వైశాలి నా కూతురే..

వైశాలి నా కూతురే..

రచయిత :: తేలుకుంట్ల సునీత

భాస్కర్, సుమలతలు కులాలు వేరైనా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి కష్టమైన తల్లిదండ్రుల్ని ఒప్పించి మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా అవనిలోకి వచ్చిన అపరంజి బొమ్మ వైశాలి. భాస్కర్ తనకున్న ఐదెకరాల భూమిని సాగు చేసుకుంటూ, భార్య బిడ్డల్ని కష్టం తెలియకుండా పోషించసాగాడు. సుమలత ఇంటివద్దనే ఉంటూ ఇంటిపనులు చూసుకునేది.చూస్తుండగానే వైశాలికి పదమూడు సంవత్సరాలు రానే వచ్చాయి. ఆడుతూ పాడుతూ చదువు లో ప్రతిభను కనబరుస్తూ, చురుకైన అమ్మాయి అనిపించుకుంటుంది.

అనుకోకుండా ఒక రోజు సుమలత వంట చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. భార్య మరణ వార్త విని పొలం నుండి పరుగున వచ్చిన భాస్కర్ సుమలత ను చూసి కూతుర్ని దగ్గరికి తీసుకొని భోరున విలపిస్తూ  మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు. చుట్టుపక్కల వాళ్లంతా ఓదారుస్తూ.. మిగతా కార్యక్రమాల్ని కానిచ్చారు. ఇల్లాలు లేని ఇల్లు, తల్లి లేని పిల్లతో భాస్కర్ భారంగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఆడపిల్ల బాగోగులు చూడడానికి ఆ ఇంటికి మళ్లీ ఒక ఆడదిక్కు  అవసరం అని ఇరుగుపొరుగు వారు భాస్కర్ని ఒప్పించాలని ప్రయత్నించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ ప్రేమకు ప్రతిరూపం ఐనా వైశాలిని  వచ్చిన సవతి తల్లి ఇబ్బందులు పెడుతుందని భయంతో మరో పెళ్లికి సుముఖంగా లేడు. కానీ ఎదుగుతున్న కూతురి మంచి చెడ్డలు చూడాలి కదా అని ఆలోచనలతో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు.

చివరకు దిగులుగా ఉంటున్న తన వైశాలి లో మునుపటి ఆనందం చూడడం కోసం, భర్త చనిపోయి, వైశాలి కంటే వయసులో పెద్దగా ఉన్నకొడుకును కలిగిన సుభద్ర ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వైశాలి కూడా కన్నతల్లి కాకపోయినా నాకు నాన్నకు తోడు ఉంటుంది అనే ఆశతో సంతోషించింది. అమ్మా అమ్మా అంటూ అభిమానంగా పిలుస్తూ మెల్లమెల్లగా తన తల్లిని మర్చిపోవడానికి ప్రయత్నించింది.మొదట్లో సుభద్ర కూడా వైశాలిని బాగానే చూసుకుంది. తను కన్న కొడుకును అపురూపంగా చూసుకుంటూ,వైశాలిని ఎలాగైనా వదిలించుకోవాలని రానురానూ ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టింది. అది చూసి భాస్కర్ భార్యను మందలించే వాడు. అయినా ఫలితం శూన్యం. ఒకరోజు వైశాలి తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఉండగా, సుభద్ర పట్టించుకోదు.అది అలా బాధపడుతుంటే నీకు ఏమాత్రం జాలి కలగడం లేదా అని భాస్కర్ అడగడంతో సుభద్ర నాకెందుకు బాధ అదేమైనా నేను కన్న కూతురా … అని ఈసడించుకుంటుంది. రోజురోజుకు సుభద్ర ఆగడాలు మితిమీరిపోతున్నాయి. భాస్కర్ కి మనశ్శాంతి కరువై పోయింది.

