పిన్నిగారి అయోమయం (కథాసమీక్ష)

పిన్నిగారి అయోమయం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: సావిత్రి కోవూరు

కథ: పిన్నిగారి అయోమయం
రచన: సావిత్రి కోవూరు

నేను తీసుకున్న కథ ‘పిన్నిగారి అయోమయం’ ఈ కథలో రిటైర్డ్ అయిన బాబాయ్ గారు, ఆయన భార్య పిన్ని గారు, ఆమె అక్క కూతురు స్వాతి.
ఈ ముగ్గురి మధ్యన కథ నడుస్తుంది. పిన్ని గారికి ఇంటి ముందరకి అమ్మడానికి వచ్చే కూరగాయలు, చిరుతిళ్ళు, చీరలు, దుప్పట్లు అన్ని ఖాతా పెట్టి కొనడం, వాళ్లు వచ్చినప్పుడల్లా ఇంట్లోకి పిలిచి గంటలు గంటలు కూర్చోబెట్టి, తను లోపల పనంతా చేసుకుని వచ్చి తీరికగా కూర్చుని కొనడం, వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టడం చేస్తుంటుంది.

దీనివల్ల ఎంత నష్టమో ఆవిడ గ్రహించకపోవడం. ఒకటి అలా కొనడం వల్ల మనకు ఇష్టమయిన, నాణ్యమైన వస్తువులు ఎంచుకునే పరిమితి తగ్గుతుంది. రెండవది మార్కెట్ ధర  కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి కొనవలసి వస్తుంది. మూడవది తెలియని వ్యక్తులను ఇంట్లోకి పిలవడం వల్ల ఇంట్లో  ఎంత మంది వ్యక్తులు ఉంటారు, వాళ్ల మనస్తత్వాలను ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అన్ని చూడడం వల్ల వాళ్లకు ఎప్పుడైనా దుర్బుద్ధి పుట్టి ఇంటిలోని వ్యక్తుల ప్రాణాలకు హాని కలిగించవచ్చని గ్రహించని అమాయకపు మనిషి పిన్ని. ఈ కథలో పిన్నిగారు ఇంట్లో ఎంతమంది వ్యక్తులుంటే అంతమందికి అన్నము వేడిగా పెట్టాలనే తాపత్రయంతో అన్ని సార్లు అన్నము వండుతూ పని తెమలకుండ ఉండటమే కాకుండ, ఎవరికి సంపూర్ణమైన బోజనం పెట్టలేక పోవడం పిన్నిగారి ప్రత్యేకత. ఇక పని మనిషి విషయం. ఈ కథలో పనిమనిషికి ఎక్కువ పనులు ఉంటాయని ఎక్కువ డబ్బులు ఇచ్చి కూడా పనిమనిషి చేత అన్ని పనులు చేయించుకోవడానికి ఇష్టపడకపోవడం. తనకు ఓపిక లేకపోయినా అన్ని పనులు తానే చేసుకుంటాననె చాదస్తం ఉంటుంది పిన్నిగారికి. ముఖ్యంగా వంటిల్లు, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్  శుభ్రం చేయకపోవడం వల్ల అపరిశుభ్రంగా ఉంచుకోవడం.  ఇంటికి వచ్చిన వాళ్లకు చికాకుగా ఉంటుంది. అందుకే పిన్నిగారి మనస్తత్వం ఎరిగిన స్వాతి స్వతంత్రించి ఆమె లోపలి నుండి వచ్చెలోపల పని మనిషి చేత ఇంటినంత శుభ్రం చేయించేస్తుంది.
పిన్నిగారు ఎలా ఉన్నా, ఇల్లు శుభ్రంగా పెట్టక పోయినా, వంట సరిగ్గా చేయక పోయినా, వంట సరియైన టైంకి చేయకపోయినా, ఆమె ఇంటి ముందర ఎన్ని బేరాలు చేస్తున్నా ఎందుకు? ఏంటి? అని అడగకుండ అడిగినన్ని డబ్బులిస్తూ ఆవేశపడకుండ తన పనులేవో తను చూసుకుంటూ ప్రశాంతంగా ఉండే బాబాయి గారి లాంటి వాళ్ళు సమాజంలో చాల తక్కువ మంది ఉంటారు. అందుకే ఆ దంపతులు ఆదర్శ దంపతులుగా ఆరోగ్యంగా, ప్రశాంతంగా టీవి చూస్తు కాలం గడుపున్నారు. ఈ కాలంలో పిన్ని గారి లాంటి వ్యక్తులు ఎక్కువమంది లేకపోయినా అక్కడక్కడ మనకు తటస్థ పడుతుంటారు. వారిని దృష్టిలో ఉంచుకుని ఈ కధ వ్రాయడం జరిగింది.

మా పిన్నిగారి అయోమయం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!