ఇంటి దీపం

ఇంటి దీపం

రచన ::  సావిత్రి కోవూరు 

మా వలపు పంట గా మా ఇంట చేరే – మహాలక్ష్మి కి మారు మా చిట్టి తల్లి,

గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాము – అరచేతిలో ఉంచి నడిపించుకున్నాము,

అలరించ వచ్చింది అందాల భరిణ – నట్టింట తిరిగితే నయనాల విందే,

తాను నవ్విందంటే వెన్నెల్ల పంట – కన్ను కదిపిందంటే కరుణాల జల్లే,

మాటలాడిందంటే మమతల మరుమల్లె – కాలు కదిపిందంటే హంసలా నడకల్లె,

తాను చూసిందంటే కాంతులే పండు – నిండు పున్నమి నాటి వెన్నెలే మాకు,

ఎన్నాళ్ళ పుణ్యమో మా ఇంట వెలసిన – అన్నుల మిన్నైన మా అపరంజి బొమ్మా,

తల్లికే తల్లైన తనయ తానమ్మా – తండ్రి కన్ను పాపయ్యి తాను వెలిసింది,

మా అదృష్ట దేవతే ఈ పుత్తడి బొమ్మ – తల్లి దండ్రులంటే తగని ప్రేమమ్మా

ఏ రోజు మా మాట లేదు జవదాటలేదు – పలు విద్యలలోనూ ఆరితేరింది,

పుడమికి ఉన్నంత ఓర్పు గల తల్లి – సుగుణాల గంధాలు వెదజల్లు మల్లి,

రాముడంతటివాణ్ణి వెదకి తెచ్చాము – రాణిలా చూచు నని మదిని తలిచాము,

కన్నులపండుగగా కళ్యాణమొనరించి – కన్నీళ్లు ఆపుకొని అప్పగించాము,

కన్ను పాప లాగా కాచుకోండి మీరు –  మా కన్నుపాపను అప్పగించాము,

మీ వంశాన్ని పెంచగా అరుదెంచెనమ్మా – మమతలా మ్రానై చిగురించునమ్మా,

మీ ఇంటి దీపమై వెలుగులు నింపుతూ – కొలువుదీరాలని కోరి పంపాము.

You May Also Like

One thought on “ఇంటి దీపం

  1. ప్రతి తల్లిదండ్రుల మనసును ఆవిష్కరించారు
    👌👌💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!