బాధ్యత నెరిగిన ప్రేమ

బాధ్యత నెరిగిన ప్రేమ

రచన: సుజాత.పి.వి.ఎల్

“అయితే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదంటావు” కోపంగా ముక్కుపుటాలు ఎగరేస్తూ అంది క్షితిజ.
‘అలా అని నేననలేదు..కానీ లేచిపోవడం మంచి పద్ధతి కాదంటున్నాను…”
“ఓఁ..పద్ధతులన్నీ తెలిసిన వాడివి…ఎవత్తినైనా పెళ్ళిచేసుకుని ప్రేమించక పోయావా…నన్ను ప్రేమించడమెందుకు? నాకోసమే నువ్వనుకున్నాను…మా వాళ్లందరూ నీ తర్వాతే అనుకున్నాను…అందుకే..అందుకే వాళ్ళనెదిరించి వచ్చేశాను. ఆడ పిల్లనైన నేను ఇంత తెగిస్తే నువ్వు మాత్రం ఇంకా ఆలోచిస్తున్నావు… మీనమేషాలు లెక్కపెడుతున్నావు..ఏవేవో నీతులు చెబుతున్నావు”
వెటకారాన్ని క్రోధంతో మిళితం చేస్తూ అంది.
“చూడు క్షితిజ…కాస్త కోపం తగ్గించుకుని సావధానంగా నేను చెప్పేది విని…ప్రేమ అనేది ఎవరూ అనుకుని చేసేది కాదు.. అదోఅనిర్వచనీయమైన బంధం.. అది ఎలా ఎప్పుడు ఎవరి మధ్య కలుగుతుందో ఎవ్వరం చెప్పలేం.. నువ్వు డబ్బున్న దానివని గాని.. గొప్ప సౌందర్య రాశివని గానీ నేను ప్రేమించలేదు..ఎందుకో నిన్ను చూడగానే నా మనసు స్పందించేది…విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవాడిని.. అదే విషయం నీతో ప్రస్తావించాను. నువ్వు కూడా ఒప్పుకునే సరికి నాపట్ల నీక్కూడా అదే అభిప్రాయం ఉందని అర్థమైంది. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా అమ్మ నానా కష్టాలు పడుతూ పెంచింది. నాన్న లేని లోటు తెలియకుండా చదివించింది. నన్నింతటి వాడ్ని చేసింది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే భర్తగా నీ బాధ్యత నేను తీసుకుంటాను. నా మీద నమ్మకంతో నువ్వు నాతో వచ్చేస్తావు. స్వతహాగా ధనవంతులైన నీ తల్లిదండ్రులకి మనమెక్కడున్నామో తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. నువ్వు దూరమయ్యావనే బాధ తప్ప వాళ్లకి ఏ బాధా ఉండదు. కానీ, నేను దూరమయ్యాక నా కన్న తల్లికి బ్రతుకు భారమవుతుంది. కనీ పెంచిన ఆధారం కనుమరుగయ్యేసరికి కుప్పకూలిపోతుంది. ప్రేమ కోసం కన్నతల్లికి స్వార్థంతో దూరమవడం న్యాయమంటావా?నువ్వే ఆలోచించు..నాకోసం నువ్వు రా కన్నా,నేను బతికుంది నీ కోసమే రా” అంటూ ఇప్పటికి నన్ను అడ్డాల నాటి బిడ్డలా గారాబం చేస్తూ.. ప్రేమని పంచిపెడుతున్న తల్లిని క్షోభ పెట్టడం ధర్మమా? చెప్పు” అన్నాడు .
అప్పటికే వికలిత అయినా క్షితిజ కన్నీళ్లతో…” లేదు..రోహిత్.. లేదు.. తల్లిని అభిమానించేవాడు…భార్యని ప్రాణప్రదంగా ప్రేమిస్తాడు..ఈ రోజుల్లో కూడా తల్లిని ఇంతలా ప్రేమిస్తారా! ఒకింత ఆశ్చర్యం కలిగినా..మరింత గర్వంగా ఫీల్ అయింది. రోహిత్ పై ప్రేమ రెట్టింపైయింది క్షితిజకి. “నాకు ఆ ప్రేమ కావాలి. ఏ స్వార్థం లేని స్వచ్ఛమైన నీప్రేమ కావాలి. ఇవాళే మన ప్రేమ విషయాన్ని మా డాడీకి చెబుతాను. నీ అంత మంచి వాణ్ణి ఎవరొదులుకొంటారు. డాడీ ఖచ్ఛితంగా ఒప్పుకొంటారు. పెద్దల అంగీకారంతోనే ఒకటవుదాం!. క్షణికావేశంలో నేను మాట్లాడిన మాటలు నీ మనసుని గాయ పరిచి వుంటాయి సారీ.” అంది.
తేలికైన మనసుతో క్షితిజని దగ్గరికి తీసుకున్నాడు. క్షితిజ అతని గుండెల్లో గువ్వలా ఒదిగి పోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!