లవ్ ఎట్ ఫస్ట్ సైట్

(అంశం:” తుంటరి ఆలోచనలు”)

లవ్ ఎట్ ఫస్ట్ సైట్

రచన: శ్రీదేవి విన్నకోట

“అదే అదే వింత తెలియకున్నది”ఏంటో ఏమైందో
నా ఒంటరి మనసుకి ఈ వేళ ఓ తుంటరి కోరిక చెలరేగుతున్నది, తోడు కోసం నా మనసు తహతహ లాడుతున్నది, చెలియ కోసం ఆరాటపడుతున్నది. అని సన్నగా హమ్ చేస్తూ ఇంట్లోనే సిస్టంలో ఆఫీస్  వర్క్ చేసుకుంటున్నాడు ప్రణీత్, అతని వయసు 26 ఏళ్లు, అతను ఒక పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రస్తుతానికి లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు,అతనిది ఒక పల్లెటూరు, కుటుంబం అంతా పల్లెటూరు లోనే ఉంటుంది అతను ఒక్కడే
ఈ మహానగరంలో రూమ్ రెంట్ కి తీసుకుని ఉంటున్నాడు, అతనికి దేవుని మీద భక్తి ఎక్కువ కొంచం భావుకత సున్నితత్వం కూడా ఎక్కువే అతనికి . చూడ్డానికి హిందీ సినిమా హిరోలా ఉంటాడు, కాస్త మొహమాటం మనిషి.

వాళ్ళ వీధి చివర్లోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఐదు నిమిషాల నడక దూరం అంతే, ప్రణీత్ ఎక్కువగా ఆ గుడికి వెళుతూ ఉంటాడు నడిచి కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు,

అలాగే ఈ రోజు  శనివారం కావడంతో తల స్నానం చేసి, గుడికి బయలుదేరాడు, అతను నడుస్తూ వెళ్తుంటే ముందు లంగా ఓణి లో సంప్రదాయబద్దంగా ఉన్న ఒక అమ్మాయి గుడికి వెళ్తుంది, ఆమె చేతిలో పూలు కొబ్బరికాయ అరటి పళ్ళు ఉన్న చిన్న వెదురుతో చేసిన పూలసజ్జ వుంది, వెనుక నుంచి చూస్తుంటే ఆమె చాలా బాగుంది, ముఖ్యంగా ఆమె జడ చాలా పొడవుగా ఆమె నడుస్తున్నప్పుడు నడుము మీద నుంచి కిందకి జారీ వయ్యారంగా అటూ ఇటూ కదులుతూ, వావ్ ఈ అమ్మాయి ఎవరో సూపర్ గా ఉందే అనుకున్నాడు ప్రణీత్ తన మనసులో, ఇంత వరకు అంత పెద్ద జడ  ఉన్న అమ్మాయిని చూడలేదు రియల్ గా,

ఆమె ఎందుకో వెనక్కి తిరిగి చూసింది, ఆడవాళ్ళలో ఉండే గొప్ప  ఆర్ట్ అదే, ఎవరైనా తమని
గమనిస్తున్నట్టు తెలిస్తే చూడకపోయినా వారికి తెలిసిపోతుంది, అదే ఎలానో తనకు ఇప్పటికీ అర్థం కాదు, వాళ్లకి వెనకాల కూడా కళ్ళు ఉంటాయేమో అనుకున్నాదు,తన వెనకే వస్తున్న ప్రణీత్ ని చూడగానే ఆమె మొహం కోపంతో ఎర్రబడింది, వీడెవడు నా వెంట వస్తున్నాడు అన్నట్టుగా కోపంగా ఓ చూపు విసిరేసి మొహం పక్కకు తిప్పేసుకుంది, నడకలో వేగాన్ని పెంచింది, ఇక అసలు మళ్లీ పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడలేదు.
అలాగే ఇద్దరూ ఒకరి వెనుక ఒకరు గుడికి చేరారు.

