చీకటి తరువులు

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

చీకటి తరువులు

రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

రితిక హడావిడిగా వచ్చి అశోక్ చెంప చెల్లుమనిపించింది.అక్కడున్న వాళ్ళంతా అవాక్కై చూస్తున్నారు ఎందుకు రితిక అలా కొట్టిందో అర్థం కాలేదెవ్వరికీ.ఏమైందోనని అనుకునే లోపే అశోక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కిందికి దూకేయబోయాడు. అక్కడున్న వాళ్ళు ఆపి కుర్చీలో కూర్చోబెట్టారు.రితిక ఆక్రోషంతో చావనివ్వండి ఫ్రెండ్స్ బతికి ఎవరిని ఉద్దరిస్తాడు అంటూ అశోక్ కాలర్ పట్టుకోవడంతో అందరూ ఏమైందో చెప్పు రితికా..!అశోక్ తో మేం మాట్లాడుతాం అంటూ సర్దిపెట్టారు.చల్లబడ్డ రితిక శాంతంగా “ఒక వగలాడితో అశోక్ అక్రమ సంబంధం పెట్టకొన్నాడని ,నేనే కళ్ళారా చూశానని , నిలదీస్తే ఏవేవో కథలు చెప్తున్నాడంటూ” వాపోయింది.అంతా విన్న మిత్రుడు గోపి అశోక్ ఎలాంటి వాడో నీకు తెలియదా రితిక,ప్రేమించి పెళ్ళి చేసుకున్నావ్.నువ్వే అనుమానిస్తే అశోక్ తట్టుకోగలడా అనడంతో రితిక సరే ఆ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నాడో చెప్పమను అని నిలదీసింది.అశోక్ రితికా..!నిజంగా నేనేతప్పు చేయలేదు .ఎప్పుడూ చేయను కూడా.నీలాంటి అందమైన భార్యని ఇంట్లో ఉంచుకొని మరో అమ్మాయితో తిరగాల్సిన కర్మ నాకు పట్టలేదు అంటూ రితిక చేయి పట్టుకొని నిమరబోయాడు.రితిక కోపంతో విదిలించి దాని సంగతి తేల్చకుండా నన్ను ముట్టుకోకు అంటూ అటు తిరిగి కూర్చుంది.

” నేను రోజూ ఆఫీసు నుంచి రాత్రి పన్నెండప్పుడు వస్తాను కదా.ప్రతిరోజూ జంక్షన్ దగ్గర ఒకమ్మాయి నిలబడి ఉండడం చూస్తూ ఉండేవాన్ని.మన డ్రైవర్ ని ఒక రోజు ఎవరా అమ్మాయి అని అడిగితే క్యాండిట్ సర్ అన్నాడు.క్యాండిట్టా అంటే అన్నాను.డ్రైవర్ నవ్వి వేశ్య సార్ అన్నాడు.అంత అందమైన అమ్మాయి,పసి వయసులో ఉన్న అమ్మాయి వేశ్యా..అని నా మనసు దిగులు నిండిపోయింది.రోజూ ఎందుకు అలా చేస్తుంది? ఏమంత అవసరం కోరికతో చేస్తుందా? సంపాదన కోసం చేస్తుందా? లేక టైం పాస్ కి చేస్తుందా?రకరకాల ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది.ఓ రోజు నేను డ్రైవర్ ని కార్ ఆపమన్నా.దానికి డ్రైవర్ ఏంటి సార్ మేడమ్ ఇంట్లో లేరా అన్నాడు.ఒరేయ్ నారిగా అందుకు కాదులేరా అని వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడా.

ఎదురుగా నిల్చున్న నన్ను చూసి ఆ అమ్మాయి ఒకటే మాట.గంటకి ఇంత అని రేటు చెప్పడంతో షాకయ్యా.ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగడంతో నీకెందుకు డబ్బులిచ్చి నీ పని చూసుకో అంది.నేను ఆ అమ్మాయి మాటలకి సిగ్గుతో తల దించి మాట్లాడా,నేను అందరి లాంటి వాన్ని కాదు నేను దానికోసం రాలేదు.డబ్బులిస్తాను నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటూ డబ్బులు చేతులో పెట్టా.గంట సేపు నువ్వు చెప్పిన మాట వింటా అంది.కారులో ఎక్కించి నేరుగా మన సెక్యూరిటీ రూం కి తీసుకొచ్చి అసలెందుకు ఇలా వేశ్యగా ఉన్నావని అడిగా “అంటూ జరిగిన విషయాన్ని చెప్పాడు అశోక్.

