వెలుగు…నీడలు

వెలుగు…నీడలు

రచన:: యువశ్రీ బీర

తూరుపు సూరీడు నిద్రలేవకముందే ఆకాశపు కాన్వాసు అక్కడక్కడా అరుణవర్ణం పులుముకుంటుంది. ఆ ఇంట్లో పార్వతమ్మ గారు నిద్రలేచి, గేదెల చావిడి శుభ్రం చేసి, ఇంటికి నలుచెరగులా ఉన్న పెద్ద వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి సూర్యునిరాకకోసమా అన్నట్లు ముత్యాల ముగ్గులతో స్వాగతం పలుకుతుంది. ఆ వాకిట్లో ముగ్గులు చూస్తూవుంటే అందానికి అద్దంపడుతున్నట్లు ఉంటుంది. అటుగా వెళ్లేవారు ఓ కన్ను అటువేయకుండా ఆ అందాల ముగ్గులను ఆస్వాదించకుండా ఉండలేనంతగా, ఇలాంటి ఇల్లాలిని చూసే సామెతలొచ్చాయేమో అనిపిస్తుంది నాకైతే. అదేనండీ “ఇల్లును చూసి ఇల్లాలిని చూడమనే సామెత”. అవునుకదా ! ఇంటి ఇల్లాలు అంటేనే అంత. ఇంట్లో ఇల్లాలికి ఎంత ఓపికనిచ్చాడో ఆ భగవంతుడు. “ఆ రెండు చేతులు దశ కరములా అన్నట్లు” ఇంటిల్లిపాదికీ అన్నీ సమకూర్చుతుంది. ఆ కోవకు చెందినదే ఈ పార్వతమ్మ గారు.

తనలో సగమైన భర్త పరాంకుశయ్య మంచి పండితుడు. ఆ ఊరిలో ఆయన చెప్పినదే వేదం. ఎంతటి సమస్యనైనా చిటికెలో తేల్చగల సమర్థుడు. ఈయనగారికి మాత్రం ఇంటిపనుల్లో ఏమాత్రం అనుభవంలేదు. ఏ వస్తువు కావాలన్నా పార్వతమ్మగారు లేసిరావాల్సిందే. లేదంటే ఇల్లు మొత్తం చిందరవందరగా చేస్తాడు. “ఈ దంపతులకు కలిగిన ఒక్కగానొక్క కూతురు వెన్నెల” పేరుకు తగ్గట్టే చల్లని వెలుగులు పంచే మనసున్న మారాణి.
పదో తరగతి చదువుతుంది. బాగా చదువుతుంది, అయినా ట్యూషన్ కి కూడా వెళుతుంది. అందమూ చదువూ రెండూ కలబోసిన వెన్నెలంటే ఆవూరిలో అందరికీ ఇష్టమే. వెన్నెలకు పుస్తకాలు చదవడమన్నా, పాటలు పాడడమన్నా చాలా ప్రీతి. స్టేజిమీద కూడా షోలిచ్చి పెద్దలమన్ననలు పొందింది. “ఆమె మాటలలోనే స్వరజతులు తొంగిచూస్తూ ఉంటాయి”. ఆ అందమైన కళ్ళలో ఎన్నెన్నో భావాలు పలికిస్తూ ఉంటుంది వెన్నెల.

“ఆమెతోపాటే వాళ్ళమ్మ పార్వతమ్మ వాళ్ళ తమ్ముడి కొడుకు చంద్ర చిన్నప్పటినుండి కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాడు”. వెన్నెలను అపురూపంగా చూసుకుంటాడు. ఏది కావాలన్నా కొనిస్తూ. ప్రకృతి అందాలను చూపిస్తూ , జలపాతాలు, నదులు కొండలు కోనలు అంతా కలియతిరిగేవారు.

జీవితం బాల్యపు పాత వస్త్రాన్ని వదిలి యవ్వనపు కొత్తవస్త్రం ధరించి “పసిడి వయసులో అడుగుపెడుతున్నవేళ” ఇరువురిలో కొంగ్రొత్త ఆశలు, ఆలోచనలు రేకెత్తుతున్నాయి. ఆ ప్రాయం ఇరువురికీ ఎంతో హాయినిస్తుంది. కాలం కరుగుతూఉంటే క్రమంగా వెన్నెల తరగతులు పెరిగాయి, కానీ మార్కులుమాత్రం తగ్గిపోతున్నాయి. “కాలేజీలో లెక్చరర్లు అందరూ ఈ అమ్మాయిలో ఏవో మార్పులొస్తున్నాయి. ఇంతకుముందులా లేదు. చదువు అటకెక్కించింది, అనుకుంటున్నారు”. ఒకరిద్దరు లెక్చరర్లు మంచి చెప్పబోయినా లాభంలేకపోయింది. క్రమంగా వారిరువురి ప్రేమ కల
నదిలా సాగిపోతూ… ఊరిలోని వారందరూ గుసగుసలాడేంత ఎత్తుకు ఎదిగింది.

