కాబోయే అల్లుడు

(అంశం: చందమామ కథలు)

కాబోయే అల్లుడు

రచన:కమల ముక్కు (కమల ‘శ్రీ’)

“శృతీ! చెప్పింది అర్థం అవుతుంది కదా. రేపు పొద్దున్నే ఆరింటికి ట్రైన్. అంటే నువ్వు ఇంట్లో నుంచి ఐదుకల్లా బయటకు వచ్చేయ్యాలి. నేను నీకోసం రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను.గుర్తుంది కదా టైం. మర్చిపోకు.” పదే పదే గుర్తు చేస్తున్నాడు హర్ష.

“గుర్తుంది హర్షా. నేను వచ్చేస్తాను. నువ్వు మళ్లీ ఫోన్ చేయకు. మా వాళ్లు ఎవరైనా వచ్చినా వస్తారు.బై. బై.” అని ఫోన్ పెట్టేసింది శృతి.

ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది. శృతి… మహేష్, రేవతి దంపతుల ఏకైక సంతానం. ఆమె ఏది అడిగితే అది లేదనకుండా ఇచ్చే అమ్మానాన్నా. ఏనాడూ పళ్లెత్తు మాట అనింది లేదు. చేయి పైకెత్తింది లేదు.

బాగా చదువుచెప్పే స్కూల్ మాని వేరే స్కూల్ లొ జాయిన్ అవుతానని అంటే కాదనకుండా జాయిన్ చేశారు. వారు మెడిసిన్ చేయమంటే తను ఇంజనీరింగ్ చేస్తానని చెప్తే కాదనలేదు, అన్నింటిలోనూ తన మాట వినే అమ్మా నాన్నా మొట్టమొదటి సారిగా తన మాట కాదన్నారు.

తను ఎంతగానో ప్రేమించిన హర్ష ని పెళ్లి చేసుకుంటానంటే వద్దు అతను నీకు తగిన వాడు కాదన్నారు.ఎలా తగిన వాడు కాదు, ఇంజనీరింగ్ లో తన సీనియర్ తను. బాగా చదివేవాడు. క్యాంపస్ లో జాబ్ వచ్చింది. నెలకి లక్ష రూపాయల జీతం. చిన్నప్పుడే కన్నవారు చనిపోతే  పిన్నీ బాబాయి ల దగ్గర ఉండి చదువుకున్నాడు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు.  అంత మంచి వాడిని ఎందుకు కాదన్నారో తనకైతే అర్థం కాలేదు.

అతన్ని కాదని ఓ సంబందం కూడా చూశారు. అతని తోనే  పెళ్లి నిశ్చయించారు.రెండు రోజుల్లో పెళ్లి. తనని ప్రేమించిన హర్ష ని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి మనసు రావడం లేదు శృతికి. అందుకే పరిస్థితి మొత్తం వివరించింది హర్ష కి.

వెంటనే తామిద్దరం తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసి ట్రైన్ టికెట్లు బుక్ చేసి ఇంటినుంచి బయటకు వచ్చేయ్యమని చెప్పాడు హర్ష.

అతనికి చెప్పడం అయితే చెప్పింది కానీ అంతలా ప్రేమించిన అమ్మా నాన్నలను మోసం చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతే రేపు అందరూ వారిని ఎన్నేసి మాటలు అంటారో?, ఆ పెళ్లి వాళ్లు ఎంత అవమానిస్తారో?, వాళ్లసలు తట్టుకోగలరా?. ఇటు అమ్మా నాన్నా అటు ప్రేమించిన హర్ష. ఎటువైపు అడుగు వేయాలో తెలీడం లేదు. ట్రైన్ టైం ఇంకా గంటే సమయం  ఉంది. ఇంట్లో పార్లర్ కి వెళ్లి ఇద్దరు ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇచ్చి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అన్నట్టుగానే ముందుగా పార్లర్ కే వెళ్లింది ఎవరైనా తన వెనకే వస్తారేమో అని. కానీ ఎవరూ రాకపోవడంతో ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కి వెళ్లింది. అక్కడ వెయిటింగ్ హాల్ లో కూర్చుని హర్ష కోసం వెయిట్  చేస్తూ ఉంది. గంట… అరగంట.. పావు గంట…‌ నిముషం… అరనిముషం…. ట్రైన్ వస్తున్నట్టుగా అనౌన్స్ మెంట్ రావడంతో  కంగారుగా చూసింది హర్ష కోసం. కానీ హర్ష రాలేదు. వచ్చిన ట్రైన్ వచ్చినట్టే వెళ్లిపోయింది. కానీ ట్రైన్ రాలేదు. ఫోన్ చేస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఇంటికి వెళ్లాలా. లేక ఇక్కడే హర్ష కోసం వెయిట్ చేయాలా?. ఈపాటికే తాను బయటికి వచ్చేశానని ఇంట్లో వాళ్లకి తెలిసిపోయి ఉంటుంది. తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసుంటారు. ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్లగలను. అలా అని వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.