ఒకరోజు పనిమీద పట్నం వెళ్ళిన భాస్కర్ తిరిగి వచ్చేసరికి, సుభద్ర వైశాలిని నానా తిట్లు తిడుతూ తన్ని ఇంట్లో నుండి తరిమి వేసింది. తను లేకపోతే నాన్న ను  సుఖంగా చూసుకుంటుందని ఆశతో వైశాలి ఏడ్చుకుంటూ… దగ్గరలోని రైల్వే స్టేషన్ కెళ్ళిఆగి  ఉన్న రైలు ఎక్కి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భాస్కర్ కి కన్న కూతురు కనిపించకపోయేసరికి సుభద్రను నిలదీయగా ఎటుపోయిందో నాకు తెలియదు అంటూ బుకాయించింది. సుభద్ర కొడుకు రాము జరిగిన విషయమంతా చెప్పేసరికి… భాస్కర్ వైశాలిని వెతుకుతుంటే కనిపించక పోయేసరికి, ఇరుగుపొరుగు వారు  చెట్లు, పుట్టలు, బావులు, చెరువులు వెతకగా ఎక్కడా కనిపించలేదు వైశాలి. తన కూతురు లేదనే బెంగతో, మరో పెళ్లి చేసుకుని తప్పు చేశానని కుమిలి కుమిలి ఏడుస్తూ, మంచం పట్టి మనాదితో చివరకు ప్రాణాలు వదిలాడు.

భర్త పోయిన బాధ అంతగా లేకపోయినా సుభద్ర కొడుకుతో హాయిగానే  కాలం గడుపుతోంది. కొంతకాలం తర్వాత రాముకి ఒక కంపెనీలో ఉద్యోగం రావడంతో రాముకి పెళ్లి చేసింది. కాలం ఒకేలా ఉండదు. తాను చేసిన మంచి చెడులకు కర్మలను నిర్ణయిస్తూనే ఉంటుంది. ఆ కర్మ కోడలి రూపంలో వచ్చి, సుభద్ర ను  నానారకాలుగా హింసిస్తున్నది. అది చూసిన ఇరుగుపొరుగువారు భాస్కర్, వైశాలి విషయంలో సుభద్రకు తగిన శాస్తి జరుగుతుందని మనసు లోపల సంతోషపడుతున్నారు. భార్య మాటలు విన్న రాము ఉన్న పొలం అమ్ముకుని, పనిమనిషి అవసరం లేకుండా ఉంటుందని తల్లినీ తీసుకొని పట్నంలో స్థిరపడతాడు రాము.

రాముకి ఇద్దరు పిల్లలు అయ్యారు. వయసుమీద పడుతున్న అవస్త పడుతూ గొడ్డు చాకిరీ చేస్తున్నా సుభద్రను పట్టించుకోని కొడుకు, కోడలు. రోజులు గడుస్తున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచమంతా విలయతాండవం చేస్తూ, మారణ హోమం సృష్టిస్తూ, ప్రజలను భయ భ్రాంతుల కు గురి చేస్తోంది. ఆ మహమ్మారికి ఎప్పుడూ, ఎవరూ, ఎలా  బలి అవుతారో తెలియని పరిస్థితి నెలకొని ఉన్న సమయంలో సుభద్ర కు జలుబు, దగ్గు,  జ్వరం వచ్చింది. సుభద్ర”రామూ నాకు చాలా నీరసంగా ఉంది రా. హాస్పిటల్ కి తీసుకెళ్ళమని బతిమాలడంతో తల్లిని దూషిస్తూ, చిరాకు పడుతూ హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. అక్కడ సుభద్రను పరీక్షించిన డాక్టర్లు సుభద్రకు కరోనా పాజిటివ్ అని, తీవ్రత అంతగా లేనందున ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసు కొమ్మని రాముకు చెప్పారు. అది విన్న రాము కన్న తల్లి అనే కనికరం చూపక తల్లిని నడిరోడ్డుపై వదిలి వెళ్తాడు. రెండు, మూడు రోజులు అక్కడే దీనావస్థలో పడి ఉంటుంది. ఆ హృదయ విదారక సంఘటన “కరోనా పాజిటివ్ అని తల్లిని వదిలిన తనయుడు ”  అనే వీడియో వైరల్ అవుతూ.. అవుతూ… చివరకు చిన్నప్పుడు తల్లి పెట్టే హింసలను భరించలేక, ఇల్లు వదలి వెళ్లి హాస్పటల్లో మంచి పేరున్న స్టాఫ్ నర్స్ గా స్థిరపడిన …. వై శాలిని చేరిందా  ఆ వీడియో.

