అత్తయ్య అలిగింది

అత్తయ్య అలిగింది
                                 (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)          

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

         ఒరే రామం ప్రొద్దున్న నుంచి మీ అత్తయ్య గదిలోంచి బయటకు రావటం లేదు. నా మీద కోపం వచ్చి అలిగింది భోజనం చేద్దురు రండి అని బ్రతిమాలినా ఉలుకు పలుకు లేకుండా పచ్చి మంచి నీళ్ళయినా త్రాగకుండా ఉదయాన్న త్రాగిన కాఫీ తోనే ఉన్నారురా అని స్కూలు నుంచి వచ్చిన కొడుకుతో లక్ష్మమ్మ అంది. రామం అనే రామారావు అమలాపురం ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో సైన్స్ మాష్టర్ గా పనిచేస్తున్నాడు. ప్రొద్దున్న  స్నాన సంధ్యాదులు పూర్తయిన తరువాత రాముడు రా రా బడికి వేళ అవుతుంది అని తొమ్మిది గంటలకు నా పిల్లలిద్దరితో పాటు నాకు ఫలహారం  సుబ్బులత్తే పెడుతుంది. స్కూలుకు అనుకునే మా లంకంత నాలుగిళ్ళ  లోగిలి గల మా ఇల్లు. మరల ఒంటిగంట కు ఇంటికి వచ్చి అత్తయ్య చేతి వంట తినడం అలవాటు. నాన్నగారు పూర్ణయ్య పంతులు గారు పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. వారు సహస్రామాస జీవిగా బ్రతికి రెండేళ్ళ క్రిందట శ్రీరామచంద్రుని సన్నిధి కి ఉత్తరాయణ పుణ్య కాలంలో భీష్మ ఏకాదశి పుణ్యతిథి నాడు చేరుకున్నారు. మా నాన్నగారి కంటే అత్తయ్య ఎనిమిది సంవత్సరాలు పెద్దది ఇప్పుడు తొమ్మిది పదులు దాటినా ఆరోగ్యవంతముగా వంటపని, తిరగలి, రోకలి ఉపయోగించే పెద్దపనులు ఆమె చేస్థు అమ్మని కన్న కూతురు లా చూస్తుంది. నా పిల్లల్ని, మా ఆవిడ సుశీల ని ఎంతో అభిమానంతో ఆదరించి
తినండర్రా, తినండి వయస్సులో గాకపోతే ఎప్పుడు తింటారు డాక్టరు కేమి తెలుసు అంటూ ఆవకాయ, బూర్లలో నెయ్యివేసి, పులిహార అన్నీ వద్దు అన్న వినకుండా వడ్డించేది. అలాంటి అత్తయ్య అలిగింది .
నాన్నగారు పోయినప్పుడు అమ్మ బాధపడుతుంటే ఏడవకే లక్ష్మీ వాడు సహస్రమాసజీవి పూర్ణయ్య అదృష్టవంతుడు కొడుకు, కోడలు, మనుమలు చూసి భీష్ములవారిలా ఏకాదశి నాడు చనిపోయాడు. రామం, వాడి పిల్లలలో మా తమ్ముడిని చూసుకో”జాతస్యహి ధృవో మృత్యు” నీకు తెలియంది కాదు అని డెబ్భై నాన్నగారికన్న పదేళ్ళు చిన్నదైన డెబ్భై ఏళ్ళు దాటిన అమ్మని ఓదార్చింది అత్తయ్య, తెల్లవారుజామున నాన్నపోయిన రెండోరోజు వారి ఫోటో దగ్గర ఒరే తమ్ముడు నీకు బదులు నన్ను తీసుకుపోయినా బాగుండునురా నీ చేతిలో పిడికెడు బుగ్గిగా అయిపోతాను అనుకున్న నాకు మరువలేని భాధనే పెట్టావు అని బాధపడటం చూసి అత్తయ్య లాంటి మనిషి మాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం
అని భావించాను. అలాంటి అత్తయ్య అలిగింది.