రితిక అంటే మన సెక్యూరిటీ రూంలోనే తంతు సాగిస్తున్నావన్నమాట అంటూ గొనిగింది.గోపి ఆ అమ్మాయి ఏం చెప్పిందిరా అంటూ అడగడంతో మళ్ళీ మొదలెట్టాడు అశోక్.

వాళ్ళది ఓ పల్లెటూరు.ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమా లో సైడ్ క్యారెక్టర్స్ కోసం సిటీలో అడుగు పెడితే అవకాశాల కోసం ఎందరితో పడుకోవలసిచ్చిందో లెక్కే లేదని చెప్పింది.పనయిపోయాక చాన్స్ ఇచ్చేవారు తక్కువవడంతో సినిమాలు వదలి పడుపు వృత్తినే సంపాదన గా మార్చి బతుకుతుందంట.అంతా చెప్పాక నేను మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అని అడగడంతో వాళ్ళు పేదవాళ్ళే అందుకే నాకీ బాధ అంటూ నెల నెలా కొంచెం డబ్బులు ఇంటికి పంపిస్తూ ఇష్టం లేకపోయినా ఈ పనిలోనే డబ్బు కళ్ళజూస్తున్నానంటూ ఏడ్చింది.
అంతా చెప్పాక ఆ అమ్మాయి “నా బాధలు పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి”అనడంతో నాకు ఆ అమ్మాయి నిజాయితీ చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియక చాలా జాలిగా నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఇంకొంచెం డబ్బులిచ్చి రేపటి నుంచి ఈ పని మానేస్తానని మాటివ్వమన్నా.దానికి ఆ అమ్మాయి నా పొట్ట కొట్టకు నీ పని నువ్వు చూసుకో అంది.నేను “నీ అన్నయ్య అనుకో ..నీకు నేనున్నా…రేపు ఆఫీసుకు రా అని చెప్పి ఆరోజు ఎక్కించుకున్న దగ్గరే దింపేసొచ్చేశా.తర్వాత రోజు అక్కడ ఆ అమ్మాయి లేదు.రెండు రోజు కూడా లేదు.ఆఫీసుకి కూడా రాలేదు.మూడోరోజు ఆఫీసు కొచ్చింది.నేను ఆ అమ్మాయిని మెసెంజర్ గా అపాయింట్ చేశా.రూం లేదు అనడంతో రెంట్ రూం కోసం ఇద్దరం తిరుగుతుంటే రితిక చూసి ఇలా గొడవ చేస్తూ ఉంది.నేనెంత చెప్పినా వినట్లేదురా గోపీ అంటూ ముగించాడు.
రితిక వెంటనే అంటే మన మెసెంజర్ బిందు నే ఆ అమ్మాయా అని అనడంతో బిందు వైపు అందరూ చూశారు.అప్పుడు అశోక్ ఒక్కనిమిషం “మీరు బిందు ని అలా చూస్తే నేను ఒప్పుకోను.మనం చీకట్లో రోడ్డుపై వెళ్ళేటప్పుడు చెట్లన్నీ నల్లగా కనిపిస్తాయి.కానీ నిజానికి అవి పచ్చగా ఉంటాయి.అది మన తప్పు కాదు చీకటి ముసుగేసుకున్న తరువుల తప్పే.అదేవిధంగా బిందు కూడా వేశ్య అనే ముసుగేసుకున్న మంచి అమ్మాయి.శరీరం అనేది శాశ్వతం కాదు మనసే శాశ్వతం.బిందు లాంటి ఎంతో మంది చీకటి తరువులై లోకాన జీవశ్చవాల్లా బతుకుతున్నారు.నా వంతుగా నేనొకర్ని మార్చాను.వీలైతే ఆదరించండి.అంతేగాని ఇబ్బంది పెట్టద్దు “అంటూ కన్నీటి బిందువులలో బిందుని ఆవిష్కరించాడు.రితిక సిగ్గుపడి సమాజం పట్ల తన భర్తకున్న బాధ్యతకి గర్వంతో పొంగుతూ బిందు ని కౌగిలించుకొంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!