వంటావార్పు

వంటావార్పు

రచన: కమల ముక్కు (కమల ‘శ్రీ’)

సుబాష్, షాలిని దంపతులు నగరానికి కాస్త దూరం గా స్థలం తీసుకుని తమ అభిరుచులకు అనుగుణం గా ఇల్లు కట్టుకున్నారు.వారికి ఇద్దరు పిల్లలు చరణ్, ధరణి.సుభాష్ కోర్ట్ లో ఎంప్లాయి.పిల్లలు స్కూల్ కి , సుభాష్ కోర్ట్ కి వెళ్లాక షాలిని తను పెళ్లికి ముందు నేర్చుకున్న కుట్లు అల్లికలూ చేసుకుంటూ, గార్డెన్ లో కాసేపు కాలం గడుపుతూ ఉండేది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా ఉండేది వారి జీవితం.

దసరా కి సెలవులు ఇవ్వడం తో షాలిని అన్నా వదినలు మాధవ్, రాణి లు వచ్చారు తమ కొడుకు నిఖిల్ తో. చరణ్, ధరణి లకు కూడా సెలవులు ఇవ్వడం తో పిల్లలంతా ఇల్లంతా కలియ తిరుగుతూ ఆడుతూ గడిపారు పగలంతా.

రాత్రి . భోజనాల సమయం లో అన్నం లో పప్పు, వంకాయ కూర వండింది షాలిని. ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్న రాణి ఆ రుచి తన్మయత్వం తో ఉండిపోయింది. మాధవ్ ది కూడా అదే పరిస్థితి.

“షాలినీ! వంట చాలా బాగా చేశావు. నీ వంట ఇంతకు మునుపు తిన్నాకూడా ఇప్పటి రుచికి ఏవీ సాటిలేవు అనుకో.” అని మెచ్చుకోలుగా అంది రాణి.

“థాంక్యూ వదినా. ఇంకాస్తా పెట్టమంటావా.”అని కాస్త కూర వడ్డించింది.

“మీ వదిన చెప్పింది నిజమే షాలినీ. నీ వంట రుచి అమోఘం. ఫైవ్ స్టార్ హోటల్ కూరలు పనికి రావు దీని రుచి ముందర.” అన్నాడు మాధవ్, షాలిని వైపు మెచ్చుకోలుగా చూస్తూ.

తృప్తిగా భోజనం చేసి హాయి గా పడుకున్నారు ఆ రాత్రి. మరుసటి రోజు సుభాష్ కోర్ట్ కి వెళ్లాడు. మాధవ్ కి ఏదో పని ఉండి సిటీ కి వెళ్తూ పిల్లల్ని కూడా తనతో తీసుకు వెళ్లాడు వచ్చేటప్పుడు సినిమా కి తీసుకుని వెళ్తానని చెప్పి.

వారు వెళ్లిపోయాక ఎప్పటిలానే చీరలు ముందు వేసుకుని ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్న షాలిని దగ్గరికి వచ్చి “షాలినీ నీ వంట సీక్రెట్ ఏమిటో చెప్పవా. ఏం మసాలా లు వేస్తున్నావు.” అంది రాణి.

“ఎప్పటిలానే వేస్తున్నా వదినా?.” నవ్వుతూ అని పని చేసుకోవడం లో మునిగిపోయింది షాలిని.

“ఎప్పటిలానే మసాలాలు వేశాను అంటున్నావు. కానీ ఇంతకు మునుపు మేము తిన్న కూర రుచి కీ, నిన్న తిన్న కూర రుచికీ చాలా తేడా. మసాలా మార్చి ఉంటావు. అదేమిటో చెప్పమ్మా. ఈ మధ్య మీ అన్నయ్య నేను ఎంతబాగా వండినా కూడా ఏదో వంక పెడుతూనే ఉన్నాడు.” అంది రాణి.

“నేను మార్చింది మసాలా కాదు వదినా. వండే పద్ధతిని, వాడే కూరగాయలను.” అంది రాణి నవ్వుతూ.

“అంటే…?!.”
“అంటే నిన్న వండిన వంకాయలు మార్కెట్లో కొన్నవి కాదు. మన పెరట్లో పండినవి. అలాగే వండింది గ్యాస్ మీద కాదు. కట్టెల పొయ్యి మీద.”

“వాట్ కట్టెల పొయ్యి మీదా?!.ఈ రోజుల్లో కూడా కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారా. పొగ, కళ్ల మంట లు… కాలుష్యం.” అంది రాణి ముఖం అదోలా పెట్టి.

