హెవెన్ కాలని

హెవెన్ కాలని

రచన: సావిత్రి కోవూరు 

నగర పొలిమేరలలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా చూసిన కిట్టు బండి కున్న బ్యాగును తీసుకుని బండిని అక్కడే వదిలేసి  చెట్లపొదల గుండా పరిగెత్తడం మొదలు పెట్టాడు. వెనక విజిల్స్ వేస్తూ ఇద్దరు పోలీసులు వెంట పడ్డారు. వాళ్లని తప్పించుకుంటూ చీకటిలో ముళ్ళ చెట్లు, పొదలు దాటుకుంటూ అడ్డదిడ్డంగా పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక పోలీసుల సడి తగ్గగానే ఆ కటిక చీకట్లో ఒక పెద్ద మర్రి చెట్టు మొదలుకు అనుకుని కూర్చుని అలసట తీర్చుకుంటుండగా, మళ్లీ పోలీసుల వాహనం శబ్దం దగ్గరలో వినబడింది. ఆ వాహనం లో నుండి ఇద్దరు పోలీసులు దిగి రావడం దూరం నుండే గమనించిన ఒక వ్యక్తి చెట్టు తొర్రలో నుంచి చేతిని బయటకు పెట్టి కిట్టుని చెట్టు తొర్రలోపలికి లాగాడు. ఈ హఠాత్పరిణామానికి ఉలిక్కిపడిన కిట్టు గట్టిగా అరిచే లోపలే, అతని నోటిని మూసేశాడు ముందే చెట్టు తొర్రలో దాక్కున్న రంగడు. కొద్దిసేపు తర్వాత ఆ కటిక చీకటిలో తాను ఒక్కడే లేడు. తనకు ఒక తోడు ఉన్నదన్న ధీమాతో ధైర్యంగా నిలబడ్డాడు కిట్టు. ఇంతలోకే పోలీసుల బూట్లు చప్పుడు చాలా దగ్గరగా వినిపించాయి. వాళ్లు ఆ దగ్గర్లో నిలబడి “వీడు ఇటువైపే వచ్చాడు. చిటికెలో దొరికినట్టే దొరికి మాయమయ్యాడు. ఇన్ని రోజుల నుండి మనని ముప్పు తిప్పలు పెడుతున్నాడు” అన్నాడు ఒక పోలీసు.”బండి కూడా చాలా కొత్తది ఉన్నట్టుంది. దానిని కూడా వదిలిపెట్టి పారిపోయాడు. ఎప్పటికైనా వీడిని పట్టుకోకపోతే పై ఆఫీసర్ల దగ్గర మనకు చీవాట్లే.  వీడు ఎవరో గాని చాల చురుకుగా ఉన్నాడు. చకచకా పని ముగించుకుని నిమిషంలో మాయం అయ్యాడు. ఈ చీకటి దొంగ స్పీడ్ చాల ఎక్కువగా వుంది. తాళాలు ఉన్న ఇళ్లను పగలంతా తిరిగి చూసి రాత్రిళ్ళు దోపిడి చేస్తున్నాడు’ అన్నాడు ఒక పోలీస్. ఇంకొక పోలీస్ “అసలు వాని చాకచక్యం మనకు తలనొప్పిగా తయారయింది. ముందే ఈ భాగ్యనగరంలో ఒక దొంగల గ్రూపు మనకు చిక్కకుండా తిరుగుతుంది. కొత్తగా వీడొకడు సరేలే. ఇక ఈ రాత్రి ఇక్కడ ఎంతసేపు ఉన్నా లాభం లేదు. పద వెళ్దాం” అని ముందుకు కదిలిపోయారు వాళ్ళు. వాళ్ళు వెళ్లారని నిర్ధారణ చేసుకున్న రంగడు కిట్టు తో “ఇక వాళ్ళు వెళ్ళిపోయారు మనం బయలుదేరదామా” అన్నాడు. “ఎక్కడికేంటి” అన్నాడు కిట్టు.”ఎక్కడికైనా వెళ్ళాలి. ఇక్కడే ఉండి పోలేము కదా” అన్నాడు రంగడు.”