వానర సైన్యం (సంక్రాంతి కథల పోటీ)

వానర సైన్యం

(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ – 2022)

రచన: సూర్యదేవర స్వాతి

“ఒరేయ్ ……ఒరేయ్ బుజ్జిగా… ఎక్కడున్నావు రా..!? ఈ కోతులు నా వడియాలు మొత్తం తినేస్తున్నాయి . తొందరగా రా..రా…వెధవ” అంటూ అరుస్తూ వచ్చి బయట తను ఆరబెట్టుకున్న వడియాలను పాడుచేస్తున్న కోతులని “హుష్…హుష్..పో… ” అంటూ అరుస్తూ గెదిమింది కాంతమ్మ!.

కాంతమ్మ  అరుపులకి అవి పళ్ళు బయటపెట్టి మీదకి రాబోవడంతో కోపంగా పక్కనే ఉన్న  కర్ర చేతపట్టుకొని “ఏక్కడకే నువ్వు మీదకి వచ్చేది దొంగదానా” అంటూ కర్రని మంచానికి వేసి ఒక్కటి చరిచింది.అంతే ఆమె చేసిన శబ్దానికి అక్కడ ఉన్న కోతులు మొత్తం పారిపోయాయి.

“వెధవ సంత వెధవ సంతానీ…చచ్చిపోతున్నాం వీటితో…ఏ వస్తువు బయట ఆరబెట్టుకొనేది లేదు.హాయిగా బయటికొచ్చి ఏమి తినేది లేదు.చంపుకుతింటున్నాయి..పాడు మంద..పాడు మందనీ…” అని తిట్టుకుంటూ మిగిలిన వడియాలు సరిచేస్తు ఉంది.

తీరిగ్గా అక్కడికి వచ్చిన పదేళ్ల బుజ్జిగాడు ఆవిడ నోటి సుప్రభాతం విని “ఏమైందే బామ్మ ఎందుకు తిడుతున్నావు?ఎవరిని తిడుతున్నావు?” అని అడిగాడు అయోమయంగా..

“ఇంకెవరిని రా….ఆ వానర సైన్యాన్ని..అయిన నిన్ను ఈ వడియాల మంచానికి కాపలా పెట్టాగా ఎక్కడికి అఘోరించావ్…?”అని గయ్యిమంది.

ఆమె అరుపుకి దడిచి ఏడుపు మొహంతో.. “ఎక్కడికి వెళ్ళలేదు బామ్మ ఆ సంతూ గాడు ఆడుకుందాం రా…అంటే చుట్టుపక్కల ఎక్కడ కోతులు లేవులే అని వెళ్ళాను” అని భయం భయంగా బదులిచ్చాడు.

“కోతులేమైన నీ చుట్టాలేమిట్రా … చెప్పి రావడానికి,నీకు కనపడేలా కూర్చోవడానికి…ఇంకోసారి ఈ మంచం వదిలి ఇక్కడినుండి  కదిలావో సాయంత్రం ఇస్తానన్న ఆ రూపాయి సంగతేమో కానీ,నీ కాళ్ళు రెండు విరగొట్టి పొయ్యిలో పెడతాను నీ ఇష్టం” అని అరిచి ఇంట్లోకి పోయింది.

ఏడుపు మొహంతో “అబ్బా..ఎం కోతులో ఇప్పుడే రావాలా!? ఇక్కడ ఉన్నంతసేపు ఒక్కటికూడా కనపడలేదు అటు పోగానే ఉరికొచ్చాయి” అని తిట్టుకుంటూ అక్కడ చెట్టు కింద బామ్మ వేసిన మంచం మీద కూర్చున్నాడు.

‘అరేయ్ బుజ్జిగా మంచినీళ్లు తాగొస్తా అని చెప్పి ఇక్కడే కూర్చున్నావేంటి రా…?రా…అడుకుందాం.”

“వామ్మో నేను రానురా సంతూ..సాయంత్రం అడుకుందాం లే…ఇప్పుడే కోతులు వచ్చి వడియాలు పాడుచేసాయి అంట మా బామ్మ నన్ను తిట్టింది.నువ్వేళ్ళు సాయంత్రం నేనే వస్తా…” అని దిగులుగా చెప్పాడు.

“సరేలే నేను కూడా నీకు తోడుగా ఇక్కడే ఉంటా…”

“హుమ్ కూర్చో” అంటూ తన పక్కన  తన స్నేహితుడికి చోటు కోసం జరిగి కూర్చున్నాడు మొహం వేలాడేసి.బుజ్జి మొహం చూసి “ఎందుకురా అలా ఉన్నావు?”

