మృగాళ్ళు

(అంశం::”ఆ చీకటి వెనకాల”)

 మృగాళ్ళు

రచయిత :: సావిత్రి కోవూరు 

ఊరి నుండి వచ్చిన చోటు, “ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నదేంటి?  పిల్లలేరి ఏం చేస్తున్నావ్ అక్కడ కూర్చుని. బాగా ఆకలిగా ఉంది భోజనం పెట్టు” అన్నాడు.

అయినా భార్య లేవకుండా కూర్చుంటే వింతగా అనిపించింది.రోజు తను రాగానే ఎదురు వచ్చి పిల్లల గురించి ఏవేవో చెబుతూ, రుచికరమైన భోజనం వడ్డించే భార్య ఉలుకు పలుకు లేకుండా కూర్చునేసరికి, ఏదో జరిగిందని ఊహించిన చోటు,

“ఏమైంది ఎందుకలా కూర్చున్నావు చెప్పు. చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది”. అనేసరికి బోరున ఏడుస్తూ ఏం “చెప్పమంటావయ్యా? ఉదయం మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి, నీకు ఆక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నావని చెప్పేసరికి, మన పెద్దమ్మాయి వెనుకా ముందూ ఆలోచించకుండా వాళ్ల కార్లో వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు నీకెన్ని సార్లు ఫోన్ చేసిన  ఎత్తవైతివి”అని ఏడవడం మొదలు పెట్టింది.
“ఎవరో వచ్చి ఏదో చెప్తే వెళ్ళిపోవడమేనా, కొంచమైనా ఆలోచించొద్దు. వచ్చిన వాడెవడు. దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏమో. ఓరి దేవుడా! నా బంగారు తల్లి ఏమైందో. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలి. నీకు బుద్ధుందా లేదా ఒక్క దానిని ఎలా పంపించావ్”అని గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు.
“నాకేం తెలుసు నిజంగానే నీకు ఆక్సిడెంట్ అయిందేమో అనుకున్నాను. అక్కడికి నేను దానితో అన్నాను, మా తమ్ముడికి ఫోన్ చేసి వెంబడి తీసుకెళ్ళమని అన్నా వినిపించుకోకుండా ‘వచ్చింది నాన్న ఫ్రెండేనమ్మా నాకు తెలుసు నేను వెళ్లి చూసి నీకు ఫోన్ చేస్తాను’ అని వెళ్ళింది. నేనేం చేయను. నేను అనుకుంటూనే ఉన్నా మీ స్నేహితులు ఎవరు మంచి వాళ్ళలా కనిపించట్లేదు. నువ్వు చేసే బిజినెస్ ఏంటో నాకు అస్సలు తెలియదు. ఏదో చేయరాని పని చేస్తున్నావేమో అనిపిస్తుంది”. అనేసరికి “నోర్ముయ్ ఎప్పుడూ నా బిజినెస్ గురించి మాట్లాడతావ్ నేను చేసే బిజినెస్ లో తప్ప, ఇంకే బిజినెస్ లో ఇంత డబ్బు సంపాదించలేను తెలుసా? ఆ డబ్బుతోనే గా నీకు ఇంత పెద్ద బిల్డింగ్, భూములు కొని పెట్టాను. నీకు కోరిన నగలూ, బట్టలూ, కార్లు, పిల్లల చదువులు, పార్టీలు, జల్సాలు ఇన్ని సుఖాలనిచ్చే బిజినెస్ నీ కళ్ళకు ఆనట్లేదు” అని అంటుండగానే
కొడుకు సన్నీ వచ్చి “అమ్మా చెల్లి దాని  స్నేహితులకెవరికన్న ఫోన్ చేసిందేమో అని కనుకున్నాను. అందరూ తమకు తెలియదనే చెప్తున్నారు.నాకెందుకో భయమేస్తోంది.పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం రా” అని తల్లిని తీసుకొని వెళ్ళుతుండగ,
“ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి” అని చోటు అరుస్తున్నా వినిపించుకోకుండ, ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి “మా చెల్లెలు, ఉదయం నుండి కనిపించట్లేదు”అని కంప్లైంట్ ఇచ్చారు.
అక్కడ ఎస్. ఐ. ఎన్నో ప్రశ్నలు అడిగి “మీకు ఎవరిపైనన్న అనుమానం ఉందా అని అడిగితే, చోటు భార్య మా ఆయన పైననే నా అనుమానం” అన్నది.
అరగంటలో పోలీసులు చోటుని స్టేషన్కు తీసుకు వచ్చారు. చోటు పోలీస్ స్టేషన్ కి వస్తూనే “నన్ను ఇక్కడికి పట్టుకొచ్చారు ఏంటి? నా కూతురు పోయిందని నేను బాధపడుతుంటే మీ గోల ఏంటి?” అని అరవడం మొదలు పెట్టాడు.
“మా నాన్న మొన్న నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికెళ్ళి ఏదో పెళ్ళి సంబంధం గురించి వాళ్ళ అమ్మా , నాన్నలకు చెప్పి ఒప్పించాడట.తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పిందట.అప్పటి నుండి ఆ అమ్మాయి కన్పించట్లేదు.ఇప్పుడు నా చెల్లీ కూడ కన్పించట్లేదు.ఈ కిడ్నాప్ ల వెనకాల మా నాన్న ప్రమేయమున్నట్లు నాకనుమానం” అని  చెప్పాడు సన్నీ.
“మీ చెల్లెలు నా కూతురు రా. నా కూతురును  నేను కిడ్నాప్ చేయడం ఏంటి?నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా” అని భార్యవైపు తిరిగి  నీకైనా బుద్ధి లేదా? నాపైన కంప్లైంట్ చేయడం ఏమిటి? అన్నాడు భార్యతో.
ఎస్సై పోలీసులతో “ఇలా అయితే చెప్పడు గాని మీ పద్ధతిలో సత్కారం చేసి అడగండి” అని చెప్పే సరికి, వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం రక్తాలు కారేలా నాలుగు వడ్డించే సరికి నోరు విప్పాడు చోటు.

