. కానీ ప్రస్తుత కాలం లో ఇలాంటివి నిజ జీవితంలో చాలా వింటున్నాము.
    చదువుకున్న ఆడపిల్లలు ఈ విధంగా మోస పోతున్నారు అంటే చాలా బాధగా ఉంటోంది.
    ఇంకా తల్లిదండ్రులు బాధలు అంత ఇంత అని చెప్ప లేము.

  2. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాగా రాశారు. తల్లి తండ్రుల భయలని అర్థం చేసుకుని భవిష్యత్తు గురించి అవగాహన అవసరమని తెలుసుకుని నిర్యయలు చేసుకోవలసిన అవసరం ఉంది. మేలు కోరే వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకూడదని తెలుసుకోవాలి.

  3. అవును. అనాలోచిత నిర్ణయాలు వల్ల చాలా ఇబ్బంది పడతారు అని బాగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!