నిజమైన స్నేహితుడు

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

నిజమైన స్నేహితుడు

రచయిత :: తేలుకుంట్ల సునీత

రఘు, రాజా చిన్నప్పటి నుండి కలిసిపెరిగారు. కలిసే చదువుకున్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. వారికి తగ్గట్టే ఇద్దరికీ ఒకే కంపనీలో ఉద్యోగం రావడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేవు.
రఘు నెమ్మదస్తుడు, మొహమాటం,అమాయకత్వం కలవాడు. తన మనస్సులో విషయాలూ అంత తొందరగా బయట పెట్టడు. రాజాలో హుషారు, చిలిపితనం మనస్సులో ఏది దాచుకోడు. ఐనా ఇద్దరి అభప్రాయాలు ఒక్కటే అవడంతో ఎంతో కాలంగా వారి స్నేహం ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కొనసాగుతుంది. తోటివారు కూడా వీరి మధ్య గల అనుబంధానికి ముగ్దులవుతారు.
అలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ముద్దుగుమ్మలాంటి అమ్మాయి శరణ్య కంపెనీలో సహ ఉద్యోగి అవటం. శరణ్యకు కూడా రఘు, రాజాల సెక్షన్లోనే వర్క్ ఇవ్వడంతో తొందర్లోనే ఇద్దరికి మంచి స్నేహితురాలు అయింది.
రఘు, రాజా, శరణ్యలు ఆఫీసు పని అయిన తర్వాత కూడా అడపా దడపా కలుస్తూ, చిన్న చిన్న పార్టీలతో సంతోష సమయాలు షేర్ చేసుకునేవారు. రఘు, రాజా లు ఒకరికి తెలియకుండా ఒకరు శరణ్యను ఇష్టపడడం మొదలు పెట్టారు.
ఆఫీసులో కూడా ఎంతో హుషారుగా పని చేసే రాజా … చేయాల్సిన పనిని పక్కనపెట్టి శరణ్య గురించి మనసులో ఆలోచిస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండడం గమనించిన రఘు “ఒరేయ్..! రాజా ఏమైంది రా… నీలో నువ్వే నవ్వుతున్నావు. అనగానే ఈ లోకంలోకి వచ్చిన రాజా”అదేం లేదురా ఊరికెనే అని తప్పించుకున్నాడు.
” లేదురా నువ్వు ఏదో నా దగ్గర దాస్తున్నావు. నేను ఈ మధ్య నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు చెప్పకూడదా. ఇంతవరకు మనం అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమైంది రా…” అన్నాడు రఘు.
రాజా కొంచెం సిగ్గుపడుతూ…”రఘు నీ దగ్గర దాచాల్సిందేమీ లేదు ఇంటికి వెళ్ళాక సాయంత్రం చెబుతాను లేవు” అనగానే “సరే లే” అని ఇద్దరూ పనిలో పడతారు. ఇంటికి వచ్చాక రఘు కాఫీ కప్పుతో వచ్చి ఒకటి రాజా కిస్తూ… “ఇప్పుడు చెప్పు రా రాజా అసలేంటి.. కొంపదీసి ప్రేమలో పడ్డావా ఎవరా అదృష్టవంతురాలు …నేను చూసానా.. ఎలా ఉంటుంది. ఎప్పుడు చూపిస్తావు. అంటూ భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా అడిగాడు.
“అవునురా… రఘు నీ ఊహ కరెక్టే… కానీ ఇప్పుడే చెప్పను. సమయం చూసుకొని చెబుతాను”
అని తాగిన కాఫీ కప్పు పక్కన పెట్టాడు.
“సరేలే ఇంతకీ ఆ అమ్మాయికయినా నీ మనసులో విషయం చెప్పావా”.
“లేదురా రఘు… చెప్పాలంటే తను ఎలా ఫీల్ అవుతుందో మా మధ్య మంచిగా ఉన్న స్నేహం ఎక్కడ పాడవుతుందో, తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయంగా ఉంది. అందుకే సాహసం చేయలేకపోతున్నాను. ఇంతవరకు నేను ఏది అడిగినా, అడక్కపోయినా నాకు ఇష్టమైనవన్ని చేసుకొచ్చావ్. నా ప్రేమ విషయంలో కూడా హెల్ప్ చేయరా బాబు. నీకు పుణ్యం ఉంటుంది.”
