అందుకో ఈలేఖ!

అందుకో ఈలేఖ!

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

ప్రియమైన కలమా!

అందుకో ఈ లేఖ!ఇదే నా ప్రేమలేఖ!రాస్తున్నా ఇక ఆగలేక. ఓ కలమా నిన్నెలా పొగడను!నిన్నెలా మరువగలను! నేను ఆరవతరగతిలోకి ప్రవేశించాను. అప్పుడే నీతో పరిచయం. ఇంకా పరిచయం అయ్యిందో లేదో మా, తెలుగుమాష్టారు ఘాండ్రింపులు ఆరంభించారు.
“ఓరయ్ చంద్రం!ఏమిట్రా కోడికెలీకినట్లు ఆ రాతలు!
నీకు కలంతో రాయడం చేతకాదుగాని, పెన్సిల్ తోనే రాయి. ఎన్నిసార్లు రాసిన చెరుపుకోవచ్చు. అప్పుడు నేనెంత ఏడ్చానో తెలుసా? అయినా నిన్ను ఒక్క మాట అనలేదు. పోనిలే నామీద నీకు ఇష్టం కలగలేదనుకొని సరిపెట్టుకొన్నాను. అయినా ఇంకా నీమీద ఇష్టం పెంచుకున్నానేగాని మానలేదు. అలా అలా నీమీద ఇష్టంతో ఎన్ని తిట్లుతిన్నా ఎన్ని కష్టాలు పడినా, నిన్ను వదులుకోలేదు. అలాగే నీమీద ఇష్టాన్ని పెంచుకొని పదవతరగతి, కళాశాల పట్టబద్రుడనయ్యాను. ఒక్క పరీక్షలకే కాదు కథలు కవిత్వాలు రాయడానికి కూడా నిన్నెంతగా వాడుకున్నానో. ఎంత కష్టపెట్టానో మరి నువ్వుకూడా నన్ను బాగానే అర్ధంచేసుకున్నావు నాతో సహాచర్యం పెంచుకున్నావు. నాకు అన్నివిధాల తోడ్పడ్డావు. నిన్ను కోత్తగా ప్రేమించిన ప్రేయసిని రకరకాల రంగుల వస్త్రధారణలో చూసుకోవాలనుకున్నట్టు గానే నేను నిన్ను రంగురంగుల రూపంలో ఇష్టపడి వాడేవాడిని. ఉద్యోగపర్వం మొదలైంది. మా మేనేజరుగాడు(గారు) ఏమనేవాడో తెలుసా! ఏంటోయ్ చంద్రం నీకలం రాత డాక్టరు రాసిన చీటి రాతలవుంటుందయ్యా! అర్ధం చేసుకోవాడానికి నాతలప్రాణం తోకకు వస్తోంది. కొంచెం అర్ధం అయ్యేలా రాయవయ్యాబాబు! “అంటు సుతిమెత్తని చివాట్లు పెట్టెవాడు. అన్నీ భరించేవాడిని.
పెళ్ళైనాక ఇక చూడు నా గతి. నా అర్ధాంగికి నీ మీద అసూయ ఏర్పడిందనుకో! ఆఫిసులో వెలగబెట్టిందిచాలక ఇక ఇంటిదగ్గర ఆ కలం కాగితాలు వదల్రా. మీకేం ఎక్కువ జీతాలిస్తున్నారా?నాతో సంసారం చేసేదేమైనా వుందాలేదా? నేను మా పుట్టింటికి పోయేదా? ఏదో వెంటనే తేల్చి చెప్పండి” అంటు బెదరింపులు. అయినా నేను నిన్ను వదలలేదు. అదిగో అప్పుడే నెత్తిమీద పిడుగు పడినట్లు కంప్యూటర్ వచ్చిపడింది. చరవాణిలు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. ఇక నీకు దూరంగా ఉండక తప్పలేదు. ఈ ఎడబాటు దీర్ఘకాలంగా కొనసాగినా అప్పుడప్పుడు నిన్ను చెక్కులు మీద సంతకాలు పెట్టడానికి, పోస్టల్ కవర్లమీద చిరునామాలు రాయడానికి, ఏటిమ్ లొ డబ్బులు లేకపోతే బ్యాంకు డబ్బులుతీసే ఫారమ్ నింపడానికి నువ్వేదిక్కుమరి. ఎంత సాంకేతికత పెరిగినా నిన్ను ఎవరూ ఉపేక్షించగలరు. ఎవరు విడచి పెట్టగలరు. నీ సహచర్యం ఎప్పటికి వుండాలని కోరుకుంటూ నిన్నే సదా ఇష్టపడే నీ అభీమానిననేకంటే నీ ప్రేమికుడిని.
ఇట్లు
చంద్రం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!