తెలివి

తెలివి

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : జీడిగుంట నరసింహ మూర్తి

ఏదీ కలిసి రావడం లేదని శని పూజలు చేయించు కుంటే ఫలితం ఉంటుంది అని ఎవరో చెపితే నమ్మి గుడి దాకా వెళ్లి వెనక్కి వచ్చేసాడు పరమేశం. అసలే చేతిలో డబ్బు ఆడక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ శని పూజలు చేయించడానికి డబ్బులు ఎక్కడనుండి తేవాలని అతని ఉద్దేశ్యం. “ఇంట్లో పనికి రాని ఇనప కుర్చీలు, పెనాలు ఇంకా పాత బట్టలు ఎవరికైనా ఇచ్చెయ్. దానివల్ల కూడా కొంత శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో ఈ వస్తువులు ఎప్పుడు ఎవరికిచ్చినా వాళ్ళ చేతికి మాత్రమే ఇయ్యి. అప్పుడే నీ శని నిన్ను వదులుతుంది “అంటూ మిత్రుడు ఒకరు సలహా ఇవ్వడంతో “అవునవును. ఇంటినిండా పాత బట్టలు, ఉపయోగంలో లేని సామాను చాలా పడి ఉన్నాయి. అన్నట్టు వెలిసిపోయిన పాత చెప్పులు కూడా ఎవరికైనా ఇచ్చేద్దామని గోనె సంచిలో కట్టి ఉంచాను. అవి కూడా వదిలిస్తే శని ప్రభావంకు కొంత ఉపశమనం లభిస్తుందా ” అంటూ అడిగాడు పరమేశం ఆశగా ఆ మిత్రుడిని. ఆ మొత్తం వదిల్చేయ్యి. వట్టి పాత సామానంటే తీసుకునే వాళ్లుండరు. దానితో పాటు ఒక పదో ఇరవయ్యో వాటిమీద పెట్టి ఇయ్యి. కొంత ఫలితం ఉంటుంది”” అన్నా డు మిత్రుడు.
“ఓహో అదొకటా. ఆ డబ్బు కోసమే కదరా బాబూ ఇన్ని తంటాలు పడుతున్నది. మళ్లీ చేతిలో ఉన్న పదో పరకో కూడా వదిలేసుకుంటే నోట్లోకి చేతులు ఎలా వెళ్లడం?” అనాసక్తిగా మొహం పెట్టాడు పరమేశం.”ఇదిగో పరమేశం ఏదో నాకు తోచిన ఉపాయం చెప్పాను. నిజానికి నీ కన్నా నాకు శని బాధలు ఎక్కువున్నాయి. పిల్లకు పెళ్లి కావడం లేదు. నా పుత్రరత్నం నాలుగేళ్ళ నుండి పరీక్షలు తప్పుతున్నాడు. మా ఆవిడకు అంతుపట్టని అనారోగ్యం. శని వదుల్చుకోవడానికి నీకు చెప్పిన సామాన్లు ఎవరికైనా అంటగడదాం అనుకుంటే మా వాడు బయట అప్పులు చేసి ఉన్న సామాను కూడా అమ్ముకున్నాడు. నాకన్నా నువ్వే నయం. వస్తానురా. మా ఆవిడ అన్నం వండటానికి బియ్యం లేవంది. ఎవరేనా అప్పిస్తారేమో అని వెతుకుతున్నాను. నిన్ను అడుగుదాం అంటే నీ పరిస్థితి ఇంకోలా ఉంది” అంటూ నిరాశగా అక్కడనుండి నిష్క్రమించాడు పరమేశం ఫ్రెండ్.
“ఏం బాబూ బాగున్నావా. ఏమీలేదు. ఈ కూరలు బండి దగ్గర నిలబడి ఎంత సేపని అమ్ముతావు?నా దగ్గర ఒక కుర్చీ నిరుపయోగంగా పడి ఉంది అది నీకు పనికొస్తోంది. బేరాలు లేనప్పుడు దాంట్లో కూర్చో కాళ్ళు లాగెయ్యవు. అన్నట్టు కొద్దిగా పొట్టయిన బట్టలు కూడా ఉన్నాయి. చక్కగా ఇస్త్రీ చేయించి పెట్టాను. నీకేమైనా ఉపయోగ పడతాయంటే చెప్పు. ఊళ్ళు పట్టుకుని తిరుగుతూ ఉంటాం కదా ఎన్నో వస్తువులు జమైపోయాయి. రేపొద్దున ఒకసారి నీ కూరల బండి తీసుకు మా ఇంటివైపు రా. బండిమీద అన్నీ తీసుకు పోదువు గానీ. ఎవరెవరో అడుగుతూ ఉంటారు. తెలిసిన వాడిని నిన్ను పెట్టుకుని వాళ్లకు ఇవ్వబుద్ది కావడం లేదు, రేపు మర్చిపోకుండా రా.. నీ కోసం