హర్ష ఇలా చేస్తాడని కళ్లో కూడా అనుకోలేదు. ప్రాణంగా ప్రేమించిన వాడు మోసం చేస్తే ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు అర్థం అవుతోంది. మరి తనని  ప్రేమించిన అమ్మావాళ్ల సంగతేంటీ. వారిని ఘోరంగా మోసం చేసింది తను. తను చేసిన దానికి తగిన శాస్తే జరిగింది తనకి. ఇంత చేసిన తనకి ఇంటికి వెళ్లే అర్హత లేదు. వారికి ముఖం  ఎలా చూపించాలి?. ఏం చేయాలి?. అందుకే అన్నారు నాన్న తనకి తగిన వాడు కాదని. వాళ్లు అన్నట్టుగానే చేశాడు. ఛా… అలాంటి వాడినా ఇంత ప్రేమించింది. అలాంటి వాడికోసమేనా ఇక్కడి దాకా వచ్చింది.

“నో… ఇంక అతనికో‌సం ఆలోచించకూడదు. ఏమైతే అనని. నా కన్నవారే కదా అంటారు. అంటే పడతాను. కొడితే కొట్టనీ.” అనుకుంటూ పైకి లేచి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటి బాట పట్టింది.

ఆటో సరాసరి ఇంటి ముందు ఆగింది. డబ్బులిచ్చి ఇంట్లోకి వెళుతుండగా వినబడిన గొంతు ఎవరిదో అర్థం అయ్యి  కోపంగా ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చున్న హర్ష కాలర్ పట్టుకుని అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్. పో బయటికి. నీలాంటి వాడికి మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా లేదు. నువ్వు ఎంతో మంచివాడివి అని నమ్మి నీకోసం బయటకు వచ్చేశాను నన్ను ఎంతో ప్రేమించే అమ్మా నాన్న లనూ వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ నువ్వేం చేశావు నన్ను మోసం చేశావు. పో బయటికి.” అంది.

అతను నిన్ను మోసం చేయలేదు శృతీ. నీ మనసు మార్చాలని చూశాడు. మేం వేరే పెళ్లి అన్నప్పటి నుంచీ నువ్వు మనిద్దరం బయటికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంటే కాదనలేక ఓకే చెప్పినా మాలా ప్రేమించే కన్నవారి నుంచి దూరం చేయడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బ్రతిమలాడాడు. పెళ్లి అయిన తర్వాత ఎంత ప్రేమించినా కన్నవారు దూరం అయ్యారు అన్న బాధ మాత్రం నీలో అలానే ఉండిపోతుంది అనీ, అమ్మా నాన్నా లేని లోటు ఎలా ఉంటుందో తనకి బాగా తెలుసనీ, ఆ బాధ శృతికి రాకూడదని, అందుకే మరోసారి ఈ పెళ్లి విషయంలో ఆలోచించమని చెప్పాడు.

అతను చెప్పింది నిజమే అనిపించింది. పెళ్లయ్యాక నువ్వు మాతో మాట్లాడలేవు, ఇంత బాగా చూసినా నువ్వు వదిలేసి వెళ్లావనే కోపం మాలోనూ ఉండిపోతుంది.అప్పుడు నిన్ను దగ్గరకు తీసుకోలేం.

ఇతను స్టేషన్ కి రాకుండా నీ మనసు నొప్పించినా ఇక్కడికి వచ్చి మా మనసు గెలుచుకున్నాడు. ఇంత మంచి వాడిని కాదన్నామని చాలా బాధగా ఉంది. మనల్ని అర్థం చేసుకున్న ఇతనితోనే నీ పెళ్లి.” అన్నారు మహేష్.
“మరి ఆ పెళ్లి.”
“వారికి ఏం చెప్పుకోవాలో అది చెప్పుకుంటా. మా మనసు పడే ఆవేదనను అర్థం చేసుకునే ఇలాంటి వాడే కదా నిజమైన అల్లుడు. నా కూతురికి కాబోయే మొగుడు.” అంటూ నవ్వారు మహేష్. ఆయనతో అందరూ శృతి కలిపారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!