తుంటరి పిల్ల

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

తుంటరి పిల్ల

రచన: అరుణ చామర్తి ముటుకూరి

చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. మా తాతయ్య పెద్ద ఇల్లే కట్టారు. కానీ అచ్చమైన బంకమట్టితో కట్టిన ఇల్లు. అప్పట్లో ఇంత వేడి లేదు బంకమట్టి వల్ల చల్లగా ఉండేది. కానీ వచ్చిన చిక్కల్లా మట్టి కాబట్టి ఏదో మూల ఉండేది దానిలో పాములు ఉన్నాయేమో అనిపించేది.
మా మేనత్త ఎప్పుడు కుదురుగా నడిచేది కాదట గంతులు వేసుకుంటూ నడిచేది అట అలా నడుస్తూ ఒక సారి తాచుపాము తోక తొక్కింది అట.
అసలే పల్లెటూరు ఇలాంటివి ఇంకా భయం. మహాలక్ష్మి అని పిలువగానే ఆ పాము కన్నం నుంచి తొంగిచూస్తోంది అని చెప్పే వాళ్ళు. తర్వాత ఏ మంత్రమో తంత్రమో వేసి ఆపద నుంచి గట్టెక్కారు అని చెప్పారు అనుకోండి.
ఇలాంటి కబుర్లు తరచూ మా పెద్ద వాళ్ల నుంచి వింటూ ఉంటాం. నేను కూడా అదే ఊరిలో లో చదువుకోటానికి వెళ్ళినప్పుడు జరిగింది ఈ సంఘటన.
****. **** ****
మా తాతయ్య కి ఇద్దరు తమ్ముళ్ళు, దత్తుడైన తమ్ముడు మరొకరు. పెద్ద తమ్ముడు కోపం ఎక్కువ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ తాతయ్యకి నేను అంటే బాగా ఇష్టం.
ఒకరోజు హడావిడిగా వచ్చి మా బాబాయి దగ్గర ఏదో మాట్లాడుతున్నారు.

‘అబ్బాయ్, మన పాతిల్లు లేదు, మట్టి ఇల్లు వెనుక
ఆ ప్రహరీ గోడ దగ్గర అ ఒక రంధ్రం నుంచి మరో చోటికి పాకినట్టు గా పెద్దగా గీత ఉంది రా”

“అవునా బాప్ప, పదండి చూద్దాం ఇప్పుడే”
అంటూ మా బాబాయి కూడా హడావిడిగా వెనక్కి వెళ్లి చూశారు.

“నిజమే బాప్ప, ఇది చూస్తుంటే రక్తపింజర లా ఉంది. చాలా ప్రమాదం”

” అసలు అంత లావుగా ఉన్నట్టు గా ఉందిరా గీత”

” అవును బాప్ప అదే చూస్తున్నాను”

వాళ్ళిద్దరి తో పాటు నెమ్మదిగా నేను వెళ్లి ఆ సంభాషణ వింటున్నాను.

“పిల్లని బయటకి రానివ్వకు, ఆడుకోడానికి”
మా తాతయ్య ముందుజాగ్రత్తలు మొదలుపెట్టారు.

“అసలు ఇలాంటి పాము ఇక్కడ లేవు కదా”

“ఏమోరా అబ్బాయి! నా గది లో కూడా రోజు ఎక్కడో మూల , ఏదో శబ్దం, అక్కడ ఏదో ఉన్నట్లుగా కనబడుతూనే ఉంటుంది”

“చెప్పవేంటి బాప్ప మరి, ఒక్కడివి అక్కడ ఏం ఉంటావు, మాతోనే ఉండమంటే వినవు” అవకాశం దొరికిందని మళ్ళీ మాతో ఉండమని మా తాతయ్య ని అడుగుతున్నారు బాబాయ్.

“సరేలేవోయ్ అవకాశం దొరగ్గానే మళ్ళి మొదలెట్టావ్..” ఎప్పటిలానే నవ్వుతూ సమాధానం దాటవేశారు మా తాతయ్య.
చివరికి, పోగయిన కొందరు ఊరిలో వారు..
“బాబో కరణంగారండి, మీ బాబాయి గారు ఆ గదిలో ఎలా ఉంటున్నారో గాని, అటు పక్కగా వెళ్ళేటప్పుడు చాలా సార్లు నేను గదిలో పాము దూరడం చూశాను. ఇప్పుడు అయితే ఇది మరీ పెద్దగా అనిపిస్తోంది. పాముల వాళ్ళని పిలిపిద్దాం దొరగారు.. ఇటు పక్కగా నడవలేము మాకు భయంగా ఉంటుంది” అంటూ మా వాళ్ళని ప్రాధేయపడసాగారు.

చివరికి అంతా కలిసి పాముల నర్సయ్య ని పిలవాలని నిర్ణయించుకున్నారు.

అక్కడే ఉండి అంతా వింటున్న నేను, బాబాయ్ ఒకసారి ఇలా రండి అని మా బాబాయ్ ని పిలిచాను.
“ఏంటి తల్లి” అంటూ మా బాబాయి నా దగ్గరికి వచ్చారు.
“పాములతను వద్దు ఏమి వద్దు” వినీ వినిపించకుండా సన్నగా గొణిగాను.
అయినా బాబాయ్ కి అర్థం అయిపోయింది. ఏదో సందేహంతో “ఏం రా ఎందుకు వద్దంటున్నావు”
అడిగారు.
“మరేం లేదు, ఆ గీత పాము వెళ్లడం వల్ల ఏర్పడింది కాదు. గోడ మీద మట్టి నెమ్మదిగా రాలుతూ కింద మెత్తటి మట్టి ఉంటే, నేనే సరదాగా అలా గీశాను.”

“అనుకున్నాను రా భడవా! ఎందుకో అంత వెడల్పు గీతం చూడగానే అనుమానం వచ్చింది. కానీ ఎలా అనుకుని ఊరుకోకూడదు కదా అని”

“బొటనవేలితో గీశాను” లోగొంతుకతో చెప్పాను.

ఊళ్లో వాళ్లంతా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అమ్మాయి గోరండి బలే చేశారే అని.

తాతయ్య నా దగ్గరికి వచ్చారు. అంత హంగామా జరగడానికి కారణం కాబట్టి, తాత ఏం కోప్పడినా తప్పేం లేదు అని ఎదురు చూస్తున్నా.
“అల్లరి పిల్ల, అన్నీ తుంటరి పనులే “అని తల నిమిరి
జమాబంది కి వెళ్లి తిరిగి వచ్చిన మా సొంత తాతయ్య తన అన్నయ్య కి విషయం చెప్పడానికి వెళ్లారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!