“వద్దు వద్దు… ప్రేమ విషయంలో మూడో వ్యక్తి జోక్యం వద్దు. నువ్వే ఏదో ఒక సందర్భంలో మొహమాటం లేకుండా చెప్పెయ్.”
“అంతే అంటావా సరే చూద్దాం … నువ్వు ఫ్రెష్ అవ్వు. అలా బయటికి వెళ్లి ఏదో ఒక మూవీకెళ్ళి అటునుండి అటే రెస్టారెంట్లో భోజనం చేసి వచ్చేద్దాం.”అంటూ హుషారుగా ఈల వేస్తూ బాత్రూంకి వెళ్తాడు రాజా.
రాజా వెళ్ళిపోగానే రఘు…మరి నా సంగతి ఏమిటి నాకసలే మొహమాటం. నా మనసులో మాట నేను శరణ్యకు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడు. ఇంతలో రాజా ఏమైంది రా అనే సరికి ఐదు నిమిషాల్లో తయారై రఘురాగా, ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు.
ఇక్కడ శరణ్య పరిస్థితి ఇంచుమించు రాజా, రఘుల లాగే తన మనసు ఊగిసలాటలో కొట్టుమిట్టాడుతోంది. వీరిద్దరిలో ఒకరితో జీవితాన్ని పంచుకోవాలని, మరొకరితో మంచి స్నేహితురాలిగా కలకాలం ఉండిపోవాలని ఆలోచిస్తూ ఉంది. వచ్చే ఆదివారం తన పుట్టిన రోజు. ఈ సారి అందరితో పాటు రాజా, రఘులతో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకొని తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటుంది.
అనుకున్న రోజు రానే వచ్చింది. రఘు, రాజాలు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ముందు రోజే… తమ మనస్సులో విషయం చెప్పాలి అనే దృఢనిశ్చయంతో రఘు…శరణ్య ఎదురు పడితే నేను చెప్పలేనని తన మనసులో ఉన్న భావాల్ని వివరిస్తూ ఎవరికీ కనబడకుండా అందించాలనే ఉద్దేశంతో పాకెట్లో పట్టేంత చిన్నసైజ్ బర్త్ డే గ్రీటింగ్ కార్డు కొని అందులో రాసి తను రేపు వేసుకోబోయే coat జేబులో దాన్ని భద్ర పరిచాడు. రాజా కూడా బర్త్ డే కానుకగా గోల్డ్ రింగ్ తీసుకున్నాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు కొన్నారు.
పార్టీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లతో శరణ్య ఫ్రెండ్స్ కోసం ఎప్పుడు వస్తారో అనిఎదురుచూస్తూ వరండాలో అటూ ఇటూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది. హల్లో… బర్త్ డే బేబీ… అంటూ ఇద్దరూ ఒకేసారి అనేసరికి… రండి రండి మీకోసమే… అందరూ వచ్చారు అంటూ లోపలికి తీసుకెళ్ళింది. కేకు కటింగ్ అనంతరం అతిధులంత శుభాకాంక్షలు తెలిపి డిన్నర్ కి వెళ్తారు. అదే సమయమని భావించిన రాజా తను తెచ్చిన రింగ్ ఇచ్చితను ప్రేమిస్తున్నట్లు చెప్పొచ్చని వెళ్తూ రఘును కూడా చెయ్ పట్టి లాక్కెళ్తాడు. రఘు కూడా తను తెచ్చిన గ్రీటింగ్ కార్డు ఇద్దామనుకొని కోట్ జేబులో చేయి పెట్టి తీయబోయే సరికి అందులో లేదు… ఆదుర్దాగా అన్ని పాకెట్లు వెతుకుతాడు. ఏమైందీ… అని ఆలోచిస్తుండగా తాము డ్రెస్ వేసుకుంటుండగా కరెంట్ పోగా వెళ్లాలనే హడావుడి లో రఘు రాజాలు ఒకరి కోటు ఒకరు వేసుకుంటారు. అప్పుడు అర్థమైంది రఘుకి గ్రీటింగ్ కార్డు తను రాసిన లెటర్ అందులో ఉన్నాయని…. ఆ చీకటి వెనకాలే తన ప్రేమ ముగిసిందని, దానికి తోడు అసలే మొహమాటం రాజా కు తెలియకుండా కొన్న గ్రీటింగ్ కార్డు… వాడిని అడగలేను. ముందు వాడి కంట పడకుండా చూడాలి. విషయం తర్వాత ఇద్దరికీ చెప్పొచ్చులే అనుకొని..శరణ్యకు దగ్గరికి రాజా తో పాటు వెళ్తాడు రఘు.