“ఎం లేదురా…ఆదివారం కూడా ఆడుకోవడానికి లేదు బామ్మేమో రూపాయి ఇస్తా కూర్చో అన్నది కానీ నాకేమో ఇలా కూర్చోవడం నచ్చలేదు.వెళదాం అంటే కొడుతుందేమో అని భయం.చ్చ ఈ పాడు కోతులు ఇన్ని రోజులు లేవు ఇప్పుడెక్కడనుండి వచ్చాయో ఎంటో”

“హుమ్ నిజమేరా…అప్పుడెప్పుడో ఎండాకాలంలో వచ్చాయి ఇక పోనే పోవట్లేదు.మా పెరట్లో చెట్లకి ఉన్న కాయలు అన్ని తినేస్తున్నాయి.లేకపోతే పాడు చేస్తున్నాయి.నిన్న మా అమ్మ కొబ్బరి మిఠాయి ఇస్తే అలా తినడానికి బయట కూర్చున్నానో లేదో ఇలా నా మీద పడి లాక్కెళ్లిపోయింది కోతి” అని ఊసురుమంటూ చెప్పాడు సంతూ..

“ఏంట్రా అడుకుందాం అని నన్ను పిలిచి మీరిద్దరూ ఇక్కడ కూర్చున్నారు ” అంటూ వచ్చాడు తరుణ్

“ఎం లేదురా…” అంటూ వాళ్ళు మాట్లాడుకున్నవి చెప్పారు ఇద్దరు.

“ఆ కోతులు రావడానికి  కారణం నాకు తెలుసు రా…నిన్న మా అమ్మ చెప్పింది నాకు” అని ఒక గొప్ప విషయం తనకే తెలుసు అన్నట్టు హావభావాలు పెట్టాడు తరుణ్.

“తెలుసా… ఎం తెలుసు రా నీకు…?” అని అడిగాడు సంతూ..ఆత్రంగా.

“ఒరేయ్ మీకు  మన ఊర్లో నుంచి దూరంగా ఒక కొండ కనిపిస్తుంది తెలుసు కదా!?”

“హ తెలుసు” అన్నారు ఇద్దరు ఒకేసారి ఆసక్తిగా

“హ…ఆ కొండ ఇప్పుడు చాలా చిన్నదిగా ఉంది కదా…”

“ఇప్పుడేంటి రా..ఎప్పటినుండో అలానే ఉంది కదా..”అని అని అడిగాడు మొహం చిట్లించి బుజ్జిగాడు.

తల కొట్టుకుంటూ…”అయితే మీకు ఇది కూడా తెలియదనుకుంటా…మా నాన్న వాళ్ల చిన్నప్పుడు ఆ కొండ మన ఊరికి ఆనుకోని ఉండేదట…అందరూ ఇల్లు కట్టుకోవాలని,పొలాలు చేసుకొని ,ఇంకా మట్టి కావాలని,కట్టెల కోసమని,ఇంకా మన చాలా అవసరాలకు అక్కడ వుండే చెట్లన్నీ కొట్టేసి ఆ కొండ అంతా తవ్వేసారట…అప్పట్లో ఈ కోతులన్ని ఆ కొOడపైనే ఉండేవి అంట.కానీ ఇప్పుడు ఆ కొండ మొత్తం తవ్వేసరికి వాటికి తినడానికి లేక,తాగడానికి నీళ్లు లేక ఇలా ఊర్లోకి వచ్చాయి అంట.అందుకే ఇవన్నీ ఇలా  మనం వేసుకున్న చెట్లకాయలు,ఇలా బయట పెట్టుకున్న తినేవాటిని అన్ని ఆగం చేస్తున్నాయంట మా అమ్మ చెప్పింది”

తరుణ్ చెప్పినది విన్న ఇద్దరు కళ్ళు పెద్దవి చేసి “నిజమా” అని ఆశ్చర్యంగా అడిగారు.

“హ.అవును రా….మనుషులు వాళ్ళ అవసరాల కోసం అడువులని,కొండలని పాడు చేస్తుంటే పాపం అందులో వుండే జంతువులు అన్ని ఇలా మనుషుల మధ్యకి వచ్చి తినడానికి ఏమి దొరక్క ఇలా చేస్తున్నాయి అంట.”

“అయ్యో పాపం రా…ఒక్క పూట అన్నం లేకపోతేనే మనం ఆకలేసి ఏడుస్తాం. కానీ అవి ఎలా తట్టుకుంటాయో కదా…పాపం వాటికి బుజ్జి బుజ్జి పిల్లలు కూడా ఉంటాయి.”