“నేను నా భార్య ఆరుగురు పిల్లల తో పదేళ్ళ క్రితం హైదరాబాద్కు బతకడానికి వచ్చాము. ఆటో నడుపుతూ పిల్లల్ని పోషించుకునే వాడిని. నా భార్య కూడా ఇండ్లలో పని చేస్తూ ఉండేది. బస్తీలో అందరితో కలిసి మెలిసి హాయిగా ఉండేవాళ్ళం.
ఒకరోజు నా పాత ఫ్రెండ్ ఒకడు కలిశాడు. వాడి పెద్ద కారు, బంగళా చూసి బాగా సంపాదిస్తున్నట్టు కనిపిస్తే ఏం పని చేస్తున్నాడని అడిగితే ‘రవాణా బిజినెస్’ అన్నాడు. నాకు కూడా ఏమైనా పని ఉంటే చెప్పు ఈ ఆటో తోల్తే వచ్చే డబ్బులు నాకు, నా పిల్లలకి సరిపోవట్లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి ఎలాగైనా ఆదుకో” అన్నాను.

“నేను చేసే బిజినెస్ వివరాలు ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. నీవు నా చిన్నప్పటి ఫ్రెండ్ వని చెప్తున్న. నీకు ఇష్టమైతే చెయ్యి. లేదా ఈ విషయాలు ఎవరికీ చెప్పకు. నీవు కూడా మర్చిపో” అన్నాడు.

“సరే చెప్పు” అనగానే

“బాగా డబ్బుకు ఇబ్బంది పడే, ఎదిగిన ఆడ పిల్లలు ఉన్న కుటుంబాలను తెలుసుకొని, వెళ్లి పరిచయాలు పెంచుకొని,మధ్య మధ్యలో వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ, డబ్బు సాయం  చేస్తూ నమ్మించాలి. తర్వాత మెల్లగా వాళ్ల ఆడ పిల్లలకు మంచి సంబంధం ఉన్నదని ఆశ కల్పించాలి. తర్వాత విదేశాల నుండి వచ్చిన బాగా డబ్బున్న ముసలి వరులను వాళ్లకు పరిచయం చేసి, వాళ్ళు ఎన్నడు చూడని అంత డబ్బు ఆశ చూపిస్తే మొదట ముసలి వాళ్లకు తమ పిల్లల్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు, చేసుకునే పిల్లలు కూడా వ్యతిరేకిస్తారు. తర్వాత వాళ్ళ ఆర్ధిక పరిస్థితి వల్ల ఒప్పుకుంటారు. విదేశీయులు ఒక్కొక్కసారి యాభైలక్షలు ఇవ్వడానికి కూడ ఒప్పుకుంటారు. వాటిలోంచి రెండు మూడు లక్షలు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఇస్తే అదే వాళ్లకు చాలా ఎక్కువ మిగతాదంతా మనకే “అన్నాడు మా ఫ్రెండ్.