ప్రదక్షిణలు కూడా ఒకరి వెనుక ఒకరు తిరుగుతూ చేశారు, ప్రణీత్ ఎప్పుడు మూడు సార్లు మాత్రమే తిరుగుతాడు, కానీ ఆమె 11 సార్లు తిరిగింది అతను కూడా ఆమెతో పాటు తిరుగుతూనే ఉన్నాడు, తను చూడడం మానేస్తే ఆమె ఎక్కడ మిస్ అయిపోతుందో అనే, ఆరాటం అతనిలో ఆమెతో  మాట్లాడాలి అని ఎంతగానో అనిపిస్తుంది,

తర్వాత దేవుని దర్శనం చేసుకుని వచ్చి మండపంలో కూర్చున్నారు, ప్రణీత్ కొబ్బరికాయ పూలు ఏమి తీసుకు రాలేదు,.హుండీ లో డబ్బులు వేసి దండం పెట్టుకుని వచ్చేసాడు, అతను ఆమెనే చూస్తూ కూర్చున్నాడు, రంగు చామన చాయ అయినా చాలా కళ గా చిరు నవ్వు మొహంతో చాలా నచ్చేసింది ప్రణీత్ కి, బాపు అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది, కొంపతీసి పెళ్లి అయిపోయిందా ఏంటి అనే అనుమానంతో ఆమె పాదాల వంక చూసాడు మెట్టెలు ఉన్నాయేమో అని లేవు, అలాగే కుంకుమ కొంచం చిన్నగా నుదుటి మీద పెట్టుకుంది కానీ  పాపిట్లో లేదు,

సో ఆమె కి పెళ్లి అవలేదు అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాడు ప్రణీత్, ఆమె తో ఒకసారి మాట్లాడాలి ఎలా ఏం చేయాలి అనుకుంటూ, ఆమె ఇంటికి బయల్దేరడంతో తను ఆమెను అనుసరించాడు.
పాదమెటు పోతున్నా నీ వెంటే నేను అని సన్నగా ఆమెకు వినిపించేలా పాడుకుంటూ  ఆమెను అనుసరించాడు ప్రణీత్,

ఆమె పేరు ఏంటో ఏమో ఆమెది ఏ పేరు అయినా సరే ఆమె తన స్వీట్ హార్ట్ కాబట్టి స్వీటీ అని ముద్దుగా పిలుచుకోవచ్చు అతని ఆలోచనలు జెట్ స్పీడ్ లో పయనిస్తున్నాయి, మళ్లీ అతనికి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే సామెత కూడా గుర్తొచ్చింది,అలా ఆలోచిస్తూ నడుస్తూనే ఆమె వెనకే ఇంటి దగ్గరికి వచ్చేసాడు.

ఆమె తన ఇల్లు దాటి పోయిన తర్వాత మరో మూడిళ్ల అవతల ఉన్న అమృత నిలయం అనే పేరు ఉన్న అపార్ట్మెంట్స్ కి వెళ్ళింది, తాను ఇన్ని రోజుల నుంచి గమనించలేదు ఇక్కడా  తన ఇల్లు అనుకుంటూ తన పేరు తెలిస్తే బావున్ను, ఎలాగైనా పరిచయం పెంచుకునీ వాళ్ళ పెద్ద వాళ్ళతో మాట్లాడి తనని సొంతం చేసుకునే వాడిని అనుకున్నాడు,

లోపలికి వచ్చేసి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసుకుని తిన్న చేసిన తర్వాత సిస్టం ముందు కూర్చుంటే ఇప్పుడు అతని తుంటరి మనసు వర్క్ గురించి కాదు, ఆమె గురించి తప్ప మరేమీ ఆలోచించని మొరాయిస్తుంది, ఏమైతే అదే అయింది అని నీటుగా రెడీ అయ్యి ఆ అపార్ట్ మెంట్ కి వెళ్ళాడు, వాచ్ మెన్ ఎవరు కావాలి అని అడిగాడు. అక్కడే బోర్డు మీద ఉన్న పేర్లన్నీ చూస్తూ రిటైర్డ్ టీచర్ పరంధామయ్యగారు కావాలి అంటూ  అబద్దం అడాడు ప్రణీత్,

వాళ్ళు థర్డ్ ఫ్లోర్  లో ఉంటారు, 215 వాళ్ళ హౌస్ నెంబర్ అంటూ చెప్పాడు వాచ్ మెన్, సరే అంటూ లిఫ్ట్  లో పైకి వచ్చేసాడు,

