బ్రహ్మ రాత

బ్రహ్మ రాత

రచయిత :: సావిత్రి కోవూరు 

మ్యారేజ్ హాలు రంగురంగుల లైట్లతో, రంగురంగుల పువ్వులతో అలంకరించబడి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది.హాలులో ఆడ పెళ్ళి వారు సాయంత్రం వచ్చి తమకు కేటాయించిన గదులలో తయారవుతున్నారు. ఒకవైపు బ్యూటీషియన్ వచ్చి పెండ్లి కూతురు ని రెడీ చేస్తున్నది. పెండ్లి కూతురు అన్నా, వదిన, కజిన్స్ అందరూ, అబ్బాయి తరపు వారు వచ్చిన తర్వాత ఇవ్వడానికి మంచినీళ్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్ లు రెడీగా ఉన్నాయా చూస్తున్నారు.

పెళ్లి కూతురు తల్లి జానకమ్మ గారు తన ఇద్దరు చెల్లెళ్ళు, మరదలితో ఏయే  కార్యక్రమానికి ఎవరెవరికి ఏ బట్టలు పెట్టాలో స్లిప్స్ అతికించిన
బట్టలని వాళ్లకు వివరించి ఏ టైం కు ,ఏవి  అందించాలో విడివిడిగా సూట్ కేసుల్లో సర్దుతున్నారు. ఒక వైపు పెద్దముత్తైదువలు పసుపు కుంకుమ మొదలైన సారే సరంజామాలు డబ్బాల్లో పోసి పెడుతున్నారు.

పెళ్లి కూతురు తండ్రి మాటిమాటికీ పెండ్లి సక్రమంగా జరిగేలా చూడమని ఆ దేవునికి మొక్కుతూ, అన్ని ఏర్పాట్లూ సరిగ్గా జరుగుతున్నాయా చూస్తూ పనివాళ్లకు పనులు పురమాయిస్తున్నారు. ఉదయం 8:30 కు పెళ్లి ముహూర్తం ఇప్పుడు తొందరగా జరగవల్సిన కార్యక్రమాలు జరిగితే  అందరూ భోజనాలు చేసి పడుకుంటే తెల్లవారుజామునే లేచి పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టాలి.

ఒకవైపు కళ్యాణమంటపం వేసే వాళ్ళు వేస్తున్నారు. సన్నాయి మేళాలు, వీడియో గ్రాఫర్ లు, కెమెరామెన్, పురోహితుడు అందరూ వచ్చారు.

పిల్లలు అటూ ఇటూ పరిగెత్తుతూ ఆడుకుంటున్నారు. ఎదురు కోళ్ళు చూడడానికి వచ్చిన చుట్టాలు కుర్చీలో కూర్చుని, చీరల గురించి నగల గురించి లోకాభిరామాయణం గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు పరిహాసాలు ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు.

ఇంతట్లోకి పెళ్ళికొడుకు ఊరేగింపు వస్తున్నట్టు బ్యాండ్ మేళం శబ్దం దగ్గరగా వినిపించగానే, అందరూ హాలు ముందర ఉన్న ఖాళీ స్థలంలోకి వచ్చి నిలుచున్నారు. పెళ్ళికొడుకు ఇల్లు హాలుకు కిలోమీటరు దూరమే కానీ, ఊరేగింపు ముందర యువతీ యువకులు, కుర్రకారు, పిల్లలు అందరూ డ్యాన్స్ చేస్తూ నెమ్మదిగా రావడం వల్ల రెండు గంటల టైం పట్టింది. మధ్యమధ్య టపాకాయలు కాలుస్తూ, పెళ్ళికొడుకుకు దిష్టి తీస్తూ మెల్లగా వచ్చారు.

పెళ్ళికొడుకు శశిధర్ చమకు చమకు శార్వాణి వేసుకుని తలపై పగిడి (తలపాగా)తో మెరిసిపోతున్నాడు. కార్ లో అతని పక్కన తల్లిదండ్రులు హూందాగ కూర్చుని ఉన్నారు.

హాలు ముందరికి కార్ రాగానే జానకమ్మ గారు, రామారావు గారు కారు దగ్గరికి వెళ్లి అందరికీ బొట్లు పెట్టి ఆహ్వానించారు. పురోహితుని పురమాయింపుతో పెళ్లికూతురి అన్న ఆనంద్,
పెండ్లి కొడుకు కాళ్లు కడిగి, చేయిపట్టుకొని హాలు లోకి తీసుకొచ్చి ఆసీనుల గావించింతర్వాత అందరు హాల్ లోకి వచ్చి కూర్చున్నారు. పెళ్లి కొడుకుకు ఇరువైపుల తల్లిదండ్రులను కూర్చోబెట్టి, పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి పారాణి పెట్టి వరపూజ చేశారు. ముగ్గురికి బట్టలు పెట్టింతర్వాత బుక్క, గులాల్ ఇరువైపుల వాళ్ళు ఒకరిపై ఒకరు సరదాగా చల్లుకున్నారు.

తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయిని కూర్చోబెట్టి నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం చేస్తన్నంతసేపు ఎదుటి కుర్చీలో కూర్చున్న పెళ్లి కొడుకు  పెళ్ళికూతుర్ని నిశితంగా చూస్తునే ఉన్నాడు.   అతని ముఖములో రంగులు మారుతున్నాయి.  పెండ్లికొడుకు ముఖాన్ని గమనిస్తున్న పెండ్లికూతురు తల్లిదండ్రులు, అన్నావదినలు కంగారు పడసాగారు. చక్కెర కలిపిన కొబ్బరిపొడి ఇరువైపులవాళ్ళు ఒకరికొకరు పంచుకుంటున్నారు.

తర్వాత చాలామంది చుట్టాలు ఉదయం పెళ్లి టైంకు వస్తామని కార్లలో వెళ్ళిపోయారు. అమ్మాయి తరపు దగ్గరి బంధువులు, అబ్బాయి తరపు దగ్గర బంధువులు మాత్రమే అక్కడ ఉన్నారు.

అప్పుడు మధ్యవర్తి ఒకతను రామారావు, ఆనంద్ దగ్గరకొచ్చి పెళ్ళికొడుకు తండ్రి మాట్లాడాలి అంటున్నాడని చెప్పే సరికి వాళ్ళ ఇద్దరికీ చెమటలు పట్టాయి. జానకమ్మ, సుజాత గార్ల ముఖాల్లో  కంగారు మొదలైంది.

రామారావు ,ఆనంద్ పెండ్లికొడుకు తరపు వాళ్ళు వున్న గదిలోకి వెళ్లారు. అక్కడ పెండ్లికొడుకు, తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు.వీళ్ళు వెళ్ళేసరికి వాళ్లంతా ఏదో సీరియస్ గా డిస్కషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

రామారావు గారు  ” బావగారు రమ్మన్నారట” అన్నారు వణుకుతున్న స్వరంతో.

పెండ్లి కొడుకు తండ్రి “ఈ పెళ్ళి జరగదు, మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు. పెద్ద మనుషులు, మర్యాదస్తులు అని, మధ్యవర్తి చెపితే మీ సంబంధం ఒప్పుకున్నాను” అన్నాడు.

“మా వల్ల ఏమైనా పొరపాటు జరిగితే చెప్పండి బావగారు సరిదిద్దు కుంటాం. అంతే కానీ ఈ పెళ్లి జరగదు అని మాత్రం అనకండి బావగారు” అన్నారు రామారావుగారు.

వెంటనే పెళ్ళికొడుకు “మీరు ఇంకా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కూడా నిజం చెప్పడం లేదు. మీరు అసలు పెళ్ళి చూపులప్పుడు మాకు చూపిన అమ్మాయి వేరు. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైన అమ్మాయి వేరు, మేము గుర్తించం అనుకున్నారు. ఎందుకు ఒక అమ్మాయిని చూపి వేరే అమ్మాయితో పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడే ఇలా మోసం చేశారంటే ఆ  అమ్మాయిని చేసుకుంటే ఇంకా ఎన్ని మోసాలు చేస్తారో. అందరి ముందర అడిగి గోల చెయ్యొచ్చు. కానీ ఆడపిల్ల జీవితం పాడవుతుందని ఇలా మిమ్మల్ని పిలిచి చెప్తున్నాము. మేం వెళ్ళిపోతాం. మీ బంధువులకు మీరేం చేప్పుకుంటారో మీ ఇష్టం” అన్నాడు.

“వద్దు బావ గారు దయచేసి అలా మాట్లాడొద్దని మీ అబ్బాయికి చెప్పండి. మీకు అన్ని వివరాలు చెప్తాను. అప్పుడు మీకు ఎలా చేయాలి అనిపిస్తే అలా చేయండి. నాకు ఇద్దరు అమ్మాయిలు శృతి శ్రియ. ఇద్దరు కూడా ఇంజనీరింగ్ పాసయ్యారు. మీకు చూపెట్టిన అమ్మాయి శృతి. ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం స్నేహితులకి శుభలేఖలు ఇచ్చొస్తానని బండిమీద వెళ్ళింది. వచ్చేటప్పుడు ఎవరో కారుతో ఆక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. శృతి ముఖము రోడ్డుకు తగిలి బాగ గీరుకు పోయింది. కాలు కూడా ఫ్యాక్చర్ అయ్యింది. ఇప్పుడు హాస్పటల్ లో ఉంది.కాలు బాగయ్యేసరికి  రెండునెల్లు పడుతుంది అన్నారు డాక్టర్. మేము ఊళ్ళో భూమి అమ్మి ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం.కళ్యాణమంటపం,సన్నాయి వాళ్లకి, వీడియో వాళ్లకి,కెమెరా వాళ్ళకి, వంట వాళ్లకి పురోహితునికి అందరికీ లక్షలు ఖర్చుచేసాం. ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందంటే మాకు చాలా కష్టమౌతుంది.