ఎదురు చూస్తూంటాను సుమా ” అని తను రెగ్యులర్గా పళ్ళు కొనే వీరయ్యకు పనిగట్టుకుని వెళ్లి చెప్పాక కొంత వరకు పనైపోయిందనుకుంటూ ఊపిరి పీల్చుకుని ఇంటికి చేరాడు పరమేశం. మాటికి మాటికి వీధివైపు తొంగి చూస్తున్న మొగుడిని “ఎవరైనా వస్తున్నారా ఏమిటి ? టీ ఇద్దామంటే చుక్క పాలు కూడా లేవు మీఇష్టం”అంటూ చిరాకు పడింది భార్య. “ఇదిగో మనింట్లో వాడని తుప్పు పట్టిన దోశెల పెనాలు ఉండాలి కదా. అవి ఈ మూల ఉంచు. ఇక్కడ ఒక కాలు పొట్టిగా ఉన్న ఇనప కుర్చీ కూడా ఉండాలి. అది ఎక్కడ పెట్టావ్?” అన్నాడు చుట్టుపక్కల వెతుకుతూ. “దాని సంగతి మీకెందుకు? అడ్డంగా ఉందని పక్కింటి పనిమనిషికి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. వచ్చి తీసుకెళ్తుంది కాసేపట్లో ” అంటూ చావు కబురు చల్లగా చెప్పింది. ఏడ్చినట్టుంది. అది నేనెవరికో ఇచ్చేస్తానని మాటిచ్చాను. వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను'” అన్నాడు కోపంగా. అయితే ఇక్కడ మొగుడూ పెళ్లాలిద్దరికీ అవతల వారికి సహాయ పడాలనే ఉద్దేశ్యం కన్నా ఆ వస్తువులిచ్చి ఏదో రకంగా శనిని వదుల్చుకోవాలనే తాపత్రయమే ఎక్కువ. వస్తానన్న కూరల బండివాడు ఆ రోజు కాదు కదా ఒక వారం రోజుల పాటు బండి ఎప్పుడూ పెట్టే ప్రదేశంలో కాకుండా ఇంకో చోటెక్కడో పెట్టుకున్నాడు. వాడి ఫోన్ నెంబర్ పరమేశం దగ్గర ఉండటంతో ” ఊరికే సామాను ఇస్తానన్నా కూడా మరీ అంత బలుపేమిటయ్యా. చూస్తూంటే మీరే మమ్మల్ని కొనేసేలాగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వచ్చి తీసుకుంటే తీసుకో లేకపోతే ఇక్కడ తీసుకునే వాళ్ళు క్యూ లో ఉన్నారు. గుర్తు పెట్టుకో ” అంటూ కోపంగా ఫోను పెట్టేసాడు పరమేశం. ఈ పెద్దమనిషికి కోపం వస్తే తన దగ్గర కూరలు కొనడం మానేస్తాడేమో అని సనుకున్నాడేమో వీరయ్య మర్నాడు ఉదయం బండి తీసుకుని వచ్చాడు.
పరమేశం మిత్రుడు చెప్పిన విషయం బాగా గుర్తు పెట్టుకున్నాడు ఇనప సామానులు అవతలి వారి చేతికి ఇచ్చినప్పుడే శని పోతుందని. “ఇదిగో వీరయ్యా. కాస్త ఈ సామాను అందుకో చాలా బరువుగా ఉన్నాయి ” అంటూ చేతికి ఇవ్వబోయాడు. “కింద ఉంచండి సార్ ఇనప సామాను చేతితో తీసుకోకూడదు. తీసుకున్న వాళ్లకు శని పడుతుంది ” అన్నాడు వీరయ్య వాటిని పొరపాటున కూడా చేతిలోకి తీసుకోకుండా.
పరమేశం వీరయ్య మాటలకు కంగు తిన్నాడు.ఓరి వీడి దుంపతెగిపోనూ వీడి జాగ్రత్తలు వీడూ తీసుకుంటున్నాడన్న మాట.అందరూ తెలివి మీరి పోయారు. ఇలా అయితే ఇక నా శని వదిలే మార్గం ? పరమేశం ఇన్ని రోజులుగా పడిన తపన బూడిదలో పోసిన పన్నీరైపోయింది. వీరయ్య చక్కగా పరమేశం ఇచ్చిన బట్టల మూటను లారీలు తుడుచుకునే వాళ్లకు, ఇనప సామానులు సామాన్ల కొట్టులో అమ్మేసి డబ్బు చేసుకున్నాడు. పరమేశం మాత్రం తనకు పట్టిన శని ఎలా వదుల్చుకోవాలా అనే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు పాపం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!