ఇక్కడికి దగ్గర్లోనే నేను పనిచేసే ఇల్లు ఉంది. నేను అక్కడికి వెళ్లి పడుకుంటాను. నీకు ఇష్టమైతే నాతో రా” అన్నాడు కిట్టు.”సరే పద నాకు బాగా నిద్ర వస్తుంది” అన్నాడు రంగడు. ఇద్దరు కలిసి ఐదు కిలోమీటర్లు రంగడి బండి పైన కిట్టు పనిచేస్తున్న ఇంటికి వెళ్లారు. అది ఒక పెద్ద బంగళా. దానిలోకి వెళ్ళగానే ఒక మూలన గల వైర్లతో టెంపరరీగా పెట్టిన లైట్ ని వెలిగించాడు కిట్టు. కిచెన్ లోకి వెళ్ళి గిన్నెలో ఉదయం వండిన అన్నం పచ్చడి వేసి ఇద్దరికీ తెచ్చాడు కిట్టు. ఈ ఇల్లు ఎవరిది” అని అడిగాడు రంగడు. ఇది మేము ఫ్లోరింగ్ చేస్తున్న ఇల్లు. ఏవో కోర్టు గొడవలతో పని ఆగిపోయింది. అప్పటినుండి నేను ఇక్కడే ఉంటున్న. దగ్గర్లో ఇండ్లు లేవు కనుక నా గురించి ఎవరికీ తెలియదు” అన్నాడు కిట్టు. “నీవు ఫ్లోరింగ్ పని చేసే వాడివా. నేను కూడా అదే పని చేస్తాను. ఇక్కడ ఆ పని కోసం వస్తే పనులేమి దొరకట్లేదు. అందుకే దుబాయ్ వెళ్లి పని చూసుకోవాలి అనుకుంటున్నాను. ఒకసారి మా ఊరికి వెళ్లి మా కుటుంబాన్ని చూసి వెళ్ళిపోతాను. మరి ఆ పోలీసులు నీవెంటెందుకు పడ్డారు” అన్నాడు రంగడు.”అదే నాకు అర్ధం కావట్లేదు ఈ రాత్రి వాళ్ళకి దొరికానంటే  నా తప్పు లేక పోయినా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తారు. అందుకే వాళ్శకి దొరకకుండ పరిగెత్తాను” అన్నాడు కిట్టు.
అతని మాటలు ఏ మాత్రం నమ్మక పోయినా ఆ సంభాషణ పొడిగించలేదు రంగడు. ఇద్దరు అన్నం తిని హాయిగా పడుకున్నారు ఎవరి బ్యాగ్ వాళ్ళు తలకింద జాగ్రత్తగా పెట్టుకుని.  ఉదయం లేచి ఊరికి వెళ్లడానికి రెడీ అయ్యాడు రంగడు. “రెండు రోజులు ఆగి వెళ్ళరాదు నేను కూడా వస్తాను” అన్నాడు కిట్టు.
నీవు నాతో వస్తే మీ వాళ్ళు వెతుకరా. వాళ్ళకి చెప్పకుండానే  నాతో వస్తావా” అన్నాడు రంగడు.
“నాకు ఎవరు లేరు. ఒక బాబాయ్ ఉండేవాడు. అతనే నాకు పని నేర్పించి తన చేతి కింద పెట్టుకున్నాడు. మొన్న కరోనలో అతను కూడా పోయాడు” అన్నాడు కిట్టు. “నీ సంచిలో ఏమున్నాయి అంత జాగ్రత్తగా తలకింద పెట్టుకుని పడుకున్నావు” అన్నాడు రంగడు. మా అమ్మవి కొన్ని నగలు కొంత డబ్బు ఉన్నది. ఇప్పుడు కరోనా కాబట్టి పని దొరకట్లేదు. నా బ్రతుకు తెరువు జరగాలి కదా.అందుకే ఈ నగలను తీసుకుని
తిరుగుతున్నాను” అన్నాడు కిట్టు.
కానీ ఈ జవాబు కూడ రంగడు నమ్మలేదు. అయినా ఇప్పుడే పరిచయం అయిన వాడిని మళ్ళీ మళ్ళీ అడగడం బాగుండదని ఊరుకున్నాడు.
