అమావాస్య వెలుగులు

అమావాస్య వెలుగులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

హాయ్ కావ్య, ఇంకా ఎంత సేపు? కాలేజికి టైం అయ్యింది. రా తొందరగా అంటూ పిలిచాను.
హా, దివ్యా వస్తున్నాను. రాత్రి పడుకునే సరికి లేట్ అయ్యింది. అందుకే పొద్దున్నే మెలుకువ రాలేదు. ఈ జడ వేసుకుని, రెడీ అయ్యి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది అంటూ సంజాయిషీ ఇచ్చింది. అంత ముచ్చటగా ఉండే జడను తిట్టుకోవడం ఎందుకు కావ్యా? మాకేమో మంచి జడ లేదని బాధ పడుతూనే ఉన్నాం కదా! మా అన్నయ్యది అంతా మొండితనం. ఈ రోజుల్లో ఎవరు ఇంత జడ వేసుకునేది అంటూ మూతి తిప్పింది. సరే, ఈ గోల మనకి ఎప్పుడూ మాములేగా. రాత్రి అంతా పరీక్షకు చదువుకున్నావా? లేట్ గా పడుకున్నాను అంటున్నావు అన్నాను. చదువా, పాడా నిన్న కాలేజీలో నన్ను ఒకడు ఏడిపించడం మా అన్నయ్య చూశాడట. ఎవరితో మాట్లాడకు, తల పైకెత్తి చూడకు, టైంకి ఇంటికి వచ్చేయ్యి అంటూ అందరూ కలిసి నాకు బుర్ర వేడెక్కించేస్తున్నారనుకో, అంది కావ్య. అదేంటి కావ్యా! మీ అన్నయ్య నిన్ను వెన్నంటి ఉన్నప్పుడు, నిన్ను కామెంటు చేస్తున్నప్పుడు చూశాడు కదా! వాడిని ఏమి అనకుండా నిన్ను తిట్టటం ఏంటి? అప్పటికప్పుడే వాడికి ముందు నిలబడి, మా చెల్లిని ఎడిపించే ధైర్యం నీకెక్కడిది? అని ఎదురు తిరిగితే, వాడు మళ్ళీ నీ జోలికి వచ్చేవాడు కూడా కాదు. అండలేని వారిపై ప్రతాపం కాదు, ఆదరించు వారిని, ఆత్మీయతతో, అని వారికి ఎలా చెప్పాలి? తల్లికి, చెల్లికి అండదండ అయి నిలువు. ఆదుకోని నీ బతుక్కి ఏముంటుంది విలువ అని కావ్య అన్నను నిలదీయాలాని ఉంది. ఆడపిల్లగా పుట్టటం పాపమా? అందంగా పుట్టడం నేరమా? విద్య కొరుకు ఆకాంక్ష మా దోషమా? సున్నితంగా ఉండటం ఘోరమా? దయ చూపండి మాకు అన్యాయం జరగకుండా, ఆదరించు మమ్ము ఆదేశించకుండా, ప్రేమను పంచు మాకు, ఆత్యాస పడకుండా, చిరునవ్వు చిందించు, మనసుపూర్వకంగా, ఆలోచిస్తూనే బస్ స్టాప్ లో అడుగు పెట్టాము. మాకు తెలియకుండానే, మా కళ్లు ఒక అమ్మాయి మీద ఆగిపోయాయి. అమ్మాయిలకే అసూయ కలిగించే అందం ఆమెది. అప్సరసను పోలిన అందం తనది. ముట్టుకుంటే మాసిపోయే చక్కదనం కలది. కలల రాకుమారిలాంటి రూపు గలది. ఆమె ఒక్కతే బెంచీ మీద కూర్చుని ఉంది. ఇద్దరు మగాళ్ళు(మృగాళ్లు) మాత్రం, ఆమె వేలు అయినా తాకాలి అనే కాంక్ష, చెప్పలేని కోరిక వారి కళ్ళల్లోనే అర్థం అవుతోంది. ఎలాగైనా సరే, ఆమెతో మాట కలిపి, ఒక్కసారి తాకాలని చూస్తున్న వారి ఆశల పై నీళ్లు చల్లినట్లు, ఒక శాంత్రో కారు వచ్చి ఆగింది. రూపంలో చంద్రుడిలా ఉన్న ఒక అబ్బాయి. వచ్చి, హే, పూజ ..