నమ్మకంగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు మాత్రం ఈ కధ అంతా ఏమీ తెలియదు. కూతురి మీద అతి ప్రేమతో ఆమె అడిగిందల్లా కొనిస్తున్నారు. “ఆ నోటా ఈ నోటా పడి చివరకు వెన్నెల ప్రేమకథ కన్నవారికి తెలిసిపోయింది”. ఇరుగుపొరుగు ఏదైనా అన్నప్పుడు ” మా అమ్మాయి అలా చేయదు, మా పెంపకం మీద మాకు నమ్మకం ఉందంటూ బోకిరించేవారు” . కానీ అదే నిజమని తెలిశాక, కన్నీళ్లతో ” పోనీలే అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా తాను ఇష్టపడ్డ “ఆ మేనల్లుడికే ఇచ్చి చేద్దాం” అనుకున్నారు కానీ వాడికి భార్యను పెంచే లక్షణాలే లేవు”. ఏ పనీ చేయడు. అమ్మానాన్నలు కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బుతో హాయిగా జల్సా చేయడంతప్ప… ఎలా వాడికిచ్చి చేసేది…?

వెన్నెల తల్లిదండ్రులు వారి మంచితనం చూసి చాలామంది ఆ అమ్మాయిని చేసుకోవడానికి ముందుకొస్తున్నారు “కానీ వెన్నెలమాత్రం ససేమిరా అంటుంది”. అలా కొంతకాలం గడిచిపోయింది. “ఒకరోజు బావామరదళ్లు ఇద్దరూ కలిసి వేరే ఊరు వెళ్ళిపోయి పెళ్లిచేసుకుందాం అని రహస్యంగా మాట్లాడుకోవడం తల్లి పార్వతమ్మ విన్నది. వెంటనే కూతురిని పిలిచి ఉక్రోషం ఆపుకోలేక చెంప చెళ్లుమనేలా కొట్టేసింది అమ్మ పార్వతి. ఇద్దరూ కలిసి ఏడ్చారు. “నిన్ను ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నామే మొదనష్టపుదాన” నువ్వు ఇంతకు దిగజారుతావని కలలోకూడా ఊహించలేదు. మీ నాన్నగారంటే ఊర్లో ఎంత పలుకుబడి ఉందో నీకు తెలియదా ? ఎన్ని పంచాయితీలు చేశారో ఎన్ని కుటుంబాల్లో గొడవలు తీర్చి మళ్లీ వాళ్ళను కలిసి ఉండేలా చేసారో నీకు తెలియంది కాదు. ఆయనే స్వయాన ఊర్లో ఎంతో మంది ఆడపిల్లలకు పెళ్ళిల్లుకుడా చేశారు. “నువ్వు కాలు కిందపెడితే ఎక్కడ అలసిపోతావో అని నీకు ఒక్కపనికుడా చెప్పకుండా నేనే కష్టపడి ఇంటి పనంతా చేస్తూ, నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్నా”. మా పెంపకం మీద మాకున్న నమ్మకంతో నిన్ను వదిలేశాము కానీ నువ్విలా చేస్తావని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించింది పార్వతమ్మగారు. ఆ వెన్నెలమాత్రం బెల్లంకొట్టిన రాయిలా అలా నిలబడే చూస్తూ, ఒక్కమాట మాత్రమే తల్లికి బదులిచ్చింది. “అమ్మా నేను బావను ఇష్టపడ్డాను అంతే. నేను బావనుతప్ప వేరొకరిని చేసుకోడానికి సిద్దంగాలేనని నిక్కచ్చిగా తేల్చి చెప్పింది”. చేసేది ఏమీలేక బిడ్డల్ని కంటాము కానీ వారి రాతల్ని కంటామా ! అంటూ నిట్టూర్చుతూ తండ్రిని పిలిచి అంతా వివరంగా చెప్పింది తల్లి పార్వతమ్మ. నెత్తీనోరు కొట్టుకొని ఇద్దరూ ఏడ్చి. చివరకు ఆ పెళ్లికి ఒప్పుకున్నారు ఆ తల్లిదండ్రులు.