“సరేలే నీకు ఎవరు లేరు అంటున్నావు కనుక నా వెంట మా ఊరికి తీసుకెళ్తాను” అని బండిమీద బయలుదేరారు. నీ దగ్గర కూడా ఇంత పెద్ద సూట్కేసు ఉంది. దాంట్లో ఏముంది” అన్నాడు కిట్టు. ఏమీ లేదు కొన్ని నగలు కొంత డబ్బు ఉంది అది బ్యాంకులో పెట్టి వెళ్ళిపోదాం” అన్నాడు రంగడు.  దారిలో ఉన్న బ్యాంకు లాకర్లో సూట్కేసులో ఉన్నవన్ని పెట్టి డబ్బును బ్యాంకులో కొంత దాచి బయల్దేరారు. ఇద్దరు అలా వెళుతూ మధ్యలో మధ్యలో ఆగుతూ హోటల్స్ లో ఉంటూ హైదరాబాద్ నుండి మొదట బాంబే వెళ్లి అక్కడి నుండి సూరత్ వెళ్లి అక్కడి నుండి ఇండోర్ మీదుగా జైపూర్ వెళ్లారు. అక్కడి నుండి ఇరవై  కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ల ప్రాంతానికి తీసుకెళ్ళాడు రంగడు. అంత దూరం మధ్య మధ్యన ఆగుతూ వెళ్లేసరికి 15 రోజులు పట్టింది. అక్కడికి వెళ్ళిన తరవాత “ఇంత దూరంలో ఉన్న మీ ఊరు నుండి హైదరాబాద్ కు పనికి వచ్చారా” అన్నాడు ఆశ్చర్యంగా కిట్టు. “నాకు పని ముఖ్యం కాదు. నాకు దేశమంతా తిరిగి చూడాలని కోరిక అందుకే అక్కడికి వచ్చాను” అన్నాడు రంగడు. “హెవెన్ కాలనీ’ అని పేరున్న ఆర్చి లో నుండి లోపలికి వెళ్శారు. లోపలికి వెళ్ళేసరికి బహుళ అంతస్తుల బిల్డింగులు ఎన్నో కనిపించాయి. ప్రతి ఇంటి చుట్టు పెద్దపెద్ద కాంపౌండ్ వాల్స్. లోపల ప్రతి ఇంటి ముందర పెద్ద పడవల్లాంటి కార్లు రెండు మూడు, గేటు దగ్గర రెండు కుక్కలు, చాలా  ఆర్భాటంగా ఉంది ఆ కాలనీ. రంగడు తన ఇంటికి తీసుకెళ్లాడు. చాల విలాసవంతమైన ఇల్లు. ఏసీలు, హోమ్ థియేటర్స్, మెత్తటి కార్పెట్స్, హీటర్స్, కూలర్స్. ప్రతి ఇంట్లో ఫ్రిజ్, వాషింగ్ మిషన్స్ డిష్ వాషర్స్ అధునాతనంగా సౌకర్యాలన్నీ సమకూర్చుకున్నారు. ఇంచుమించు 100 ఏళ్ల వరకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. వాళ్లందరూ కూడా ఒకరికొకరు దగ్గరి బంధువులే. కిట్టు వెళ్ళినప్పుడు సగంమంది మగవాళ్ళు ఊరిలో లేరు. ఆడవాళ్ళు  మంచి మంచి వస్త్రాలు ధరించి విలువైన నగలు వేసుకొని కనిపించారు. కిట్టుని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే వాళ్ల కాలనీకి ఎప్పుడు కొత్త వాళ్ళు రారు. కాని రంగడు వాళ్లకు ఏం చెప్పాడో కానీ కిట్టును తమలో ఒకడిగా కలుపుకున్నారు వాళ్ళు. సాయంత్రం అయ్యే సరికి కిక్కిరిసిన జనాల తో కూడిన వాళ్ల క్లబ్బులు రంగురంగుల లైట్లతో, గానాభజానాలతో, విందు భోజనాలు మొదలైన వాటితో పట్టపగల్లా కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ స్వర్గమే భూమికి దిగి వచ్చినట్టుగా ఉంది. వారం రోజులలో కొందరు కొందరు మగవాళ్లు అందరూ వచ్చేశారు. మగవాళ్ళంతా ఆరు నెలలు పనికి బయట ఊళ్లకు వెళ్లి ఆరు నెలల తర్వాత వస్తూ ఉంటారట. చాలామంది దుబాయ్ కి పనికి వెళ్తారని చెప్పాడు రంగడు. కిట్టుకు ఘనంగానే అతిథి మర్యాదలు చేశారు అందరు. అక్కడున్న యువకులంతా డిగ్రీలు, పీజీలు, ఎమ్.బి.బి.