తెలివిగల రైతు కొడుకు

తెలివిగల రైతు కొడుకు 

రచన :: రాజెల్లీ సాయికృష్ణ

అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ కూతురు పేరు రుద్ర ,,, చూస్తూ చూస్తుండగానే పెళ్లీడుకు వచ్చేసింది ఆ అందాల ముద్దుగుమ్మ. కూతురు పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు రాజు.

ఇతర రాజ్యాల రాజులకు మంత్రులకు మహా మంత్రులకు సాధారణ ప్రజలకు రాజ్య పాలకులకు అందరికీ సమావేశ పెట్టాడు.

మహారాజు తన నిర్ణయాన్ని నిర్భయంగా అందరికి తెలియజేశాడు.

నా కూతురిని పెళ్లి చేసుకునేవాడు తెలివి గలవాడై, గుణవంతుడై, గెలుస్తానన్న నమ్మకం ఉన్నవాడై, ఓటమిని ఒప్పుకోని వాడు, ఈ గుణాలు ఉన్న వాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇస్తున్నాను అని తెలియజేశాడు అందరికీ.

మీ అందరికీ పెట్టే పోటీ ఏమిటంటే, పోటీలో పాల్గొన్న వారికందరికీ ఒక్కొక్కరికి ఒక్కో గదిని ఇవ్వడం జరుగుతుంది ఆ గదిని మీ తెలివితేటలతో 5 నిమిషాలలో ఆ గది మొత్తం నింపి వేయాలి. పోటీలో గెలిచిన వారికి నా కూతురిని ఇస్తాను అని చెప్పాడు మహారాజు.

పోటీకి సిద్ధమై పోయారు ‘రాజులు”, “మంత్రులు” మరియు ఇతరులు. ఈ పోటీలో బీద రైతు కొడుకు కూడా పాల్గొన్నారు.

అందరూ ధాన్యపు సంచులతో ఇతరత్రా సరుకులతో గది ముందు నిలుచుని సిద్ధంగా ఉన్నారు.

రైతు కొడుకు మాత్రం ఎటువంటి సంచులు, సరుకులు లేకుండా ఖాళీగా నిలుచున్నాడు. గది ముందు.

ఆ రాజు రైతు కొడుకు దగ్గరకు వచ్చి, అందరూ పోటీకి సిద్ధంగా ఉన్నారు నీ దగ్గర ఏమీ లేదు ఏంటి నువ్వు ఎలా పోటీ పడతావు… అని అడిగాడు మహారాజు.

ప్రణామము మహారాజా… ఈ పోటీలో నేను ఓడిపోయినట్టు అయితే నా శిరస్సును నీకు అర్పిస్తాను మహారాజా… గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోటీల్లో పాల్గొన్నాను మహారాజా… నేను ఒక బీద రైతు కొడుకుని తినడానికి తిండి లేకున్నా సంపాదించే సత్తా ఉంది.

ఓటమిని ఒప్పుకోను, గెలుపుని ఆస్వాదిస్తాను అని ధైర్యంగా చెప్పాడు.

ఇలా మాట్లాడి మంత్రముగ్ధున్నీ చేసేసాడు మహారాజుని ఆ రైతు కొడుకు.

సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు మహారాజు.

బటుడికి ఆరంభపు బేళ్ళు మ్రోగించమన్నాడు మహారాజు. భటుడు వెంటనే మ్రోగించాడు.

రాజులు, మంత్రులు, ఇతరులు అందరూ బియ్యం బస్తాలు సరుకులు తీసుకొని వాళ్ళకు కేటాయించినటువంటి గదులను నింపుతున్నారు. రెండు నిమిషాలు అయిపోయింది ఇంకా మూడు నిమిషాలు సమయం ఉంది. రాజుల మంత్రుల కండరాలు కరిగిపోతున్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. అయినా ఇంకా గదులు నిండిపోలేదు.

రైతు కొడుకు వీళ్ళని చూస్తూ నిల్చున్నారు మూడు నిమిషాలు దాటింది అయినా ఇంకా ప్రారంభించలేదు రైతు కొడుకు.

నాలుగవ నిమిషానికి గదిలోకి వెళ్లి అతని జేబులో ఉన్న కొవ్వొత్తిని తీసుకొని, గది మధ్యలో ఒక చెక్క బల్లపై పెట్టి కొవ్వొత్తిని వెలిగించాడు.

ఆ కొవ్వొత్తి వెలిగే గదిని నింపేసింది.

ఆ కొవ్వొత్తి వెలుగిస్తూనే గదిని వెలుగుతో నింపేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

ఆ మహారాజు ఈ రైతు కొడుకు తెలివితేటలకు మెచ్చి అభినందించారు.

తన కూతురిని ఇచ్చి పెళ్ళి చేశాడు. బంగారు రథం పై ఊరేగింపు చేశాడు.

బీదవాడిగా ఉన్న ఆ రైతు కొడుకు తన తెలివి తేటలతో గొప్ప వాడిగా అయిపోయాడు.

నీతి:తెలివి ఉంటే దేనినైనా జయించవచ్చు.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!