సారీరా లేట్ అయ్యిందా? రోడ్ బాలేదురా, టైర్ పంక్చర్ షాప్ కూడా దగ్గరలో లేదు. ఏమైనా ఇబ్బంది పెట్టానా? అంటూ చుట్టూ పరికించి చూశాడు. పక్కన ఉన్న వాళ్ళను అనుమానంగా చూస్తూ. లేదు, సూర్య. నాకు ఇక్కడ బానే ఉంది. వచ్చి, వెళ్లే వాళ్ళను చూస్తు కాలం గడిపేసాను. టైం తెలియనే లేదు అసలు అంటూ ముగ్ధ మనోహరంగా నవ్వింది. ఆ నవ్వు చూస్తే గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. అన్నంత సోయగంతో ఉంది. ఆ నవ్వు. రండి ఆంటీ, మీరు మా విల్లా దగ్గరలోనే మీ ఇల్లు అన్నారుగా. మా కారులో వచ్చేయ్యండి అని ఆహ్వానించింది ఆమె. ఆంటీ మొహమాటంగా నవ్వారు. పర్లేదు ఆంటీ రండి. నేను మిమ్మల్ని డ్రాప్ చేసే, విల్లా వైపు వెళ్తాము ఆన్నాడు అతను. ( ఆంటీ బ్యాగ్ పట్టుకుని) మంచి తనమే వారి రూపంలో ఉందా? గర్వం లేని హుందాతనం అతనికి హారం కాగా, వెలకట్టలేని ఆ చిరునవ్వు అతనికి ఆభరణం అవగా, ఆమెపై హృదయం నిండా ప్రేమ ఉప్పొంగగా
మానవత్వానికి కొత్త అర్దం వారవ్వగా, కదిలారు ముందుకు సీతా రాములులా. వారే ఆదర్శ దంపతులు కాగా. మంచి తనం నింపుకున్న ఆ జంటను చూసి, ఆ (మృగాళ్లు) మగాళ్ళు దొరకని అదృష్టమును నిందిస్తూ, మనుష్యుల విలువ తెలుసుకుని సిగ్గుపడుతూ, వడి వడిగా నడిచారు. చిత్ర విచిత్రమైన సంఘటనల మద్య, చిలిపి చేష్టల మద్య, సరదా సంగతుల నడుమ ఆ రోజు కాలేజీ ముగిసింది. ఇంట్లోకి అడుగు పెడుతూనే, ఎవరో ఏడుస్తూ ఉన్నట్టు వినిపించింది. అటుగా చూస్తే, మా ఇంట్లో పని చేసే మల్లి. మల్లి, మళ్ళీ మొదలు పెట్టింది అనుకుంటూ, ఫ్రెష్ అయ్యి రావటానికి పైన తన గదిలోకి వెళ్ళింది. పాపం, మల్లి, సంపాదించినది మొత్తం కిట్టూ(మల్లి వాళ్ళ ఆయన)కి ఇచ్చేయ్యాలంట. నెల నెలా లెక్క చెప్పాలంట. ఒక్క పైసా తగ్గినా అసలు ఒప్పుకోడంట. అంతే కాదు, ఆసుపత్రికి వెళ్ళాలన్నా, డబ్బులు ఇవ్వడంట. అందులో ఈ మధ్య దానికి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు. రొమ్ములు నొప్పి అని ఒక్కటే గోల చేస్తోంది పాపం. ఒక్క రాత్రి కూడా దూరంగా పడుకుంటే అసలు ఊరుకోడంట. రొమ్ములను నొక్కి నొక్కి ఎప్పుడో నిద్ర పోతాడట. అయినా తను పక్కలోంచీ లేస్తే, అరచి గోల పెడుతున్నాడంట. పాపం బాగా ఇబ్బంది పడుతోంది. మీ స్నేహితుడి భార్య గైనకాలజిస్టు కదా, ఒక్కసారి మల్లిని చూపించి తీసుకు వద్దామా అని అడుగుతోంది అమ్మ. నాన్న సరే అని తలూపారు. ఒక్క మగాడు సరిగ్గా లేకపోతే ఆడవారికి అన్ని ఇబ్బందులా, అనుకుంటూ అక్కడి నుంచి కదిలాను. భోజనాలు చేసి, ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు. అన్నయ్య మాత్రం టి. వి.లో క్రికెట్ వస్తూంటే చూస్తున్నాడు. మంచి నీళ్లు తాగుదామని వచ్చిన నాకు, అమ్మానాన్న మాటలు వినిపించాయి. ఈ సంవత్సరం దివ్యకి పెళ్ళి చేద్దామండి. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడితే, ఏ ఊరిలో పోస్టింగ్ వస్తుందో తెలియదు. ఆ నాలుగు గింజలు వేస్తే, తను కూడా ఒక ఊరిలో సెటిలయిపోవచ్చు అంటోంది అమ్మ. హా, మొన్న నేను చూపించిన ఫోటోలో అబ్బాయిని చూశావుగా! అన్నింటికీ తగిన జోడి వాళ్ళు ఇద్దరు అనిపిస్తోంది అన్నారు నాన్న.
