గొప్పలు- తిప్పలు

గొప్పలు- తిప్పలు

రచయిత :: కమల’శ్రీ’

చరణ్ కి ఓ రెండు నెలల క్రితమే సరిత తో వివాహం అయ్యింది. సరిత పల్లెటూరు పిల్ల అయినా సభ్యతా, సంస్కారం తెలిసిన పిల్ల. పది మందిలో ఎలా నడుచుకోవాలో తెలిసిన పిల్ల.
చరణ్ ఉద్యోగం పట్నం లో కావడం,పెళ్లికి ముందు ఓ ఇద్దరు ఫ్రెండ్స్ తో రూం షేర్ చేసుకోవడంతో ఆ రూం లోనే ఉంటూ తమిద్దరి కోసం అద్దెగది కోసం వేట మొదలుపెట్టాడు.తను అనుకున్న డబ్బుల్లో ఎక్కడా గది దొరకనే లేదు.
ఓ రోజు గది కోసం తిరిగి కాస్త ఆలస్యంగా వచ్చిన చరణ్ ని చూడగానే “ఏంటి చరణ్ ఎప్పుడూ ఆలస్యంగా రానివాడివి ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నావు. రాత్రుళ్లు మీ ఆవిడ కళ్లోకొచ్చి నిద్ర పోనివ్వకుండా చేస్తుందా ఏంటి?!.”అంటూ చలోక్తి విసిరాడు సుందర్.
“అదేం కాదు సుందర్.సరితను తీసుకుని ఇక్కడికి వచ్చేద్దామని అనుకుంటున్నా.దానికోసమే రూం చూస్తున్నా. కానీ నేను అనుకున్న డబ్బుల్లో రూం ఎక్కడా దొరకడం లేదు.” అన్నాడు చరణ్.‌
“అవునా! మన కరుణా మేడమ్ గారి ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉందని వినికిడి. ఓసారి అడిగి చూడరాదూ. స్టాఫే కాబట్టి కాస్త అద్దె తక్కువలో ఇవ్వొచ్చు.” అంటూ ఓ సమాచారం అందించాడు.
“థాంక్యూ సుందర్. మేడమ్ ని అడుగుతా ఇప్పుడే.” అంటూ కరుణ గారి దగ్గరకు వెళ్లాడు.
“రండి కొత్తపెళ్లి కొడుకు గారూ. అమ్మాయిని ఎప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు?!.” అంది కరుణ, చరణ్ ని చూడగానే నవ్వుతూ.
“ఆ పనిలోనే ఉన్నా మేడమ్. కానీ రూం కుదరడం లేదు. మీ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉందని తెలిసిందీ?!.” అంటూ ఆగాడు.
“ఆ ఉంది చరణ్. మొన్నటి వరకూ ఓ ఫ్యామిలీ ఉండేది. వాళ్లు రెండు రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీరు కావాలంటే సాయంత్రం వచ్చి పోర్షన్ చూసుకోండి.” అంది కరుణ, అద్దె మూడువేలని చెప్తూ.
ఆ రేట్ కి రూం దొరికితే తన బడ్జెట్ కి సరిపోతుంది అనుకుంటూ “సరే మేడమ్ సాయంత్రం వచ్చి చూస్తాను.” అంటూ తన పనిలో మునిగిపోయాడు.
సాయంత్రం వెళ్లడం పోర్షన్ చూడటం, అది నచ్చి అడ్వాన్స్ గా ఒక నెల అద్దె కూడా ఇచ్చి మరో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉండటంతో పాలు పొంగించి కొత్త కాపురం మొదలుపెట్టారు. కాపురం సజావుగానే సాగిపోతుంది. కొత్త వాతావరణం అయినా సరిత తొందరగానే అడ్జస్ట్ అయ్యింది.
ఆదివారం ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడే అలవాటు ఉన్నా ఆ రోజు ఉదయం నుంచే వర్షం పడటం తో ఇంట్లోనే ఉన్నాడు చరణ్. పనులన్నీ అయ్యాక భోజనాలు అవీ ముగించి చరణ్ కాసేపు పడుకోవడంతో కరుణ వాళ్లింటికి వెళ్లింది సరిత.