“మనం ఎంత కష్టపడ్డా లక్ష రూపాయలు కూడా చూడము. నువ్వు కూడా ఈ బిజినెస్ చేయి మీ చుట్టుపక్కల వాళ్ళను పరిచయం చేసుకొని, వాళ్ళ స్థితిగతులు చూసి బాగా పేదగా ఉండి  వాళ్ళ ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉంటే వాళ్లను బుట్టలో వేసుకొని పెళ్లిళ్లు కుదిరించు” అన్నాడు.

నేను “మరి ఆ పిల్లల గతి ఏంటి తర్వాత అని అడిగితే ఆ పిల్లలను చేసుకున్న ముసలివాళ్లు ఒక్కొక్కసారి హోటల్స్ లో కొత్త భార్యలతో నెల రెండు నెలలు గడిపి, మళ్ళీ వచ్చి తీసుకెళ్తామని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ రారు వచ్చిన ఈ పిల్లల ను కాకుండ వేరె పిల్లలను అరెంజ్ చేయమంటారు. ఇక ఈ పిల్లల బ్రతుకులు ఇంతే. కొందరు వెంబడి తీసుకెళ్తారు” అన్నాడు.

అప్పుడు ఎస్. ఐ. “నీకు కూడా ఆడ పిల్లలు ఉన్నారు కదా! ఇది పాపం అనిపించలేదా” అని అడిగితే,

“మొదట్లో నాకు అసలు చేయాలనిపించలేదు. కానీ మా స్నేహితుడు పాపపుణ్యాలు ఎంచుకుంటూ కూర్చుంటే మనం బతకలేం అన్నాడు. నేను కూడా ఆలోచించుకొన్నాను. అప్పటికే బాగా అప్పుల్లో కూరుకుపోయి తిండికి కూడ ఇబ్బంది పడే కుటుంబాలకు అప్పులు తీర్చుకోవడానికి కొంత డబ్బు ఇస్తే, అప్పు తీర్చీ మిగతా కుటుంబం సభ్యులు సంతోషంగా ఉంటారు అనిపించి మొదలు పెట్టాను. మొదట మొదట చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అలవాటైపోయింది ఇప్పుడు పేద ఆడపిల్లల తండ్రులే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ విధంగా ఆడపిల్లలను అమ్మి డబ్బు చేసుకునే పద్ధతి నా స్నేహితుడు చెప్పడం వల్ల గత మూడేళ్లుగా చేస్తున్నాను. మొత్తం కుటుంబం కొరకు ఒక పిల్లని బలి ఇస్తే ఏమవుతుంది అని అనిపిస్తుంది.” అన్నాడు చోటు.
“మరి ఆ పిల్లలు వ్యతిరేకించటం లేదా” అన్నాడు ఎస్.ఐ
“బుద్ధి తెలిసిన వాళ్ళు వ్యతిరేకించడమే కాదు, ఏడుస్తారు కూడా వాళ్ళని శారీరకంగా కొట్టి లేకపోతే మత్తు మందు ఇచ్చి పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఇంకా కొందరు ఏమి తెలియని చిన్న పిల్లలు ఆ రోజు ఇచ్చిన నగలు,బట్టలు చూసుకొని మురిసిపోతుంటారు. అలాంటి పిల్లలను చూసినప్పుడు చాలా బాధనిపిస్తోంది. కానీ  నాకు దొరికే డబ్బులను గురించి ఆలోచించి అన్ని మర్చిపోతుంటాను” అన్నాడు చోటు.

