ఎదురింట్లో ఏమైందో..?

ఎదురింట్లో ఏమైందో..?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీ సుధ కొలచన

సుధ, రవిలది బెంగళూరులో కొత్తకాపురం. వారి ఎదురింట్లో ఉండేవారు శంకరంగారు, భవానీ గారు. అచ్చంగా సుధ నాయనమ్మ, తాతయ్యల వయసు వారు. చాలా రోజులు వారిని దూరం నుండే గమనించేది సుధ. గుళ్ళో, కురగాయలవాడి దగ్గర ఆ ఇద్దరినీ కలుస్తూండేది. తనకి భాష సాయం చేసేవారు వారు. మెల్లిగా రాకపోకలు పెరిగి, వారింటమ్మాయే అనేంతగా, వారి అనుబంధం పెనవేసుకుపోయింది. నెమ్మదిగా సుధ వారి బాగోగులు మొత్తం చేసుకోవటం మొదలెట్టింది. రవి తనని వారించినా, తను మాత్రం శంకరం, భవానీ గార్లకు ఏ అవసరమున్నా దగ్గరుండి చూసుకునేది. భవానీ, శంకరం గార్లకు గణేష్ ఒక్కడే కొడుకు. తను ఉన్నత చదువులకు ఇంగ్లాండ్ వెళ్లి, అక్కడే స్థిరపడిపోయాడు. ఏడాదికి ఒక్కసారి క్రిస్మస్ సెలవులకి కుటుంబంతో సహా వచ్చి, వారితో నెలరోజులు గడిపి, వారికి అన్నీ అమర్చి వెళ్లేవాడు. సుధ గురించి వారి మాటల్లో విని, తను కూడా పరిచయం పెంచుకున్నాడు. సుధ, గణేష్ ని “అన్నయ్య” అని పిలిచేది. గణేష్ కి ద్యుతి, కీర్తి ఇద్దరు ఆడపిల్లలు. వారి కుటుంబంలో ఒక్కత్తిగా మారిపోయింది సుధ. ఈ యేడు కూడా క్రిస్మస్ కి పిల్లలు వస్తారని భవానిగారు, శంకరంగారు చాలా హడావిడి చేస్తున్నారు. నానా రకాల పిండివంటలు సిద్ధం చేసుంచారు. పిల్లలకు, కోడలికి భవానీ గారు కంచిపట్టు చీరలు తెప్పించారు. వీరితోపాటు సుధకి కూడా. గణేష్ వచ్చేరోజు రానే వచ్చింది. తెల్లారింది. కాని ఏ చడీ చప్పుడు లేదు. వాకిట్లో ముగ్గు కూడా పెట్టలేదు. తలుపులన్నీ తాళాలు వేసున్నాయి. ఇంతటి నిశ్శబ్ధాన్ని ఊహించని సుధ నిశ్చేష్ఠురాలైంది. వారి మొబైల్ స్విచ్ ఆఫ్. గణేష్ ది కూడా. ఎవ్వరిని అడిగినా తెలియదనే సమాధానం. చుట్టుపక్కల వాళ్ళంతా సుధని గుచ్చిగుచ్చి అడిగేవారు. తెలియదన్నా వదిలేవారు కాదు. ఇంక అక్కడ ఉండలేక సుధ, రవి ఇద్దరూ హైదరాబాద్ మకాం మార్చేసారు. ఐదేళ్ల గిర్రున తిరిగిపోయాయి.
ద్యుతి సుధకి ఫోను చేసింది. ఎయుర్ పోర్టు నుండి బయటికి వచ్చి ట్యాక్సీ ఎక్కిన గణేష్, కీర్తిలకు పెద్ద యాక్సిడెంట్ అయిందిట. అందుకే, రాత్రికిరాత్రి భవానీ, శంకరం గార్లు హుటాహుటిన మణిపాల్ హాస్పిటల్ కి వెళ్ళారు. ద్యుతి, కీర్తి ఇద్దరూ లగేజ్ తీసుకునేందుకు ఎయిర్ పోర్ట్ లోనే ఉండటం వలన, వారికి ఏం కాలేదు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వలన, వారిని అటునుంచటే లండన్ తీసుకెళ్ళిపోయారుట. వారు తేరుకోవటానికి సంవత్సరం పట్టిందిట. తరువాత బెంగళూరు వచ్చి భవానీ గారిని, శంకరంగారిని పూర్తిగా లండన్ తీసుకెళ్ళిపోయారుట. మా గురించి ఎలాంటి సమాచారం లేకపోయేసరికి, చాలా బాధపడ్డారుట. మొన్న తన కొలీగ్ ప్రొపైల్ లో రవిని చూసి, మా నంబరు వాకబుచేసి. ఇదిగో, ఇవాళ ఇలా కాల్ చేశానని ముగించింది. అందరూ బాగున్నారన్న విషయం విన్న సుధ ఆనందానికి ఇక హద్దులు లేవు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!