పరుమండలం

(అంశం: చందమామ కథలు)

పరుమండలం

రచన: కృష్ణకుమారి

కూరలపాడు అనే ఊరిలో మంగమ్మకి ఒక్కడే కొడుకు. కృష్ణుడు వాడిపేరు. మంగమ్మ భర్త పిల్లడు చిన్నప్పుడే చనిపోయాడు. ఆమె కూరలు పండించి అమ్ముకొని బతుకుతోంది.

ఈ కూరల పాడు గ్రామం ‘పరుమండల రాజ్యం’ పరిథి లోకి‌ వస్తుంది. గ్రామాధికారులు ఏటా పరుమండల మహారాజుకి కప్పం కడుతూ ఉంటారు.

కృష్ణుడికి వయసు వచ్చేసరికి బత్తాయి తోటవేసి పళ్ళు ‌కూడా
అమ్మడం మొదలెట్టేడు. వాడి కబుర్లకే
ఎక్కువమంది వాడి దగ్గర కూరలూ‌ పళ్ళూ కొనేవారు.

కృష్ణుడికి రాజుగారి కబుర్లు వినడం‌ ఇష్టం. ఎలాగైనా రాజుగారి
దర్బారు చూడాలని ఉబలాటం పట్టుకుంది. తల్లి‌ తమలాటి‌ పేదవాళ్లకి, అది జరగని పని అని హెచ్చరించింది.

చుట్టు పక్కల‌ ఉన్న ‘చిన్నచిన్న’ ఊళ్లలో రోజుకో ఊరులో సంత జరుగుతుంది. పండిన కూరలన్నీ గోతాంలో వేసుకొని కృష్ణుడు ఆ ఊరి వాళ్లందరితో కలిసి ఎక్కడ సంత ఉంటే, అక్కడకి వెళ్లేవాడు.

పగలంతా సంతలో అమ్మకాలు చూసుకొని అందరూ రాత్రి చీకటి పడే లోపల ఇంటికి తిరిగి వచ్చేవారు. రోజుకో దగ్గర కి వెళ్లడం, ‘కొత్త కొత్త’ మనుషులతో వాడికి పరిచయాలు ఏర్పడ్డాయి.

సాయంకాలం అందరూ కొంత దూరం కలిసి వచ్చేవారు. కృష్ణుడుకి వింతలూ, విశేషాలు వినడం‌ మహా ఇష్టం. చాలామంది ద్వారా రాజుగారి కబుర్లు వినేవాడు.‌‌‌

రాజుగారు అప్పుడప్పుడు సభ చేస్తారు. అప్పుడు ఎవరైనా ‘వింత వింత’ ప్రశ్నలు అడగవచ్చును. జవాబు ఎవరైనా చెప్పొచ్చును. రాజుగారు వాళ్ల ప్రతిభని బట్టీ బహుమానం కూడా ఇస్తారు.‌

ఆ వారంలోనే సభ జరగనుంది. ఇది విని ఆలోచిస్తూ కృష్ణుడు ఇంటికి చేరేడు.
తల్లికి ఊరికే సభ చూసిందికే వెళతానని చెప్పి, రెండు రోజులు ముందే బయలుదేరి వెళ్ళేడు. తనతో ప్రత్యేకంగా పండించిన నేతి బీరకాయలు, వంకాయలు,‌ బత్తాయిలూ కూడా తీసుకెళ్ళేడు‌. కృష్ణుడితో ఆ ఊరివాళ్ళు ఇంకో ఇద్దరు బయల్దేరేరు.

సభలో పాల్గొన తలచుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళ పేర్లు ఊరిపేరు, వయసు లాటి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆ పనిమీద రాజ మందిరంలోకి వెళ్ళినపుడు తను తెచ్చిన కూరలు వంటశాలలో అప్పచెప్పి, రాజుగారికి వంటలో ఈ శాకాలు కలపమని కోరి వచ్చేడు

సత్రంలో బస చేసి, పూటకూళ్ళ అవ్వకి కొన్ని కూరగాయలు ఇచ్చి, అక్కడ భోజనం చేసి రాజ్యం అంతా తిరిగి చూసేడు.

అలా కోట చూస్తూ ఉంటే కృష్ణుడి నిశిత దృష్టికి ఓ కొత్త విషయం కనపడింది.
హుషారుగా తనలో తనే ఈల వేసుకుంటూ సత్రం చేరేడు.

రాజుగారి సభ ప్రారంభం అయింది. అందరూ ఎవరి ఆసనాల్లో వాళ్ళు కూచొని ఉన్నారు

సభ కోలాహలంగా ఉంది. అందరూ వాళ్ళ ప్రతిభ చూపిస్తున్నారు.

కృష్ణుడు రాజుగారికి నమస్కరించి, తనో ప్రశ్న అడుగుతాను అన్నాడు. రాజుగారు అనుమతి ఇచ్చేరు.

కృష్ణుడు అందరికీ నమస్కరించి “ఆకాశంలో చందమామ అందరికీ తెలుసు. అలాటిది మీరు రోజు ఇక్కడ చూస్తున్నారు. ఏమిటది?”
అడిగేడు. వృద్ధుడయిన మంత్రి చిరునవ్వుతో కృష్ణుడిని చూసేడు.

ఎవరికీ బోధపడలేదు. ఎవరూ జవాబు చెప్పలేకపోయారు.

రాజుగారు ‘ఎవరూ చెప్పనప్పుడు నువ్వే చెప్పాలి’ అని అదేశించేరు.

కృష్ణుడు నిలబడి “మహారాజా……. చందమామలాగ గుండ్రంగా ఉన్న మీకోట రోజూ అందరూ చూస్తున్నారు కదా….. అందుకే కదా మన రాజ్యానికి ‘పరుమండల రాజ్యం’ అన్నపేరు వచ్చింది” అన్నాడు.

రాజుగారు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మంత్రి లేచి నిలబడి “ఇతను చెప్పినది నిజం మహారాజా…. ఈ కోట మీ తాతలు కట్టించినది. వారు కోటమొత్తం గుండ్రంగా ఉండేట్టూ శిల్పులకి చెప్పి కట్టించేరు. ‘పరుమండలం’ అంటే గుండ్రటిది అని అర్థం ఉంది. ఆ పేరే మన రాజ్యానికి స్థిరపడింది” అని వివరణ ఇచ్చేడు. రాజుగారు పరవశించి
పోయేరు. ప్రధాన వంటతను అంతా చూసి “మహారాజా, నిన్న మీరు మెచ్చుకుంటూ తిన్న బీరకాయ కూర వంకాయ కూరల కూరలు ఇతను స్వయంగా పండించి తెచ్చినవే” అని చెప్పేడు.

సభలొ అందరూ చప్పట్లు కొట్టేరు.‌

రాజుగారు కృష్ణుడికి సన్మానం చేసి, బంగారు కాసుల మూట బహుమానం ఇవ్వడమే కాక కూరలపాడులో
ఉన్న అయిదెకరాల బంజరు భూమి
కూరలు పండించిందికి అతనికి దానంగా ఇచ్చేసారు.

అతనిని ఇంటికి పల్లకి మీద పంపించేరు. పల్లకి దిగుతున్న కొడుకుని చూసి మంగమ్మ నిర్ఘాంత పోయింది. సంగతంతా విని ఆప్యాయంగా మెటికలు విరిచి, కొడుకుకి దిష్టి తీసేసింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!