చీకటిలో మగ్గుతున్న చిరుప్రాయo

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

చీకటిలో మగ్గుతున్న చిరుప్రాయo

రచయిత :: పావని చిలువేరు

ఒక రోజూ నేను మా అమ్మ రైలులో అమ్మమ్మ  వాల్ల ఇంటికి వెళుతున్నాము.
మా ప్రయాణం నత్తనడక లాగే సాగుతోంది.
ఈ రైలు యెక్కడ పడితే అక్కడ గంటలు గంటలు ఆగుతూ పోతుంది.

ఇంత రద్దీ నేను యెప్పుడూ చూడలేదు. రైలు నుంచి కిందికి దిగి టీ తాగేవారు కొందరైతే .రైలు లోనే కొనే వాళ్లు  మరి కొందరు. రైలు ఆగి ఆగి ఎంత చిరాకుగా ఉందో నాకూ.

ఆ సమయంలో పక్క డబ్బా నుంచి మా డబ్బా కి సమోసాలు అమ్ముతూ ఒక 10 సంవత్సరాల అమ్మాయి  వచ్చింది. సమోసే సమోసే అనుకుంటూ.

యెవ్వరు కొనడం లేదు,  యెందుకంటే యెప్పుడు పడితే అప్పుడు రైలు ఆగుతుండడం వల్ల  చీటికిమాటికి పిల్లలకి యేదో కొనిస్తున్నారు మా  డబ్బాలోఉన్న తల్లిదండ్రులు . మరి యెన్ని సార్లు కొంటారు అందుకే ఈసారి  యెవ్వరు కొనడం లేదు . పిల్లలందరు  పేచి పెట్టడం మెదలు పెట్టారు.

అప్పుడు ఆ  సమోసాలు అమ్మాయి  చిన్న చిన్న పోట్లాలు కట్టి అందరి పిల్లలకు యివ్వడం మొదలుపెట్టింది. కాని డబ్బాలోఉన్న అందరూ పాపం చిన్న పిల్ల అని చూడకుండా బతక నేర్చిన తెలివి చూడు యిలా పంచిపెడితే మనం డబ్బులు యిస్తామని అలా చేస్తోంది అని అందరూ అనడం మొదలు పెట్టారు.

ఆ చిన్న మనుసు కి వాళ్ల మాటలు అర్థం కాలేధో, లేక మరి యేమనుకుంధో   తెలియదు  ,అయినా యేమీ పట్టించుకోకుండా పోట్లాలుగా చుట్టి పిల్లలకు సమోసాలు యిస్తుoది . అప్పుడు మా యెదురుగా  కూర్చున్న  ఒక అతను  ఒక సమోసా పోట్లాo తీసి బయట విసిరివేశాడు . అయిన ఆ అమ్మాయి యేమీ పట్టించుకోకుండా ఇంకో పోట్లాo చేసి యిచ్చి యేమీ అనకుండా పక్క డబ్బాకి వెళ్లిపోయింది.

అప్పుడు చూడు మా డబ్బాలో  వాళ్ల సంభాషణలు:

ఆ పోనీలే పంచిపెడితే యేమీ అవుతది అందులో వాళ్లకి చాలా లాభం ఉంటది అని ఒకరు,  ఆ వాళ్లు యేమీ డబ్బులు వదిలి పెట్టరు మళ్లీ వస్తారు అని కొందరు, యిది అంతా వ్యాపారం చేసే వాళ్ల తెలివితేటలు అని మరి కొందరు అంటూనే ఉన్నారు.
అది చూస్తున్న నాకూ చాలా బాధగా అనిపించింది.
మా రైలు మళ్లీ మొదలైంది. కొంత దూరం వెళ్లక మళ్లీ ఆ అమ్మాయి  వేరుశనగ కాయలు పట్టుకొని వచ్చింది. మా డబ్బాలో  వాళ్లు, వాళ్లని యెక్కడ డబ్బులు  అడుగుతధో  అని మొహం తిప్పుకొని కూర్చున్నారు , యేమీ మాట్లాడకుండా , నిద్ర పోతున్నట్టు నటిస్తున్నారు .

కాని  ఆ చిన్ని పాప యేమీ అడగలేధు . అది చూసి ఒక ఆవిడ యేమే పిల్ల నీకు పైసలు యెక్కువ అయ్యాయ లేక నీకు అమ్ముకోవడం తెలువదా అని కసిరింది .

అప్పుడు ఆ చిన్న పాప లేదు అమ్మ, నాకూ తెలుసు అన్నది.
యేమీ తెలిసే నీకు అని  మళ్లీ కసిరింది ఆవిడ .