మెల్లిగా ఆమె ఎక్కడైనా కనిపిస్తుందేమో అని వెతకసాగాడు, చాలావరకు తలుపులు మూసే ఉన్నాయి, ఇలా వెతకడం టైం వేస్ట్, దొరకకపోవచ్చు పైగా అందరికీ తన ప్రవర్తన మీద అనుమానాలు వస్తాయి, ఏ దొంగో అనుకునే ప్రమాదం కూడా ఉంది, ఆ అమ్మాయి బయటికి వచ్చినప్పుడు మాత్రమే పట్టుకోవాలి, తనకి ఆ పిల్ల మీద కూడా కోపం వస్తుంది, తను ఆమె వైపు చూస్తున్నాడు అని తెలుసు కదా కనీసం ఒక్క మాట మాట్లాడొచ్చు, నవ్వనైనా నవ్వలేదు, అందంగా ఉన్నాననే పొగరు, ఆమెను ముద్దుగా తిట్టుకుంటూనే ఎక్కడైనా కనిపిస్తుందేమో అన్నట్టుగా తన కళ్ళ తోటే వెతుకుతున్నాడు,

10 ప్లోర్స్ ఉన్న పెద్ద అపార్ట్మెంట్ అది, చాలా ఇళ్లు ఉన్నాయి, బాగా పైకి వచ్చేసాడు టెర్రస్ మీదకి, చాలా పెద్ద వాటర్ ట్యాంక్, ఏవో చాలా పనికిరాని వస్తువులు చాలా మొక్కలు కుండీల్లో ఉన్నాయి, ఒక కుండీలో గులాబీ మొక్కకి ఎర్ర గులాబీలు రెండు విచ్చుకుని ఉన్నాయి చాలా అందంగా, ప్రణీత్ కి వాటిని చూడగానే ముట్టుకోవాలి అనిపించింది, ఆ గులాబీ పూల దగ్గరికి వెళ్లి వాటిని తన చేత్తో పట్టుకున్నాడు, హేయ్ ఎవర్రా నువ్వు మా చెట్టు పూలు కోస్తున్నావ్ ఇడియట్ అంటూ కోమలమైన గొంతు వినేసరికి గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు ఇప్పటివరకు తాను వెతుకుతున్న అమ్మాయే వచ్చింది, జడని ముందుకు వేసుకుని, నడుము మీద చేతులు ఉంచుకుని తన వంక కోపంగా చూస్తుంది, అతను ఆమెనీ చూసిన కంగారు లో గబుక్కున గులాబీ కాడని ముల్లు తో సహా గట్టిగా పట్టుకున్నాడు, ముల్లు కసుక్కున వేలికి గుచ్చుకోవడంతో అబ్బా అంటూ గులాబీ పూలను వదిలేశాడు.

నేను నిన్ను చూసిన అప్పుడే అనుకున్నా, నేను గుడికి వెళ్తున్నప్పుడే నువ్వు నా వంకే కళ్ళప్పగించి చూస్తూ ఉంటే పెద్ద పోకిరి గాడీవి అని ముందే అనుమానం వచ్చింది.ఇప్పుడు మా ఇంటి వరకు వచ్చేసావా, ఆమె తిడుతుంటే అతనికి చెవుల్లో అమృతం పోసుకున్నంత హాయిగా ఉంది.

నా పేరు ప్రణీత్, నేను ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్నీ, నిన్ను చూడగానే నచ్చేసావ్, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగని భావన నిన్ను చూడగానే కలిగింది, నువ్వు నా సొంతం అయితే బాగుండు అనిపించింది, అందుకే నువ్వు
ఈ అపార్ట్మెంట్ లోకి రావడం చూసి నిన్ను వెతుకుతూ వచ్చేశాను, చూసిన మొదటి చూపులోనే ప్రేమ ఎంటి అని నువ్వు ప్రశ్నిస్తే నేను చెప్పలేను కానీ దానికి సరైన సమాధానం,

కానీ నిన్ను చూడగానే ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు, నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి అన్నట్టు అనిపించింది, ప్లీజ్ అర్థం చేసుకో బంగారం
అంటూ ప్రణీత్ చెప్తుంటే, ఓహ్ అవునా అలా కూడా జరుగుతుందా, సినిమా ల్లో డైలాగులు అన్నీ బట్టి పట్టేసి నాకు బాగానే చెప్తున్నావు అంది వెటకారంగా నవ్వుతూ ఆ అమ్మాయి.