అందుకే మద్రాసులో ఉన్న మా రెండో అమ్మాయి శ్రియ కూడా అందంగానే ఉంటుంది. అది కూడా ఇంజనీరింగ్ పాస్ అయింది. కనుక మీకు పెద్ద అభ్యంతరం ఉండదని, మీ సంబంధం వదిలి పెట్టుకోలేక ఈ అమ్మాయిని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను. మీ అబ్బాయిని చేసుకోవడానికి మొదట శ్రియ అస్సలు ఒప్పుకోలేదు. మేమే ఆ అమ్మాయిని ఒప్పించాము. మీకు కూడా పెద్ద అభ్యంతరం ఉంటుంది అనుకోలేదు. మా అబ్బాయితో ఈ విషయము మీకు ముందే చెప్పి ఒప్పించాలని చెప్పాను.
వాడు ముందే చెబితే ఒప్పుకుంటారో లేదో, అని శ్రియ ని చూపిన తర్వాత చెబితే కన్విన్స్ అవుతారన్నాడు. ఇప్పుడు మీరు ఎలా చేసినా మాకు సమ్మతమే. ఎందుకంటే మీకు నిన్న చెప్పిన ఈ రోజు చెప్పిన జరిగే నష్టం ఎలాగయిన జరుగుతుంది. మీకు ఇష్టమైతే ఒక వేళ శ్రియ ను చేసుకుంటే ఆ నష్టం జరగకుండా ఉంటుంది. మీకు ఇష్టమైతేనే ఈ అమ్మాయిని చేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే మేమేం చేయలేము. ఒకసారి మీరు మా శ్రియని చూడండి. అందంలో గానీ చదువులో కానీ వినయ విధేయతల్లో గాని ఇద్దరూ ఒకేలా ఉంటారు. ముందే చెప్పాల్సి ఉండే.  కానీ మీరు ఈ అమ్మాయి ని చూడకుండానే క్యాన్సిల్  చేసుకునే వారు.
మాకు ఇంత మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు. ఎలాగు దాని పెళ్ళి కూడ తొందరలోనే చేయాలనుకున్నాం. కాని ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్ళి మొదట చేయాల్సొస్తుందని బాధపడ్డాము.
మేము కావాలని మోసం చేయలేదు. దయచేసి బాగా ఆలోచించుకొని మాకు తెలపండి. మీకు అప్పటికి కూడా ఇష్టం లేకుంటే అలాగే క్యాన్సిల్ చేయండి” అని శ్రియని అందరికీ ఒకసారి చూపి తమ గదికి వచ్చేశారు రామారావు గారు.

కొద్ది సేపు అయిన తర్వాత తల్లిదండ్రులతో పెళ్లి కొడుకు వచ్చి “మాకు శ్రియ అయినా పర్వాలేదు మొదట చెప్పుంటే ఆనందంగా ఒప్పుకునే వాళ్ళం. మీరు మోసం చేశారన్న కోపంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదామనుకున్నాము. కానీ ఆ అమ్మాయి కి ఆక్సిడెంట్ అయింది. మీరు పరేషాన్ లో ఉన్నారు. ఇంకా పెళ్లి ఆగిపోతే మీరు ఎంత బాధపడతారో, ఎంత నష్టపోతారో మాకు తెలుసు. మీరు అనివార్య కారణాల వల్ల పెద్దమ్మాయి బదులుగా చిన్నమ్మాయిని చేసుకోమంటున్నారు. కనుక నేను పెద్దమ్మాయిని కూడా ఒకే సారి చూశాను. పెద్ద పరిచయం లేదు. కనుక ఏ అమ్మాయి అయినా ఒకటే. కాని మీ అమ్మాయి మనస్పూర్తిగా ఒప్పుకుంటేనే ఈపెళ్ళి జరిపించండి.మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి. ఆ అమ్మాయి ఒప్పుకుంటే, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి” అని చెప్పేసరికి రామారావు, ఆనంద్ వాళ్ళు పట్టరాని సంతోషంతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఒక పెద్ద భారం తీరిపోయినట్టుగా తేలికైన మనుసులతో ఆనందంగా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

You May Also Like

One thought on “బ్రహ్మ రాత

  1. మధ్యతరగతి తల్లిదండ్రులు…అదీ ఆడపిల్లల తల్లిదండ్రుల
    మనస్తత్వాన్ని ఉన్నదున్నట్లుగా చూపించారు కథలో…
    👌👌💐💐సావిత్రి గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!