“అవును రా బుజ్జి నిజమే!” అలా అనుకోగానే ఆ కల్మషం లేని పసిహృదయలు మూడు ద్రవించాయి.

ఆలోచిస్తూ కుర్చీన్న ముగ్గురిలో కాస్త దూరంగా వడియాలు వైపే  చూస్తున్న రెండు కోతులు కనిపించాయి బుజ్జికి

“అరేయ్ సంతూ,తరుణ్ అక్కడ పాపం రెండు కోతులు ఈ వడియాలు వైపే చూస్తున్నాయి చూడు…” అని చూపించాడు వాటి వైపు.

“అవునురా బుజ్జి పాపం వాటికి ఆకాలేస్తుందేమో!”

“అనుకుంటా సంతూ…చూడు వాటి దగ్గర ఇంకో రెండు చిన్నపిల్లలు కూడా ఉన్నాయి.”

“అవును రా పాపం…” అని ఉపాయం వెలిగినట్టు..”అరేయ్ తురుణ్,సంతూ…మనం ఇక్కడ ఉంటే అవి రావురా…పాపం వాటికి ఆకలిగా వుందేమో మనం ఆ పక్కకెళ్లి దాక్కొని వాటిని చూద్దాం. అవి వచ్చి ఈ వడియాలు తింటాయి..సరేనా…” అని బుజ్జిగాడు చెప్పగానే మిగతా ఇద్దరు ఆనందంగా “అలాగేరా బుజ్జి..పదా వెళ్దాం…” అనగానే ముగ్గురు మంచం పై నుంచి లేచారు…

“ఒరేయ్ బుజ్జి మనం వెళ్లిపోగానే మీ బామ్మ వస్తే ఎలాగరా..మళ్ళీ నిన్ను కొడుతుందేమో…!?”

“అవును రోయ్…అది నిజమే మరి ఎలా?”

“అసలు మీ బామ్మ ఎం చేస్తుందో చూడు ముందు”

“హ.వుండు చూస్తా..” అని ఇంట్లోకి తొంగిచూసిన బుజ్జికి బఠాణీలు తింటూ టి.వి చూస్తున్న వాళ్ళ బామ్మ కనపడగానే కోపం వచ్చి..”అరేయ్ మా బామ్మ కోతులు రెండు వడియాలు తింటే ఊర్కోలేదు కానీ,ఆమె అక్కడ కూర్చొని ఎంచక్కా బఠాణీలు మెక్కుతుంది.”

“వాటికి తినడానికి చద్దన్నం కూడా పెట్టరు కానీ, వాటికి తిండి లేకుండా చేసి వీళ్ళు మాత్రం బాగా తింటారు” అని కోపంగా ముక్కులు ఎగరేశాడు సంతూ…

“రేయ్ మెల్లిగా అరవండి. పదండి మనం ఆ పక్కకి వెళ్లి మెల్లిగా మీ బామ్మ బయటికి రాకుండా తలుపు వేసేద్దాం” అని తరుణ్ అనగానే సరే అని పిల్లుల్లా వెళ్లి కాంతమ్మ కి తెలియకుండా తలుపు వేశారు ఆమె బయటికి రాకుండా…

‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకొని పదండి అని సైగ చేసుకొని ముగ్గురు వెళ్లి కాస్త పక్కగా వడియాలు మంచం కనపడేలా గోడ చాటున దాక్కొని చూడసాగారు.

కాసేపటికి మెల్లిగా అక్కడికి వచ్చిన కోతులు  వడియాలను ఒక పట్టు పట్టె పనిలో పడ్డాయి.వాటిని చూసి వీళ్ళు ముగ్గురు బాగా తినండి అంటూ నవ్వుకుంటూ చూస్తున్నారు.

అప్పుడే పెరట్లో పని చేసుకొని వాకిట్లోకి వస్తున్న బిజ్జిగాడి తల్లి వీళ్ళేం చేస్తున్నారో అర్ధంకాక మెల్లిగా వాళ్ళ పక్కకొచ్చి వంగోని ,వాళ్ళు చూసే వైపు చూసి ఖంగుతిని “హే పో…పో…” అంటూ కోతులన్ని  గద్ధించుకుంటు మంచం దగ్గరికి పరిగెత్తింది.