శరణ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి రాజా రింగ్ తీసి రఘు చేతిలో పెట్టి, రఘు … “ఈ గిఫ్ట్ శరణ్యకు ఇవ్వరా…”అని తొందర పెడతాడు. ఊహించని ఈ పరిణామానికి రఘు మొహమాట పడుతుంటే… తను కూడా రఘును ఇష్టపడుతున్నందున శరణ్య సంతోషంగా తొడగమని చూపుడు వేలు చూపిస్తుంది రఘుకి. వెంటనే శరణ్యా.. నీకు మరో సర్ప్రైజ్ అంటూ…ఆ చీకటి వెనకాలే దాగిన నీ ప్రేమ అంటూ కోట్ జేబులో నుంచి గ్రీటింగ్ కార్డు ఇచ్చి, శరణ్యకు ఇవ్వమని సైగ చేయగా గ్రీటింగ్ కార్డు శరణ్య కు ఇచ్చాడు.రఘు సంతోషానికి హద్దులు లేవు. మనసులో ఎంతో తబ్బిబ్బు అవుతున్నాడు. శరణ్య ఇద్దరికీ కేకు తినిపిస్తుంది. ముగ్గురూ కలిసి డిన్నర్ చేస్తారు. రఘు, రాజాలు.. శరణ్య కు బై.. చెప్పి కారులో ఇంటికి బయలుదేరారు. ఆనందంతో వెలిగి పోతున్న రఘు భుజం తడుతూ.. “ఏరా రఘు ఇప్పుడు సంతోషమేగా,ఆ చీకటి వెనకాల దాగిన నీ ప్రేమ మరుగున పడింది అనుకున్నావ్ కదూ”.. అనగానే “అవునురా రాజా…. నిజంగా నేను నా జీవితంలో ఇంత అనందాన్ని ఎప్పుడు పొందలేదు రా..ఇవాళ నీ వల్ల అంటూ…ఆలింగనం చేసుకున్నాడు రఘు. “ఎప్పుడూ నామేలు కోరే నీవు.. నాకు తెలిసి నేనెప్పుడు ప్రత్యేకంగా నీ కోసం ఏమి చేయలేదు.ఇలాగైనా..నాకో అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందిరా” అన్నాడు మనసులోని ప్రేమను త్యాగం చేసిన రాజా.
“రాజా ఇంతకీ నా మనసులో ఉన్న ఇష్టం నీకెలా తెలిసింది రా”.
“అందరూ గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మెల్లగా శరణ్యకు గ్రీటింగ్స్ చెప్పొచ్చు అనుకొని చల్లగాలి కోసం బయటకు వెళ్లి, పట్టిన చెమటలు తూడ్చు కుందామని పాకెట్లో చేయి ఇలా వెళ్లిందో లేదో .. అశ్చర్యంగా నీ గ్రీటింగ్ కార్డు. ఓపెన్ చేయడం సంస్కారం కాదు అనుకున్నాను కానీ … ఈ మధ్య నువ్వు శరణ్య వైపు ఆరాధనగా చూసే నీ కళ్లు, తనతో మాట్లాడేటప్పుడు తడపడే నీ మాటలు…గమనించాను. నువ్వు తొందరగా బయట పడవు కదా… ఏమైనా అనుకోని… అందులో ఏముంది ..నీకు హెల్ప్ చేద్దామని .. చూసాను. ఒకటి రెండు పదాల్లోనే మాటర్ అర్థమైంది. మళ్ళీ ఎప్పటిలాగే గ్రీటింగ్ కార్డు జేబులో ఉంచాను. నువ్వు అడుగుతావేమోనని చూసాను. కానీ నువ్వు అడగక పోయేసరికి వీడింతే.. ఇదే మంచి సమయం అని.. నేనే ఒక అడుగు ముందుకు వేశాను ” అన్నాడు రాజా. మాటల్లోనే ఇల్లు వచ్చింది. ఇద్దరూ ఆనందంగా ఇంట్లోకి వెళ్ళారు.
స్నేహితుని సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కున్న రాజా హాయిగా నిద్ర పోయాడు. రఘు… రాజాలాంటి ఫ్రెండ్ దొరకడం తన అదృష్టమని శరణ్య తో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!