అప్పుడు ఆ  అమ్మాయి  అదిగో ఆ తలుపు దగ్గర కూర్చుని ఉన్నాడు చూడమ్మ వాడు  నా తమ్ముడు అని యెంతో సంతోషంగా చూపించిoది ,వాడు కూడా యిట్లాగే బయట అమ్మో  పుల్ల ఐస్క్రేటు కావాలంటాడు . మాకు పైసలు ఉండవు కదా వాడికి అర్దం కాదు వాడు రోజు అడుగుతూనే ఉంటాడు. యిప్పటి వరికి కూడా  నాకూ పైసలు లేక వాడికి నేను కొనియ్యలే , కానీ నాకూ తెలుసు వాడు ఎంత బాధ పడతధో , అందుకే ఆ పిల్లలు ఏడుస్తుoటే చూడబుద్ధి కాలే , నా దగ్గర ఉన్నది యియ్యచ్చు కదా అని యిచ్చిన  అంతె అన్నది ఆ చిన్న పాప.

ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు.
ఆ కసిరిన ఆవిడ మళ్లీ ఆ చిన్న పాప తో మాట కలిపిoది .
మరి రోజూ సమోసా, వేరుశనగ కాయలు అమ్మిన పైసలు యేమీ చేస్తావు అంది ,అప్పుడప్పుడు మీ తమ్ముడికి కొని యివ్వచ్చు కదా అంటే,
అప్పుడు ఆ పాప అమ్మో ఒక్క పైసా తగ్గిన మా సవితి తల్లి (చిన్నమ్మ ) పొయ్యిలో కట్టె తీసి కాలుస్తది .యిదిగో యిది అదే అని తన కాలికి ఉన్న పెద్ధ కాలిన మరక చూపించిoది .అప్పుడు మా డబ్బా లో ఉన్న వాళ్ళు అందరు చాలా  ఆశ్చర్యంగా చూస్తూ, ఆసక్తికరంగా వింటున్నారు అయ్యో పాపం అనుకుంటూ.

మళ్లీ ఆ కసిరిన ఆవిడ  మాట కలిపిoది .
మరీ ఇవాళ యెట్లా అందరికీ పంచి పెట్టినవు కదా సమోసాలు, మీ చిన్నమ్మ కి పైసలు యేమీ చూపిస్తవు అని అడిగింది.

యేమీ కాదులే అమ్మ  ఈయాల  నేను, నా తమ్ముడు యేమీ తినo,  అక్కడ ఉన్న బోరింగ్ నీళ్లు తాగుతo అని చెప్పింది.  తినకుంటే  పైసలు  మిగులుతై  కదమ్మ  ఆ పైసలు మా చిన్నమ్మకి యిస్తా అని చెప్పింది.

అయ్యో మరి రాత్రి కన్నా కడుపు నిండా తింటావా  అని ఒక ఆయన అడిగాడు.
లే కడుపు నిండా పెట్టదు ,నేను, నా  తమ్ముడు మధ్యాహ్నo అంత బాగా తిరిగి అన్ని కొనుక్కుని తిని వస్తాము అనుకోని తిండి పెట్టదు.

అయ్యో బిడ్డ మరి మీ అయ్యకి  (నాన్న) చెప్పవ అని మా అమ్మ అడిగితే.
ఆ పాప అమ్మో మా అయ్యనా నన్ను చూస్తే అమ్మేస్థాడు , మా అమ్మ ని కూడా గట్లనే  రెండు సార్లు అమ్మితె పారిపోయి వచ్చిందని కొట్టి సంపిండు .అందుకే పొద్దు పోయినoక మా అయ్య తాగి పండుకున్నాకా పోతం యింటికి నేను, మా తమ్ముడు అని చెప్పింది.

మరి నువ్వు మీ చిన్నమ్మ కి చెప్పవా నేను, తమ్ముడు యేమీ తినలే అని అడిగింది  ఒక అమ్మాయి.
చెప్పినా నమ్మదు  అన్నది.

మరి నీ దగ్గర ఉన్న సమోసా తినచ్చు కదా అంటే,  లెక్క చెప్పాలి కదా అయ్యా అన్నది .

అన్ని లెక్కతోని తెస్తవా అని నేను అడిగితె.
లేదు  పాపా మాకు కొన్ని యెక్కువ నీ యిస్తారు .
కానీ మరీ  నేను 10 రూపాయలకి 10  సమోసా అని అమ్మితే  అందరూ  10 కి 12 యివ్వు  లేకపోతే. 10 రూపాయలకి  14 యియ్య మంటరు కదా. యివ్వలేదు అంటే  కొనరు,  మరి ఇంకా యెక్కడ మిగులుతయి నాకూ. ఒక వేళ ఒకటి రెండు మిగులుతె మా తమ్ముడు  కిస్తా అన్నది.
మరి నీకు ఆకలి కదా అని అడిగితే  ,
ఆకలి అయితే ఆ బోరింగ్ నీళ్లు తాగుత ,  నీళ్లు కొంచెం వేడిగా, చాలా ఉప్పుగా ఉంటాయి కదా దానితో కడుపు నిండి పోతది  ఆకలి చచ్చిపోతది అని అన్నది.

