ఒక స్త్రీమూర్తి

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

ఒక స్త్రీమూర్తి

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”

ఆ చీకటి మాటున పరిచయమైన ఆ వ్యక్తిని నేను నా జీవితంలో మరిచిపోలేను.

అలాగని ఆ వ్యక్తితో నాకు సుదీర్ఘ పరిచయం, రక్త సంబంధం, అనుబంధం ఉన్నాయనుకుంటే పోరపాటే. అలాగని ఆ నాలుగైదు నెలల పరిచయం తర్వాత నేను ఆ వ్యక్తిని మరీ కలవను లేదు కూడా.

కాని, తరచు ఆ వ్యక్తిని గుర్తు చేసేది ఆ తారకమంత్రం ఒక్కటే.

ఇన్ని చెప్పి, ఆ వ్యక్తి ఎవరూ!?… పరిచయం ఎలా జరిగింది!?…చెప్పకపోతే నన్ను తిట్టుకుంటారేమో.

ఆ సంవత్సరం మా నాన్నగారికి ప్రమోషన్ మీద ఆ ఊరికి ట్రాన్ఫర్ అయింది. ప్రభుత్వఉన్నతోద్యోగి అయిన మా నాన్నగారికి కేటాయించిన క్వార్టర్స్ లో సామానుతో సహా చేరిపోయాం మా కుటుంబ సభ్యులం అందరం.

మూడవ తరగతి చదువుతున్న నాకు మా ఇంటి పక్కనే ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల. అందులో అయిదవ తరగతి వరకు మాత్రమే ఉండటం మూలాన హైస్కూల్ చదువులు చదువుతున్న మా అక్కలు మాత్రం దూరంగా ఉన్న స్కూల్ కి చెరువు గట్టు దాటి వెళ్తుండేవారు.

ఇంకా మేము ఆ ఊరు వచ్చి, రెండు నెలలు సరిగ్గా గడిచాయో , లేదో.

ఆ రోజు రాత్రి, కటిక చీకటి మాటున మా ఇంటికి కొంత దాపున ఉన్న ఇంటి నుంచి, భయంకరమైన చప్పుళ్లు. డప్పులతో వాయిస్తున్న ఆ వాయిద్యం, గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అమ్మ నాన్న కూడా అక్కడికే వెళ్లినట్లు ఉన్నారు.

ఒంటరిగా ఉన్న నేను ఆ డప్పులకు గుండెలు దడదడమంటూండగా భయంతో ఒక మూలకు చేరి, వణికిపోతున్నాను.

అదేమి పట్టించుకోని, మా అక్కలు గాఢనిద్రలో ఉన్నారు. వాళ్లకు అదేమిటో ముందే తెలుసో. లేకా ఇంతకు ముందు ఏమైనా అనుభవాలు ఉన్నాయో.

ఇంతలో మా స్కూల్ పక్కన ఉన్న బ్రాహ్మణ స్త్రీ తలుపు తోసుకుని, మా ఇంటికి వచ్చింది. మా అమ్మ ఆమెకు నా పిరికితనం సంగతి చెప్పి ఉండచ్చు.

ఆమె నన్ను మెల్లిగా దగ్గరకు తీసుకుని, నడిపించుకొని వాళ్లింటికి తీసుకెళ్లారు. వాళ్లకి మాకు మధ్యలో ఆ ప్రాధమిక పాఠశాల మాత్రమే అడ్డు.

అక్కడ ఆమె పిల్లలు ముగ్గురు. ఒక అబ్బాయి నాకన్న రెండేళ్లు పెద్దయితే, మరో ఇద్దరు అమ్మాయిలు. ఒకమ్మాయికి నా వయసు ఉంటే, మరోక అమ్మాయి నా కంటే రెండేళ్లు చిన్నది కావచ్చు.

