చైత్రమాధవం

(అంశం:: “నా ప్రేమ కథ”)

చైత్రమాధవం 

రచన:సావిత్రి కోవూరు 

“విశాల్ ఏమైందిరా అలా ఉన్నావు? రాత్రి నిద్ర పోలేదా?” అన్నాడు అనురాగ్

“ఏం లేదులే” అన్నాడు కానీ వాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాత్రంతా నిద్రపోలేదని తెలుస్తుంది. వారం రోజుల క్రింద ఫ్రెండ్స్ అందరం కలిసి అండమాన్ వెళ్లి అక్కడి నుండి చుట్టుపక్కల అన్ని చూసుకుని నిన్ననే వచ్చాము. నిన్న బాగానే హుషారుగానే ఉన్నాడు. నిన్నటికి ఈరోజుకు అంత తేడా ఏమిటి? ఏదో జరిగింది చెప్పలేకపోతున్నాడు. వాడిని మా ఇంటికి తీసుకెళ్లి ఎవరు లేకుండా అడిగి తెలుసుకోవాలి అనుకున్నాను.

“రారా మా ఇంటికి వెళదాము. మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. నా గదిలో రెస్ట్ తీసుకుందాం.” అన్నాను. విశాల్ కి కూడా అదే మంచిది అనిపించింది. ఇద్దరు మాదాపూర్ లో ఉన్న అనురాగ్ ఇంటికి వెళ్లారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న అనురాగ్ గదిలో విశాల్ ని కూర్చోబెట్టి కిచెన్లో ఉన్న  అన్నం కొంచెం పెట్టుకుని పెరుగు కలిపి తీసుకొచ్చి,

“నీ వాలకం చూస్తే నీవు రాత్రి నుండి ఏమీ తిన్నట్టు లేదు. మొదట ఈ అన్నం తిను” అన్నాడు.

అన్నాన్ని చూసేసరికి అప్పటివరకు జ్ఞాపకం రాని ఆకలి జ్ఞాపకం వచ్చి గబగబా తినేశాడు.

“ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు.” అన్నాడు అనురాగ్.

“నేను చెప్తాను కాని, నీవు ఎవరికి చెప్పకు. దాని వల్ల ఉపయోగం ఉండదు కానీ, నేను బాగా ఇష్టపడే అమ్మాయికి ఫ్యూచర్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. నేను మనశ్శాంతి లేకుండా ఉన్నాను. ఆ అమ్మాయి అయినా సుఖపడని” అన్నాడు.

“నీవు బాగా ఇష్టపడే అమ్మాయా? అంటే నీ ప్రేమ కథా? అన్నాడు

“అవును నా ప్రేమ కథ”

“ఎప్పుడు చెప్పలేదు మాకు ఎవరామె? ఎక్కడ ఉంటది? నేను వెళ్లి ఒప్పిస్తాను చెప్పు” అన్నాడు.

“ఇప్పుడు వీలుకాదు. చేయి దాటిపోయింది. టూర్ పెట్టుకోకపోయుంటే ఒక ఛాన్స్ ఉండేది.” అన్నాడు.

“ఇంతకు ఎవరు చెప్పరా” అన్నాడు అనురాగ్.

“ఆ అమ్మాయి మా బావ చెల్లెలు, మా అక్కకు ఆడపడుచు. నాకు చిన్నప్పటి నుండి తెలుసు. రెండేళ్ల నుండి అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వాళ్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు చెప్పొచ్చు అనుకున్నాను. ఈ లోపల ఆ అమ్మాయికి ఏదో మంచి సంబంధం వచ్చిందట వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని వారంలో పెళ్లి పెట్టుకున్నారు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతాడట. నాకు నిన్న వచ్చిన తర్వాత తెలిసింది.”

“ఇప్పటికైన ఆ అమ్మాయికి నీవు నీ మనసులో మాట చెప్పావా, లేదా? అన్నాడు అనురాగ్.

“అదే నేను చేసిన మొదటి తప్పు. కానీ ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టం అని తెలుసు.”

“ఎలా తెలుసు? ఎప్పుడైనా ఆ అమ్మాయి చెప్పిందా?”

“లేదు నిన్న తను నాతో తన పెళ్లి కుదిరిందని, చెప్పేటప్పుడు కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. ‘ఎందుకిలా చేశావు మీ అన్నయ్యతో నీ మనసు లోని విషయం చెప్పొచ్చు కదా’ అంటే

“నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఎప్పుడు నాతో చెప్పలేదు కదా” అన్నది.