నీ పేరేంటి,అని అతను అడిగితే ఏమో మర్చిపోయా గుర్తులేదు కోపంగా చెప్పింది, మీ పెద్ద వాళ్లతో మాట్లాడుతాను, నాకు ఒక్క రూపాయి కట్న కానుకలు అక్కర్లేదు నిన్ను అచ్చంగా కట్టు బట్టలతో నాకు ఇచ్చేస్తే చాలు, నిన్ను నా గుండెల్లో పెట్టుకొని
నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అతని గొంతులోని నిజాయితీ అతని కళ్ళల్లో తన పట్ల అతనికి తొలిచూపు లోనే నిజంగానే ప్రేమ కలిగింది అనేది ఆమెకు అర్థమవుతుంది,

చెప్పు ప్లీజ్ బంగారం నీ పేరేంటి అడిగాడు మళ్ళీ బ్రతిమాలుతున్నట్టుగా, మా ఇంట్లో ఎవరికి ప్రేమ వివాహం ఇష్టం ఉండదు, పెద్దలు చూసి కుదిర్చిన పెళ్లి మాత్రమే చేస్తారు చెప్పింది ఆమె, అయితే మీ పెద్దవాళ్ళని అడుగుతాను ఆతృతగా అన్నాడు అతను, అతని వైపు వెక్కిరింపుగా చూసి నవ్వి మా వాళ్లు నాకు ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు అంది చిలిపిగా, ఎం నేను నీకు నచ్చలేదా జాలిగా బాధగా అడిగాడు ప్రణీత్. ఆమెకి ఇక అతన్ని ఏడిపించ కూడదు అనిపించింది, సరే మీరు నాకు నచ్చారు, కానీ చూసిన మొదటి సారే  ప్రేమా దోమా అంటూ ఇలాంటి కబుర్లు నేను చెప్పలేను,కానీ  ఇరువైపుల పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఇష్టపడి ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. మీరు ముందు మీ పెద్ద వాళ్ళని ఒప్పించండి, ఆ తర్వాత మా ఇంటికి తీసుకురండి మా పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి, అది కూడా మీరు నేను చూడగానే నచ్చేసాను అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని చూడగానే నాకు అంతగా ప్రేమ కలగకపోయినా నా పట్ల మీకు కలిగింది కదా, అందుకే మీ ఇష్టాన్ని గౌరవిస్తున్నాను అంటూ కొంచెం సిగ్గు పడింది,

సరే మీ నాన్నగారి  పేరేమిటి, అతని కళ్ళల్లో కొండంత సంబరం, తొలిసారిగా తను ప్రేమతో కోరుకున్నది కావాలి అనుకుని వెంట పడిన అమ్మాయి తన సొంతం అవుతున్నందుకు, మా నాన్న గారి పేరు వేణుగోపాల్ గారు, కానీ  కింద బోర్డు లో
మా తాతయ్య పేరు ఉంటుంది ఆయన పేరు పరంధామయ్యగారు మా తాతయ్య, మా హౌస్ నెంబర్ 215 అని చెప్తూ వెళ్ళిపోబోయింది,

నేను పైకి కింద బోర్డు లో చూసి వాచ్మెన్ కి ఆ పేరు చెప్పే లోపలికి వచ్చా అంటూ, హేయ్ అన్ని చెప్పావు నీ పేరు ఫోన్ నెంబర్ చెప్పి వెళ్ళు అన్నాడు ప్రణీత్,
నా పేరు ప్రవీణ అంటూ, ఫోన్ నెంబర్ ఇప్పుడు కాదు మీరు మీరు మా పెద్ద వాళ్లతో మాట్లాడిన తర్వాత వాళ్లు మన పెళ్ళికి ఒప్పుకున్నాక అప్పుడు నా ఫోన్ నెంబర్ ఇస్తాను సరేనా అని చిలిపిగా అంటున్న ఆమెని అపురూపంగా చూసుకుంటూ, రెండు గులాబీలు తుంచి ప్రేమగా  ఐ లవ్ యు  వీణ
మై స్వీట్ హార్ట్ అంటూ ఆమె చేతిలో పెట్టాడు ప్రణీత్.

ఆ గులాబీలు తీసుకుని తుర్రుమంటూ కిందకి పారిపోయింది సిగ్గుపడుతూ వీణ, ఇక ప్రణీత్ సంతోషంగా తన ఇంటి దారి పట్టాడు తన ప్రేమ సఫలం అయినందుకు సంతోషిస్తూ, అమ్మ నాన్నలు తన మాట ఎప్పుడూ కాదనరు. ఈ విషయం చెప్పి అర్జంట్ గా రమ్మని  చెప్పాలి వాళ్లకి, అనుకుంటు తమకు పెళ్లయితే ఆ తర్వాత జరగబోయే మధురమైన సంగతులు తలుచుకుంటూ ఊహాలోకంలో విహరించ సాగాడు ప్రణీత్.

You May Also Like

One thought on “లవ్ ఎట్ ఫస్ట్ సైట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!