ఆమె నన్ను తన ఇంటికి తీసుకెళ్లగానే మెుదట చేసిన పని, గది నిండా కళ్లాపు చల్లి నట్లు నీళ్లు చిలకరించి, అప్పటికే గిరగిరా తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్ పూర్తిగా పెంచారు. తర్వాత దాని కింద ఒక చాప పరిచి, మా నలుగురుని కూర్చోబెట్టారు ఆమె. అపుడు మెుదలుపెట్టారు, . తారకమంత్రోపదేశం మా నలుగురికి. ఎప్పుడు భయం వేసిన ఆ మంత్రం చదువుకుంటే భయం దరి చేరదని, ఆ మంత్రం వినబడే చోట ఏ భూతపిశాచాలు, కీడు దరిచేరకుండా అంజనేయస్వామి వెంట ఉండి కాపాడుతారని, అపుడే చెప్పారు ఆమె.

ఆ తర్వాత తెలిసింది ఏమంటే, మా ఇంటికి అటు పక్కన మా నాన్నగారి సహోద్యోగి ఒకరూ మరణించారని, ఆ రాత్రి శవజాగరం చేస్తూ, నిద్రను దూరం చేయడానికి, భగవద్గీత పఠిస్తూ, మధ్య మధ్య భూతప్రేతాలను దూరం చేయడానికి ఆ డప్పు లను వాయిస్తూన్నారని. అందుకే అవి అంత కర్ణకఠోరంగా వినిపిస్తూన్నాయని.

ఆ తర్వాత మూడు, నాలుగు నెలలు, మధ్యాహ్నము ఖాళీ సమయంలో వాళ్లింటికి వెళ్లి కూర్చునే దానిని.

నేను వెళ్లేటప్పటికి ఆమె వాళ్ల పిల్లలకు అన్నాలు తినిపిస్తూండేవారు. బ్రాహ్మణులు కావడాన పిల్లలకి స్కూల్ కి వెళ్లే బట్టలు విప్పించేసి, ఒంటి మీద చిన్న తువ్వాళ్లో, డ్రాయరో వేసి, మెుదటిసారి, ఒక కంచంలో అన్నం వేసి, కూర కలిపి తన చేతులతోనే ఆ పిల్లలకు అన్నం ముద్దలు చేసి, చేతిలో వేసి తినమని చెప్తూండేవారు.అదైన తర్వాత పప్పు, ఆ తర్వాత రసం, చివరిగా పెరుగుతో అలా ఆ పిల్లల భోజనం ముగిసేది.

ఆ సమయంలో పక్కన ఉన్న నాకు కూడా ఆమె ఆ అన్నం ముద్దలు. చేతిలో పెట్టి, తినమని చెప్పేవారు.

అలా అన్నాలు తింటున్నంత సమయం, తారకమంత్రం “రామ” అనే శబ్దం ఆమె నోటి నుండి వినిపిస్తూనే ఉండేది.

తారకమంత్రం తో పాటు అష్టాదశ శక్తిపీఠాల శ్లోకం. అలా నిత్యపరాయణ శ్లోకాలు ఆమె నోట. అలవోకగా పలుకుచుండగా ఆమె వెంట మేము కూడా ఆ శ్లోకాలు పట్టించేవారం.

అలా తారకమంత్రం ఉపదేశించిన ఆమె నాకు గురుదేవులతో సమానమని అపుడు నాకు అంతగా అవగాహన లేదు.

ఆ తర్వాత దీపావళికి పుట్టింటికి వెళ్లిన ఆ కుటుంబం, ఏ కారణం చేతో మరల తిరిగి రాలేదు.

వాళ్లు తిరిగి వస్తారని, మరల మునుపాటిలా ఆమె చేత శ్లోకాలు చెప్పించుకోవాలనుకుని ఎంతో ఆశగా ఎదురుచూసిన నాకు ఆశ భంగము కలిగించింది మా నాన్నగారి ట్రాన్ఫర్.

ఆ తర్వాత ఆమెను కాని, ఆ కుటుంబాన్ని కాని కలవలేదు. ఇప్పటికి కూడా నేను ఆ పిల్లల పేర్లు వింటే వాళ్లేనేమో అని ఆశగా వివరాలు చూస్తుంటాను. కాని, ఆమె మంత్రోపదేశం చేసిన తారకమంత్రం నా ప్రతి కష్ట సమయంలో నా వెంట ఉండి కాపాడుతూనే ఉంది.

ముఖ్యం గా ఈ కరోనా కష్ట సమయంలో ఆమె నేర్పించిన తారకమంత్రం మాత్రం ఎనలేని మేలు చేసిందని ఘంటాపధంగా చెప్పగలను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!