“నేనెప్పుడూ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన కనబడేది. తను నా వైపు ఆరాధనగా చూసేది. నాకు చాల ఇష్టంరా ఆ అమ్మాయంటే. నేను వెంటనే చెప్పాల్సి ఉండే. ఇంత తొందరగా ఆ అమ్మాయికి పెళ్ళి కుదిరిస్తారనుకోలేదు. నేను తర్వాత మెల్లగా మా అక్కకి చెప్పి, ఒప్పించి మా బావకు చెప్పమని అడుగుదామనుకున్నాను. మా అక్కకైన, మా బావ కైనా, ఆ అమ్మాయికైనా చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు” అన్నాడు విచారంగా.

“ఇప్పటికైనా మించిపోయింది లేదు. బాధ పడకు మీ అక్కకు ఎలాగైనా ఈ పెళ్లి ఆపమని చెప్పు” అన్నాడు అనురాగ్.

“అమ్మో వాళ్ళ మామగారు చాలా స్ట్రిక్ట్. ఆయనతో మాట్లాడాలి అంటే అందరికీ భయమే. పైగా పెళ్ళికొడుకు, ఆయన ఫ్రెండ్ కొడుకని తర్వాత తెలిసిందట.”

“నీ ప్రేమ కథ వింటుంటే నా బుర్ర తిరిగి పోతుంది. మురళి గాడిని పిలుద్దాం ఏదైనా ఉపాయం చెప్తాడు” అన్నాడు

“వద్దురా అందరికీ తెలిస్తే ఆ అమ్మాయి జీవితం పాడవుతుంది. ఏదైనా తేడా వస్తే బాగుండదు” అన్నడు విశాల్.

“లేదు వాడు ఇలాంటి టైంలో  మంచి ఉపాయం చెప్తాడు. నేను పిలుస్తాను.” అని

మురళికి ఫోన్ చేసి “ఒకసారి అర్జెంటుగా రారా ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అన్నాడు. ఒక అరగంటలో మురళి, అనురాగ్ ఇంటికి వచ్చాడు.

“ఏంట్రా అంత ముఖ్యమైన విషయం. మా నాన్న ఏదో పని చెప్పాడు. మా అన్నయ్య పెళ్ళి దగ్గర పడింది కద. నేను తొందరగా వెళ్ళాలి.”అన్నాడు మురళి.

అనురాగ్, విశాల్  ప్రేమకథను అంతా చెప్పి, “ఇప్పుడు చెప్పు ఏం చేసి ఎవరు బాధపడకుండా ఈ పెళ్లి ఆపి మనోడితో పెళ్ళి జరిపించ గలుగుతాము.” అన్నాడు.

“అరే, ప్రేమిస్తే కనీసం ఆ అమ్మాయితోనైన చెప్తే, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్లకి చెప్పేది కదా! నన్ను కొంచెం ఆలోచించుకోని ఎలా చేస్తే బాగుంటుందో. పెళ్లి ఇంకా వారం రోజులు ఉంది కదా! అన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ అమ్మాయిని అడిగి ఆ పెళ్ళికొడుకు అడ్రస్ కనుక్కో” అన్నాడు.

“ఆ అబ్బాయి అడ్రస్ ఎందుకు రా బాబు” అన్నాడు తల పట్టుకొని.

నీవు మొదట ఆ అమ్మాయికి ఫోన్ చేసి పెళ్లి కొడుకు అడ్రస్ కనుక్కో”అన్నాడు

ఆ అమ్మాయి చెప్పిన అడ్రస్ ను పట్టుకొని అతని ఇంటికి బయలుదేరారు మిత్రత్రయం. కొంతదూరం వచ్చాక,

“ఆ అబ్బాయి ఉండేది తార్నాకలోనే కనుక నాకు తెలుసేమో చూస్తాను. ఏది ఆ అడ్రస్ కాగితం ఇటియ్యి” అని మురళి అనురాగ్ చేతిలోంచి ఆ అడ్రస్ కాగితం తీసుకుని చూసి,

“అరేయ్ విశాల్, ఇది మా ఇంటి అడ్రస్ రా బాబు.  పెళ్ళి కొడుకు పేరు ‘మాధవా’ కొంపదీసి” అన్నాడు.

“అవున్రా అబ్బాయి పేరు ‘మాధవ్’ అనే చెప్పింది ఆ అమ్మాయి.” అన్నాడు విశాల్.