“చూశావా. చెప్పేదాకా ఒప్పుకోలేదు. తీరా చెప్పాక ఇదా అని ముఖాన్ని అదోలా పెట్టావు.” అంది షాలిని నవ్వుతూ.

“ఎందుకు నవ్వుతావు షాలినీ. కూరగాయలు పెరట్లో చాలా మంది పండించుకుంటారు అది తెలిసిన విషయమే.అధునాతన పద్ధతుల్లో వంటలు చేస్తున్న ఈ రోజుల్లో నువ్వు కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే ఏమనుకోవాలి చెప్పు.”

“ఏమీ అనుకోకు వదినా. మన ఆరోగ్యం పై మనం శ్రద్ధ వహిస్తున్నాము అనీ, అలాగే పెరిగే గ్యాస్ ధరలు తట్టుకునే కన్నా మనకి అందుబాటులో ఉన్న వనరులతో వంట చేస్తున్నామని అనుకో.”

“దానివల్ల చాలా ఎయిర్ పోల్యూషన్ పెరుగుతుంది కదా.”
చిన్న కట్టెలపొయ్యి తో వంట చేస్తే పొల్యూషన్ అవుతుంది అంటే ఇన్ని వేల వాహనాలు వాడటం వల్ల ఎంత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది చెప్పు. అయినా దాని గురించి నేను మాట్లాడను. మా ఫ్యామిలీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా అందుకే ఇలా చేస్తున్నా.

నేనూ నీలానే అనుకునేదాన్ని ఎన్ని మసాలాలు వేసినా వంటలో రుచే లేదని. అదే విషయం ఓ సారి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు అదే విషయం మా అమ్మమ్మ ని అడిగాను. గ్యాస్ స్టౌవ్ మీద వండే వంట కంటే కట్టెల పొయ్యి మీద చేసే వంట చాలా రుచిగా ఉంటుంది. అలాగే మేము కూరగాయలు అన్నీ పెరట్లోనే పండించుకుంటాము. మీ పట్నాల్లో అలా కాదుగా ఇరుకిరుకు ఇళ్ళల్లో ఉంటారు. మార్కెట్లో దొరికే ఆ హై బ్రీడ్ కూరగాయలు వండితే రుచి చప్పగా ఉంటుంది ఎన్ని మసాలాలు వేసినా. నాటు కూరల్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేస్తే చాలు ఆ రుచి అమోఘం అని చెప్పింది. ఆమె చెప్పింది నాకెందుకో బాగా నచ్చింది. అందుకే సిటీ కి కాస్త దూరం లో ఉన్నా కూడా ఇక్కడ స్థలం తీసుకుని మా అభిరుచి సరిపోయేలా కూరగాయల పండిస్తున్నాం. ఆవులు కూడా ఉన్నాయి వదినా. వాటి పేడతో గోబర్ గ్యాస్ పొయ్యి ఒకటి పెట్టించుకున్నాము. దాంతో కూడా వంట చేస్తాను. ఇలా చేయడం వల్ల ఎంత పొల్యూషన్ అవుతుందో నాకైతే తెలీదు కానీ మా ఫ్యామిలీ కి మాత్రం మంచి రుచికరమైన వంట అందివ్వగలుగుతున్నా. అలాగే పెరిగే వంట గ్యాస్ ధర నుంచి మన జేబుకి చిల్లు పడకుండా కూడా చూసుకోగలుగుతున్నా.” అంటూ బదులిచ్చింది షాలిని.

బాగుందమ్మా మీ వంటా వార్పు కార్యక్రమం. ఈ విషయాన్ని నేను ఒక్కదానే ఉన్నప్పుడు చెప్పావు సరిపోయింది. అదే మీ అన్న ఉన్నప్పుడు చెప్పావే అనుకో ఓ కట్టెలపొయ్యి తెచ్చి వండు అంటాడు. వచ్చే ఆ పొగకి మా ఫ్లాట్ తగలబడి పోతుందని ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసినా చేస్తారు మా అపార్ట్మెంట్ వాళ్లు.” అని నవ్వింది రాణి.

ఆ మాటకి షాలిని కూడా జతకలిసింది.

“ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి ఆ రోజులు మళ్లీ రావు కదా షాలినీ. ఇలా ఉరుకుల పరుగుల జీవితం ఎన్నాల్లో కదా.” అంది నవ్వుని బాధగా రాణి చివర్లో.

“నిజమే…” అన్నట్టుగా తల ఊపింది షాలిని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!