“అయ్యయ్యో మా అమ్మ అప్పుడే వచ్చేసిందిరా..అవి సగం కూడా తినలేదు,పాపం వాటి కడుపు నిండిందో లేదో…”అని జాలిగా వాటి వైపు చూసాడు బుజ్జి

“అవును రా..పాపం” అంటూ జాలిగా చూసారు  మిగతా ఇద్దరు కూడా…

బుజ్జిగాడి తల్లి అరుపులకి తలుపు తీసుకొని వచ్చిన కాంతమ్మ ,కోడలి ద్వారా విషయం తెలుసుకుని కోపంగా “బుజ్జి బుజ్జి” అని గట్టిగా కేకలు వేసింది.తేలుకుట్టిన దొంగల్లా ముగ్గురు కాంతమ్మ ముందుకు వచ్చి నిలబడ్డారు..

“ఏంట్రా మీరు చేసిన పని” అని  బుజ్జి గాడిని కొట్టడానికి వెళ్ళింది.

“మేమేం తప్పు చేయలేదు బామ్మ వాటికి ఆకలేసిందని వడియాలు పెట్టాం” అని అప్పటికే జడిసిన ముగ్గురు బెక్కుతూ చెప్పారు.

ఆశ్చర్యంగా అంతకంటే కోపంగా “ఏరా..వాటికి ఆకలవుతుందని మీతో అవి వచ్చి చెప్పయా…వెధవల్లరా…”అని అరిచింది.

“లేదు బామ్మ మేమే అనుకున్నాం ” అని చెప్పాడు సంతూ..

“ఏమనుకున్నార్రా…” అని వెటకారంగా అడిగింది కాంతమ్మ.

“మరేమో..మేము..” అని ముగ్గురు మాట్లాడుకున్నవి,కోతులకి వడియాలు తినడానికి అవకాశం ఇచ్చింది చెప్పారు.

మొదట కోతులు వదిలినందుకు కోపం వచ్చిన..మలినం లేని పిల్లల మనసుకి, ఆలోచనకు ఎం మాట్లాడలేకపోయారు ఆ అత్తకొడళ్లు.

“సరేలే అత్తయ్య…అయ్యిందేదో అయిపోయింది తెలియక చేశారు ఇక వదిలేయండి.నేను ఇవి పడేస్తాను మట్టి కాళ్లతో మొత్తం తొక్కేసాయి..”అని పిల్లల వైపు చూసి “మీరెల్లి ఆడుకోండి రా.” అని చెప్పింది.

“ఏంటి వాళ్ళు చేసిన పనికి రెండు దెబ్బలేయకుండా వదిలేయమంటావు. ” అని కయ్యిమంది కాంతమ్మ.

“మరేం చేస్తారు అత్థయ్య..వాళ్ళు పాపం మంచి చేయాలి అనుకున్నారు. వాటి ఆకలి చూసారు అంతే కదా..అయిన పిల్లలు అనుకున్న దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు.”

“సరిపోయింది తప్పుచేస్తే మందలించకుండా వాళ్ళకి వత్తాసు పలుకుతున్నావు. ఆ వానర సైన్యానికి వీళ్ళు ఒక వత్తాసు అయితే,ఈ వానర సైన్యానికి నువ్వు ఇంకా వూతం ఇస్తున్నావు.” అని రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది కాంతమ్మ.

బుజ్జిగాడి తల్లి కోప్పడకపోయేసరికి  హమ్మయ్య అనుకున్నారు ముగ్గురు.

“ఒరేయ్ నాన్న..కోతులకి ఎమన్నా పెట్టాలి అనుకుంటే వాటికి దగ్గరగా వేస్తే అవి తీసుకొని తింటాయి. ఇలా మనం తినే ఆహారాన్ని కూడా పాడుచేసుకోకూడదు. ఇకనుంచి ఎప్పుడైన వాటికి ఎమన్నా పెట్టాలి అనిపిస్తే వాటికి దగ్గరగా తీసుకెళ్లి కొంత వేయండి.కానీ ఇలా చేయకండి” అని మెత్తగా వాళ్ళని మందలించి “సరే ఇక వెళ్లి అడుకోపొండి” అని చెప్పింది.

ఆమె మాటలకి ఆనందంగా  సరేనన్నట్టు తల ఊపి పరిగెత్తుకుంటూ ఆటకి వెళ్లిపోయారు ముగ్గురు.

వెళ్తున్న ముగ్గురిని చూసి నవ్వుకుంది ఆ తల్లి.

పిల్లల మనసులు మెత్తన, వాటికి ఏవి మంచి అనిపిస్తే అవి చేసేస్తాయి. మనకి మంచా, చెడా అన్నవి ఆ వయసుకి పట్టవు. తప్పు చేసినప్పుడు, మంచి చెప్పేటప్పుడు కాస్త ఆలోచించి పిల్లలకు చెప్పడం ఉత్తమం.

★★★★★★★

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!