“మాధవ్ అంటే మా అన్నయ్యనే రా. వాడి పెళ్లి వారం రోజులు ఉంది. ఇప్పుడు నేను ఏం చేయన్రా. మా అన్నయ్య ఆ అమ్మాయిని ఎక్కడో చూసి, నచ్చితే ఇష్టపడి పెండ్లి సెటిల్ చేసుకున్నాడు.” అన్నాడు.

స్నేహితులేమి మాట్లాడలేకపోయారు. కొంతసేపటికి మురళి “మా అన్నయ్య కూడా పెళ్లి కుదిరినప్పటి నుండి అంత ఉత్సాహంగా లేడు. వాడు కోరుకున్న
అమ్మాయితోనే పెళ్ళవుతున్నా, వాడెందుకలా ఉంటున్నాడో అర్ధమవ్వటంలేదు. వాడేదో దాస్తున్నాడా, అనిపిస్తుంది. కనుక నేను వాడికి ఈ విషయం ఏమైనా తెలిసిందేమో కనుక్కుంటాను. వెళదాం పదండి. ఇప్పుడైతే ఇంట్లో వాడొక్కడే ఉన్నాడు” అన్నాడు మురళి.

అందరు కలిసి ఇంట్లోకి వెళ్లేసరికి మురళి వాళ్ళ అన్నయ్య మాధవ్ ఏదో ఆలోచిస్తున్నాడు. వీళ్ళు వెళ్లి కూర్చున్నారు. “ఏంటన్నయ్యా నీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటున్నావుగా, ఎందుకు అంత సంతోషంగా లేవు?” అన్నాడు మురళి.

“ఏం లేదురా. నేను బాగానే ఉన్నా.” అని మాట దాట వేయడానికి ప్రయత్నించాడు మాధవ్.

“కాదన్నయ్య నీవెందుకలా ఉంటున్నావో చెప్పు. మేము ఏమన్నా సహాయం చేయగలుగుతామేమో చూద్దాం” అన్నాడు.

“అది కదురా, ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. పెద్దవాళ్లకు చెప్పకండి.పెద్ద గొడవై పోతది. ఇప్పుడు మీరు ఏమి చేయలేరు కానీ, నా మనసులో మాట చెబుతాను. నేను అమెరికా నుండి వచ్చిన మరుసటి రోజు నుండి ఎంతో మంది అమ్మాయిలను పెళ్లి చూపుల్లో చూశాను. కానీ నాకెవ్వరు అంతగా నచ్చలేదు. కాని మన లావణ్యత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లావణ్య అత్త కూతురు సృజన ఫ్రెండ్ ఒక అమ్మాయి కనబడింది. ఆ అమ్మాయిని చూడగానే నాకు చాలా బాగ నచ్చింది. ఆ అమ్మాయి ఎంత నచ్చిందంటే వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ సృజన దగ్గర నుండి తీసుకుని నాన్న చేత ఫోన్ చేయించాను.

“మీ అమ్మాయిని, మా అబ్బాయి ఎక్కడో చూశాడట. మీకు ఇష్టమైతే వాడు మీ అమ్మాయిని పెండ్లి చేసుకోవాలను కుంటున్నాడు. మీరు సరేనంటే మేము రేపు పెళ్లి చూపులకు వస్తాము” అని చెప్పాడు.

“వాళ్ళు ఒప్ఫుకోవడంతో మరుసటి రోజే వాళ్ళింటికి పెళ్లిచూపులుకి వెళ్ళాము. అక్కడి కెళ్ళాక తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ నాన్న మన నాన్నకి చిన్నప్పటి స్నేహితుడని.

పెద్దవాళ్ళు అబ్బాయికి అమ్మాయి నచ్చింది కనుక, అమ్మాయికి అబ్బాయి నచ్చిడా అని అడిగారు. నేను నచ్చిందని ముందే చెప్పాను. కనుక నన్నెవరు నా అభిప్రాయం అడగకుండానే తాంబూలాలు కూడ మార్చుకున్నారు. వెంటనే ముహూర్తం నిర్ణయించి లగ్న పత్రిక కూడా రాసుకున్నారు. టైం ఎక్కువ లేదని. నేను చెబుదామని అనుకుని, ఆ అమ్మాయి ముఖం చూసి ఏమి చెప్పలేకపోయాను. కానీ ఆ అమ్మాయి లావణ్య అత్త ఇంట్లో చూసిన అమ్మాయి మాత్రం కాదని తెలుస్తుంది. దగ్గర పోలికలు ఉండటంతో వాళ్ళ సిస్టర్ అయి ఉంటుందని అర్థం అయింది. ఇప్పటి వరకు ఎవరిని చూసినా నచ్చలేదని చెబుతుంటే అమ్మకు నాన్నకు అంత మంచి అమ్మాయిలు నీకు ఎందుకు నచ్చటం లేదు. ఇప్పుడు సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకోకపోతే మళ్లీ ఏడాది వరకు వీలుకాదు నీవు రావడానికి అని విసుక్కున్నారు.