సాంప్రదాయం ప్రకారం పెళ్ళి జరిగిపోయింది. కూతురు అల్లుడు ఒచ్చిపోతూ వున్నారు. పరాంకుశం మాత్రం ఎంతో మధనపడుతూ ఉండేవాడు. “ఆతర్వాత కొంతకాలానికి బెంగతో ఆరోగ్యం క్షీణించి పరమపదించారు పరాంకుశంగారు”. ఇకపోతే వెన్నెల కూడా సంతోషంగాలేదు తన బావైన భర్తతో . చంద్ర ఏపని చేయకుండా ఊర్లో తిరగడం, కోపమొచ్చినప్పుడు వెన్నెలను, వాళ్ళ పుట్టింటి వారిని తిట్టటం, పేకాడటం. మందు తాగటం వంటి వ్యసనాలకు కూడా బానిసయ్యాడు . ఇక చేసేది ఏమీలేక వెన్నెలే ఏదో చిన్న ఉద్యోగం వెతుక్కొని కుటుంబాన్ని పోషిస్తోంది. “అదికూడా ఆయనకు అనుమానమే”. అయినా ఆయనతో ఏదోలా వేగుతూ సంసారపు బండిని ఒక్కతే లాక్కొస్తుంది. కాలం కదలలేక కదులుతోంది. “వెన్నెలకు ఒకపాప కూడా పుట్టింది. కానీ భర్త చంద్రలో ఎటువంటి మార్పు రాలేదు”.

తన విషయాలను ఎవరితో చెప్పుకునేది కాదు వెన్నెల. అంతా తన స్వయంకృతాపరాధం అనుకుంటూ, అప్పుడప్పుడూ “తనకు దుఃఖం వచ్చినప్పుడల్లా ఊరిచివరన ఉన్న ఓ పిల్లకాలువతో తన బాధను పంచుకునేది”. తన భాధను విని ఆపిల్ల కాలువా వెన్నెలను ఎలా ఊరడించాలో తెలీక మౌనాన్నే ఆశ్రయించేది. అలా కొంచెంసేపు గడిపి “కొంచెం మనసు కుదుటపడ్డాక కళ్ళు తుడుచుకుని ఇంటిదారి పట్టేది”. సమస్యలతో సతమతమైనప్పుడల్లా “మా అమ్మ నన్ను ఎంత చక్కగా పెంచుకుంది” కాలు క్రిందపెడితే కందిపోతానేమో అన్నట్లు చూసుకునేది. ఎవరైనా నన్ను ఒక్కమాట అన్నా ఊరుకునేదికాదు. “నేను తప్పుచేశాను, చాలా పెద్ద తప్పే” ! నా మనసుమాట విని ప్రేమమైకంలో పడి నా మంచిచెడులు ఆలోచించే తల్లిదండ్రులను విస్మరించాను. నా వల్ల నాన్నగారు ఊర్లో పెద్దరికంగా ఉండలేకపోయారు. “ఆయనలో ఆయన మదనపడి మంచంపట్టి మరణించారు”. నేను మాత్రం సుఖపడింది ఏముంది? బ్రతుకుమీద ఆశలు వదులుకుని ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశాను. “అయినా నేను పెళ్లిచేసుకొని వెళ్లిపోతానని అన్నప్పుడు అమ్మ నన్ను కొట్టింది” కానీ అదేదో ” ఇంకాస్త ముందే నన్ను మందలించి ఉంటే బాగుండేది నాకు కనువిప్పు కలిగేదేమో ” అమ్మ నా మీద తన పెంపకం మీద నమ్మకంతో ఎవరు నా గురించి ఏమి చెప్పినా వినిపించుకోలేదు, అందుకే ఇలా జరిగింది.

నేను మా తల్లిదండ్రుల నమ్మకం మీద దెబ్బకొట్టాను. బంగారంలాంటి కుటుంబానికి మనఃశాంతి లేకుండా చేశాను. “నాకు ఈ శాస్తి జరగాల్సిందే
అనుకుంది వెన్నెల తనలోతాను కుమిలిపోతూ”….. ఎవరికి ఏం జరిగినా అది నాకు అనవసరం నేను ఎప్పుడూ మేలుకొలిపే వాడినే “నన్ను గమనించి నడుచుకోని వారి కథల్లో ఎప్పటికైనా ముసిరేవి చీకట్లే అనుకుంటూ” పచ్చిమాద్రిన సూరీడు క్రుంగిపోతున్నాడు. “స్యూర్యుని ఒకరోజు గమనం అంటే ఓ నిండైన మానవ జీవితం” అందుకే వెలుగున్నపుడే చక్కబెట్టుకోవాలి అన్నది పెద్దల మాట.

ఆకాశంలో చీకట్లు ముసురుకుంటూ, అనేకానేక సమస్యలతో అలసిన మానవులకు కొంతసేపైనా విశ్రాంతి నీయడానికి కాలం ఆయత్తమౌతుంది. చీకట్లు మరింతగా ముసురుకుంటున్నాయి. వెన్నెల ఆలోచనల్లాగే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!