బా(నిస)త్వము

(అంశం:”బానిససంకెళ్లు”)

బా(నిస)త్వము

రచన:డా॥అడిగొప్పుల సదయ్య

భావ జాలమునందు బానిసత్వము వద్దు
నీదైన వాదమును నిక్కచ్చిగా చెప్పు

జగతిలో ప్రతిజీవి జన్మించు స్వేచ్ఛగా
పెక్కు సంకెళ్ళతో బిగిసికట్టును జగతి

కట్టు మనదీ కాదు బొట్టు మనదీ కాదు
గట్టిగా వేసేటి తిట్టు మనదీ కాదు

అడుగడుగు బతుకులో అణగదొక్కెడి అడుగు
బడుగు జీవుల యెడల బాగ బలసిన పిడుగు

చరితలో మిగిలినవి చిరకాలమై గొప్ప
తిరుగుబాటులు ఎన్నొ తీవ్రముగ గర్జించి

బానిసత్వపు లంకె బలిగొనును బేలలను
నిశ్శబ్ద హారియై నిండి దృక్పథమందు

బానిసత్వము సోక పారిపోవును తనము
అవిటియై,అల్పుడై అచ్చోటనే పడును

ఇజమునిజములెరుగని ఇహలోక ఓ నరుడ!
బానిసత్వము దెంప బాకాడవేలరా?

నీ తలపు,నీ మలుపు నీకోసమై చేయి!
నీ పదము,నీ పథము నీకోసమై వేయి!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!