ఆ వీడియోలో రోడ్డు పై పడి ఉన్నామే వివరాలు విన్న వైశాలి ఒక్కసారి ఉత్కంఠకు లోనయి, తన తల్లి స్థానంలో వచ్చిన సుభద్రను ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక, హాస్పిటల్ సూపరిండెంట్ పర్మిషన్ తీసుకొని, స్పృహ కోల్పోయిన తల్లి దగ్గరికి చేరుకొని అంబులెన్స్లో హాస్పిటల్ కి తీసుకు వస్తుంది. సీనియర్ డాక్టర్ సలహాతో కరోనా వార్డులో చేర్పించి, కోలుకునే వరకూ తానే దగ్గరుండి సేవలు చేస్తుంది. సుభద్ర వారం రోజుల్లో మామూలు మనిషి అవుతుంది. వైశాలి మరోసారి కరోనా పరీక్షలు చేయించి నెగెటివ్ అని తేలడంతో ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్లు చెప్తారు. అది విన్న సుభద్ర వైశాలి వైపు తిరిగి” కంటికి రెప్పలా కాపాడి పెంచిన కన్న కొడుకు వదిలి వెళ్ళిపోయాడు. ఏ తల్లి కన్న బిడ్డవో నువ్వు, నాకు కన్న బిడ్డలా పూట పూటకు తినిపిస్తూ, తాపిస్తూ మందులు వేస్తూ, మామూలు మనిషిని చేశావు. ఈ జన్మకు నీ రుణం తీర్చుకోలేను” అంటూ కంట తడి పెడుతూ చేతులెత్తి నమస్కరించగా… వైశాలి “అమ్మా అంటూ ఆర్తిగా పిలుస్తూ… నేను అమ్మా వైశాలిని అనగానే చెమర్చిన కళ్లను నులుముకుని చూస్తూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. నన్ను క్షమించమ్మా.. నా పేగు బంధం కాదని ఆనాడు నిన్ను వదిలించుకోవాలని, నిన్ను హింసించిన కర్మ ఫలితమే నాకన్న కొడుకు రూపంలో నన్ను వెంటాడుతూ చావు అంచుల దాకా తీసుకెళ్ళింది. వాడు కాదమ్మా నా కన్న కొడుకు. నువ్వే నాకన్న కూతురు. వైశాలి  నా  కూతురే… అంటూ పశ్చాత్తాపంతో భోరున విలపిస్తుంది. తల్లిని ఓదార్చి వైశాలి తన ఇంటికి తీసుకుని వెళ్తుంది.

***

You May Also Like

7 thoughts on “వైశాలి నా కూతురే..

  1. వెరీ నైస్ స్టొరీ టీచర్ , ఇట్స్ టచింగ్ హార్ట్ 👌👌👌
    చాలా years తరువాత మంచి స్టోరీ చదివాను టీచర్ 👌👌👌

  2. కథ అద్భుతంగా ఉంది. వైశాలి నా కూతురే ….కాదు… అందరి కూతురు, పవిత్రమైన నర్సు వృత్తిలో ముఖ్యమైన లక్షణం వైశాలి చూపింది. ప్రస్తుత తరుణంలో వైశాలి వంటి నర్సులు ఎందరో కరోనా రోగులకు సహాయం అందిస్తూన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!