నేను  అమ్మ నాన్నల పెళ్ళి అయిన పన్నెండేళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి దయవల్ల శ్రీరామనవమి నాడు పుట్టడం. ఏకైక సంతానం అవడంచే ఎం.ఎస్.సి. కెమిస్ట్రీ లో బంగారు పతకం వచ్చి ముంబాయి లో సైంటిస్ట్ గా వచ్చినా ఉద్యోగంలో చేరక
బి.ఇ.డి చేసి ఎయిడెడ్ ఉన్నతపాఠశాలలో సైన్స్ మాస్టార్  గా చేరడం. నాన్న, అత్తయ్యలు కుదిర్చిన  దగ్గర సంబంధం సుశీలను వివాహం చేసుకోవడం ఇప్పుడు నా పిల్లలే ఇంజనీరింగ్ చదువులు చదువుతుండడం జరిగిపోయింది. అత్తయ్య కు తొమ్మిదో ఏటపెళ్ళి , పన్నెండేళ్ళకి భర్తపోయి అత్తవారిల్లు, భర్త సంసారం తెలియక ఘనాపాటి సోమయాజులు గారింట్లో ఉండిపోవడం. తాత గారి తరువాత తమ్ముడితోనే ఉండడం. అమ్మని కూతురుల చూసి ఇంటి పని అంతా ఆమె చేయడం. నా గురించి అత్తయ్య మొక్కిన మొక్కులే ఎక్కువ.
రాత్రిపూట అత్తయ్య దగ్గర పడుకుని విన్న రామాయణం, భారత గాధలు, సుమతీ, వేమన శతకాలు, గాంధీతాత, తిలక్ వంటి మహనీయుల గాధలు ఎన్నో ఎన్నెన్నో అందుకే అమ్మ కన్నా అత్తయ్య నా కెంతో ఇష్టం. ఆలోచిస్తు భార్య సుశీల పిలుపుతో ఎందుకు అత్తయ్య అలిగింది అని అడిగితే ప్రొద్దున్న  పెద్దమ్మ గారితో అత్తయ్య గారు రేపటినుంచి కార్తీకమాసం అంటూ స్నానాలు చేయకండి మీకు తొంభై ఏళ్ళు దాటాయి ఆరోగ్యం బాగులేదు అన్నారు అందుకేమో వెళ్ళి కనుక్కోండి. మీరు పెద్దమ్మకు ఏభై ఏళ్ళు దాటినా చిన్ని కృష్ణుడే కదా అని నవ్వుతు అంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుని అత్తయ్య గదిలోకి వెళ్ళి దగ్గర కూర్చుని చేతులు పట్టుకుంటు అత్తయ్యా భోజనం పెట్టు స్కూలుకు సమయం అయింది అంటే
నన్ను పట్టుకుని ఒరే రాముడు  నేనెవరికి కావాలి. ఎవరున్నారు నాకు అని చిన్నపిల్లలా తొంభై ఏళ్ళ అత్తయ్య భాధ పడింది. ఏమిటయింది చెప్పవే అంటే అదికాదురా రాముడు డెబ్భై ఏళ్ళయి కార్తీక స్నానాలు చేస్తున్నాన ఏనాడయిన జలుబు దగ్గు వచ్చింది, జ్వరంతో మంచం పడ్డాన పనులు చేస్తుంటేనే ఆరోగ్యం, పరమేశ్వరునికి పూజ లోకకల్యాణం కోసమే, ఇప్పటి కరోనా, యుద్ధభయం పోయి ప్రపంచంలో శాంతి కొరకే చేయడం అంటూ అత్తయ్య మాట్లాడుతుంటే కృష్ణపరమాత్మ అర్జనునికి గీత బోధించినట్లనిపించింది.
ఒరే రాముడు నీకయిన జుట్టు ఉంది గాని  నా బోడిగుండు మీద వెంట్రుక అయినా ఉందా అనగానే నవ్వొచ్చి నేను అత్తయ్యతో తప్పక కార్తీక స్నానాలు చెయ్యి కానీ వేడి నీటిలో రెండు చుక్కలు గంగ వేసుకుని చెయ్యి మొన్న మన చాగంటి వారు చెప్పారు అలా చేసినా కాశీలో గంగలో చేసినట్లు అని అనగానే ఒరే రాముడు నా ఆయుష్షు కూడా పోసుకుని నిండా నూరేళ్ళు బ్రతకారా అని మీద ముసుగు జారిన ఆప్యాయతతో ఎప్పటిలాగే
మేనల్లుడి నుదుట ముద్దు పెట్టుకుని పదరా నేనే నీకు అన్నం పెడతాను అంటు
అలకవీడారు అత్తయ్యగారు…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!