“మరి ఆ పిల్లలు ఏమి అవుతున్నారో నీకు తెలుసా అనేసరికి

“ఏమో సార్ పంపించే వరకే మా పని తర్వాత సంగతులు మాకేం తెలియవు” అన్నాడు చోటు

“నేను చెప్తాను విను అక్కడి నుండి తప్పించుకొని వచ్చిన ఒక అమ్మాయి చెప్పిన వివరాలను బట్టి, ఇక్కడి నుండి తీసుకెళ్లిన అమ్మాయిల దగ్గర నుండి విదేశాలకు వెళ్ళగానే పాస్పోర్టు, వీసా లను వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. వీళ్లను బానిసలుగా చేసి తమ ఇళ్లల్లో పనులే కాకుండా, వాళ్ల చుట్టాల ఇండ్లలో పనులు కూడా చేయిస్తారు. తిండి మాత్రం ఒకటే పూట. అది కూడా పాడైపోయిన అన్నం పెట్టి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా నీరసంగా ఉండేలా చూస్తారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే పారిపోతారని వాళ్ళకి నరకం చూపిస్తారు.
అంతేకాకుండా ఆ ఇంట్లో మగ వాళ్ళు ఎంతమంది కోరుకున్నా ఈ అమ్మాయిలు తమ శరీరాలను అప్పగించాల్సిందే. వాళ్లకే కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలకి కూడా ఈ అమ్మాయిలను అప్పగిస్తారు. ఈ విధంగా నరకయాతనను భరించలేక కొంతమంది చనిపోతుంటారు.
ఎవరైనా దయదలచి ఇంటి వాళ్ళకి తెలియకుండ సాయపడితే జీవచ్ఛవాల్లా స్వదేశానికి వచ్చినా, వాళ్ళ అనారోగ్యాల వల్ల చావలేక బతకలేక అన్నట్లు ఉంటారు.
ఇన్ని రోజులకు నీ పాపం పండి నీ స్నేహితుడే నీ కూతురును, నీ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను ఫ్లైట్ ఎక్కించే ప్రయత్నం లో ఉండగా, మాకు దొరికిపోయాడు. అదిగో అక్కడ ఊచలు లెక్క పెడుతున్నాడు. సమయానికి మేము వెళ్ళి వాళ్ళిద్దర్నీ రక్షించ గలిగాము” అన్నాడు ఎస్.ఐ.

“లేదు సార్ నా స్నేహితుడు అలాంటి వాడు కాదు నా బిడ్డను ఎట్లా కిడ్నాప్ చేస్తాడు సార్?”
అనుకుంటూ, అటు వెళ్లేసరికి తనను ఈ బిజినెస్ చేయమన్న స్నేహితుడే కస్టడీలో కనిపించేసరికి, చోటు కోపంగా “అరే నా కూతుర్ని ఎలా కిడ్నాప్ చేయాలనిపించింది రా నీకు? అని అరుస్తూ, ఏడుస్తూ, తల కొట్టుకుంటూ కూతురు దగ్గరికి వెళ్ళేసరికి,

కూతురు “నీవు ఇంత దుర్మార్గుడవని అనుకోలేదు. వేరే ఆడ పిల్లలు కూడా నాలాంటి వాళ్లే కదా నాన్న. నీకు ఆ పిల్లల జీవితాలను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు. ఇన్ని రోజులు నీవు ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఏవో సరుకులు ఎక్స్పోర్ట్ అనుకున్నాను. నీవు మనుషులను ఎక్స్పోర్ట్ చేసి వచ్చిన డబ్బుతో పెట్టిన కూడు తిన్నామంటే నాపైన నాకే చాలా అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడూ నీ ముఖం నాకు చూపించకు” అన్నది.
“అలా సంపాదించిన డబ్బు అని  తెలిస్తే ఇంత విషం తాగి చచ్చేవాళ్ళం నేను నా పిల్లలు. నీవింత రాక్షసుడవు అనుకోలేదు. ఇన్ని రోజులు నీతో కాపురం చేసినందుకు చాలా సిగ్గుపడుతున్నాను” అని అతని భార్య “సార్ మీరు ఏమన్నా శిక్షించండి కాని మమ్మల్ని అతని కొరకు  పిలవకండి. ఈరోజుతో నాకు, నా పిల్లలకు ఇతనితో సంబంధం లేదు” అని, ఆ ఇద్దరు అమ్మాయిలను తీసుకొని తన కొడుకుతో ఇంటికి వెళ్ళిపోయింది చోటు భార్య.

You May Also Like

One thought on “మృగాళ్ళు

  1. చాలా బాగుంది సావిత్రి గారూ…సమాజంలో జరుగుతున్న అమానుష చర్యల గురించి అప్రమత్తంగా ఉండాలంటూ
    చక్కని సందేశమిచ్చారు.కొసమెరుపు బాగుంది.👌👌💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!