పులిహోర గోంగూర – పుట్టింట్లో ముచ్చట్లు

పులిహోర గోంగూర – పుట్టింట్లో ముచ్చట్లు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన -ఎం. వి. ఉమాదేవి

అరెకరం పొలంతోటి ఆపసోపాలు పడుతూ వ్యవసాయం చేసే అమ్మమ్మ. పంట కోశాక కౌలుదారు చెప్పే అబద్దపు లెక్కలు నమ్మినా నమ్ముకున్నా. పోన్లే పిల్లలు గలవాడు అనుకుంటూ. ఇంటికి తోలిన ధాన్యం గాదెలో పోయించి, అర్జంటుగా కయ్యలో చల్లేసిన పిల్లి పెసర్లు, మినుములు మంచులో పండి, ఇంక కోసుకోవమ్మా అనే లోపల రాఘవయ్య చెరుకు తోటలో పనికి, గుర్రం బండి సాయిబుగారి బీన్స్ తోటలో కోత, చెంచయ్య మామ చేలో చేమ దుంపలు వొలిచే పని చూసుకోని ఎండలు ముదిరే లోపు మా ఊరు వచ్చేసేది. ఎందుకంటే వడియాలు, వరుగులు, చింత తొక్కు, తను తెచ్చినా ఆవకాయ, మాగాయ, పండుమిర్చి పచ్చడి, పులిహోర గోంగూర, ములక్కాడ ఆవకాయ, ఉసిరి తొక్కు. ఒహటేమిటి. సూర్యనారాయణ ఇచ్చిన ఎండభాగ్యం అంతా  అమాంతంగా జాడీలూ, సీసాలూ, పెద్ద పెద్ద ప్లాస్టిక్ టిఫిన్ల లో నిల్వ జేసే యుద్ధ ప్రాతిపదిక మీద, ఓ నెల రోజులు అమ్మకు సాయంగా ఉండేది అమ్మమ్మ. ఆవిడ బాల వితంతువు కిందే లెక్క. అయినా ఆవిడ మాటల్లో “ఉన్నామా తిన్నామా అని కాదే. మానవ జన్మ పరమార్థం కనుక్కుని మరీ పోవాలి. ఋతువులు బట్టీ లోకంలో ఎన్నెన్నో పన్లూ,  పద్యం అన్నీ వంట బట్టించుకోవాలి గదా. పని దొంగలు ఈ కాలం వాళ్ళు, “అనేసే అమ్మమ్మ గ్రామం లో ఆయుర్వేద వైద్యుడి కూతురు. సంతకం నేర్చుకున్నది పోస్ట్ లో వచ్చే వంద రూపాయల పెన్షన్ కోసమే. చదువురాని ఆమె సొంత వైద్యం, ఇంజక్షన్ స్వయంగా చేసుకోవడం మాకు నిజంగా అబ్బురమే ! ఒక బోషాణం లాంటి చెక్క పెట్టే నిండా కల్వాలు, రాచ్చిప్పలూ గాజు సీసాల్లో ప్రభాకరవటి, చ్యవన ప్రాశ వంటి లేహ్యాలు, మూలికలు, కంట్లో పెట్టే కలికాలూ. (బాబోయ్)గురిగింజలూ, ఓ చిన్న సీసాలో పాదరసం కూడా వుండేది.