అయ్యో  పాపం యింకా యెన్ని రోజులు యిలా  ఆకలి తో ఉంటావు అని అడిగితె .
ఇంకా కొన్ని రోజుల తరువాత నా తమ్ముడుని కూడా పనికి పెడుతా అప్పుడు నేను కూడా కొంచెం పెద్ధగయితా కదా  అప్పుడు అన్నది.

నీ తమ్ముడుని యే పనికి పేడుతావు , దొరుకుతదా నీ తమ్ముడుకి  యేపని వస్తది అని ఒక తాత  అడిగితే ,

దొరుకుతది అయ్యా, మెల్లగా తెలుసుకుంటాడు, ఆ పుల్ల ఐస్క్రేటు అమ్మో అన్నని  అడుగుతా నా తమ్ముడిని  కూడా తీసుకొమ్మని అన్నది చిన్నగా  ముసిముసిగా నవ్వుతూ.

అప్పుడు అందరి  మొహంలో కూడా నవ్వు  మొహం అయ్యింది.

ఆ కసిరిన ఆవిడ మళ్లీ మాటకలిపి యెందుకు పిల్ల మీ తమ్ముడు రోజు ఐస్క్రేటు తింటాడు అనా  అంటే.
కాదు అమ్మ నేను కూడా గీ  సమోసా అమ్మోటప్పుడు నాకూ కూడా బాగా తినబుద్ధయింది కనీ  అన్ని అమ్మినంక మిగిలినవి తినాలి ,ఇంకా రోజు అంత చూసి చూసి, బరువు మోసి, తినబుద్ధి కాలే పోయింది, యిప్పుడు కూడా పొద్దున అంత అమ్ముత కదా యేమీ తిన బుద్ధికాదు అని చెప్పింది.

అందుకే ఒక్క 10 రోజులు పుల్లఐస్క్రేటు అన్న దగ్గర పెడితే  వాడికి 10  రోజుల తరువాత ఇంకా తినబుద్ధి కాదు అని చెప్పింది.    వూకే తింటే దగ్గు లేస్తది అమ్మ నా తమ్ముడుకి
నా తమ్ముడు ఇంకా చిన్నవాడు అని చెప్పింది .

స్టేషన్ వస్తుందని మేము తేరుకొనే లోపే లేచి నడుచుకుంటూ తలుపు దగ్గర ఉన్న వాళ్ల తమ్ముడి దగ్గరకి పోయి వేరుశనగ గంప నెత్తిన పెట్టుకొని, సమోసా గంప ఒక చేత్తో,  తమ్ముడిని  మరొక చేత్తో పట్టుకొని  ఇక్కడ 2 నిమిషాలే ఆగుతది  పద తమ్ముడు అని చట్టుకున రైలు దిగి వెళ్లి పోయింది .

మంచి మనుసు ఉన్న బంగారు తల్లి కి యెన్ని కష్టాలు. నిండా 10 సంవత్సరాలు లేవు . ఎంత పెద్ద మనసు, పెట్టే మనుసు ఉండే వాళ్ల కి  ముందు తిన దానికి  యేదయినా పెట్టి తరువాత చెప్పమని అంటారు.

మీము ఆ రోజు  చేసిన తప్పు అదే పాప తన కష్టాలని కూడా ఇష్టంగా  భరిస్తూ చెపుతూ ఉంటే  విన్నాము అంతెకాని ఒక్కరు కూడా ముందు ఆ పాపకి  యివ్వవలసిన సమోసా డబ్బులు ఆమె యిచ్చిన,  సాయం చేదాoఅనిపించిన  వాళ్లు సాయం చేసిన  తరువాత ఆ పాప కథ వినివుంటే  ఆ పాప  వట్టి చేతులతో  రైలు దిగి పొయ్యేది కదా.

పెట్టే మనుసు ఉండాలి కానీ వయసు కాదు అనిపించింది .
ఆ  చిట్టి తల్లికి  యెప్పుడూ మంచి రోజులు వస్తాయని అనిపించింది.
ఈ కథలో ఆ అమ్మాయి కి  యెటు చూసిన చీకటి,  తనకి  ఉన్న గతం చీకటి  యిప్పుడు జరుగుతున్న వర్తమానం కూడా చీకటి గానే  ఉంది మరి ఆ చీకటి  కొంత కాలం అయినా తరువాత అయినా మంచి రోజులు రావాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!