ఎస్ చదివిన వాళ్ళే ఉన్నారు. అక్కడ ఒక మంచి స్కూలు కూడా నడుపుతున్నారు. పిల్లలకు మంచి మంచి చదువులు చెప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అందరు పార్టీ చేసుకుని బాగా ఆడి పాడి అలిసిపోయి నిద్రపోయిన టైంలో ,పెద్ద పెద్ద వ్యాన్లలోలో బిలబిలమంటూ వందలకొద్ది పోలీసులు కళ్ళు మూసి తెరిచే లోపే వచ్చేశారు. అందరూ కిట్టుతో సహా అందరినీ వ్యాన్లో ఎక్కించి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చెప్పిన దానిని బట్టి వాళ్ళు ఉండే టౌన్షిప్ లోని మగాళ్లంతా దుబాయ్ కి వెళ్తున్నాము అని చెప్పి, గ్రూపుల వారీగా పెద్ద పెద్ద నగరాలకు చేరుకుంటారు. కొంతమంది రెక్కీ చేస్తే కొంతమంది దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ఆ దోచుకున్న సొమ్మును బ్యాంకుల్లో దాచి వాళ్లకు వీలైనప్పుడు కొంత కొంత తీసి భార్య పిల్లల దగ్గరికి వెళ్లి సంతోషంగా గడుపుతారట. ఆ విధంగా ఏ పని పాట లేకుండా ఆరు నెలలు ఎంజాయ్ చేసి,ఆరునెల్ల తరువాత మళ్ళీ దోపిడీలకు బయలుదేరుతారట. వాళ్ళు ఉండే ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం అవడంవల్ల ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ల పనులు వారు చేసుకుంటున్నారు. హైదరాబాదులో ఎన్నో ఏళ్ళ నుండి గొలుసు దొంగతనాలు చేస్తూ, పోలీసులకు చిక్కకుండా, ఒక పెద్ద సవాలుగా నిలిచిన ఈ ‘హెవెన్ కాలనీ’ వాసుల బాగోతం కొత్తగా క్రైమ్ డిపార్ట్మెంట్ లో చేరిన కిట్టు అనే కృష్ణారావు దొంగ అవతారం ఎత్తి  పునాదులతో పెకిలించాడు. ఎన్నో ఏళ్లుగా తలనొప్పిగా మారి, ఆఫీసర్ల చేత చీవాట్లు పెట్టించుకున్న పోలీసులకు ఆ హెవన్ కాలనీ యువకులను ఇంటరాగేషన్ చేస్తుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినవి. అక్కడ ఉండే యువకులు అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్ చదువులు చదివిన వాళ్లు.
మరి ఎందుకిలా చేస్తున్నారు అంటే ఏ ఉద్యోగం చేసినా సంవత్సరమంతా ఒకరి చేతి కింద పని చేస్తూ నెలకొకసారి జీతం తీసుకొనే కంటే, రోజుకు దొంగతనంతో ఎన్నో వేలుచొప్పున ఆరునెలలు కష్టపడి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటే, మిగతా ఆరు నెలలు భార్యా పిల్లలతో ఏ పని చేయకుండా హాయిగా గడప వచ్చునన్న ఆలోచన.
అన్నింటి కంటే వింతేమిటంటే కనీసం వీళ్ళు దొంగతనాలకు వెళుతున్నారన్న విషయం కనీసం భార్యలకు కూడ తెలియక పోవడం. అందుకే పోలీసులు ఆడవాళ్ళనందర్నీ, పసిపిల్లలను వదిలిపెట్టి, మగవాళ్ళను మాత్రం అరెస్ట్ చేసి  జైలుకు పంపించారు. పోలీసులు ఇదంతా కిట్టు రిస్క్ తీసుకుని వాళ్లతో పాటు కొన్ని రోజులు గడపడం వల్లనే ఒకేసారి అందరి దొంగలను పట్టుకోగలిగారు. అలా కాకుండా హైదరాబాద్ లో దొరికిన ఒక్క దొంగనే పట్టుకుని ఉంటే ఏమి లాభం ఉండేది కాదు. వాళ్ళంతా మంచి చదువులు చదువుకుని మేధావులైన దొంగలు. కనుక పోలీసులకు దొరకకుండా తప్పించుకోగలిగారు.
చురుకైన చాకులాంటి కృష్ణారావు పక్క ప్లాన్ తో అందరిని ఒకే సారి పట్టుకునేలా చేసి డిపార్ట్మెంట్ లోని ఆఫీసర్ల అందరి మెప్పును పొందగలిగాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!