అసలు ఆ పెట్టె తాళం వేసి ఉండేది. ఎపుడైనా మర్చిపోతే, మా పిల్లమూక ఆ పెట్టెలో అరలు అన్నీ పరిశోధన చేసే వాళ్ళం. శంఖాలు, ఆల్చిప్పలూ, పగడపు పూసలసరాలు, స్పటికపు పూసలు, ఆముదం గింజలు, శొంఠి వాము, వట్టి వేరు, కరక్కాయ. గచ్చకాయలు. (ఈ గచ్ఛకాయలు రెండు రకాలు మళ్ళీ. సముద్రపు పచ్చ, ఎర్రమట్టి రంగు ) ఇంటి వెనుక వైపు ఈత, గచ్చకాయ చెట్లు, తుమ్మి కూర, వగైరా ఉండేవి. అన్నట్లు చిల్లి కాణీలు రాగి ఇత్తడి వెండి నాణేలు, కడియాలు, మువ్వలు, అయస్కాంతాలు, భజన చెక్కలూ, తాళాలు, రామదాసు కీర్తనల తో బొమ్మల పుస్తకాలు, కాశీ మజిలీ కథలు, పింగాణి, గాజు కుప్పెలు, గరాటు, లక్క, అదో వైద్య, కళా సమాహారమే. సరే, విషయం దారిమళ్లింది సుమీ. ఆవిడ వచ్చే ముందే అమ్మ పక్క పల్లెల నుండి వచ్చి కూరలు అమ్మే వాళ్ళతో మాట్లాడుకొని పండుమిర్చి, ఊరగాయ మామిళ్ళు, రెండు గంపల తెల్ల గోంగూర, తోటల్లో నాటు టమాటాలూ, పచ్చిమిర్చి (కండ గింజ బాగుండి ముదురు పచ్చ రంగు, పొట్టి పొడవు కాని మధ్యస్త కొలతలు.), పచ్చడి వంకాయలూ ఆర్థర్ ఇచ్చి, అడ్వాన్సు కూడా ఇచ్చి ఓ అరగంట మాటాడి నాలుగు ఇడ్డెన్లు, కారప్పొడి నెయ్యి తామరాకులో కట్టిచ్చి, లోటాడు మజ్జిగ కరేపాకు నిమ్మరసం ఉప్పు  వేసి ఇచ్చి పంపేది. అందుమీదట వాళ్ళు చెప్పిన రోజుపొద్దున్నే (నాలుగు రోజుల వ్యవధి చొప్పున) సరుకు దించి వెళ్లే వాళ్ళు. అమ్మమ్మ వచ్చి ఉంటుంది కదా. నూతి దగ్గర స్నానం చేసి వచ్చి కుంపటిలో అందరికి కాఫీ కలిపేది. తర్వాత వంట అధ్యాయాలు మావే. వీళ్ళు ఆ గోంగూర ఒలిచి కడిగి నవారు మంచం మీద పంచెలు పరిచి నీడలో ఆరబెట్టే వాళ్ళు. గుంటూరు కొత్త కారం, మిల్లులో తాజా వేరుశెనగ నూనె, అరకేజీ చొప్పున పోపు గింజలు, ఇంగువ, స్పెషల్ పసుపు పొడి, కల్లు ప్పు (బాగా ఎండాలి ) ఇల్లంతా పళ్ళాలూ గరిటలు. గందరగోళం గా వుండేది. స్నానం చేసి వచ్చి అమ్మ కట్టెల పొయ్యి మీద పెద్ద బాండలి లో రెండు గరిటలు నూనె వేసి ఆరిన గోంగూర బాగా మగ్గనిచ్చి దించేసి వంట సంగతి మాకే వదిలేసి, అమ్మ కూతురు వాళ్ళ ఊరి ముచ్చట్లు చెప్పు కుంటూ కొత్త కారం వేసి ఉప్పు గోంగూర కాస్త కొత్త చింత పండుతో కొద్ది సేపు రుబ్బేసి తీసేవాళ్ళు. ఎక్కువగా రుబ్బితే రుచిగా ఉండదు. తాళ్లు తాళ్ళుగా ఉంటేనే మజా! ఆనక చెంచాడు పసుపేసి ఉంచుకోని సాయంత్రం కాఫీలపుడు ఆవాలు, సెనగ పప్పు మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ పొడి, కర్వే పాకుతో తాలింపు వేసి చల్లారాక పచ్చడి లో కలిపి జాడీ కెత్తెవాళ్ళు. ఇక నాలుగో రోజు నుండి అదే పనిగా. వాడకం !చుట్టాలకు పంపడం. ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలో పచ్చళ్ళ వాడకం ఉండదు. ఇంట్లో బోలెడు హార్లిక్స్, వివా, బోర్న్ విటా ఖాళీ సీసాలు బోలెడు ఉండేవి. అందరికి హార్లిక్స్ గాజు సీసాలోనే ఎక్సపోర్ట్. ఇంట్లో వాళ్లేమో. పొట్లకాయ, బీరకాయ, బెండకాయ వంటి ఇగురు కూరలు, పెసరపప్పు అరటికాయతో, కంది పచ్చడి, సెనగపప్పు మసాలా వడల పులుసు తో సరిపెట్టే వాళ్ళు వంట. ఈ గోంగూర వేడి చేస్తుందని. అలా నెల కంతా జాడీ ఖాళీ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!