నిద్ర లేచి చూసిన చరణ్ కి సరిత కనపడకపోయే సరికి కరుణా మేడమ్ దగ్గరికి వెళ్లిందేమో అనుకుని టీవీ చూస్తూ ఉండిపోయాడు. సాయంత్రం కావొస్తున్నా ఇంకా రాకపోవడంతో అసహనంగా లేచి వాళ్లింటి వైపు వెళుతున్న అతను కిటికీ నుంచి కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి స్థానువై పోయాడు. కరుణ గారు తన నగలన్నీ సరిత ముందు పరిచి అవి ఎంత కాస్టో, ఎప్పుడు కొందో, ఎక్కడ కొందో చూపిస్తోంది. ఓ పక్క చీరల డబ్బాలు కనిపిస్తున్నాయి.
“సరితా!” అంటూ చరణ్ పిలుపు వినపడే సరికి కళ్లార్పకుండా వాటినే చూస్తున్న సరిత “హా వస్తున్నా.” అంటూ పరుగున బయటకు వచ్చింది.
“కాస్త టీ పెట్టు తల నొప్పి గా ఉంది.” అంటూ లోపలికి నడిచాడు.
“అవునా! మాటల్లో పడి టీ కూడా ఇవ్వలేదు మీకు. ఉండండి ఇప్పుడే చేసి పెడతా.” అంటూ టీ పెట్టి ఇచ్చింది సరిత.
రోజులు గడుస్తున్నాయి. చరణ్ మరో ఇల్లు చూసుకుని కాపురాన్ని అక్కడికి మార్చాడు.
“ఏంటి చరణ్ ఇలా చేశారు. మేడమ్ గారు మన స్టాఫ్ అని తక్కువ అద్దె కి ఇల్లిస్తే మీరిలా ఖాళీ చేయడం ఏమీ బాలేదు. అదే మాట నాతో చెప్పి బాధపడ్డారు ఆవిడ.” అన్నాడు సుందర్.
“అద్దె తక్కువని ఇంకొన్ని రోజులు వాళ్లింట్లోనే ఉంటే నా కాపురంలో చిచ్చు రేపుకున్న వాడిని అవుతాను. అది ఇష్టం లేకే ఖాళీ చేసేశాను.” అన్నాడు చరణ్.
“అదేంటి అలా అంటున్నావు?!.” అర్థం కాక అడిగాడు సుందర్.
“మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. కొత్తగా పెళ్లైన అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ అవేవీ భర్త ని అడగలేదు. నా పరిస్థితి, జీతం గురించి తెలిసిన సరిత నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉంటే ఆ పరిస్థితి వచ్చేది.”
“అంటే?!.”
“ఆవిడ భర్త ఓ కాంట్రాక్టర్. బంగారం, చీరలు ఎన్నైనా కొంటారు. ఏదైనా చేస్తారు.
నేను ఓ సాధారణ గుమస్తాని. నా పరిస్థితి సరిత అర్థం చేసుకుని ఏం కోరుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదూ నాకూ ఆవిడ లా బంగారం కావాలంటే నేనేం చేయాలి. కొత్తగా పెళ్లైన వారికి ఎవరైనా తమ గొప్పతనం ప్రదర్శించుకోవడానికి బంగారం చీరలూ చూపిస్తూ గొప్పలు చెప్పుకోవడం కరెక్టా. ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటే నా భార్యతో నాకు తిప్పలు మొదలౌతాయని అద్దె ఎక్కువైనా ఇంకో ఇల్లు చూసుకుని వెళ్లిపోయాను.
వారికి ఉండొచ్చు కాదనను. కానీ లేనివాళ్ల ముందు వాటిని ప్రదర్శించడం వల్ల కాపురం లో కలతలు వచ్చే పరిస్థితి ఏర్పడేది. ఆ ప్రమాదం రాకూడదనే ముందుగానే మేల్కొన్నాను.” అని చెప్పడం ముగించాడు.
“నిజమే చరణ్.మంచి పని చేశావు.” అన్నాడు సుందర్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!