కన్నపేగుకు కర్తవ్య నిర్వహణకు మధ్య

కన్నపేగుకు కర్తవ్య నిర్వహణకు మధ్య

రచయిత :: నామని సుజనాదేవి

నేనిప్పుడు అంటరాని దాన్ని
ఆత్మీయుల లోకం నుండి వెలివేయబడ్డ దాన్ని
కాదు …కాదు … నా చుట్టూ నేనే లక్ష్మణ రేఖ గీసుకున్నదాన్ని
కన్నపేగు చేసే ఆర్తనాదాలు దరి చేరకుండా
అభేద్యమైన కంచుకోటలు నిర్మించుకున్నదాన్ని

రేపంటూ ఉంటుందో లేదో తెలీదు
నేనంటూ తిరిగివస్తానో రానో తెలియదు
ఎ రోజు కా రోజే వారిని చూసే చివరి రోజు కావచ్చేమో తెలీదు
కడుపు నిండా తినడానికైనా వెరపే
కంటికి కనిపించని రాక్షసి ఏ రకంగా చేరుతుందో తెలీదు
కర్తవ్య నిర్వహణలో క్వారంటైన్ తోనో
కరోనా కాటుతోనో కప్పెట్టుకు పోతానెమో తెలీదు
నిత్య యుద్ధానికి అంతమెప్పుడో తెలియదు
చను బాల కోసం వెక్కుతున్న బిడ్డ కన్నీరు తుడిచి
హత్తుకుని ముద్దిచ్చి మురిపం తీరుస్తానో లేదో తెలీదు

ఆకాశంలో సగం అవనిలో సగం అంటూ
కర్తవ్య నిర్వహణ లో కన్న (పేగు)బిడ్డలను దూరం పెట్టి
అమ్మ పాత్రకు అన్యాయం చేసిన దాన్ని
కనుపాపల కన్నీళ్లను కర్కశంగా కాలదన్ని
అమ్మప్రేమకు చరిత్రలో కొత్త అర్దానికి తెరతీసినదాన్ని

నాకు తెలిసింది ఒక్కటే …కరోనాపై కదం తొక్కుతున్న సైనికురాల్నని
పాలన భారాన్ని భుజస్కంధాల పై వేసుకున్నప్పుడే
అనురాగ, బాధ్యతల పాశాల తులాభారంలో
అనుబంధాల కన్నా వృత్తి ధర్మం , నమ్మకమే మిన్న అని
క్షణ క్షణం పెరుగుతున్న కరోనా అంతానికి
పాలకులు పూరించిన శంఖారావాన్నని
అష్టావధానాలు చేసే మహిళా శక్తి ప్రతినిధిగా
రూపాంతరం చెంది పరాకాయ ప్రవేశం చేసే కార్యకర్తనని.
కరోనా ను కాటికంపే వరకు నిద్ర పోనీ అపర కాళికా శక్తి నని
అనాదిగా అంతిమ విజయం అలుపెరగని పోరాటానిదే నని .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!