కనువిప్పు

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

కనువిప్పు

రచన: కమల ముక్కు (కమల’శ్రీ’)

ఓ అడవిలో ఓ కోతుల గుంపు ఉండేది. ఆ గుంపులో మొత్తం పది కోతులు ఉండేవి. ముసలి కోతి రామూ, దాని కొడుకూ, కోడలూ, వారి పిల్లలు ఐదుగురు… వారితో పాటే రాము అన్న పిల్లలు ఇద్దరు. రాము చెప్పిందే అన్ని కోతులకూ వేదం. పెద్ద కోతులను ఆహారం తీసుకురావడానికి పంపి తను పిల్ల కోతులను తమ నివాసం వద్ద జాగ్రత్త గా చూసుకునేది రాము. వాటికి మంచి మంచి నీతి కథలు చెప్పేది. సాయంత్రం మధ్యవయస్సు కోతులు తెచ్చిన ఆహారం అన్నిటికీ సమానం గా పంచి పెట్టేది.

పిల్ల కోతులన్నీ చక్కగా రాము చెప్పే కథలు విని ఆడుకునేవి , ఒక్క చీకూ అనే చిన్ని పిల్లకోతి తప్పించి.

“తాతా! నువ్వేందుకు మమ్మల్ని మా అమ్మా నాన్న లతో పాటే ఆహారం కోసం వెళ్లనీయడం లేదూ. నాకు వారితోపాటే వెళ్లి అన్నీ చూడాలని ఉంది.”అంది చీకూ.

“నువ్వింకా చిన్న వాడివి చీకూ. ఆహారం సంపాదించేంత అనుభవం నీకు ఇంకా రాలేదు. వచ్చాక వాళ్లు నిన్ను తప్పక తీసుకుని వెళ్తారు. అలాగే నీకు బయట ప్రపంచం కోసం ఏమీ తెలీదు.అందుకే నువ్వు ఇక్కడే మీ అన్నలతో పాటే ఉండి హాయిగా నేను చెప్పే కథలు వింటూ, నీ అన్నలతో ఆడుకుంటూ ఉండు.” అని చీకూ కి నచ్చ చెప్పేవాడు రాము.

“అయినా చీకూ మనసులో తన అమ్మా నాన్నలతో కలిసి బయటకు వెళ్లాలి, ఆహారం తీసుకు రావాలి, తన అన్నల కంటే తానే గొప్పవాడు అని అందరూ తనని మెచ్చుకోవాలి. అప్పుడు చిన్నపిల్లాడివి నీకు ఏమీ తెలీదు అని తాత అనకుండా ఉంటాడు.”అన్న ఆలోచనే బలంగా నాటుకుపోయింది.దానిని ఎలాగైనా నిజం చేయాలి అనుకుని అందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. అలాంటి అవకాశం దానికి ఓ రెండు రోజుల తరువాత వచ్చింది.

ఆ రోజు తమ అమ్మవాళ్లు అడవి లోపలికి ఆహారం తీసుకు రావడానికి వెళ్లిపోయాక రాముకి కాస్తా నలతగా ఉండటం తో తను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి పిల్లలను బయట ఆడుకోమంది. అదే అదునుగా భావించిన చీకూ పిగతా పిల్లలతో పాటూ ఆడుకోకుండా తనని ఎవరూ గమనించకుండా అడవిలోపలికి వెళ్లింది.

రోజంతా అడవి మొత్తం కలియ తిరిగి పళ్లు ఏరుకుని నచ్చినవి తింటూ గడిపింది. చీకటి పడే వేళ అయ్యింది. ఇక ఇంటికి తిరిగివెళ్లాలి అనుకుని నడవడం మొదలుపెట్టింది. కాస్త దూరం వెళ్లాక తన ఇంటికి దారిని మర్చిపోయింది చీకూ. ఎలా వెళ్లాలో తెలీక, అక్కడే ఉంటే ఏం ప్రమాదం ముంచుకు అర్ధం కాక ఓ చెట్టు తొర్రలో కూర్చుంది. కాసేపటికి చల్లగాలి ప్రభావం వల్ల కళ్లు నెమ్మదిగా మూతలు పడటం మొదలైంది. అలా కాసేపు కళ్లు మూసుకుంది.

ఏదో అరుపు చెవికి వినపడి ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది. దూరంగా ఏదో అలికిడి. ఆ జంతువు తనవైపే వస్తుంది అన్నదానికి సూచనగా అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించడం మొదలైంది. తొర్రలోని చిన్న కన్నం నుంచి బయటకు చూస్తే ఆ జంతువు కనిపించింది. దాన్ని చూడగానే చీకూ భయంతో ఒళ్లంతా గజ గజా వణకడం మొదలైంది. ఎందుకంటే అది తన తాతయ్య చెప్పే కథల్లోని జంతువుని పోలి ఉంది. చిరుత పులి దాని పేరు… ఆ చెట్టుకు కాస్త దూరం గా నిలబడి చుట్టూ చూస్తుంది.