అమ్మో, నా పెళ్ళి ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. నాకు ఎలాంటి వాడు వస్తాడో అనుకుంటూ ఉండగా తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నన్ను అలా చూసి, వారి మాటలు విన్న అన్నయ్య దీరు వచ్చాడు. దివ్యా , ఎందుకు అంత కంగారు.  ఆ పెళ్ళికొడుకు మన దిలీప్. నా స్నేహితుడు దిలీప్. నువ్వంటే వాడికి చాలా ఇష్టం. మన కుటుంబం మీద గౌరవంతో ఈ మాట నీకు చెప్పకుండా, ముందు మాకు చెప్పాడు. ఏది ఏమైనా, నీకు ఇష్టం అయితేనే ఈ పెళ్ళి జరిగేది. అంటూ ముగించాడు.  అన్నయ్యా,. దిలీప్ హా, అవునా.. అంటూ సిగ్గుపడుతూ అన్నయ్య ఒడిలో తల దాచుకుంది కొత్త పెళ్ళికూతురు. మా మాటలు విన్న అమ్మానాన్న కూడా బయటకు వచ్చారు. నన్ను ఓదార్చుతున్న అన్నయ్యను చూసి, పిచ్చి పిల్లా నువ్వు ఏదో ధైర్యం గల పిల్లవి అనుకున్నాను. చదువుకున్న దానివి, తెలివైన దానివి నువ్వే ఇలా అయిపోతే మిగిలిన ఆడ పిల్లల మనసులు ఇంకా ఎంతలా చలించిపోతాయి. అంటూ అనునయంగా చెపుతోంది అమ్మ. భయం ఎందుకు దివ్యా?
అబ్బాయి కొత్త వాడు కూడా కాదు. నిన్ను కోరి వచ్చాడు. మా అండ దండలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. ఇకపోతే, మేము మిమ్మల్ని ఇద్దరినీ ఏ విషయంలోను సందిగ్ధంతో పెంచలేదు. ఆడపిల్ల అయినా, మగ పిల్లాడు అయినా ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలి. ఏ సమస్య వచ్చినా గుండె ధైర్యంతో ముందుకు నడవాలి. ఎదుటివారి పైన ఆధారపడి జీవితం సాగించ కూడదు. ప్రేమకు, అధికారానికి తేడా తెలుసుకుని వ్యవహరించడం చాలా అవసరం. అంటూ జీవిత సత్యాలు చెప్పారు నాన్న. ఆ మాటలకు చాలా ధైర్యం వచ్చింది. నాకు తప్పొప్పులు చెప్పేది తల్లిదండ్రులు, వెన్నుతట్టి ముందుకు నడిపేది తోబుట్టువులు. కష్టంలో సైతం నేనున్నాను అంటూ చేయూత ఇచ్చేది స్నేహితులు బంధంతో పాటు, భాద్యత కూడా వివరించేది జీవిత భాగస్వామి. భార్యాభర్తలను, పరిపూర్ణులను చేసే వారు పిల్లలు, వయసు పైబడిన తరువాత ఊతం అందించేవారు భాద్యత కలిగిన వారు. ఎవరి జీవితంలో అయినా, ఇలాంటి వివిధ దశలు ఉంటాయి. ఏ దశలో ఏ ఆపద సంభవించునో ఎవరికీ తెలియదు. అందుకే నీ జీవితంలోని అమావాస్యకు వెలుగును నింపుకోవటానికి ధైర్యం అనే కొవ్వొత్తిని ఎల్లప్పుడూ నీ గుండెల్లో నింపుకోవాలి. అప్పుడే నువ్వు నిత్య నూతనంగా యవ్వనంతో కళ కళ లాడుతూ ఉంటావు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!