చోదకుడా! హెల్మెట్ మరువకు

చోదకుడా! హెల్మెట్ మరువకు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ప్రియంవద పుతుంబాక

“బాబూ, ఇదిగో హెల్మెట్ మర్చిపోయావు తీసుకొని వెళ్ళు అంటున్న తండ్రి మాటను వినీ విన్నట్టుగా వెళ్ళిపోతున్న కొడుకు వద్దకు వడి వడిగా వచ్చి హెల్మెట్ ఇచ్చారు నరేష్ గారు. “ఓ..ఓ..ఓ.. సారీ నాన్న. ఇయర్ ఫోన్స్ వలన వినిపించలేదు మీ పిలుపు అన్నాడు ప్రకాష్”. “ఫర్వాలేదు కానీ, నువ్వు జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో కూడ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా ఉండకు”. అని మళ్ళీ చెప్పారు. మా నాన్నకి చాదస్తం పెరిగి పోయింది. ‘నేను వెళ్ళే దారంతా ఆయనకు తెలిసిన వారే ఉంటారు. ఎవరో ఒకరిని అడిగి తెలుసుకుంటారు. మా వాడు ఆ వైపు వచ్చాడు కాస్త కనిపెట్టుకొని ఉండు. హెల్మెట్ పెట్టకుండా బండి తోలుతుంటే నాకు చెప్పు అని కాపలా పెడతారు’. అనుకుని శిరస్త్రాణం ధరించి, సమర విజయుడిలా పయనమయ్యాడు ప్రకాష్.
ప్రకాష్ తండ్రి ఒక చిన్న పట్టణంలో తాలూకా ఆఫీసులో గుమాస్తా. అతనికి ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాడు అమెరికాలో చదువుకోవటానికి వెళ్ళాడు. చిన్నవాడు ప్రకాష్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని కాలేజీ, ఊరికి దక్షిణాన ఉన్న, పెదపాడులో ఉంది. ఆ ఊరు దాటి వెళితే వచ్చే చినపాడే నరేష్ గారి సొంత ఊరు. ప్రకాష్ ఆ కాలేజీలో చేరినప్పటి నుండీ అతని ప్రవర్తన గురించి, ఆ ఊరి వారిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు నరేష్ గారు. చెడు ప్రవర్తన అయితే లేదు కానీ, హెల్మెట్ లేకుండా, మిత్రులతో బైక్ మీద ఫీట్లు చేస్తూ కాలేజీకి రావటం పోవటం జరుగుతుందని తెలిసి, ఒక కన్ను వేసి ఉంచారు. ఒక రోజు ఇలాగే అందరూ హెల్మెట్లు తీసి, రైయ్యి మంటూ.. మోతగా హారన్ మోగించు కుంటూ.. రోడ్డుకు అడ్డ దిడ్డంగా మలుపులు తిప్పుతూ.. బైక్ ర్యాలీలా పోతున్న కుర్రకారులో ప్రకాష్ కూడ ఉన్నాడు. ప్రకాష్ ప్లేస్ తనకి కావాలని వెనుక వరుసలో కుర్రాడొకడు తెగ ఆతృత పడి పోతున్నాడు. అప్పుడే తండ్రికి కబురు అందటం, ఫోన్ రావటం జరిగింది. ఇయర్ ఫోన్లో తండ్రి గొంతు విని బండి రోడ్ పక్కకు తీసి ఆపి, మాట్లాడుతూ ఉండగానే వెనుక వరుసలో అతను తన ప్లేస్ లో కి దూసుకు వెళ్ళాడు. అది నాలుగు రోడ్ల కూడలి. యూ టర్న్ తీసుకోబోతున్న ట్రక్ ఆ బైక్ తో పాటు ఇంకో రెండు బైక్లను గుద్దింది. అక్కడికక్కడే ఇద్దరి తలకాయలు పుచ్చకాయల్లా పగిలి చెల్లాచెదురు అయ్యాయి. మూడో అతను హెల్మెట్ ఉండటంతో కొద్ది గాయాలతో బయట పడ్డాడు. ఇది చూసిన ప్రకాష్ కి వెన్నులో వణుకు మొదలై గజగజ వణుకుతూ ఉంటే తండ్రి ఏమైంది బాబూ? ఏమిటి ఆ మోత? అన్నా! సమాధానం చెప్పలేక అక్కడే కుప్పకూలి పోయాడు. అక్కడికి చేరువలో సోడా తాగుతున్న! వారి బంధువు గబగబా వచ్చి, నీళ్ళు ముఖాన చల్లి సృహ రాగానే “చూశావుగా నువ్ లేచి పోవలసింది ఈ రోజు. మీ నాన్నకు నేనే ఫోన్ చేసి చెప్పా, అంత దూరాన నిన్ను చూడగానే. వెంటనే ఆయన నీకు కాల్ చేయటంతో నీ స్థానంలో అతను చనిపోయాడు అని, ఆ బంధువు చెప్పాడు”. మొబైల్ ఆన్ లోనే ఉండటంతో నరేష్ గారికి ఈ సంభాషణ వినిపించి, ముచ్చెమటలు పోశాయి. అది మొదలు హెల్మెట్ లేకుండా మనవాడు బండి తీస్తే ఒట్టు. ఆ తర్వాత బైక్ రేసుల జోలికి కూడా పోలేదు. యువతా….తస్మాత్ జాగ్రత్త.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!