“హమ్మో! పోయి పోయి చిరుతపులి కి ఆహారం అయ్యేలా ఉన్నానే. అప్పటికీ తాతయ్య చెప్తూనే ఉన్నాడు నువ్వింకా చిన్నాడివే చీకూ అడవిలోకి వెళ్లొద్దు అనీ, కానీ నేనే వినిపించుకోకుండా తుంటరి ఆలోచన చేసి ఒంటరిగా అడవిలోపలికి వచ్చేశాను. తీరా వచ్చాక వెనక్కి వెళ్ళే దారి మర్చిపోయి ఇలా పులికి ఆహారం గా మారిపోతున్నా. అందుకే అంటారు పెద్దవాళ్ల మాటలు వినాలి అని. వినిపించుకోకుండా ఉంటే ఇలాంటి ప్రమాదాలే ఎదురౌతాయి.” అని తనని తానే నిందించుకుని దేవుడా నా తప్పు నేను తెలుసుకున్నా , ఈ ఒక్క గండం నుంచి నన్ను తప్పించు. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయను.” అని కళ్లు మూసుకుని దేవుణ్ణి ప్రార్ధించింది. కాసేపటికి అడుగుల చప్పుడు వినిపించింది కానీ తనకి దూరం అవుతూ, మరికాసేపటికి పూర్తిగా వినిపించడం ఆగిపోయింది.

“అంటే ఆ పులి వెళ్లిపోయిందన్నమాట. రక్షించావు దేవుడా. నాకు కనువిప్పు కలిగింది. ఇంకెప్పుడూ ఇలా ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా అడవి మధ్యలోకి రాను. బుద్దిగా తాతయ్య చెప్పే కథలు వింటూ, అన్నలతో ఆడుకుంటూ, అమ్మానాన్నలు తెచ్చే ఆహారం తింటూ సంతోషం గా గడిపేస్తాను.” కళ్లు మూసుకుని దేవుణ్ణి ప్రార్ధించింది.

ఇక అప్పటినుంచి దానికి కళ్లు మూతలు పడనేలేదు ఏ నిమిషానికి ఏ జంతువు వస్తుందో అనే భయం తో. వేకువజామున కళ్లు చిన్నగా మూతలు పడ్డాయి. కాసేపటికి వెలుగురేఖలు ముఖంపై పడటం తో తెల్లవారింది అనుకుంటూ కళ్లు నెమ్మదిగా తెరిచి ఎలాగోలా తన ఇంటికి వెళ్లాలి అనుకుని వడివడిగా నడుచుకుంటూ ముందుకు వెళ్లింది చీకూ.

కొంతదూరం నడిచేసరికి “చీకూ చీకూ” అంటూ దూరంగా అరుపులు వినపడి పరుగులాంటి నడకతో ఆ అరుపులు వినిపించేవైపు వెళ్లింది. దూరం గా తన అమ్మానాన్నా,తాతయ్యా అన్నయ్యా కుటుంబం మొత్తం వస్తూ కనిపించింది. ఎప్పుడైతే వాళ్లు కనపించారో ఏడుస్తూ వాళ్ళ దగ్గరకు వెళ్లింది.

“ఏంటి చీకూ చెప్పకుండా అలా వెళ్లొచ్చా. నువ్వు కనిపించడం లేదని సాయంత్రం తాతయ్య చెప్పగానే ఎంత కంగారు పడ్డామో తెలుసా. చుట్టంతా వెతికాం. తాతయ్యా, అన్నయ్యలు కంగారు పడిపోయారు.” అని తల్లి దగ్గరకు తీసుకుంది.

నన్ను మన్నించమ్మా. అప్పటికీ తాతయ్య చెప్తూనే ఉన్నారు అడవిలోపలికి వెళ్లడం అంత క్షేమకరం కాదని, అయినా మీ మాట వినకుండా వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడూ మీ మాట మీరి ఏ పనీ చేయను.” అంటూ క్షమాపణ అడిగింది తల్లికి.

అడవి లోపలికి వెళ్లి అంతా చూడాలని అనుకోవడం లో తప్పేమీ లేదు, కానీ నీకింకా ఆ వయసు రాలేదు కాబట్టి నిన్ను మీ అమ్మానాన్నలతో వెళ్లొద్దని చెప్పాను. నేను వద్దు అన్నానని నువ్వు ఒక్కడివే వెళ్లడం తప్పు. పిల్లల్ని ఎందుకు వెళ్లొద్దు అంటామంటే మీకు బయట ఎలా మసులుకోవాలో తెలీదు కాబట్టి, పొరపాటున తప్పిపోతే వెనక్కి తిరిగి రాలేరు కాబట్టి నిన్ను మీ అమ్మానాన్నలతో వెళ్లొద్దని చెప్పాను. నీ తప్పు తెలుసుకున్నావు కదా. ఇంకెప్పుడూ ఇలా ఒంటరిగా ఎక్కడికీ వెళ్లి ప్రయత్నం చేయకు. పదండి ఇంటికి వెళ్దాం.” అంది రాము.

చీకూ దొరికింది అన్న సంతోషం తో అందరూ సతోషం తో ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంకెప్పుడూ ఒంటరిగా వెళ్ళే ప్రయత్నాలు చేయలేదు చీకూ.

నీతి:- పెద్దవాళ్లమాట కాదని పిన్నలు తప్పనిసరిగా పాటించాలి, కాదని తుంటరి ఆలోచనలకు సొంతం గా నిర్ణయాలు తీసుకుంటే చీకూ కి ఎదురైన పరిస్థితే ఎదురౌతుంది. ఒక్కోసారి ఆ పరిస్థితి ప్రాణాపాయం గా మారే అవకాశం కూడా ఉంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!