ఇప్పుడు నేను చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదు అంటే, చాలా బాధ పడతారు. అందుకే ఏమీ చెప్పలేక పోతున్నా. ఇప్పుడు ఇంత వరకు వచ్చాక పెళ్లి ఆగిపోతే నాకు నచ్చిన అమ్మాయిని వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అంతే కాకుండ ఈ అమ్మాయికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఏమీ చెప్పలేక పోతున్నా” అన్నాడు.

ముగ్గురు స్నేహితులు ముఖాలు చూసుకుని నవ్వడం మొదలు పెట్టారు.

“నా సమస్య వీళ్లకు నవ్వులాటగా ఉంది. సమస్యను తీర్చక పోయినా పర్వాలేదు కానీ, మీరు ఎగతాళిగా నవ్వకండిరా” అన్ని విసుక్కున్నాడు మాధవ్.

“ఎగతాళి కాదు రా బాబు మంచి సొల్యూషన్ దొరికింది. కానీ నీవు విశాల్ ఒక అవగాహనకు వచ్చి ధైర్యం చేయాల్సి ఉంటుంది” అన్నారు మిత్రత్రయం.

విశాల్ జేబులోంచి సెల్ తీసి వాళ్ళ అక్క కూతురి పుట్టినరోజు ఫొటోస్ చూపించి “నువ్వు చూసిన అమ్మాయి ఈ ఫోటోలో ఉందా చెప్పు” అన్నాడు.

ఆ ఫొటోస్ చూసిన మాధవ్ ఒక ఫోటోను చూపించి “ఈ అమ్మాయినే నేను లావణ్యత్త వాళ్ళింట్లో చూసింది. ఆ పక్కన ఉన్న అమ్మాయి ఇప్పుడు నాకు పెద్దలు కుదిరించిన అమ్మాయి” అని చైత్రను చూపించాడు.

“వీళ్ళ ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి” అన్నాడు.

“అన్నయ్యా అదంతా దారిలో చెబుతాను.ఇక నీవు బయలుదేరు విశాల్ వాళ్ళ అక్క ఇంటికి వెళ్దాం” అని విషయమంతా చెప్పారు.

తేలికైన మనసుతో అందరూ కలిసి వెళ్లి, విషయం అంతా వాళ్ళ అక్కకి చెప్పారు. ఆమె భర్తతో చెప్పింది. ఆయన తండ్రితో చెప్పాడు.

వాళ్ళ నాన్న రాఘవయ్యగారు “అదెట్లా కుదురుతుంది చందన జాతకం, మాధవ్ జాతకం అన్ని విధాల కుదిరిందని పెళ్ళి నిశ్చయించాము. జాతకాలు కుదిరిన అమ్మాయిని కాకుండా వేరె అమ్మాయిని ఎలా చేసుకుంటాడు. మళ్ళీ జాతకాలు చూపించాలి, లగ్న పత్రికలు రాయించాలి. వాళ్ళిద్దరికీ కుదురుతుందో లేదో తెలియదు. అయినా తనకు ఇష్టమని ముందు చెప్తేనే కదా ఇంత చేశాము.” అని కసురుకున్నాడు.

అప్పుడు మాధవ్ , విశాల్  ఇద్దరు రాఘవయ్య గారి కాళ్ళ పైన పడి పొరబాటైంది మామయ్యగారు. మమ్మల్ని క్షమించండి. మీరెలాగైన మేము కోరుకున్న వాళ్ళను మాకిచ్చి పెళ్లి చేయండి” అని వేడుకున్నారు. ఎన్నో తర్జనభర్జనల తర్వాత రాఘవయ్య గారు చివరకు సరే అనక తప్పలేదు.

విశాల్ ప్రేమించిన ‘చైత్ర’ను విశాల్ కి ఇచ్చి, మాధవ్ చూసిన ‘చందన’ను మాధవ్ కి ఇచ్చి, వారం రోజుల్లోనే రెండు పెళ్ళిళ్ళు ఘనంగా చేశారు. అందరు సంతోషించారు.

మాధవ్, విశాల్ జంటలు వాళ్ళ ప్రేమ కథలను సుఖాంతం చేసినందుకు,  మిత్రులకు సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!