జోక్యం

జోక్యం

రచయిత :: మంగు కృష్ణకుమారి

కనకవల్లి వచ్చి రెండు రోజులయింది.

పరిమళ పెళ్ళయిన కొత్తలో చాలా ఇబ్బందులు పడింది. వాటాలో ఇంట్లో ఒక గది వంటిల్లు, కటకటాల గదిలో అద్దెకి ఉండేవారు. మరిది కూడా కాలేజీలో చదువుతూ ఉండేవాడు.

పక్క పోర్షన్ లో ఉండే కనకవల్లి చాలా సహాయపడేది. మగవాళ్ళు వెళ్ళగానే కనకవల్లి వచ్చేది. పులిహార, ఉప్పుడు పిండి లాటివి చేస్తే తప్పకుండా పరిమళకి తెచ్చేది.

ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ బియ్యం బాగుచేయడం, గోరుచిక్కుడు లాటి కూర ఏరడం, లాటి పనులు చేస్తూ ఉండేవారు. కనకవల్లి ఏదో‌ ఒక సలహా ఇస్తూనే ఉండేది. “పాలు చిన్నగిన్నెలో తోడుపెట్టే! బాగా తోడుకుంటాయి”
“ఆ బిందె కింద చిన్న మట్టు ఉంచు”
“రాగి చెంబు చూడు. నల్లగా అయిపోయింది. ఉప్పుకూడా పెట్టి తోము” పరిమళ తనకి నచ్చినవి చేసేది. లేకపోతే లేదు.

కనకవల్లి అందరి ఇళ్ళూ ఓ రౌండ్ వేసి నచ్చిన సలహాలు చెప్తూ ఉండేది. అందరూ నవ్వేసి ఊరుకొనేవారు.

అక్కడ ఉండగానే కొడుకు అభినవ్ పుట్టేడు. కనకవల్లి వాడిని తెగ ఎత్తుకు మోసేది. ఎప్పుడన్నా పరిమళ ఓ వారం పుట్టింటికి వెళ్ళి వస్తే ఆ రోజంతా అభిని ఎత్తుకొని “మా ఇంట్లో అందరూ అంటున్నారే, అభి వచ్చేసాడు. ఇహ నువ్వు మొహం చూపించవు” అంటూ వాడి బుగ్గ సాగదీసేది. వాడు కిల‌కిలా నవ్వేవాడు.

వాడికి నాలుగేళ్ళప్పుడు భర్తకి ఎదురుచూసిన మంచి ఉద్యోగం రాడంతో ఆ ఊరినించీ వచ్చేసారు.

అభినవ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అనుకోకుండా ఓ‌మాల్ లో కనకవల్లిగారు కనపడ్డాది. ఆప్యాయంగా కౌగలించుకుంది. తన మేనల్లుడి వడుగుకని వచ్చిందిట. పరిమళ తమింటికి రమ్మని నాలుగు రోజులు ఉండమని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది.

కనకవల్లి గారు మాట ఇచ్చినట్టుగా వచ్చింది. ఒక రోజంతా ఇద్దరూ పాతరోజులు తలచుకుంటూ ఆ కబుర్లు చెప్పుకుంటూ గడిపేరు.

రెండోరోజు ఇల్లంతా తిరుగుతూ తన ధోరణిలో మొదలెట్టింది.

“ఇల్లు చాలా బాగుందే, మీరే కట్టించేరా?”
“ఎంత బాగున్నా, వంటింట్లో అల్మారాలకి తలుపులేమిటే? తియ్యా, వెయ్యా! రోజంతా ఇదే ఉద్యోగం.”

“ఆ గేస్ బండలు స్టౌ కింద ఉంచేవు బాగుంది, కానీ అక్కడ వుడ్ వర్క్ చేయించేవు. వెనకనించీ బండలు మొయ్యొద్దా?”

“ఏం చెప్పు? వంటిల్లు ఆడదానికి నచ్చినట్టు ఉండాలి సుమీ”

అభినవ్ లేనప్పుడు వాడి రూమంతా చెక్ చేసింది. పరిమళకి గుండెలో రాళ్ళు పడ్డాయి. అసలే అభి తన రూమ్ లోకి ఎవరినీ రానివ్వడు.

మర్నాడు ఆవిడ తన‌ ధోరణిలో “అసలు అభికి వేరే గదెందుకే? మీ మరిది ఆ కటకటాల గదిలో చదువుకొని చక్కగా పెద్ద ఆఫీసర్ అవలేదూ? మగపిల్లాడిని ఓ కంట కనిపెట్టి ఉండాలి సుమా” పరిమళ భయపడ్డట్టు అభి విననే విన్నాడు. అభి ఫోన్ లో మాటాడుతూ ఉంటే కనకవల్లి అక్కడకి వెళ్ళింది. ఎగాదిగా వాడి పక్క చూసి ఏదొ అనబోతూ ఉంటే అభీ అక్కడనించీ బాల్కనీలోకి వెళిపోయేడు.

కనకవల్లి పూలు మాల కట్టడానికి తెస్తున్న పరిమళతో, “నీ‌ పూల పిచ్చి చల్లగుండా! కొడుకుని చూడవా? అభి ఆడపిల్లతో‌ ఫోన్ మాటాడుతున్నట్టు ఉన్నాడు. ఎవరో అడగవా?” గట్టిగా
అంది.

అభినవ్ “అమ్మా” అంటూ గట్టిగా అరిచేడు. పరిమళ గుండెలు దడదడలాడుతూ ఉంటే వెళ్ళింది.

“ఏమిటమ్మా, ఇంటికి వచ్చిన వాళ్ళు వాళ్ళ‌ పనులు చూసుకొని వెళ్ళకుండా ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోడం? నువ్వు ఆవిడకి చెప్పు. నా గదిలోకి రాడం నా విషయాలన్నిటిలో
జోక్యం నాకు చికాకకని” అని అభి అనడం కనకవల్లి విన్నది. పరిమళ మాటలు వినపడలేదు గానీ ఏదో నెమ్మదిగా చెప్పి వచ్చేసింది.

“పిన్నిగారూ మనకి వాడి గోల ఎందుకు? ఇవాళ కొబ్బరుండలు చేసుకుందాం అనుకున్నాం కదా పదండి” అంది.

మర్నాడు కనకవల్లి బయలుదేరుతూ ఉంటే మంచి జరీ చీర పెట్టింది పరిమళ.
కనకవల్లే “అమ్మాయ్, ఏమిటోనే నాకు ఇలా అన్నిటిలో కలగజేసుకోడం అలవాటయి ఇంట్లో మనవల చేతకూడా తిట్లు తింటున్నాను. నేనే మారాలి కాబోలు. అభిని ఏమీ అనుకోవద్దను”
అంటూ బయలుదేరింది.

అభిని ఆవిడ ఇంకేమిటి అంటుందో, ఇద్దరికీ ఎలా సద్దిచెప్పాలో అని హడలిపోతున్న పరిమళ ఆవిడ ముక్తాయింపు మాటలకి ఆశ్చర్యపోయింది. ఆవిడ వెళ్ళిన తరవాత తనలో తను అనుకుంది
“ఓ తరం అయిపోతే, పెద్దవాళ్ళు
అనుభవాలతో మారతారు కాబోలు”

అభి తల్లి మాటలకి నవ్వినా హాయిగా ఊపిరి తీసుకున్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!